మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Mar 28, 2020 , 23:38:07

మొదటికే పోతానం

మొదటికే పోతానం

మామా బాపు పొద్దుగాల నుంచి శానాసార్లు ఫోన్‌ జేసిండు. ఏం జెప్పాల్నో అర్థంగాక ఫోనెత్తలే నేను. ఎందుకు చేస్తాండో కూడా తెల్సుగనీ.. నేనే లేపొద్దని లేపలే. బాపు అంతగనం నాకు ఫోన్‌జెయ్యడానికి కారణమేంటంటే.. మేం మేడారం జాతరకువొయ్యేదుంది. కొమ్రెల్లి మల్లన్నకు.. ఎములాడ రాజన్నకు.. కొండగట్టు అంజన్నకు కూడా మొక్కులు చెల్లించుకోవాల్సిందే. ముందుగాల ఈ మూడు యాత్రలకు పోయి.. అటెన్క సమ్మక్క జాతరకు పోవాలె. ఇది నిన్నియాలటి ముచ్చటగాదు.. మా తాతల నుంచి వొస్తున్న ఆచారం. ఈ త్యాప మా అన్న.. అక్కల మొక్కు ఉంది. కానీ అందరం పోవాలె. ఒకరకంగా పొత్తుల దేవుడు అనుకోవచ్చు. 

కానీ నేను చేస్తున్న నౌకరిల గిన్నిగనం తాతీల్‌ ఇయ్యరు. ఐనా.. ఇప్పుడు రద్దీల పిల్లల్ని దీస్కొని ఎట్ల పోవాలె? అన్ని సౌలెత్‌లు ఉంటయా? అని నాకు ఇష్టం లేకుండె. ఇట్లనే మా నాయినకు ఏవో సాకులు చెప్దామనుకున్నా. కానీ అట్ల చెప్తే బాధవడ్తడేమో. అందుకనే ఫోన్‌లేపలే. అసల్కే మా పెద్దన్న బాపుతోని మాట్లాడ్తలేడు. ఏవో శెల్కల పంచాయితీలంట. ఇంకోపక్క మా అక్క.. అన్నలుగూడ మాట్లాడుకుంటలేరు. వాళ్లదేమో పైసల లొల్లి. ఇసొంటివెన్ని ఉన్నా దేవుని విషయంల నడ్వవుగదా? అందుకే బాపు అందరికీ నచ్చజెప్పిండు. ‘జాతరకు పోవాలె’ అని చెప్పంపిండు. నేనేమో హైద్రవాద్ల ఉంటా. ఏదో బతుకుదెరువు కోసం పనిచేసుకుంటున్న. బాపేమో జాతరకు పోదామని ఒక్కటే చెప్పవట్టె. సెలవులు దొర్కినప్పుడు.. జాతర రద్దీ తగ్గినప్పుడు పోదామనేది నా ఆలోచన. అదే చెప్దామని పొద్దుమూకంగ ఫోన్‌చేసిన. ‘ఏందిరా పొద్దుగాల నుంచి ఫోన్‌ జేస్తుంటే ఎత్తుతలేవూ?’ అన్నడు. ఆయన మాటల్లో నాకు బాధ కనిపించింది. మారు మాట్లాడక సైలెంట్‌గా ఉన్నా. ‘నిన్నేరా అడిగేది’ అన్నడు. ‘పని మీద ఉన్నుంటి బాపూ’ అని చెప్పిన చిన్న స్వరంతో. ‘పెద్దన్న.. చిన్నన్న.. అక్క అందరూ వస్తాండ్రు. నువ్వు కూడా రావాలె. ఈ యాత్రలనే అన్న కొడుక్కి పుట్టెంటుకల దీయాలె. ముందుగాల కొమ్రెల్లి.. ఎములాడ.. కొండగట్టుకు వోయి అటెన్క మేడారం పోవాలె. అమ్మకు మొక్కులు అప్పజెప్పాలె’ అన్నడు. ‘అవునుగానీ.. బాపూ నాకు కుదిరేటట్లు లేదు. మీరైతే ముందుగాల పోండ్రి. నేను సీదా మేడారం జాతరకే వస్తా’ అన్నా. ‘ఓ.. అట్లెట్లయితదిరా? మనుమనితో ఎములాడ రాయేశునికి కోడెగట్టిస్తనని మీ అమ్మ మొక్కుకుంది. కొండగట్టు మొక్కు కూడా అట్లనే ఉంది. మల్ల మల్ల యేడ కుదుర్తది. అన్నీ ఒక్కసారే చేసేద్దాం. ఏమన్నజెయ్యి మీరు ఇద్దరాలు మొగలు.. పిల్లలు రావాల్సిందే’ అని నా మాటే శాసనం అన్నట్టు అన్నడు బాపు. 

