శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sunday - Apr 04, 2020 , 23:17:21

ట్రంక్‌ పెట్టె

ట్రంక్‌ పెట్టె

శాన్‌ఫ్రాన్సిస్కోకి వచ్చిన రెండోరోజు మిసెస్‌ కెండల్‌ సన్‌లిట్‌ హైట్స్‌ అనే చోట ఓ చిన్న కొండమీది ఇంటిని అద్దెకి తీసుకుంది. సన్నగా ఉన్న దాని యజమాని అరవై ఏళ్ళ జాక్‌ దగ్గుతూ ఆవిడకి తన ఇంటిని చూపించాడు.

“ఈ ఇల్లు వదిలి వెళ్ళాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఇందులో ముప్పై ఐదేళ్ళు ఉన్నాను. అకస్మాత్తుగా శ్వాస సమస్య నన్ను పంపించేస్తున్నది. రుచి, వాసనలు పోయాయి. గుండెవేగం పెరిగింది. క్రితం వారం నాకు దగ్గుకి దాదాపు స్పృహ తప్పింది. ‘జాక్‌! నువ్వు తక్షణం ఈ పొగమంచు ప్రాంతం నించి వేడి ప్రాంతానికి వెళ్ళిపోవాలి. లేదా మూడు నెలల్లో పోతావు’ అని డాక్టర్‌ చెప్పాడు. పిల్లలున్న వారికి అద్దెకి ఇవ్వదలచుకోలేదు. పిల్లలు ఇంటిని నాశనం చేస్తారు. అద్దెకి ఇవ్వక పోతే దొంగలు చొరబడి ఇష్టం వచ్చినట్లు దీన్ని వాడుకుని పాడు చేస్తారని భయం. అందుకే, మీరు ఇల్లు తాళం పెట్టి ఎక్కువ రోజులు ఎటూ వెళ్ళకూడదని కోరింది. ఐనా, మీ వయసులో ఎవరు వెళ్తారు? షికాగోలో మీకు ఎవరూ లేరన్నారుగా?”

“అవును. మా కుటుంబంలో నేనొక్క దాన్నే మిగిలాను” మిసెస్‌ కెండల్‌ అబద్ధం చెప్పింది.పాల్‌ తను ఇక్కడ దాక్కుందని కనిపెట్టి రాలేడు. ఐతే, అతను ఎలాగైనా తనని కనుక్కోవచ్చనే భయం ఆవిడలో ఉంది. కొన్ని వారాలు లేదా కొన్ని నెలల్లో ఓ రోజు పాల్‌ వచ్చి డోర్‌ బెల్‌ కొట్టినా ఆశ్చర్యం లేదని అనుకొంది.“మీకు ఎంతకాలం ఈ ఇల్లు అవసరం?” జాక్‌ ప్రశ్నించాడు.“చెప్పలేను. కనీసం కొన్ని నెలల పాటు ఉంటాను.”“మంచిది. కొన్ని నెలల తర్వాత నేను ఆరోగ్యం కుదుటపడితే తిరిగి రావచ్చు.”ఆయన ఓ తలుపు హ్యాండిల్‌ని తిప్పి, తెరచి, లైట్‌ స్విచ్‌ని నొక్కి మెట్లమీద కిందకి దిగుతూంటే ఆవిడ అనుసరించింది. మిగిలిన ఇంటిలా సెల్లార్‌ కూడా ఎంతో శుభ్రంగా ఉంది. “చాలా చోటుంది. మీ సామానంత ఇక్కడ స్టోర్‌ చేసుకోవచ్చు. కారడం, నీళ్ళు ఊరడం లాంటివేం లేవు” చెప్పాడు.

“నాకు సామాను పెద్దగా లేదు మిస్టర్‌ జాక్‌” చెప్పింది.ఓ వైపు గోడకి ఆనించిన పెద్ద చెక్క పెట్టెలని చూసింది. ఇత్తడి మూలలు, ఇత్తడి తాళాలు, చుట్టూ ఇత్తడి ్రైస్టెప్స్‌ ఉన్న ఆ మూడు ఒక దానిమీద మరోటి ఉన్నాయి. వాటిని చూడగానే ఆవిడకి మళ్ళీ పాల్‌ గుర్తొచ్చాడు.

