శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Mar 28, 2020 , 23:29:28

పోస్టర్‌ ముచ్చట్లు

పోస్టర్‌ ముచ్చట్లు

సినిమా రంగుల కళ.. సినిమా అనగానే మనకు తెరమీద కనిపించే నటీనటులు  గుర్తుకు వస్తారు. లేదంటే నిర్మాత, దర్శకుణ్ణి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కానీ ఒక సినిమా రూపొందాలంటే 24 విభాగాలు సమర్థంగా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ 24 క్రాఫ్ట్స్‌లోచాలామందికి తెలియని విభాగాలు ఎన్నో. అటువంటి వాటిలో పబ్లిసిటీ డిజైన్‌ అన్నది ఒకటి. ఒక సినిమా చూడదగినదా, కాదా అన్నది అంచనా వేయాలంటే సినిమా పోస్టరునే చూస్తాం. సినిమా విజయవంతం కావడంలో పబ్లిసిటీ ఆర్టిస్ట్‌ (డిజైనర్‌) కూడా ఒక భాగం. ప్రేక్షకున్ని థియేటర్‌కు రప్పించడంలో పోస్టరు కీలకం. ఎన్ని రకాల మాధ్యమాలు వచ్చినా పోస్టరుకు ప్రత్యామ్నాయం లేదు. పోస్టరు రూపకల్పనలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఏలె ధనుంజయ్య (ధని ఏలె) పోస్టరు డిజైన్‌ గురించి తన అనుభవాలను ఇలా పంచుకున్నారు...

సగటు ప్రేక్షకున్ని థియేటర్‌ మెట్లు ఎక్కించడంలో పోస్టర్‌ అత్యంత కీలకం.ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఎన్ని వచ్చినా పోస్టరు పాత్ర ఇప్పటికీ సజీవమనే చెప్పాలి. గోడల మీద రంగురంగుల్లో దర్శనమిచ్చే పోస్టరును ఒక్కసారన్నా ఆగిచూడకుండా ఉండలేం. సినిమాలోని ప్రధాన పాత్రధారుల చిత్రాలను ముద్రించిన పోస్టరు ఎంత ఆకర్షణీయంగా ఉంటే, ప్రేక్షకుడు అంత ఎక్కువగా ఆ సినిమా మీద ఆసక్తి పెంచుకుంటాడు. సినిమా పేరుతో పాటు అందులోని పాత్రధారుల్ని పోస్టరుమీద ఎంత అందంగా తీర్చిదిద్దగలిగితే అంత ఎక్కువగా ఆ చిత్రం ప్రేక్షకుని మనసులోకి చొచ్చుకుపోగలదు.

నాటికీ నేటికీ తేడా

‘ఒకప్పుడు సినిమాలు వంద రెండు వందల రోజులు ఆడేవి. దీంతో పబ్లిసిటీ డిజైనర్‌కు చేతినిండా పని ఉండేది. సినిమా ఎంత ఎక్కువగా ఆడితే అన్ని పోస్టర్లు డిజైన్‌ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం వారం, పదిరోజుల్లోనే సినిమా భవిష్యత్‌ తేలిపోతున్నది. దీంతో పబ్లిసిటీ ఆర్టిస్ట్‌ తక్కువ సమయంలోనే మరో సినిమాను వెతుక్కోవలసి వస్తున్నది. పోస్టరు డిజైనింగ్‌, సైజుల్లోనూ మార్పులొచ్చాయి. గతంలో రెండు మూడు సైజుల్లో ఉండే పోస్టర్‌ స్పేస్‌ను బట్టి తన సైజును మార్చుకున్నది. రంగుల స్కీముల్లోనూ, స్పేస్‌ వాడుకలోనూ, అక్షరాల్లోనూ చాలా తేడాలు వచ్చాయి. పోస్టర్ల ఆకర్షణీయత గణనీయంగా పెరిగింది. ఓపెనింగ్‌ రాబట్టడంలో పోస్టరుదే ప్రధానపాత్ర అంటాడు ధని. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పోస్టరే ముఖ్యం. పోస్టరే చిన్న సినిమాను బతికించిన సందర్భాలు కూడా అనేకం.  రోజులు..నెలలు కూడా

‘ఒక సినిమా పోస్టర్‌ రూపకల్పనకు రోజుల నుండి నెలల వరకు సమయం పడుతుంది. కథ, టైటిల్‌ను బట్టి, పాత్రల ప్రాధాన్యతను బట్టి  పోస్టర్లు డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలను ఆధారంగా చేసుకునే పోస్టర్లను రూపొందిస్తామని ధని అంటారు. ‘దానికోసం కథ వింటాం లేదా పాత్రల పరిధి, ప్రాధాన్యతను అడిగి తెలుసుకుంటాం. దాదాపు దర్శకులే పోస్టర్‌కు అవసరమైన పోటోలు ఎంపిక చేసి పంపుతారు. ఒక టెక్నీషియన్‌గా  డిజైనర్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత సినిమా విడుదల, విజయవంతం అయ్యేంతవరకు సినిమాకు పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల కొన్నిసార్లు నెలల తరబడి ఒకే సినిమాకు  పరిమితమైపోతాం. కంప్యూటర్‌ ఫాంట్స్‌ వినియోగం కంటే కొత్తగా తయారు చేసుకున్న ఫాంట్స్‌నే డిజైనింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తాం’ అని చెబుతారు ధని.