నేను ఎగ్గొట్టడానికి ఏవేవో చెప్పినా బాపు విన్లేదు. ఏంజెయ్యలేక చివరి ప్రయత్నంగా ఒకమాటన్నా. ‘బాపూ ఎములాడకు వోతెనే శివుడున్నడాయే? మన ఇంటి పక్కల శివుని గూళ్లె శివుడు లేడా?’ అన్నా. ఈ నడ్మ నేను కొంచెం ఆధ్యాత్మికంగా మారిపోయిన. సత్సంగ్‌ కూడా వెళ్తున్నా. మా గురువు చెప్పిన మాటలల్ల.. పుస్తకాలల్ల.. కొందరి జీవితగాథలు చదవడం వల్ల కావచ్చు విగ్రహారాధన కంటే ధ్యానం మేలనే భావన నాకు కలిగింది. దీని దిక్కెల్లి మా నాయినకు నాకు మధ్యన శానా జగడమైంది కూడా. ఆత్మ.. పరమాత్మ గురించైనా సరే ‘తప్పకుండ రావాల్సిందే’ అని హుకుం జారీచేసిండు బాపు. నేను నాస్తికుణ్ణి అవుతున్నానుకొని కొంతసేపు నాతో గట్టిగా వాదించిండు. ‘ఏమన్నజేస్కోపో.. నీకు తెల్సు.. మీ అమ్మకు తెల్సు’ అనుకుంట అమ్మకు ఫోనిచ్చిండు. ‘తప్పకుండ రావాలె బిడ్డా. మొన్న మీ నాయినకు జెరం వచ్చినప్పుడు రాయేసుడి మహిమే అనిపించింది. అప్పుడే కోడె కడతా అని మొక్కుకున్నా.  దెబ్బకు జెరం తక్వయింది. మనుమడు పరీక్ష పాసైతే కొండగట్టుకు వొస్తనని ముడుపు గట్టిన బిడ్డా’ అంటూ ప్రేమగా చెప్పేసరికి ఇంకేం మాట్లాడటానికి నాకు అవకాశం లేకుండె. ‘సరే అమ్మా.. అట్లనే వస్త తియ్‌' అని చెప్పిన. మీరంత కలిసి కనపర్తి నుంచి కొమ్రెల్లికి రాండ్రి. నేను హైద్రవాద్‌ నుంచి పిల్లలన్ని తీస్కొని వొస్తా. అక్కడ్నుంచి ఎములాడకు.. కొండగట్టుకు పోదాం’ అని చెప్పినంక అమ్మకు నిమ్మలమైంది. ‘మంచిది బిడ్డా’ అని అమ్మ ఫోన్‌ పెట్టేసింది. మా ఇంటామెతో మాట్లాడి ఎట్లెట్ల పోదాం? ఎన్నింటికి పోదాం? అని డిసైడ్‌ అయినం. కొమ్రెల్లికి పోయేసరికి రాత్రి పది దాంటింది. 

