మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Apr 05, 2020 , 00:23:04

ఊరికే బోతున్న

ఊరికే బోతున్న

ఆర్నెల్ల పరీక్షలైపోయినయ్యి, ఇగ భూమ్మీద కాలేడ నిలుస్తది?తాతిల్లిచ్చిన్నాటి సంది ఎన్నడువొయ్యి ఊర్ల పడుదామా అని ఒకటే ఆత్రం.మల్ల తెల్లారే, ఒగ చెయి సంచిల రెండు లాగులు, రెండంగీలు సదురుకుని, అంబట్యాల్ల ఇంత బువ్వదిని, అమ్మతాన జరన్ని పైసలు దీస్కోని బైల్దేరిన. కోఠీకి కూతేటు దూరంల ఉన్న కుత్బీగూడల, రెండర్రలు కిరాయికి దీస్కోని ఉండేటోళ్ళం. అమ్మ, బాపు, అక్క, నేను ఇంక తమ్ముడు. తమ్ముడు శిన్నగుండె, అక్కయి పరీక్షలింక అయిపోలె అంటని నేనొక్కన్నె బైల్దేరిన.

కోఠీలున్న గాంధీ జ్ణాన్‌ మందిర్‌ కాడ ఒకటో నంబర్‌ బస్సెక్కి అఫ్జల్‌ గంజ్‌ ల దిగిన, హాఫ్‌ టికెట్‌ గాన్ని నాకాదినాలల్ల చారాన టికటు గొట్టిండు కండక్టరు.అటెంకల్ల ఒగ డబుల్‌ రొట్టె పుడ తీస్కున్న, ఒక డజను అరటిపండ్లు కొన్న, ఆకులు, రెండు పుడల ఆసన జర్ద తీసుకున్న, సున్నం డిబ్బి, కాసు ఇన్ని పచ్చి పోకలు, రెండు ఘంట సుట్టల పుడలు తీస్కోని అన్ని మంచిగ ఇంకో సంచిల సర్దుకున్న.అడుగులడుగేసుకుంట నయాపూల్‌ దాటి అవుతలి బాజుల ఉన్న మ్యూజియము పక్కలున్న ఇస్టేట్‌ టాకీస్‌లకి నడిసిన. గాడ అయిదారు బస్‌ సర్వీసులు నిలవడి ఉన్నయి. గండ్లకెల్లి  ‘చిప్పలపల్లి’ బొయ్యే సర్వీసు సూస్కుని అండ్లకెక్కిన. ఎవ్వల్లేరు బస్సుల. ఇంక గంటయ్యినంక డైవరు, క్లీనరు ఒచ్చి సర్వీసు చాల్జేసిండ్రు.అప్పట్ల మా ఊరికి బోనీకె అర్టీసి బస్సులేడుండె?  గివ్వే పైవేటు సర్వీసులు. మందినెక్కిచ్చుక పట్నం బొయ్యే బస్సు పొద్గాల ఆరింటికి ఊళ్ళెకొస్తుండె, మల్ల గదే సర్వీసు పొద్దుమీకినంక మనుసులను కుక్కుకొని ఒస్తుండె. మా ఊరికి పోనీకె గిదొక్కటె అధారం.సర్వీసు ఇస్టేట్‌ టాకీస్‌ కాడికెల్లి, మిరాలం మండికి ఒచ్చి ఆగింది. అప్పటిదాంక పూర ఖాళీగ ఉన్న సర్వీసు తట్టలతోటి, గంపలతోటి, మనుసులతోటి కుక్కి కుక్కి నిండెట్యాల్లకే ఇంకో గంటయ్యింది. ఆడ సర్వీసు చాల్చేసిండంటే, గప్పుడు షురూ అయితుండే అసలు కత. డైవరు సులేమాన్‌, నోట్ల బీడి తుంట వెట్టుకొని, అంగి కాలర్‌ మెడెనుకకు జారేసుకొని, అబ్బో హీరోలెక్కనే గొడుతుండే. సర్వీసులున్న అందరు అందర్కీ ఎర్కున్నోల్లే. ఏం మామా...అంటే, ఏం కాకా అని పల్కరిచ్చుకునేటోళ్ళే. డైవర్‌ పక్కల బ్యానెటుకు పొడువుగ ఉన్న సీట్ల గూసున్న నేను, ఆల్లీల్లు ఒచ్చి నన్ను జరంత, ఇంక జరంత అనుకుంట, జరుపుకుంట ఆఖిరికి బ్యానెటుమీద కూసోవెట్టిండ్రు. సిన్నవిలగాడ్ని ఇగ నేనేమంట? నా రెండు సంచులు పైలంగ డైవరు సీటెంక కుదురుగ బెట్టిన.

