శుక్రవారం 05 జూన్ 2020
Sunday - Apr 04, 2020 , 23:43:08

అనుకోకుండా ఒక రోజు..

అనుకోకుండా ఒక రోజు..

ఇండస్ట్రీలో సపోర్ట్‌ లేకుండా నెగ్గుకు రావడం కష్టమంటారు.. కానీ  ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా.. చదువుల నుంచి తప్పించుకోవడానికి.. సినిమా ఆడిషన్‌కి వెళ్లాడు.. అక్కడ బెడిసి కొడుతుందనుకుంటే.. సుడి తిరిగింది.. హీరో అయ్యే చాన్స్‌ దక్కింది..ఒకటి కాదు.. మూడు సినిమాల్లో  చేశాడు.. కానీ తగిన గుర్తింపు రాలేదు..ప్రశ్నార్థకంగా మారిన కెరీర్‌లో ఆశాదీపంలా..సీరియల్స్‌ దారి చూపాయి.. అలా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని.. బుల్లితెరలో స్టార్‌ స్టేటస్‌ని దక్కించుకున్నాడు.. అతడే ‘రక్తసంబంధం’ ఆదిత్య ఉరఫ్‌ సిద్ధార్థవర్మ. అతని అంతరంగం.. 

నా అసలు పేరు రవీంద్ర వర్మ. మాది ఈస్ట్‌ గోదావరి దగ్గర రాజవొమ్మంగి. అక్కడ ఏడవ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత పక్కనున్న అడ్డతీగలలో టెన్త్‌ పూర్తి చేశా. పెద్ద చదువులకు భీమవరం బీఎన్‌ ఆర్‌ కాలేజ్‌లో చేరాను. చిన్నప్పటి నుంచి స్టేజ్‌ ఎక్కింది లేదు. కాకపోతే మిమిక్రీ చేయడమంటే సరదా. చిన్నప్పుడు ఏదో ట్రై చేశా. అది కూడా ఇంట్లోనే. అనుకోకుండా  హీరో అయ్యా.   

హీరో వేషం..

అవి నేను ఐసెట్‌ కోసం కోచింగ్‌ తీసుకుంటున్న రోజులు. విజయనగరంలో ఉన్నా. ‘3జీ లవ్‌' అనే సినిమాకు ఆడిషన్స్‌ జరుగుతున్నాయని మా సీనియర్‌ వర్మ అన్నయ్య వచ్చి చెప్పారు. చిన్నప్పటి నుంచి నేను బాగుంటాననీ సినిమాల్లో  ట్రై చేయమనీ చెబుతుండేవారు. సరే.. ఒకసారి వెళ్లి చూద్దామని అనుకున్నా. అసలు కొద్దిగా కూడా ఇంట్రెస్ట్‌ లేకుండా  అడుగుపెట్టా. అప్పటికే 800మంది పేపర్లు పట్టుకొని డైలాగులు ప్రిపేర్‌ అవుతున్నారు. నాకూ ఆ పేపర్‌ ఇచ్చారు. ఒక గదిలోకి పిలిచి డైలాగ్‌లు చెప్పమన్నారు. అప్పటి వరకు నాకు ఫొటోకు ఫోజు ఇవ్వడం కూడా తెలియదు. అలాంటిది లైటింగ్స్‌ మధ్య డైలాగులు చెప్పడం నావల్ల కాలేదు. అక్కడ ఉన్నవాళ్లు నాకు తెలిసిన డైలాగ్‌ ఏదైనా చెప్పమన్నారు. అదీ చెప్పలేకపోయాను. కనీసం సినిమాల్లో నాకు వచ్చిన డైలాగ్‌ అయినా చెప్పమన్నారు. నాకు ప్రభాస్‌ అంటే ఇష్టం. చివరికి ఛత్రపతిలో ఒక డైలాగ్‌.. అది కూడా సగం చెప్పా. దానికి వాళ్లు ఇంప్రెస్‌ అయి సెలెక్ట్‌ చేశారు. ఈ విషయం ఇంట్లో చెబితే ఈ వేషాలు మనకు అవసరం లేదన్నారు... కోపంగానే. తర్వాత రోజు జిల్లా ఎడిషన్‌ పేపర్లో నేను సెలెక్ట్‌ అయిన సంగతి రావడంతో నేను హైదరాబాద్‌ వెళ్లడానికి ఒప్పుకొన్నారు. ఇలా హాలిడేస్‌ సమయంలో ఏదో చేసేద్దాం అనుకున్నా. అప్పటికి నాకు కూడా కెరీర్‌ పట్ల అవగాహన లేదు. 