“సెల్లార్‌ కిటికీ తలుపులకి ఇనుప చువ్వలని బిగించాను. బయటనించి ఇందులోకి ఎవరూ రాలేరు. ఈ ఇంట్లో చాలా భాగం నేనే కట్టాను.” “అలాంటి చెక్కపెట్టె నాకు ఉపయోగపడుతుంది. నేను ఓ దాంట్లో నా విలువైన పింగాణీ సామాను పెట్టుకోవచ్చా? అది వారసత్వంగా వచ్చింది” కోరింది.“సారీ. నా పెట్టెలనిండా సామానుంది. పుస్తకాలు, మా ఆవిడ వస్తువులు, సావెనీర్లు మొదలైనవి. ఐనా, ఈ సెల్లారే ఇనప్పెట్టె లాంటిది. ఈ పెట్టెలని నాకు తయారు చేసి అమ్మినతను కావాలంటే చేసిస్తాడు.”అవి పాల్‌కన్నా పొడవైన పెట్టెలని మనసులో లెక్క వేసుకున్నాక చెప్పింది.“మీకు డబ్బిస్తాను. నాకో పెట్టెని తెప్పించి పెట్టండి.”“లేదు. నా మిత్రుడు తెస్తాడు. అతనికే డబ్బివ్వండి” జాక్‌ చెప్పాడు.ఆవిడకి డబ్బు సమస్య లేదు. హ్యాండ్‌బ్యాగ్‌లో కొన్ని వేల డాలర్ల నోట్లు, ఇంకా షికాగోలోని బ్యాంక్‌లో రెండు లక్షల డాలర్లు ఉన్నాయి.“ముప్పై ఐదేళ్ళు! కానీ, ఇప్పుడు ప్రాణాలకోసం ఈ ఇల్లు వదలాల్సి వస్తున్నది. నా పెద్ద కూతురు ఆరిజోనాలో ఉంటున్నది. ఆమె దగ్గరకి వెళ్తాను. మా ఆవిడ పోయాక ఎన్నిసార్లు పిలిచినా ఈ ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళలేదు. కానీ, ఇప్పుడు తప్పడం లేదు. దయచేసి ఇంటిని జాగ్రత్తగా చూస్తుండండి” జాక్‌ బాధగా చెప్పాడు.“నా స్వంత ఇంటిలా చూసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను.”“నేను ఎప్పుడైనా వచ్చి నా ఇంటిని చూసుకుని వెళ్తూంటాను.”ఆయన సెడాన్‌ కారు రోడ్లో కొండమీద నించి కిందకి దిగి వెళ్ళడాన్ని ఆవిడ కిటికీలోంచి చూసింది. ఇరుగు, పొరుగు లేని చోట తనకో సెల్లార్‌గల ఇల్లుందన్న ఆలోచన ఆవిడకి సంతోషాన్ని కలిగించింది. ‘పాల్‌! నన్ను కనుక్కొని రాకు. నీ కోసమే నన్ను వెదికే ప్రయత్నం చేయకు’ ఆవిడ మనసులో అనుకుంది.

ఆర్నెల్ల మునుపు...

