మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Mar 28, 2020 , 23:20:07

ఆలోచనల రారాజు

ఆలోచనల రారాజు

ఉదయాన్నే లేవడం. స్కూలుకెళ్లడం. సాయంత్రం ట్యూషన్‌కెళ్లడం. మళ్లీ రాత్రికి పుస్తకాలతో కుస్తీ పట్టడం. ఇవేనా మనం పిల్లలకు నేర్పించేది? ఒక పిల్లాడు 20 ఏండ్లు క్లాస్‌రూంలో మాత్రమే కూర్చుని బయటికొస్తే.. సమాజానికి ఏం ఇస్తాడు? సమాజం నుంచి ఏం ఆశిస్తాడు? అలాంటి నేటితరానికి విలువలు, నిజాయతీ వంటి అంశాలు నేర్పుతూ.. విలువైన జీవితాల్ని ప్రసాదించాలని ప్రయత్నిస్తున్నారో వ్యక్తి. ఆయన తలపెట్టిన మహాయజ్ఞం తెలంగాణలో మొదలై దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలకు చేరింది. విలువైన భావితరాన్ని సమాజానికి అందించేందుకు ‘మిషన్‌ ఎథికల్‌ ఇండియా’ను ప్రారంభించారు కేసిపెద్ది నర్సింహరాజు. ఆయన కృషికి అక్షరరూపం...

ప్రస్తుతం నిమిషానికో హత్య. గంటకో అత్యాచారం. పసికందులపైనా పాశవిక చర్యలు. భవిష్యత్‌లో నేరరహిత సమాజాన్ని చూడాలనుకున్నారు కేసిపెద్ది నర్సింహ రాజు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు 2013లో ‘మిషన్‌ ఎథికల్‌ ఇండియా సొసైటీ’ని ప్రారంభించారు. స్వగ్రామమైన జనగాం జిల్లాలోని ఖిలాషాపురం ప్రభుత్వ పాఠశాలలో నీతికథల వక్తృత్వ పోటీలు ప్రారంభించారు. అలా మొదలైన పోటీల్ని ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు విస్తరించారు. ఏటా ఆగష్టు 14న సంస్థ ఆధ్వర్యంలో  పోటీల్ని నిర్వహిస్తున్నారు. విజేతలకు  బహుమతులు అందిస్తున్నారు. ‘మిషన్‌ ఎథికల్‌ ఇండియా సొసైటీ’కి ఆఫీస్‌ లేదు. సిబ్బంది లేరు. ఎవరిదగ్గరా విరాళాలు తీసుకోరు. తెలంగాణలో మొదలైన ఈ సంస్థ సేవలు ప్రస్తుతం 22 రాష్ర్టాల్లోని 6వేలకు పైగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు విస్తరించాయి.

ధర్మ స్తూపం.. ధర్మయాత్ర

రాజు ‘ధర్మస్తూపం’ పేరుతో మరో వైవిధ్యమైన కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఇందులో భాగంగా 50 వేల పోస్టర్లు ప్రింట్‌ చేయించారు. దాదాపు 10 వేలకు పైగా పాఠశాలల గోడల మీద వాటిని అంటించారు. ఈపోస్టర్‌లో ‘సత్యం బ్రూయాత్‌.. ప్రియం బ్రూయాత్‌.. సత్యాన్ని పలుకవలెను.. ప్రియముగా పలుకవలెను.. ఇలాంటి 15 సూక్తులుంటాయి. ఖిలా షాపురంలో పాఠశాలలో ధర్మస్తూపాన్ని కూడా నిర్మించారు. ‘ధర్మాన్ని రక్షిస్తే.. అది మిమ్మల్ని రక్షిస్తుంది’ అని చాటుతూ వందల కిలోమీటర్ల మేర ధర్మయాత్ర చేశారు.

ఈ-బుకింగ్‌ ఆలోచన రాజుదే..

రాజు గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అందరిలాగే తిరుమలేశుడి దర్శనానికి వెళ్లారు. క్యూకాంప్లెక్స్‌లో గంటల కొద్దీ వేచి ఉన్నారు. దర్శనానికి 12 గంటలు పట్టింది. ఆ సుదీర్ఘ నిరీక్షణ ఫలితంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇందుకు తానే ఓపరిష్కారాన్ని చూపించాలనుకున్నారు. భక్తులకు గంట వ్యవధిలోనే దర్శనమయ్యేలా ఓ ఆలోచన చేశారు. దానికి టెక్నాలజీని  జోడించారు. మూణ్ణెల్ల ముందుగానే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా టికెట్‌ బుక్‌ చేసుకునేలా ప్రాజెక్టు రూపొందించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఒప్పించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులోఉన్న రూ.300 టికెట్ల ఆలోచన రాజుదే. ‘ఇదంతా ఆ శ్రీనివాసుడి సంకల్పమే’ అని వినయంగా చెబుతారు రాజు.

ప్రవాస గ్రామీణులు

సొంత ఊళ్లకు దూరంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లూ లెక్కలేనంతమంది. వారంతా ఊరి కోసం తమవంతుగా ఏదైనా చేస్తే.. అన్న ఆలోచనలోంచి వచ్చిందే.. నాన్‌ రెసిడెంట్‌ విలేజర్స్‌.. రాజు www.nrvindia.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. గ్రామంలో చదివి, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి జాబితా  అందులో ఉంటుంది. ఈవెబ్‌సైట్‌ ద్వారా గ్రామంలో ఏ అవసరమున్నా.. ఎవరికి ఆర్థికసాయం కావాలన్నా.. సభ్యులంతా స్పందించే వీలుంటుంది. వివిధ రంగాల్లో  స్థిరపడ్డ వారి రెఫరెన్స్‌తో యువతకు ఉద్యోగ అవకాశాలూ లభిస్తున్నాయి.  

బీటెక్‌ తర్వాత? 

చాలామంది లక్షలు పోసి బీటెక్‌ చదువుతారు. ఆ తర్వాత చదువుతో సంబంధం లేకుండా ఏదో చిన్నపాటి ఉద్యోగంలో చేరిపోతారు. లేదంటే రోడ్లపై తిరుగుతుంటారు. కారణం.. ఉద్యోగం రావాలంటే చదువొక్కటే సరిపోదు. మరింత మంచి కొలువు సాధించాలంటే ఏం కావాలి? అందుకు సంబంధించిన విషయాలన్నీ 5thyear.in లో పొందుపర్చారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, ఇంజినీరింగ్‌ చదువుతున్నవారు ఈ వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ చెక్‌ చేసుకుంటే.. నైపుణ్య పరంగా తాము ఏ స్థాయిలో ఉన్నారో ఓ అవగాహనకు వస్తారు. ఇలాంటి ఎన్నో మంచి సంకల్పాలతో సమాజానికి తనవంతుగా సేవ చేస్తున్నారు నర్సింహరాజు.

తెలంగాణ వాదం

తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయం. రాజు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే.. ప్రభుత్వ ఖజానా మీద దెబ్బ కొట్టాలని భావించారు. ‘స్వచ్ఛంద మద్య బహిష్కరణ ఉద్యమం’ ప్రారంభించారు. ఖిలాషాపురం వేదికగా మొదలైన ఈ ఉద్యమాన్ని తెలంగాణ పల్లెలకు విస్తరించారు. పల్లెల్లో స్వచ్ఛంద మద్య బహిష్కరణపై విస్తృత అవగాహన కల్పించారు. దాదాపు రూ.2 లక్షల సొంత ఖర్చుతో స్వగ్రామంలో తెలంగాణ వాదాన్ని బలపర్చడానికి ‘ధూంధాం’ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో తన గొంతును వినిపించిన రాజు ... కొత్త ఆలోచనల్లో రారాజు.

ఎన్నో ఉద్యోగాలు వదిలి.. 

కేసిపెద్ది నర్సింహ రాజు బీటెక్‌ పూర్తి చేశారు. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం వస్తే వెళ్లలేదు. ఇస్రోలో సైంటిస్ట్‌గా ఉద్యోగావకాశాన్ని వదిలేశారు. డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌)లో సైంటిస్ట్‌గా మరో ఉద్యోగ అవకాశాన్నీ వదులుకున్నారు. చివరికి తనకిష్టమైన సాఫ్ట్‌వేర్‌ రంగంలో తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఓఎస్డీ టు డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు.

-పడమటింటి రవికుమార్‌ 


logo