హైదరాబాద్‌ పయనం..

నాకు ఒక అక్క. వాళ్ల అత్తగారిది హైదరాబాద్‌. తన కోసం రెండుసార్లు హైదరాబాద్‌ వచ్చాను. కానీ ఈసారి నేను హీరో కావడం కోసం  అడుగుపెట్టా. ఆ సినిమాలో ముగ్గురు హీరోల్లో నేను ఒకడిని. అందరిలో నాకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉండేది. ఆ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. కానీ సెకెండ్‌ చాన్స్‌ మాత్రం ఇచ్చింది. మరో రెండు సినిమాలు చేశా. అవి కూడా సక్సెస్‌ అవ్వలేదు. ఈలోపు సీరియల్‌ చాన్సులు  వచ్చాయి. దానికి నా భార్య విష్ణుప్రియ(అప్పటికి ఫ్రెండ్‌ మాత్రమే) చాలా బ్రెయిన్‌వాష్‌ చేసి నన్ను ఒప్పించింది. అలా క్రిష్‌ గారి బ్యానర్‌లో స్వాతి చినుకులు చేశా. అది నాకు మంచి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత దాదాపు ఐదు సీరియల్స్‌ చేశా. ఈ మధ్యలో మా పెళ్లి కూడా అయిపోయిందండోయ్‌!

జీతో మలుపు..

ఎన్ని చేశామన్నది కాదు.. ఎక్కడ చేశామన్నది కూడా ఒకటి ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో జీ నెట్‌వర్క్‌లో చేయాలని ఉండేది. నా ఎదురుచూపు ఫలించింది. రక్తసంబంధం సీరియల్‌తో నాకు మరింత పెద్ద ప్లాట్‌ఫామ్‌ దొరికింది. ఇందులోనే మట్టిగాజులు సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది. జీ నుంచి.. 2018లో ఉత్తమ కొడుకు, 2019లో బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నా. ఈసారి హ్యాట్రిక్‌ హీరో అవుతానేమో. మధ్యలో చాలా సినిమా చాన్సులు వచ్చాయి. కానీ నేనే నాకు సీరియల్సే జీవితమనిపించింది. ఇందులోనే ఇంకా సాధించేది చాలా ఉందన్న నిర్ణయానికొచ్చి, సినిమా అవకాశాలు వదులుకున్నా. ఇప్పడు నా భార్య విష్ణు, నా కొడుకు అయాన్ష్‌... నా లోకంగా బతికేస్తున్నా.

క్రిష్‌తో అనుబంధం..

చదువులో టాపర్‌నేమీ కాదు. యావరేజ్‌ స్టూడెంట్‌ని. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా భాష్యం స్కూల్‌లో ట్యూటర్‌గా పనిచేశా. అదీ నా పాకెట్‌ మనీ కోసం. నేను హైదరాబాద్‌ వచ్చినప్పుడు చూసిన మొదటి సినిమా గమ్యం. ఆ తర్వాత క్రిష్‌గారి బ్యానర్‌లో దాగుడుమూతలు దండాకోర్‌, నా మొదటి సీరియల్‌ చేశా. ఆయన నాకు మార్గదర్శకుడు. నేను అన్ని విషయాలను ఆయనతో షేర్‌ చేసుకుంటా. ఆయన కూడా నాకు ఒక తమ్ముడిలా సలహాలు ఇస్తుంటారు. నా మొదటి ప్రొడ్యూసర్‌ ప్రతాప్‌ గారు నాకు మొదట్లో చాలా సహాయం చేశారు.ఆయన గదిలోనే నాకు చోటిచ్చారు.

క్రేజీ క్రేజీగా..

సీరియల్స్‌ ద్వారా నాకు ఎంతోమంది ఫ్రెండ్స్‌ అయ్యారు. అందులో మాతో పాటు మరో మూడు జంటలు ఉన్నాయి. ఇంద్రనీల్‌-మేఘన, ప్రీతమ్‌-మానస, శివనాగ్‌ - మహేశ్వరితో కలిపి క్రేజీ కపుల్‌ అని  వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నాం. ఇప్పడు మేమంతా కలిసి #CrazyCouples పేరుతో ఒక యూట్యూబ్‌ చానెల్‌ని ఈ ఉగాదికి లాంచ్‌ చేశాం. ఇక నుంచి టీవీలోనే కాదు యూట్యూబ్‌లో కూడా అలరించడానికి వస్తున్నాం. 


logo