అప్పటికే మావొళ్లొచ్చి రూములు కిరాయికి తీస్కుండ్రు. ఆ రాత్రి మల్లన్న సన్నిధిలో నిద్రపోయినం. కొమ్రెల్లి మల్లన్న గుడి నుంచి ‘కొమురెల్లి గుట్టల్లో మల్లన్న నువ్వు.. కొలవుదీరినవ్‌ మల్లన్న నువ్వు’ పాటతో తెల్లారగట్ల నాలుగు గంటలకు లేశిన. అప్పటికింకా ఎవ్వరు లేవలేదు. జనాలు లేవకముందే తానాలు చేస్తే మంచిది. లేదంటే భక్తుల రద్దీ పెరుగుతుంది. ఎంబడే అమ్మ.. నాయిన.. అన్నలు.. అక్కబావ అందర్నీ లేపిన. అల్లుడికి గుండు కొట్టించినం. మేనమామ వంతుగా నేను మూడు గాట్లు పెట్టిన. అందరూ గుండంల తానం చేస్తాండ్రు. నాకేమో గుళ్లో వినపడే పాట వింటూ గుండంల తానం చేస్తాంటే మనసు తేలిక పడ్డది. నిన్నటి సంది మనసులో ఉన్న రంది తీరింది. అందరం తయారైనం. మల్లన్న పట్నం వేయడానికి గుడి లోపల ఉన్న గంగరేగు చెట్టు దగ్గిరిక వొచ్చి ఒక ‘పంబాల’ ఆయినను మాట్లాడిన. పట్నాలు వేయించుకోవడం కొమ్రెల్లి మల్లన దగ్గర ఉన్న ప్రత్యేకత. పట్నాలు వేయడమంటే కొమ్రెల్లి మల్లన్నకు లగ్గం చేయడమన్నట్టే. అదో అద్భుత ఘట్టం. ఖాయిష్‌తో వొచ్చినం కాబట్టి అందరమూ ఉత్సాహంగా గడిపినం. ఒగ్గోళ్లు కథ చెప్తూ ఢమరుకం సప్పుడు చేస్తాంటే కొమ్రెల్లి మల్లన్న పరవశిస్తాడు. 

లగ్గం జరిగే సమయంలో నేను కాదు పిల్లాజెల్లా అంతా ఆధ్యాత్మిక అనుభూతి పొందినం. దీంట్ల ఏదో నిగూఢార్థం ఉందనిపించింది. దర్శనమైనంక అందరం రెండు బండ్లలో ఎములాడ బైలెల్లినం. సిద్దిపేట దాటంగనే ఒక బాయి కాడ ఆగినం. వంట గంజులు.. సామన్లు అన్నీ దింపినం. మా బాపు పొయ్యిరాళ్లు తీస్కొచ్చి పొయ్యి రాజేసిండు. అమ్మ.. వదినలు.. అక్క కూరగాయలు కడిగి వంట చేయడం షురూ చేసిండ్రు. పిల్లలకేమో ఆకలైతున్నట్టుంది. లొల్లి లొల్లి చేస్తుండ్రు. ‘ఏముల్లా.. వంట తయారైంది కడ్కోండ్రి’ అని అమ్మ  చెప్పంగనే ఆత్రమాత్రం మొకాలు కడుకున్నం. చూడనీకె అక్క.. వదిన.. అమ్మ ఏదో మాట వరుసకు మాట్లాడుకుంటుండ్రుగనీ ఏదో చిన్న డిస్టర్బెన్స్‌ కన్పిస్తుంది. అంత మనసిప్పి మాట్లాడ్తలేరు అనిపిస్తుంది. ఎడమొకం పెడమొకం అంటంగా అట్లా అన్నట్టు. అందరం కూసున్నం. వంకాయ కూర.. పప్పుచారు ఎంతో మంచిగున్నయి. చాలా రోజుల తర్వాత అమ్మచేతి వంట తిన్నా. చాలా తృప్తిగా అనిపించింది. తిన్నంక కొంచెంసేపు పొలాల గట్ల పొంట తిరిగినం. తర్వాత ఎములాడకు మల్లా బాట సాగించినం. 