షికాగోలోని డిటెక్టివ్‌ లెఫ్టినెంట్‌ బ్రాయల్స్‌ దగ్గరకా కేస్‌ వచ్చింది. తుపాకీని శుభ్రం చేస్తూంటే ప్రమాదవశాత్తు పేలి ఎవరైనా మరణిస్తే, అది ప్రమాద మరణమై ఉండదని అతని విశ్వాసం. రోజర్‌ కెండల్‌ గెడ్డంలోంచి తల్లోకి దూసుకెళ్ళిన గుండువల్ల అర్ధరాత్రి దాటిన ఐదు నిమిషాలకి మరణించాడు. తన పడకగదిలో నిద్రించే మిసెస్‌ కెండల్‌కి తుపాకీ పేలిన శబ్దానికి మెళకువ వచ్చింది. ఆ సమయంలో అది పేలిందని పొరుగువాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఆవిడ వెళ్ళి చూస్తే గుండు తల్లోకి దూసుకెళ్ళిన భర్త బేస్‌మెంట్లో మరణించి కనిపించాడు. ఐతే, సాక్ష్యాధారాలు లేక బ్రాయల్స్‌ ఆ కేస్‌ని మూసేసాడు. ఆవిడ భర్త మేనల్లుడు పాల్‌ బర్టన్‌ కూడా షికాగోలోని ఓ చిన్న సింగిల్‌ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లో ఉంటున్నాడు.

రోజర్‌ పోయిన వారానికి పాల్‌ వచ్చి మిసెస్‌ కెండల్‌ని కలిసాడు.“నీకు వారసత్వంగా వచ్చిన ఆ డబ్బుని ఏం చేస్తావత్తా?” ఎనిమిదో ఓడ్కా, టానిక్‌ని తాగుతూ ప్రశ్నించాడు.“నువ్వు తాగి ఉన్నావు పాల్‌” ఆవిడ కోపంగా చెప్పింది.“ఒప్పుకుంటాను. ఆ రాత్రి కూడా పావు తక్కువ పన్నెండుకి తాగి ఉండగా నిన్ను చూసాను. నువ్వు చేసిందంతా స్పష్టంగా గమనించాను” పాల్‌ సీరియస్‌గా చెప్పాడు.“ఏం గమనించావు?” ఆవిడ తీవ్రంగా చూస్తూ అడిగింది.“ఆ రాత్రి ఎనిమిదికి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు సినిమాకి వెళ్ళావు. నేను అంకుల్‌ రోజర్ని నాకు కొంత డబ్బివ్వమని అడిగాను. ముందు నిరాకరించినా తర్వాత నేను త్వరగా బయటకి వెళ్ళడానికి యాభై డాలర్లు ఇచ్చాడు. అందుకు నాకు గంట పట్టింది. ఇవాళలా తాగి ఉన్నాను. తలుపు తెరిచి వెళ్దామనుకుని, ఆ మత్తులో వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళి గెస్ట్‌రూంలో పడుకున్నాను. తలుపు తెరచి మూసిన చప్పుడికి మామయ్య నేను వెళ్ళానని అనుకున్నాడు. తర్వాత నువ్వు వచ్చిన అలికిడికి నాకు మెలకువ వచ్చింది.”“నేనా రాత్రి తొమ్మిదికి ఇంటికి వచ్చాను.”“అవును. కానీ, నేను గెస్ట్‌రూంలో ఉన్నానని నీకు తెలీకపోవడం నీ దురదృష్టం. నీకు తెలుసుంటే అంకుల్‌ రోజర్‌ ఆ రాత్రి మరణించేవాడు కాదు.”“నువ్వా రాత్రి ఇంట్లో ఉన్నావని నేను ఎందుకు నమ్మాలి?” ఆవిడ మొహం చిట్లించి అడిగింది.

