శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Apr 04, 2020 , 23:56:30

ఫ్రమ్‌ ఎమర్జెన్సీ వార్డ్‌!

ఫ్రమ్‌ ఎమర్జెన్సీ వార్డ్‌!

పేషెంటేమో.. ‘డాక్టర్‌ డాక్టర్‌' అన్నాడు. డాక్టరేమో.. ‘నర్స్‌.. నర్స్‌' అని పిలిచాడు. ఫ్యామిలీ మెంబర్స్‌ తోడు కూడా లేరు. ఉన్నదల్లా ఒక్కరే.. నర్స్‌. ప్రీ ట్రీట్‌మెంట్‌.. పోస్ట్‌ ట్రీట్‌మెంట్‌. ఎమర్జెన్సీ వార్డులో వెలకట్టలేని సేవ. చూస్తున్నాం కదా? కరోనా రక్కసి ప్రజలనెలా ఇబ్బంది పెడుతున్నదో. వైరస్‌ కావచ్చు.. యాక్సిడెంట్‌ కావచ్చు.. ఇంకోటి కావచ్చు. డాక్టరైతే మధ్యమధ్యలో వచ్చి చికిత్స చేసి వెళ్తారు. అయితే నర్స్‌ మాత్రం డిశ్చార్జి వరకూ తోడుగా ఉంటారు.  అలాంటి ఓ నర్స్‌ ‘లైఫ్‌ జర్నీ’ ఇది... 

‘నా పేరు లక్ష్మణ్‌ రుడావత్‌. మాది.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా, పదర మండలంలోని ఇప్పలపల్లి తండా. కూలీనాలీ చేసుకునే కుటుంబం. మా పేరెంట్స్‌ చదువుకోలేదు.  మమ్మల్ని బాగా చదివించాలనే కోరిక వాళ్లది. స్థోమత లేకపోవడంతో హైదరాబాద్‌లోని చర్లపల్లి క్రైస్తవ మిషనరీలో చేర్పించారు. సేవాభావం అంటే ఏమిటో అక్కడే తెలుసుకున్నాను. ఇంటర్మీడియెట్‌ అయిపోయాక మహావీర్‌ వైద్య కళాశాలలో నర్సింగ్‌ కోర్స్‌ చేశాను. 

అది 2011. ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో నర్స్‌గా తొలి ఉద్యోగం. నేను చేసేది ఉద్యోగం కాదనీ.. సేవ అనీ అప్పుడే అర్థమైంది. ఫ్రెండ్లీ నర్సింగ్‌ అలవాటు చేసుకున్నాను. కోర్సు చేసేటప్పుడు ఉండే ఆసక్తి.. ఉద్యోగంలో చేరిన తర్వాత ఉండదు. ఈ మాట నాకే కాదు. ఎవరికైనా వర్తిస్తుంది. రెండేండ్లు గడిచాయి. ఫ్రెండ్స్‌ని కలవడం లేదు. ఊరికెళ్లి అమ్మానాన్నలను పలకరించడం లేదు. ఎప్పుడూ ఆసుపత్రీ పేషెంట్లూ... అదే ప్రపంచం! జీవితం ఇలా అయిపోయిందేమిటా అనుకునేవాడిని.  

జీవితాన్ని షిఫ్ట్‌లుగా విభజించుకోవాల్సిన సరిస్థితి. మార్నింగ్‌ షిఫ్ట్‌ అయితే పొద్దున ఏడింటికే హాస్పిటల్‌లో ఉండాలి. ఎమర్జెన్సీ కేస్‌ వస్తే... ఇంటికి వెళ్లేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. ఇప్పుడు నేను ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్‌ నర్స్‌గా చేస్తున్నా. కొలువు నాంపల్లిలో. ఉండేది తార్నాకాలో. 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను చూసి అందరూ భయపడుతున్నారు. కరోనా పాజిటివ్‌ రోగుల దగ్గరికి  కుటుంబ సభ్యులు రావడానికి కూడా అవకాశం లేదు. కానీ మేం మాత్రం వాళ్లతోనే ఉండాలి. అన్నీ దగ్గరుండే చూసుకోవాలి.  మా భార్యాపిల్లలు కూడా ఇలాంటి సమయాల్లో... తమతోనే, తమ మధ్యే, నాలుగు గోడల నడుమ సురక్షితంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ మేం కుటుంబానికంటే, రోగికే ప్రాధాన్యం ఇస్తాం.  మావి ఎమర్జెన్సీ వార్డు జీవితాలు! 