ఎములాడకు పోయేసరికి రాత్రి ఎనిమిది అయింది. బాపు.. ‘ఇప్పుడే దర్శనం చేసుకొని కొండగట్టుకు పోదాం’ అన్నడు. నాకేమో ఇష్టం లేదు. ఆత్రమాత్రం ఈ రాత్రి వెళ్లడం కంటే దగ్గర్లో రూమ్స్‌ తీసుకొని కొంచెం రెస్ట్‌ తీసుకుంటే బాగుంటుంది అన్నా. అటూ ఇటూ దేవులాడంగ కిరాయికి రూమ్స్‌ దొరికినయి. ప్రయాణంల అలసిపోయిండ్రు కాబట్టి అందరూ ఎక్కడోళ్లు అక్కడ అడ్డమొరిగిండ్రు. నాకేమో నిద్ర వొస్తలేదు. బాల్కనీలో నిలవడి బైటికి చూస్తే కళకళలాడుతున్న దుకాణాలు కన్పించినయి. పిలగాండ్లు దుకాణాల్లో బొమ్మలు కొనుకుంటుండటం చూసి నా బాల్యపు జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయిన. చిన్నప్పుడు ఎములాడకు వస్తే ‘ఆ బొమ్మ కావాలీ.. ఈ బొమ్మ కావాలీ’ అంటూ అమ్మను.. బాపును అడిగేటోన్ని. కొనియ్యకపోతే కిందపడి బొర్లుకుంట ఏడిశేటోన్ని. ఇప్పుడట్లా కొనుక్కోవాలని లేదుగానీ మనసు ఇంకేదో కోరుకుంటున్నట్లు మాత్రం అనిపిస్తాంది. మావోళ్లేమో మొక్కుబడిగా యాత్రకు వొచ్చిండ్రుగానీ మనస్ఫూర్తిగా ఒకరికొకరు మాట్లాడకుంట లేరు. ఎప్పుడూ ఏదో పంచాయితీల ఉన్నట్లు కనిపిస్తుండ్రు. అక్కకేమో అన్నల మీద కోపం.. అన్నలకేమో బాపు మీద కోపం. ఈ కోపతాపాలన్నీ డబ్బు.. పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటయి. ఇక అమ్మ.. వదినలకేమో చెప్పుడు మాటల వల్ల పంచాయితీలు. ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా అందరివీ ఇవే ప్రశ్నలు.. ఇవే ముచ్చట్లు. వీటితోటే సగం జీవితాలు గడిపేస్తుంటారు చాలామంది. తీరా చూస్తే అవేం విప్పలేని కథలు కాదు.. సమాధానం లేని ప్రశ్నలూ కాదు. అయినా ఎప్పుడూ ఏవో మనస్పర్థలు. మొహమాటానికి మాట్లాడుతుంటారు. కానీ మనసులో కల్మషాలు కొట్టొచ్చినట్లు నాకు కనిపిస్తున్నయి. అన్నలు కూడా బాపుతో కలివిడిగా ఉండరు. ఎప్పుడుచూసినా.. ‘ఇదియ్యలేదు.. అదియ్యలేదు.. ఏం సంపాదించినవ్‌' అంటూ గుణుక్కుంటారు. వీళ్లందర్నీ ఒకేతాన కూసోబెట్టి అడగాలని నాకు ఉండేది. కానీ వాళ్లు నా బాధను అర్థం చేసుకుంటారా? మంచి చెప్తే స్వార్థం అనుకుంటారామో. ‘మాకంటే చిన్నోడివి నువ్వు చెప్తే మేం వినాల్నా అంటరేమో? ఎందుకొచ్చిన లొల్లి. అట్లా అడిగితే ఉన్న ఈయింత సంబంధాలు కూడా దెబ్బతింటయేమో అని ఏమీ అనకుంట కూసున్నా. ఉన్నన్ని రోజులు ఏ లొల్లి పంచాయితీల్లేకుండా నిమ్మలంగా ఉండాలన్నది నా సిద్ధాంతం. కానీ ఏ ఇంట్లో ఈ నిమ్మళం కనిపిస్తలేదు. అందర్నీ కలపాలి అనుకునే నా లాంటివారి ప్రయత్నాలు ఫలిస్తలేవు.. అని ఆలోచిస్తుండగానే మా ఆమె వచ్చింది. ‘తొందరగా పడుకోండ్రి. మళ్లీ పొద్దున్నే లేవాలె. జనాల రద్దీ పెరగకముందే తానాలు చెయాయలె’ అన్నది. ‘సరే లే’ అన్నట్లు తలూపి కండ్లు మూసుకొని పండుకున్నా. 