“నన్ను పూర్తి చేయనీ. నాకు మెలకువ వచ్చాక గడియారం చూస్తే పావు తక్కువ పన్నెండైంది. నా జేబులో డబ్బుంది. బార్లు ఇంకా తెరిచే ఉంటాయి. దాంతో నేను తలుపు తెరచుకుని బయటకి వచ్చాను. నువ్వు స్టడీరూంలోకి వెళ్ళడం చూసాను. ఊలుతో చేసిన ఆకుపచ్చ రంగు చెప్పులు, అదే రంగు నైట్‌గౌన్‌ తొడుక్కున్నావు. నేనా సమయంలో అక్కడ ఉన్నానని తెలుసుకోవడానికి నీకీ ఋజువు సరిపోతుందాంటీ?” నవ్వుతూ చెప్పాడు.వెంటనే ఆవిడ మొహం వివర్ణమైంది.“అంత అర్ధరాత్రి నువ్వు అంకుల్‌ దగ్గరకి వెళ్ళి ఏం మాట్లాడుతావన్న ఆసక్తితో నేను గెస్ట్‌రూం తలుపు దగ్గరనించి కదల్లేదు. నువ్వా గదిలోకి వెళ్ళాక నేను నిశ్శబ్దంగా తలుపు తెరచుకుని బయటకి వెళ్ళాను.”“అంటే, ఆ గదిలో జరిగింది నువ్వు చూడలేదన్న మాటేగా?”“అవును. చూడలేదు. కానీ, చూసింది నువ్వు పోలీసులకి చెప్పిందానికి భిన్నమైంది. ఇంటికి రాగానే పడుకున్న నువ్వు తుపాకీ పేలిన శబ్దానికి లేచానని చెప్పావు. నా సాక్ష్యం నిన్ను చాలా కాలం కటకటాల వెనక్కి నెట్టడానికి సరిపోతుంది.”“ఐతే, నువ్వు పోలీసులకి ఈ సంగతి చెప్పకుండా నాకెందుకు చెప్తున్నట్లు?” మిసెస్‌ కెండల్‌ ప్రశ్నించింది.

“అంకుల్‌ రోజర్‌ విల్లులో నాకేమైనా రాసాడా అని వేచి చూసాను. మొత్తం నీకే రాసాడు. నాకో సెంట్‌కూడా రాయలేదు.”“నీ బ్లాక్‌మెయిల్‌కి నేను లొంగుతాననుకుంటే...”“నాకో పదివేల డాలర్లు ఇవ్వడం కంటే నీకు గత్యంతరం లేదాంటీ.”“ఆ డబ్బై పోయాక మళ్ళీ వస్తావు. ఇది నా జీవితాంతం కొనసాగే ఆట” ఆవిడ గంభీరంగా చెప్పింది.“రాను. నా దగ్గర సెంట్‌కూడా లేదు. పది వేలిస్తే వెళ్ళిపోతాను.” అతను వెళ్ళాక ఆవిడ ఆలోచించి, షికాగోనించి మాయమవ్వాలని నిర్ణయించుకుంది. తన కోసం వెదుకుతాడు తప్ప తన గురించి పోలీసులకి ఫిర్యాదు చేయడు. తను అతని బ్యాంక్‌. మిత్రులు అందరికీ మనసు బాగాలేకపోవడంతో తను యూరప్‌కి కొద్ది వారాలు పర్యాటకురాలిగా వెళ్ళి వస్తానని చెప్పి, వారం తర్వాత విమానాశ్రయానికి వెళ్ళింది. శాన్‌ ఫ్రాన్సిస్కో విమానం సిద్ధంగా ఉండటంతో మిస్‌ కేన్‌ అనే మారుపేరుతో విమానం టిక్కెట్‌ కొనుక్కుని ఎక్కింది.మూడు రోజుల తర్వాత జాక్‌ ఇంటిని అద్దెకి తీసుకుంది.

ఆ ఇల్లు అద్దెకి తీసుకున్న మూడు రోజుల తర్వాత డోర్‌ బెల్‌ మోగింది. తలుపు తెరచి చూస్తే జాక్‌ మిత్రుడు.అతను ఇత్తడి అలంకారాలు, కొత్త పాలిష్‌తో నిగనిగ మెరిసే ఆ పెట్టెని తెచ్చాడు. దాన్ని అతనే వాహనం లోంచి తీసుకెళ్ళి సెల్లార్‌లో ఉంచమని, తను మోయలేనని కోరింది. అతను ఇత్తడి తాళం తెరచి లోపల నీలం రంగు ముఖమల్‌ లైనింగ్‌ని చూపించి చెప్పాడు.“మీరు పింగాణీ వస్తువులు పెడతారని జాక్‌ చెప్పాడు. కాబట్టి, లోపల దళసరి మెత్తటి లైనింగ్‌ వేసాను.”తర్వాత అతనికి డబ్బిచ్చి, థాంక్స్‌ చెప్పి పంపించింది. ‘నువ్వెప్పుడైనా రా పాల్‌' మనసులో అనుకుంది.

