శుక్రవారం 05 జూన్ 2020
Sunday - Apr 05, 2020 , 00:03:51

సహజ కవి బమ్మెర పోతన

సహజ కవి బమ్మెర పోతన

 • ‘నన్నయ, తిక్కనలు నా పుణ్యంకొద్దీ భాగవతాన్ని తెలుగులో రాయలేదు. నేను భాగవతాన్ని తెనిగించి పునర్జన్మ లేకుండా చేసుకుంటాను’ అని పొంగిపోయిన బమ్మెర పోతన.. మహాకవి. ప్రజాకవి. పండితులను, పామరులను మెప్పించిన గొప్ప కవి. భక్తి సాహిత్యంలో పోతనది పోత పోసిన ప్రస్థానం. ఒక ఆధ్యాత్మిక, వేదాంత గ్రంథాన్ని.. సర్వజనరంజకంగా, అద్భుతమైన పద గుంభనతో, లలితమైన పద విన్యాసంతో, భక్తి, పాండిత్యం, చమత్కృతి, భావుకత్వం నిండిన సంగీత మాధుర్యం పండిన కవన శైలితో తీర్చిదిద్దిన మహానుభావుడు పోతన. 
 • బమ్మెర పోతన సహజ పాండిత్యుడు, సద్గుణ సంపన్నుడు, వినయ విద్యావివేక, వినిర్మల త్రివేణీ సంగమ స్నాతుడు, శ్రీరామ పాద సేవార్చనా దురంధరుడు. శ్రీకృష్ణలీలామృత భాగవతాన్ని సంస్కృతం నుంచి దేశ భాషలలోనికి అనువదించడం ఈయనతోనే ప్రారంభమైంది.  
 • పదిహేనవ శతాబ్దానికి (క్రీ.శ. 1450-1510) చెందిన పోతన.. భక్తకవి. ఈయనది విశిష్ట వ్యక్తిత్వం. మొదట శివారాధకుడైనా తర్వాత విష్ణుభక్తుడయ్యాడు. పోతనకు ‘సహజపాండిత్య’ అనే బిరుదు ఉంది. ఈయన సంస్కృత ‘శ్రీమద్భాగవము’ను తెలుగులో రాసి తన జన్మనీ, తెలుగు భాషని చరితార్థం చేశాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 
 • వచన రచనలో పోతనను మించిన వారు లేరు.. నైమిశారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, కళ్యాణ ఘట్టంలో రుక్మిణి వర్ణనం, ద్వారకాపురి వర్ణనం.. ఇలా ఆంధ్ర మహాభాగవతం మొత్తం అద్భుతమైన వచన రచనా విలాసంతో నిండి ఉన్నది. ఇక పద్య రచనా విధానంలోనూ పోతనది గొప్పశైలి. పద్యాలతో వర్ణ చిత్రాలు, భావ చిత్రాలు, చలన చిత్రాలు, నిశ్చలన చిత్రాలు, కుడ్య చిత్రాలు, మణిమయ సువర్ణ సౌధాలు.. నిర్మించిన వాడు పోతన. భీష్మ ఘట్టం మొత్తం అద్భుతమైన వర్ణ చిత్రమే. దశమ స్కంధం సాంతం నిరుపమానమైన భావ చిత్రం. అద్భుతమైన కుడ్య చిత్రాలుగా, నిశ్చలన చిత్రాలుగా ప్రణయ, దాస్య భక్తిలో నిశ్చేష్టులైన రుక్మిణి, ప్రహ్లాదుడు, నారదుడు, కుంతీ, కుచేలుడు, ఉద్ధవుడు, అర్జునుడు, గోపికలు.. వీరందరి నవరస భావ ప్రకటనలతో కూడిన వర్ణ చిత్రాలుగా ఆయా ఘట్టాలను ఆవిష్కరించాడు. 
 • పోతన నేటి జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసయ దంపతులకు జన్మించాడు. వీరి అన్న పేరు తిప్ప. వీరిది బమ్మెర వంశం. శైవ కుటుంబం. వీరి గురువు ఇవటూరు సోమనాథుడు. శ్రీనాథునికి పోతనకు బంధుత్వం ఉందని కొందరు భావించారు. కానీ అది చారిత్రక సత్యం కాదని పరిశోధకులు నిర్ణయించారు.   
 • పోతన భాగవతం కాక, వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం రాశాడు. భాగవతం రచించడానికి ముందు పోతన రాచకొండనేలిన పద్మనాయకరాజు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో ఉండేవాడు. అక్కడున్నప్పుడే భోగినీ దండకం రచించాడని అంటారు. యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన ఈ దండకం రాశాడంటారు. సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దండకంగా చెబుతారు. 
 • దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ వీరభద్ర విజయం అనే పద్యకావ్యాన్ని కూడా రాశాడు పోతన. వీరభద్ర విజయం అణువణువునా శివభక్తితో నిండిన కావ్యం. ఇప్పుడంటే శివకేశవులు ఒక్కరే అన్న భావన ఉన్నది కానీ, ఒకప్పుడు రెండు మతాలు కుమ్ములాడుకున్నంత తీవ్రంగా... శివ, విష్ణు భక్తుల మధ్య కొట్లాటలు సాగేవి. అలాంటి కాలంలో శివభక్తుడైన పోతన, విష్ణు సంబంధమైన భాగవతాన్ని ఆంధ్రీకరించడం చాలా ఆశ్చర్యకరమైన అంశం. 
 • పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. అలాగే గజేంద్ర మోక్ష ఘట్టంలో ‘సిరికిం జెప్పడు’ అనే పద్యం ఉంది. విష్ణువు తన భక్తుడైన గజేంద్రుని రక్షించేందుకు ఉన్నపళంగా బయల్దేరాడు అన్న అర్థం ఈ పద్యంలో స్ఫురిస్తుంది. ఈ పద్యాన్ని చదివి- ‘యుద్ధానికి బయల్దేరేవాడు అలా ఎలా ఉన్నపళంగా బయల్దేరతాడయ్యా’ అంటూ పోతనని, శ్రీనాధుడు అపహాస్యం చేశాడట. ఈ విషయం మీద వాదన జరుగుతుండగానే శ్రీనాధునికి తన పిల్లవాడు బావిలో పడిపోయాడని ఎవరో చెప్పారు. వెంటనే శ్రీనాథుడు హడావుడిగా బావి దగ్గరకు పరుగెత్తాడు. పిల్లవాడు బావిలో పడలేదనీ, ఆప్తులైనవారు ఆపదలో ఉన్నారని తెలిసినప్పుడు కంగారుపడి పరుగులెత్తడం సహజమనీ.. శ్రీనాథునికి తెలియచేసేందుకే ఈ నాటకం ఆడామనీ పోతన శిష్యులు చెబుతారు.
 • పోతన జీవితంలో ఇలాంటి రసవత్తర ఘట్టాలకు లోటు లేదు. కాల్పనిక సాహిత్యంలో పోతన, శ్రీనాథుడు ఇరువురూ కూడా బావాబావమరదులు అన్న అల్లికలు ఉన్నాయి. నిరంతరం రాజాశ్రయాన్ని నమ్ముకుని చివరికి కటిక దారిద్య్రాన్ని అనుభవించిన శ్రీనాధునికీ, నిత్యం పేదరికంలో ఉంటూనే ఆత్మతృప్తితో జీవించిన పోతనకీ మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల.. రచయితలు వారిరువురినీ ఒక చోటకి చేర్చి కావాల్సినంత నాటకీయతను సృష్టించారు. కానీ వీరిరువురికీ అసలు సంబంధమే లేదు. కేవలం సమకాలికులు మాత్రమే. 
 • పోతన భాగవతాన్ని సింగభూపాలుడు తనకు అంకితం ఇమ్మన్నాడనీ, అందకు పోతన నిరాకరించి రామాంకితం చేశాడనే కథ ప్రచారంలో ఉంది. పోతన శ్రీనాథుడిలా భోగి కాదు. సిరిసంపదల కోసం అర్రులు చాచలేదు.  అందుకే భాగవతాన్ని రాజుకు కాకుండా రాముడికే అంకితం ఇచ్చాడు. 
 • పోతన గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పిన ఒక అంశం ఆయన సేద్యం. పోతన ఒకవైపు నాగలి పట్టి పొలాన్ని దున్నుతూనే, మరోవైపు సాహిత్య రంగంలో భాగవత రత్నాలను పండించాడు. ఒకవైపు శివుని ఆరాధిస్తూనే, మరోవైపు విష్ణులీలలను భాగవతం ద్వారా ప్రకటించాడు. కటిక దారిద్య్రాన్ని అనుభవించినా కూడా తన భాగవతాన్ని సింగభూపాల రాజుకి అంకింతమిచ్చేందుకు ఒప్పుకోలేదు. 
 • బహుశా అందుకేనేమో పోతన భాగవత పద్యాలు కూడా అంతే నిర్మలంగా ఉంటాయి. అందులోని గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు, ‘ఇందు గలడందు లేడను సందేహంబు వలదు’ వంటి పద్యాలు.. కొన్ని వందల ఏళ్లపాటు పండితపామరులన్న భేదం లేకుండా ప్రజల నోళ్లలో నానుతున్నాయి. 

-నగేష్‌ బీరెడ్డి


logo