సర్వీసుల ఒకటే పొగ. పతోడు బీడీలు, సిగిరేటులు, సుట్టలు తాగేటోల్లే.అంతట్ల కండక్టరు ఒచ్చె.‘ఏడ్దాంక పిలగా?’ అంటనడిగిండు.‘ఘట్‌ పల్లి’, అని రెండ్రూపాలు చేతిలవెట్టి, ’ఒకటి హాఫ్‌ టికిట్‌', అన్న.  నన్ను కిందికి మీదికి సూశి,’ఎన్నో తరగతోయి నువ్వు?’ అడిగిండు.‘ఆరో తరగతి,’ అని చెప్తి.రూపాయిన్నర టిక్కిట్టు గొట్టి, మిల్గిన ఆఠాన చేతిలవెట్టి బొయ్యిండు కండక్టర్‌.‘ఘట్‌పలిల ఎవరింటికి బోతున్నవు పిలగా,’ అనడిగిండు, నా ముంగల పంచె కమీజు తొడుక్కొని, సిగిరేటు తాగుతున్నాయన. ‘మా తాతింటికి,’ అని జెప్పేట్యాల్లకు ఘొల్లుమని నగిరి అందరు.‘పట్నంల సదూకునే పోరగాల్ల హుషారు సూడు,’ అంటని నగుకుంట,’ మీ తాత పేరేమిటి’ దని అడిగె.‘రాములయ్య,’ అంటని చెప్తి.‘కొట్టం రాములయ్య మన్మనివా,’ అనుకుంట నన్ను ఆళ్ళల్ల కలిపేసుకున్నరు.సర్వీసు పోతనే ఉన్నది.ఇంజను బౌళి, చాంద్రాయణ గుట్ట, కాటేదాన్‌ లను దాటి శంషాబాద్‌ కొచ్చింది.   దిగేటోళ్ళు దిగుతనే ఉన్నరు, ఎక్కేటోళ్ళు ఎక్కుతనే ఉన్నరు.సర్వీసులున్న ఒక్కడు గూడ జరంత సేపు సప్పుడు చెయ్యకుండ కూసోలే. ఒగరొగరికి సాంతిం ఎర్కలేకపోయినా, చాన పాత సుట్టం ఇన్నేండ్లకు మల్ల కండ్లవడ్డట్టు ఆరివారంగ మాట్లాడుతనే ఉన్నరు. నవ్వుతనే ఉన్నరు, పరాష్కాలాడుతనే ఉన్నరు.సర్వీసు పోతనే ఉన్నది.శిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, నాగారంలను దాటుకుని అమీరు ప్యాటకు పోతున్నది సర్వీసు, శెల్కల పోంటి, దుబ్బలల్ల, బండ్ల బాటలల్ల, దుమ్ము లేపుకుంట సర్వీసు పోతనే ఉన్నది.సర్వీసు ఒకటే ఎత్తేసుడు, ఎగిరేసుడు. కడుపులల్ల పేగులు బయటికొచ్చేటట్లు కుదుపుడు. సర్వీసులున్న ఒక్కడు గూడ సోయిల లేడు. జోలి వెట్టుకుంటనే ఉన్నరు.  ఒగ చెరువుకట్ట మీదికెళ్ళి అలుగువారెడు తొవ్వలకెల్లి సర్వీసు పోతుంటె, సర్వీసులున్న ఒక నడీడు మనిసి, డైవరు సులేమానుకు చెప్పి బస్సాపె.బస్సాపి ఏమాయె నంటని అడిగేట్యాల్లకే, సర్వీసు దిగి పక్కలున్న తుప్పలల్లకు ఉర్కిండు పంచె మీదికనుకుంట.‘చెంబట్కకు పొయ్యిండని,’ నగుకున్నరందరు.ఇగ ఎట్లా సర్వీసు ఆగిందని, అందరు ఒగరెనుకొగరు దిగి, రానోడు గూడ బల్మీకి మూత్రాలు పోసిండ్రు. బీడీలు తాగేటోల్లు బీడీలు ముట్టిచ్చుకున్నరు. మల్ల సర్వీసు చాల్జేసేట్యాల్లకు అద్దగంట ఆడ్నే అయిపాయె.అమీర్‌ ప్యాట, పెండ్యాల మీదికెల్లి శెల్కల పోంటి దుమ్ములేపుకుంట ‘ఘట్‌ పల్లి’చేరేట్యాల్లకు పొద్దుమీకింది. దూళ్ళు ఇండ్ల మొఖంబట్నయ్యి. కోళ్ళు గూళ్ళల్లకు చేరుతున్నయి.ఆల్‌ జిల్లా గ్రామీన యాత్ర అయిపోయి చెయి సంచి తీస్కోని ఇంట్ల కాలువెట్టిన.