ఓ వారం గడిచాక ఓ మధ్యాహ్నం డోర్‌ బెల్‌ మోగింది. జాక్‌ అనుకుంది. కానీ, గుమ్మం అవతల ఆల్కహాల్‌ వాసన వేసే పాల్‌ నవ్వుతూ కనపడ్డాడు. అతనొచ్చిన ట్యాక్సీ వెనక్కి తిరిగి వెళ్ళింది. ఆవిడ ఉదాసీనంగా చెప్పింది.“నువ్వు వస్తావని నాకు తెలుసు.”“ఇంట్లో ఓడ్కా ఉందా? కొనడానికి డబ్బు లేక నేను వెంట తేలేదు” లోపల సోఫాలో కూర్చున్నాక అడిగాడు.ఆవిడ మౌనంగా ఓడ్కా సీసాని, ఐస్‌ క్యూబ్స్‌ని, గ్లాస్‌ని ఇచ్చింది. “దయచేసి దీన్ని ముందుగా నువ్వు కొంత తాగు ఆంటీ. ఓ హత్య చేసిన వారికి రెండోది లెక్కలోది కాదు” నవ్వుతూ చెప్పాడు.ఆవిడ సీసాలోంచి కొంత గొంతులో పోసుకుని మింగింది.“పది వేలతో తృప్తి పడతానని, మళ్ళీ అడగనని మాటిచ్చావు?” సూటిగా చూస్తూ అడిగింది.“ఇదే ఆఖరిసారి ఆంటీ. ఒట్టు పెట్టి చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ రాను. నాకు ఇంకో పది వేలివ్వు. దాంతో వ్యాపారం చేసి స్థిరపడదామని అనుకుంటున్నాను. అన్ని ఏర్పాట్లు చేసుకుని రావడానికి ఇంతకాలం పట్టింది.”“నన్నెలా కనుక్కున్నావు?” ఆసక్తిగా అడిగింది.“నువ్వు యూరప్‌కి వెళ్తున్నానని నీ మిత్రులనించి విన్నాక షికాగోలో నిన్ను అనుసరించాను. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి నువ్వు శాన్‌ఫ్రాన్సిస్కో టిక్కెట్‌ కొనడం చూసాక, ఇక్కడి నా క్లాస్‌మేట్‌కి ఫోన్‌ చేసి, విమానం దిగి వచ్చే నిన్ను అనుసరించమని, కొంత డబ్బు వెంటనే పంపుతానని చెప్పాను. హోటల్‌కి, మర్నాడు రియల్‌ ఎస్టేట్‌ ఏజన్సీకి నిన్ను అనుసరించాడు. నువ్వు అద్దెకి తీసుకున్న ఇంటిని కనుక్కోవడం నాకు కష్టం కాలేదు. నువ్వు యూరప్‌కి వెళ్ళినా అక్కడికీ దాపురించే వాడిని ఆంటీ.”“నీ క్లాస్‌మేట్‌ని తీసుకురాలేదే?”“నేను వచ్చినట్లే అతనికి చెప్పలేదు. అతనితో పని అంతవరకే. డబ్బిస్తే వెళ్తాను.”“సరే. నా వెంట రా” లేచి సెల్లార్‌ తలుపు తెరచి కిందకి నడిచింది. పాల్‌ ఆవిడని నిర్భయంగా అనుసరించాడు.“ఇదేమిటి? నాకు మత్తెక్కి నిద్ర బాగా వస్తున్నది? ఓడ్కాలో ఏమైనా కలిపావా?” ఆవులిస్తూ మత్తుగా అడిగాడు.“లేదు. ఐస్‌ క్యూబ్స్‌ నీటిలో కలిపాను.” తూలే అతను కొద్ది నిమిషాల్లో నేలమీదకి జారిపోయాడు. ఆవిడ ఓ తాడుని అందుకుని అతని మెడచుట్టు దాన్ని ఉరిలా బిగించి లాగి పట్టుకుంది. అతని నోట్లోంచి కొన్ని బలహీనమైన అరుపులు వినిపించాయి. కళ్ళు తెరచి ఆవిడని చూస్తుండి పోయాడు. అతను మరణించాడని రూఢీ చేసుకున్నాక పెట్టె తలుపు తాళం చెవి తెరచి అతని శవాన్ని ఎత్తి రొప్పుతూ అందులో పడుకోపెట్టింది. తర్వాత దాన్ని మూసి తాళం వేసింది.‘దాన్ని ఇంట్లోంచి ఎలా తరలించాలో నెమ్మది మీదట ఆలోచించవచ్చు’ అనుకుంది.  