 ఏం చేసినా సమాజం కోసమే అనే సంతృప్తితో పనిచేస్తున్నాం. కానీ, అదే సమాజం మాకు తగిన గుర్తింపును ఇవ్వడం లేదనే బాధైతే ఉంది. నర్స్‌లు అనగానే చిన్నచూపు చూస్తుంటారు. తక్కువ చేసి మాట్లాడుతుంటారు.

ఒకసారి.. ఒక పెద్దాయన కాలికి ఆపరేషన్‌ అయింది. పాపం చాలా అవస్థ పడేవారు. తోడుగా ఎవరూ లేరు. భార్య ఉన్నా, ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఆమెది. పిల్లలు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. కేర్‌ టేకర్‌గా ఒక మనిషిని పెట్టారు.  ఆమె సొంత పిల్లల్లా సపర్యలు చేయలేదు కదా? అప్పుడు నేనే దగ్గరుండి అన్నీ చూసుకున్నా. వారం రోజుల్లో అంతా సెట్‌ అయింది. డిశ్చార్జి అయ్యేనాడు నాకు వీక్లీ ఆఫ్‌. కానీ ఆరోజు ఆ పెద్దాయన నన్ను పిలిపించుకున్నాడు. ‘నా సొంత కొడుకులు కూడా చూసుకోలే’ అని ఉద్వేగానికి గురయ్యాడు. డబ్బులివ్వబోయాడు. ‘నా సేవను డబ్బుతో కొనాలి అనుకుంటున్నవా పెద్దాయనా?’ అన్నాను. చాలా సంతోషపడ్డాడు. సంపాదన తక్కువైనా సరే.. ఇలాంటి సంతృప్తి.. చిన్న చిన్న సంతోషాలు పుష్కలంగా పొందుతున్నా. 

ఒకసారి.. థియేటర్‌ రూమ్‌లో ఆపరేషన్‌ జరుగుతోంది. పేషెంట్‌ మహిళ. మేల్‌ నర్స్‌ కాబట్టి ఆమెకు చికాకుగా ఉందనిపించింది. కానీ అది మేజర్‌ ఆపరేషన్‌. నేను కచ్చితంగా థియేటర్లో ఉండాల్సిందే. పొద్దున ఎనిమిదింటికి మొదలు పెడితే రాత్రి ఏడయింది సర్జరీ అయిపోయే 

సరికి. అంత కష్టపడి ఆపరేషన్‌కు సహకరిస్తే, డిశ్చార్జి అయ్యేటప్పుడు ఆమె కనీసం ‘వెళ్తున్నా’ అని కూడా అనలేదు. నన్ను చూడనట్టే వెళ్లిపోయింది. ‘అంతగా రిస్క్‌ తీసుకుంటే కనీసం థ్యాంక్స్‌ కూడా చెప్పరా’ అనిపించింది ఆ సమయంలో. ‘పుణ్యానికి చేస్తున్నారా? జీతం తీసుకోవడం లేదా’ అని ఉద్దేశం ఉండొచ్చు. కానీ మా జీతాలు అంతంత మాత్రమే. 

నర్సింగ్‌ వ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం 2017లో నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశా. ఇప్పుడు నా వెనక నర్సింగ్‌ సమాజం ఉంది. వాళ్ల కోసం ఎంతోకొంత చేయాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. ఒకానొక దశలో డాక్టర్లు కూడా చేతులె

త్తేస్తే...పేషెంట్లకు మానసిక ైస్థెర్యం అందించి, జీవితం పట్ల భరోసాను కల్పించే వృత్తి మాది. కానీ సొసైటీ మమ్మల్ని ఇంకా ‘ఆఫ్టరాల్‌ నర్సులు’గానే చూస్తోంది ఎందుకో?’ అని ఎమోషనల్‌గా తన లైఫ్‌జర్నీ స్టోరీకి ఎండ్‌ చెప్పాడు. 

లక్ష్మణ్‌ చెప్పేదాంట్లో వాస్తవం ఉంది. నిజంగా నర్సింగ్‌ వృత్తిలోనివారి సేవకు.. సంపాదనకు పొంతనే లేదు. ఎమర్జెన్సీలో చావుబతుకుల్లో ఉన్న పేషెంట్‌కు జాగ్రత్తగా చూసుకొనే నర్స్‌ల జీవితానికి ఓ భరోసా అవసరం. లక్ష్మణ్‌లాంటి వాళ్లకు మంచి రోజులు రావాలి. 

- దాయి శ్రీశైలం


logo