తాతయ్య ఆరివారంగ పల్కరిచ్చె.బాపమ్మ దగ్గర్కి తీస్కోని నెత్తంత నిమిరె.చిన్నమ్మ కాళ్ళు కడుక్కోనీకె నీళ్ళిచ్చె.తమ్ముడు ఉరుకొచ్చి అబ్బలిచ్చె.చెయి సంచి సిలకొయ్యకు తలిగిచ్చి, తమ్మునికి డబుల్‌ రొట్టె తీసిద్దామని సూస్తే, ఇంకో సంచి లేదు. ర్వీసులనే మర్సిన. నాకు ఏడుపొచ్చింది.సుట్టలు, ఆకులు, జర్ద, పండ్లు అన్ని అండ్లనే ఉండె. నా పానం సల్లగయ్యింది. సప్పుడు చెయ్యకుండ, ఎవ్వలికి చెప్పకుండ కాళ్ళు కడుక్కొచ్చుకున్న.చీకటయ్యిందని గూట్లె దీపాలు బెట్టిండ్రు.అందరం ఒకతాన గూసోని రొట్టెలు దిన్నం.ఎన్ని చేస్నా, ఏం చేస్నా నాకు చైను వడ్తలేదు. పానమంత సంచి మీదనే ఉన్నది. జల్ది జల్ది ఇంత తిని పండుకున్న.తెల్లారి లేసి నోట్ల పండ్ల పుల్లేసుకొని ఇంటెనక ఆడికీడికి తిరుగుతుండంగ, తాత పిలిస్తే, ఏంటిదంటని పోతి.‘నిన్న సర్వీసుల, సంచి మర్సినవంటగద, ఇగో పట్నం బొయ్యేటపుడు, సులేమాను యాదివెట్టుకోని పంపిండు,’ అంటని అని,’ మల్ల సంచి మర్సినవని రాతిరి చెప్పకపోతివేందిరా?’ అడిగిండు తాతయ్య.నాకు పానం లేచొచ్చినట్టయ్యింది.ఉర్కొచ్చి తాతను అబ్బలిచ్చుకున్న.

([email protected])

-కొట్టం రామకృష్ణారెడ్డి


logo