మర్నాడు ఉదయం డోర్‌ బెల్‌ మోగితే మెలకువ వచ్చింది. జాక్‌ అయి ఉంటాడని అనుకుంది. లేచి వెళ్ళి తలుపు తెరచింది.“మిసెస్‌ కేన్‌?” బయట నల్లటి సూట్ల నిలబడ్డ ఇద్దరిలోని ఒకరు అడిగారు.“అవును. మీరు?”“నా పేరు డిటెక్టివ్‌ మైల్స్‌. ఇతను సార్జెంట్‌ విలియమ్స్‌. వారెంట్‌తో వచ్చాం” అతను చెప్పాడు.“వారెంట్‌?” గొణిగింది.“అవును. మీ సెల్లార్‌లో వెదకడానికి.”“ఎందుకు?” భయంగా అడిగింది.“అందులోని ట్రంక్‌ పెట్టెలో ఓ శవం ఉంది.”తను కలగంటున్నదా అనుకొంది? ఇరవై నాలుగు గంటల్లో ఎలా కనిపెట్టారు?“ఎవరు చెప్పారు?” బలహీనంగా అడిగింది.“మిస్టర్‌ జాక్‌.”“ఆయనకి ఎలా తెలుసు?”“ఆయన నిద్రలో కలవరించాడు. ఆయన కూతురు అది విని జాక్‌ తన తల్లి ఫ్లోరెన్స్‌ని చంపి సెల్లార్‌లోని పెట్టెలో దాచాడని తెలుసుకుని మాకు ఫిర్యాదు చేసింది. ఫ్లోరెన్స్‌ స్కాట్‌ల్యాండ్‌కి ఐదేళ్ళ క్రితం తన చెల్లెల్ని చూడటానికి వెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు. ఆవిడ ఏమైందో ఎవరికీ తెలీదు. జాక్‌ని నిద్ర లేపి ప్రశిస్తే తన నేరాన్ని అంగీకరించాడు.”“ఏ నేరాన్ని?”“ఐదేళ్ళ క్రితం ఫ్లోరెన్స్‌ని ఆవేశంతో పోకర్‌తో కొట్టి చంపడాన్ని. తర్వాత సెల్లార్‌లోని పెట్టెలో శవాన్ని దాచడాన్ని.”ముగ్గురూ మెట్లు దిగి కిందకి వెళ్ళారు.“ఇది నా పెట్టె. ఆ మూడు ఆయన పెట్టెలు. వాటిలో ఓ దాంట్లో ఉండచ్చు” చెప్పింది.“ఏమిటా వాసన?”“ఎలుక. ఎలుకల మందు పెట్టాను.”ఆ ఇద్దరూ ఒకరి వంక మరొకరు చూసుకున్నారు. తర్వాత ఆవిడ పెట్టె దగ్గరకి వెళ్ళి పరిశీలించారు.

“ఇది ఎలుక చచ్చిన వాసన కాదు. ముందుగా దీన్ని తెరచి చూస్తాం” డిటెక్టివ్‌ లెఫ్టినెంట్‌ మైల్స్‌ చెప్పాడు.(రాబర్ట్‌ టుహీ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo