బుధవారం 03 జూన్ 2020
Sunday - Mar 29, 2020 , T00:20

బుల్లితెర బాతాఖానీ

బుల్లితెర బాతాఖానీ

ఆఫీసు నుంచి అలసిసొలసి ఇంటికి వెళ్లినవారికి& కాస్తంత ఉపశమనం టీవీ సీరియల్‌. మధ్యతరగతి గృహిణికి ఇంట్లో ఊసుపోవాలంటే కూడా సీరియల్‌ కావాలి. ఇక, నలుగురు ఆడవాళ్లు ఓ దగ్గర కలుసుకుంటే సీ‘రియల్‌' అన్నట్లుగా ముచ్చట్లు కొనసాగుతాయి. కాబట్టే, ధారావాహికలకు సంబంధించిన తాజాతాజా విశేషాలు ప్రతీవారం మీ కోసం..

మళ్లీ వచ్చేసింది పిన్ని!


‘కృష్ణమ్మకు.. గోదారికి తోడెవరమ్మా..’ అంటూ జెమినీలో ప్రసారమైన ‘పిన్ని’ సీరియల్‌ని ఎవరూ మరచిపోయి ఉండరు. 1999లో మొదలైన ఈ ధారావాహిక 2001 వరకు కొనసాగి ప్రభంజనాన్నే సృష్టించింది. అప్పట్లో రాత్రి 7.30కి వచ్చిన 

ఈ సీరియల్‌లో రాధిక లీడ్‌ రోల్‌ చేశారు. దాదాపు 20 యేండ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ తీసుకొచ్చింది సన్‌ నెట్‌వర్క్‌. ఈ నెల 23 నుంచి సాయంత్రం 6గంటలకు పిన్ని -2 ప్రసారం అవుతున్నది.  నిన్నటితరాన్ని  ఊపు ఊపిన పాటతోనే.. మరోసారి ఈ సీరియల్‌ ప్రభంజనం సృష్టిస్తుందని జెమినీ నమ్ముతున్నది. గతకొంతకాలంగా మిగతా చానెళ్లతో పోలిస్తే టీఆర్పీ రేటింగ్‌లో జెమినీ వెనుకబడిందనే చెప్పొచ్చు. ఈ ట్రెండ్‌ సెట్టర్‌ సీరియల్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని జెమినీ ఊవ్విళ్లూరుతున్నది. ఆ కల ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే.. బార్క్‌ రేటింగ్స్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే! 
చిన్నారి శౌర్య చీర కట్టింది! 

‘కార్తీకదీపం’ సీరియల్‌లో వంటలక్క ఎంత ఫేమస్సో.. ఇప్పుడు చిన్నారి శౌర్య  అంతకంటే ఎక్కువ పాపులర్‌. టీవీలో వచ్చే డెయిలీ సీరియల్‌ అంటేనే.. ఫ్యామిలీ డ్రామా, కక్షలు, అత్త-కోడళ్ల ఘర్షణ.. ఇవే ముఖ్య దినుసులు. ఈ సీరియల్‌కి కూడా ఆ ఎమోషనే ప్రధాన వనరు. ప్రేమీ విశ్వనాథ్‌ అదేనండీ.. వంటలక్క కోసమే ఆ సీరియల్‌ చూసేవారి సంఖ్య కూడా తక్కువేం కాదు. అయితే ఈ ట్రెండ్‌ను బీట్‌ చేస్తూ..  ఇప్పుడు ఆమె కూతుర్లుగా నటిస్తున్న కృత్తిక (శౌర్య),సహృద (హిమ) నటన పీక్స్‌లో ఉంటున్నది. ఆ ఇద్దరూ లేకుంటే ఆ పూట సీరియల్‌ చూడటం ఎందుకనట్లుగా ఉంది పరిస్థితి. నిజంగానే పోటీపడి నటిస్తున్నారీ పిల్లలు. ఈ మధ్యే కృత్తిక ఓణీల ఫంక్షన్‌ జరిగింది. ఆ శుభకార్యం కోసం.. పసుపు, ఎరుపు కాంబినేషన్‌లో లంగా-ఓణీ కట్టి, కాసుల పేరుతో అందంగా ముస్తాబయింది తను. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఫంక్షన్‌కి  టీవీ ప్రముఖులు కూడా అటెండ్‌ అయ్యారు. 


వెబ్‌సీరిస్‌గా అమృతం 

‘అమృతం’ సీరియల్‌ను 90వ దశకంలో పడీ పడీ చూశారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఉంచారు. ఈటీవీ ప్లస్‌లో కూడా కొన్ని రోజుల పాటు పునఃప్రసారమైంది. ఏమైందో ఏమో కానీ, ఈ మధ్య ప్రసారం కావడం లేదు. అలాగే.. యూట్యూబ్‌లోని ఎపిసోడ్స్‌ కూడా మాయమయ్యాయి. దీని వెనుక కారణం... జీ-5 ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ ఈ సీరియల్‌ని కొనేయడమే. జీ యాప్‌లో మాత్రమే దీన్ని చూడొచ్చు. ఇప్పుడు, అమృతం-2... ‘మూర్ఖత్వానికి మరణం లేదు’ అనే సబ్‌ టైటిల్‌తో ఓ వెబ్‌సీరిస్‌ కూడా ప్లాన్‌ చేశారు. ఇది ఉగాది నాటికి అందుబాటులో ఉండనున్నది. ఓ హోటల్‌ చుట్టూ తిరిగే  ఇతివృత్తంతో అందరినీ కడుపుబ్బా నవ్వించేందుకు గుణ్ణం గంగరాజు అండ్‌ కో మళ్లీ సిద్ధమైంది. ట్రైలర్‌ని కూడా రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇందులో అమృతంగా హర్షవర్దన్‌, తనకు జోడీగా సత్య కృష్ణ, స్నేహితుడు ఆంజనేయులు పాత్రలో ఎల్బీశ్రీరామ్‌ కనిపించనున్నారు. మిగతా క్యారెక్టర్లు పాత వాళ్లే పోషిస్తున్నారు. 
బాబు బంగారం!

జబర్దస్త్‌లోని స్కిట్‌లోలాగే రియల్‌ లైఫ్‌లోనూ రసికుడనే పేరును సార్థకం చేసుకున్నాడు దొరబాబు కానీ అదే రోజు దొరబాబు భార్య పెట్టిన ఫొటో కూడా బాగా వైరల్‌ అయింది. నందిని రెడ్డి అలియాస్‌ అమూల్య ఓ లోకల్‌ చానెల్‌లో యాంకర్‌గా పనిచేసింది. 2018లో  దొరబాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి టిక్‌టాక్‌ వీడియోల ద్వారా చాలా ఫేమస్‌ అయ్యారు. దొరబాబు వ్యభిచార గృహంలో దొరికిన రోజునే& ఆమె టిక్‌టాక్‌లో ‘మై లైఫ్‌ లవ్‌ యూ సో మచ్‌ బుజ్జీ’ అంటూ దొరబాబు పేరును చేతిపై టాటూగా వేయించుకుంది. దొరబాబును తను బుజ్జీ అని పిలుస్తుందట. ప్రపంచమంతా నొసలు చిట్లిస్తున్న సమయంలో& భర్త పై బహిరంగంగానే ప్రేమను వ్యక్తం చేసి పెద్ద షాకే ఇచ్చింది. ‘ఎవరు ఏమనుకున్నా నా భర్త బంగారమే’ అని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 


logo