శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Apr 04, 2020 , 23:06:56

‘యాడ్‌ కరోనా’

‘యాడ్‌ కరోనా’

 తమ మార్కెట్‌ను కబళిస్తున్న.. తమ షేరు విలువను మింగేస్తున్న.. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు వైవిధ్యంగా  ప్రచార బాట పట్టాయి. మూస ప్రమోషన్‌కు తాత్కాలిక విరామం ఇచ్చి, ప్రజల్లోఅవగాహన పెంచే యాడ్స్‌ను రూపొందిస్తున్నాయి. 

ఎయిర్‌టెల్‌ 

సాధారణంగా ఏ సంస్థ అయినా తమ కార్యాలయాన్ని సందర్శించమని చెబుతుంది. ఎయిర్‌టెల్‌ మాత్రం ఈ పరిస్థితుల్లో తమ కంపెనీ స్టోర్లకు ఎవరూ వెళ్లవద్దని ఎయిర్‌టెల్‌ చెపుతున్నది.  ప్రజలంతా సామాజిక దూరం పాటించాలన్నదే తమ ఉద్దేశం అని వాణిజ్య స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్‌ సేవల కోసం కంపెనీ యాప్‌ను లేదా వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది.

హుందాయ్‌ 

‘కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో’ అని ప్రముఖ వాహనాల కంపెనీ సందేశమిస్తున్నది. డిజిటల్‌, ప్రింట్‌, టెలివిజన్‌ మాధ్యమాల ద్వారా సోషల్‌ డిస్టెన్స్‌పై అవగాహన కల్పించే యాడ్స్‌  రూపొందిస్తున్నది.  ఆరోగ్యాన్ని వెనక చీట్లో కూర్చోబెట్టకండి.. అంటూ ఆత్మీయంగా హెచ్చరిక కూడా చేస్తున్నది.

టయోటా

ఈ కంపెనీ కూడా  కరోనా మీద స్పందించింది. ‘మేము మీ కోసం ఇక్కడ ఉన్నాం. మున్ముందు మరిన్ని మంచి రోజులుంటాయని ఆశిస్తున్నాం’ అంటూ ఆశావాదాన్ని రేకెత్తించే ప్రచారం చేస్తున్నది.   ఈ ప్రచారం కుటుంబ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నదని కంపెనీ వర్గాలు అంటున్నాయి. 

ఈరోస్‌ నౌ

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఈరోస్‌ నౌ’  ఓ ఆఫర్‌ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు వినియోగదారులు తమ ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్‌ను ఉచితంగా వీక్షించొచ్చని తెలిపింది. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ, బయటి ప్రపంచంతో సంబంధంలేకుండా గడిపేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపింది.   లలితా జ్యూవెల్లరీ

‘డబ్బులు ఊరికే రావు’ అని చెప్పే లలితా జ్యూవెల్లరీ యజమాని ఈసారి సందేశం మార్చేశాడు. ‘ఆరోగ్యం కూడా ఊరికే రాదు’ అని అంటున్నాడు. ప్రభుత్వ ఆదేశాలను పాటించించి, ముఖ్యమంత్రికి అండగా ఉండాలని కోరుతున్నాడు. సామాజిక దూరం పాటించి, కరోనాను తరిమికొట్టాలనే సందేశాన్ని ప్రకటల ద్వారా గుప్పిస్తున్నాడు.లైఫ్‌ బాయ్‌ 

‘శుభ్రత కోసం లైఫ్‌ బాయ్‌నే వాడండి’ అని తరచూ చెప్పే ఈ సబ్బుల కంపెనీ ఈసారి వినూత్నంగా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏ సబ్బుతోనైనా సరే  చేతులనుమాత్రం కడుక్కోవాలని కోరుతున్నది. ‘వ్యక్తిగత శుభ్రతతో కరోనా వైరస్‌ను నివారిద్దాం’ అని టీవీల్లో ప్రకటలను ప్రసారం చేస్తున్నది.