 లోగో నుండి మొదలు

‘ఒక సినిమా పురుడు పోసుకోవాలంటే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టాల్సిన నిర్మాత ముఖ్యం. ప్రతి నిర్మాతకు ఒక నిర్మాణ సంస్థ ఉంటుంది. కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చే నిర్మాత కూడా తనకంటూ ఒక నిర్మాణ సంస్థను బ్యానర్‌గా పెట్టుకుంటాడు (గీతా ఆర్ట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఇలా...). సినిమారంగంలో నిర్మాణ సంస్థ లోగో అతి ముఖ్యమైంది. ప్రతి నిర్మాత తన పేరో, కుటుంబ సభ్యుల పేరో ప్రస్ఫుటించేలా తన నిర్మాణ సంస్థ పేరు రిజిస్టర్‌ చేసుకుంటాడు. దానికి తగ్గట్టు లోగోను  చేయించుకుంటాడు. ఆ లోగోను డిజైన్‌ చేయాల్సిందీ పబ్లిసిటీ డిజైనర్లే. అలా లోగో డిజైన్‌తో ప్రారంభమై సినిమా టైటిల్‌, సినిమా టైటిల్‌ కార్డ్స్‌, పత్రికలలో వచ్చే ప్రకటనలు, వెబ్‌సైట్లలో డిజైన్‌లు, విడుదల సమయంలో పోస్టర్లూ, హోర్డింగులూ, వారంవారం మారే ప్రకటనల వరకూ పబ్లిసిటీ డిజైనర్ల బాధ్యతలే. ఇప్పుడు మెట్రో పిల్లర్‌ సైజ్‌ ప్రకటనలు,లాలీపప్‌లు, ట్రైలర్స్‌ కూడా ఇందులో వచ్చి చేరాయి. ఒకప్పుడు పూర్తిగా చేతులతోనే డిజైన్‌లు వేయాల్సి వచ్చేది. కంప్యూటర్లు వచ్చాక పని తీరు మారడంతో పాటు సులభమైంది.  సినిమా టైటిల్‌ను కథను బట్టి ఇప్పటికీ కొంతమంది చేతులతోనే డిజైన్‌ చేస్తున్నారు. దానికి అనువైన మెరుగులద్ది ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తీర్చదిద్దినప్పుడే పోస్టర్‌ డిజైన్‌ ఆకట్టుకుంటుందని’ అంటారు.నెగెటివ్‌ నుండి ఫోటో షూట్‌ వరకు

‘బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా సమయంలో  పోస్టరు డిజైన్‌  మాన్యువల్‌గానే ఉండేది. సినిమా మొత్తం ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ పోటోలు తీసి ఒక అల్బమ్‌లా తయారు చేసి ఆర్టిస్ట్‌కు పంపేవారు. దానికి తగినట్లు డిజైన్‌ చేసి బ్ల్లేడ్‌తో డిజైన్‌లు కత్తిరించి, వాటిని అతికించి పోస్టర్‌కు ఒక లుక్‌ తీసుకువచ్చేవారు. కలర్‌ వచ్చాక  పోస్టర్‌కు రంగులద్దడం,బార్డర్‌లు వేయడం, పోటోలు అంటించడం ప్రతిదీ మాన్యువల్‌గా చేసేవాళ్లు. డ్రాయింగ్‌ గీసుకుని, పోస్టర్లు తయారు చేయడానికి సృజనాత్మకత కావాలి. ఎంతో దీక్ష, పట్టుదల ఉండాలి. అప్పుడే  పోస్టర్లలో జీవకళ ఉట్టిపడుతుంది.  సినిమాకు సంబంధించి ఫ్రేమ్‌ టూ ఫ్రేమ్‌ సినిమా ఐడియా డిజైనర్‌కు ఉండాలి. పబ్లిసిటీ డిజైనర్‌ను ఎక్కువగా నిర్మాతలే ఎంపిక చేసుకుంటారు. అయితే ఒక్కోసారి హీరో, దర్శకుడు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సినిమాకు  వేరియేషన్‌ చూపించగలిగే ఆర్టిస్టుకే ఎక్కువగా అవకాశాలు వస్తాయి.   సినిమా షూటింగ్‌ సమయంలో తీసిన పోటోలతోనే ఎక్కువగా పోస్టర్లు డిజైన్‌ చేస్తారు. అయితే మరింత ఆకర్షణీయంగా పోస్టర్లు వేయాలంటే ప్రత్యేకంగా ఫోటోషూట్‌ కూడాచేయించడం చేస్తున్నారని ధని తెలిపారు. -మధుకర్‌ వైద్యుల