తెల్లారగట్ల నాలుగైంది. అమ్మ..నాయిన వొచ్చి అందర్నీ లేపిండ్రు. అందరం లేశి మొఖాలు కడుక్కొని.. కొత్త బట్టలు తీసుకొని గుండంల తానం చేయనీకె పోయినం. తానమైపోయింది. దర్శనానికి లైన్లో నిలవడ్డం. మొగులు మీద మొల్శిన సుక్కలు అట్లనే ఉన్నయింక. ‘ఓం నమశ్శివాయ.. ఓం..నమశ్శివాయ’ అంటూ దూరం నుంచి శివనామ స్మరణ వినిపిస్తాంది. గుగ్గిలం పొగ గాలితో కలిసి కమ్మటి వాసన వస్తుంది. ఇంకోదిక్కు రాయేసుడి అలంకరణ కోసం తీసుకెళ్తున్న పూల వాసన వొస్తుంది. లైన్‌ మెల్ల మెల్లగా కదులుతుంది. కోడెను కట్టేయడం అయిపోయింది. దర్శనం తర్వాత ప్రసాదాలు కొనుక్కుని గుడి ఆవరణలో కూసొని పులిహోర తిన్నాం. కొండగట్టు అంజన్న దర్శనమయ్యేవరకు మళ్లీ తిండి లేదని మా అమ్మ చెప్పింది. కొండగట్టు చేరుకునే సరికి పగటీల పన్నెండు అయ్యింది. వంట వార్పుల కోసం ఆగకుండా కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకున్నం. దర్శనం ఐనంక గుట్టు దిగి కిందకి వచ్చినం. రోడ్డుకు రెండు పక్కల పెద్ద పెద్ద మర్రిచెట్లున్నయి. వాటి నీడకు జనాలు వంటలు చేసుకుంటున్నరు. మేము కూడా చెట్టు నీడ చూసుకొని ఆగినం. వంటవార్పు కాగానే మల్లీ అక్కడి నుంచి స్టార్ట్‌ అయినం. 

కొండగట్టు నుంచి ఇంటికి వచ్చిన తెల్లారి పొద్దున్నే మా అమ్మ ప్రసాదాలు చుట్టుపక్కల వాళ్ళకు, చూట్టాలకు పంచి పెట్టింది. మర్నాడు యాట తోటి సమ్మక్కను చేసుకున్నం. పండుగైనంక ‘ఇగ నేను పట్నం పోతనే’ అని బాపుతో అంటే మా బాపు ‘మొదటికి పోవాల్సిందే’ అని పట్టుబట్టిండు. అమ్మ కూడా ‘సమ్మక్క మొక్కు ఉంది. వద్దు బిడ్డా’ అని బతిలాడింది. ‘అయినా మేడారం దాకా పోవడం అవసరమా అమ్మ. మన ఊరి పక్కనే వీణవంకలో జాతర జరుగుతుంది కదా’ అని నేను ఎంత మొత్తుకున్నా మావాళ్ళు వినలేదు. మా అమ్మ ‘మేడారం సమ్మక్క మహిమగల దేవత మొదటకిపోతే మొక్కుకున్నా కోరికలు తీరుతయి’ అంది. నేను వచ్చి ఐదు రోజులు అయిపోయింది. మల్లతెల్లారి అందరం మొదటికి పయనమైనం. కాలక్షేపం కోసం మా అన్న పిల్లలు ‘మేడారం జాతర.. సమ్మక్క సారలమ్మల గురించి చెప్పు బాబాయ్‌' అని అడిగిండ్రు. నాకేమో పెద్దగా తెల్వదు. నాకు తెల్సిన కథేదో చెప్తుంటే మధ్యలో బాపు అందుకొని ఆయిన చెప్పడం షురూ చేసిండు. ఇంతలో మేడారం వచ్చింది. 

