శుక్రవారం 05 జూన్ 2020
Sunday - Apr 05, 2020 , 00:38:09

ప్రకృతి సోయగంఎల్‌ మడుగు

ప్రకృతి సోయగంఎల్‌ మడుగు

చుట్టూ పచ్చని అడవులు.. అందులో ఎత్తయిన గుట్టలు.. మధ్యలో గోదారి పరవళ్లు.. తీరం వెంట చారిత్రక గుహలు.. పక్షుల కిలకిల రావాలు.. ఇలా ప్రకృతి అందాల నడుమ ‘ఎల్‌ మడుగు’  పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాల సరిహద్దు మధ్యగోదావరిలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలవనరు నిత్యం యాత్రికులకు స్వాగతం పలుకుతూ... జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నది. ఇందులో గూడు కట్టుకున్న శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం చూపరులను కట్టిపడేస్తున్నది.

 పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఖాన్‌సాయిపేట అటవీ ప్రాంతంలో గోదావరి నది మధ్యన సహజ సిద్ధంగా ఏర్పడిన ఎల్‌ (లక్ష్మీ) మడుగు ప్రకృతి అందాలతో అలరారుతున్నది. దట్టమైన అటవీ ప్రాంతంలో, రెండు గుట్టల మధ్య నుంచి ఇది ఆహ్లాదం పంచుతున్నది. గోదావరి నది ‘ఎల్‌' ఆకారంలో ప్రవహిస్తుండటంతోనే ‘ఎల్‌(లక్ష్మీ) మడుగు’గా పేరు వచ్చినట్లు తెలుస్తున్నది. పెద్దపల్లి జిల్లాకే తలమానికమై ఈ పర్యాటక కేంద్రంలో అన్ని హంగులనూ కలిగి ఉన్న వన్యప్రాణి మొసళ్ల పెంపక సంరక్షణ కేంద్రం... ఎల్‌-మడుగు. ప్రకృతి అందాలు ఆరబోసినట్లుగా ఉన్న పరిసర దృశ్యాలు చూస్తే  ఔరా అనాల్సిందే. రెండు గుట్టల మధ్య నుంచి ప్రవహించే గోదావరి నదిలో... నీటిలో తేలియాడే మొసళ్లు, పెద్దపెద్ద చేపలు అందరికీ కనువిందు చేస్తూ ఆహ్లాదాన్నిస్తాయి. అవతలి ఒడ్డున ఉన్న రాతి గుట్టల మధ్య నుంచి సహజంగా జాలువారే నీరు నయాగరా జలపాతాన్ని మరిపిస్తుంది. అటవీశాఖ బోటులో  పర్యటిస్తుంటే  ప్రతీ దృశ్యం మనసుపై చెరగని ముద్ర వేస్తుంది. గుట్టమీద రాతి కట్టడాలు, వాటి నిర్మాణ శైలి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కట్టడాల మధ్య ఏర్పడిన శివలింగం పూర్వీకుల కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆ ప్రశాంత వాతావరణం మధ్య ... ఓ నిమిషం ఆగితే సుగంధ ద్రవ్యాలను మరిపించే మొగిలిపువ్వు వాసన మనస్సుకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఎప్పుడూ నిండు కుండలా కనిపించే ఈ ఎల్‌-మడుగులో ఎండా కాలంలో కూడా మూడు టీఎంసీల నీరు ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

మైమరిపించే వ్యూ పాయింట్‌..

ఎల్‌-మడుగులో ప్రభుత్వం చేపల వేటను నిషేధించింది. వన్యప్రాణులైన మొసళ్ల సంరక్షణ కోసం అవతలి ఒడ్డున ఒక వ్యూ పాయింట్‌ను నిర్మించింది. అక్కడి నుంచి ప్రకృతి అందాలను చూస్తే ఎవరికి వారు మైమరిచిపోతారు. నిత్యం బోటింగ్‌ను అందుబాటులో ఉంచితే పర్యాటకుల సంఖ్య పెరిగి  పర్యాటక కేంద్రం మరింత అభివృద్ధి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఎల్‌-మడుగుకు చేరడం ఇలా..

ముందుగా, పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి 35కిలోమీటర్ల దూరంలో ఉన్న మంథనికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోలు, బైక్‌లు, వివిధ వాహనాలపై 3కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖానాపూర్‌ గ్రామానికి వెళ్లాలి. అక్కడి నుంచి మరో మూడు కిలో మీటర్లు లోపలికి వెళ్లి... ఒక కిలో మీటరు వరకు కాలినడకన వెళితే ఎల్‌-మడుగుకు చేరుకోవచ్చు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం శివ్వారం నుంచి కూడా ఎల్‌ మడగు అవతలి వైపు చేరుకునే వీలుంది. కరోనా సమస్యలన్నీ సమసిపోయాక... కుటుంబంతో ఓ వారాంతం వెళ్లిరాదగిన చోటు ఇది. హైదరాబాద్‌ వాసులకు కూడా మరీ దూరమేం కాదు.

ప్రశాంతమైన  వాతావరణం మధ్య ఓ నిమిషం ఆగితే సుగంధ ద్రవ్యాలను మరిపించే మొగిలిపువ్వు వాసన మనసుకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది.  నిండు కుండలా కనిపించే  ఎల్‌-మడుగులో ఎండా కాలంలో కూడా మూడు టీఎంసీల నీరు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


logo