రెండు కిలోమీటర్ల దూరం నుంచి ట్రాఫిక్‌ జామయ్యింది. పార్కింగ్‌లో బండి ఆపి కాలినడకన ప్రయాణం చేస్తున్నాం. అడివంతా జనాలతో నిండి పోయింది. జనాలు అందరూ బ్లూ కలర్‌ ప్లాస్టిక్‌ కవర్‌తో గుడిలు చేసుకొని ఉన్నారు. జంపన్న వాగు దగ్గర స్నానం చేసినం. పిల్లలకు ‘నిలువెత్తు బంగారం సమర్పిస్తా అని మొక్కుకున్నాదంట అమ్మ. మా ఆమె మా పిల్లల ఎత్తు బంగారం సమర్పించినం. మేడారమంతా శివసత్తులతో నిండి ఉంది. సమ్మక్క కోరిన కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. ఈ రోజే సమ్మక్కను గద్దెల మీదకు  తీసుకువచ్చిండ్రు. కేవలం పసుపు కుంకుమలే దేవత మూర్తి. అందరూ మొక్కు తీర్చుకున్నరు. నేను కూడా రెండు చేతులు జోడించి మొక్కు కున్నా. దర్శనం చేసుకొని బాటెంట నడుసుకుంట వెళ్తుంటే మధ్యలో దేవుఁడ్ల పటాలు కొన్నాం. కానీ ఈ రోజొక మార్పు కనిపించింది. మావోళ్లంతా కలిసిపోయిండ్రు. ఎవ్వరి మనసులలో కల్మషం లేకుంట కన్పిస్తుండ్రు. ఐదొందల రూపాయలతో ఒక గుడిసె కిరాయికి తీసుకున్నం. అంతా కూసున్నం. అమ్మవారి పసుపుతో అందరి మొఖాలు వెలిగిపోతున్నయి. చాలా సంతోషం అనిపించింది. మా అమ్మ వంట చేస్తుండగా వదినలు కల్పించుకుని వంటపని చేయడం చూసిన. అన్నలు మంచిగా మాట్లాడుతుండ్రుతూ ఉన్నారు. మా బాపుతో కూడా బాగా మాట్లాడుతూ కన్పించిండ్రు. అందరూ బాగా దగ్గరైండ్రు. ఇక్కడ సమ్మక్కకు ఎదురిస్తారన్న మాట అందుకే  అందరూ కోళ్లు, మేకలు కోసుకుంటున్నరు. మా నాయిన కూడా రెండు పుంజులు తీసుకు వచ్చిండు. అమ్మ.. నాయిన కోరుకున్న కోరిక ఇదే అని అర్థమైంది. అందరూ కలిసి ఉండటమే వాళ్లకు కావాల్సింది కూడా. సమ్మక్క కోరిన కోర్కెలు తీర్చిందనిపించింది.  

ఓ కవి చెప్పినట్లు ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా..‘అనే మాట గుర్తొచ్చింది. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే మా గురువుని కొందరు తప్పు పడతారుగాని ఆయన ఎప్పుడూ’ సన్యాసం తీసుకోమని, కాషాయం వేసుకోమని, సంసారం వదలమని చెప్పలేదు. ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ‘ఉన్న జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు’అని చెప్పిండ్రు. ‘నేను నాలాంటి వాళ్ళు ధ్యానం వల్ల సేదతిరితే, మా వాళ్ళు భక్తిలో సేదతీరుతున్నరు. రెండు దారులు దగ్గరగానే ఉన్నయి. నేను రావాలా వద్దా అన్న సందిగ్ధంలో నుంచి  మళ్లీ  రెండేళ్ల తర్వాత మొదటికే రావాలి అని మనసులో అనుకున్నా. ఇంత కన్నా మహిమ ఎక్కడ ఉంటది అనిపించింది నాకైతే. కుటుంబం మొత్తం కొత్త వెలుగుతో ఇంటికి తిరుగు ప్రయాణం అయినాము. 

-రమేశ్‌ చెప్పాల 


logo