శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Mar 28, 2020 , 23:16:21

ఫాలో యువర్‌... ఇకిగయ్‌

ఫాలో యువర్‌... ఇకిగయ్‌

హఠాత్తుగా ఎవరో  గొంతుమీద కత్తి పెడతారు. ‘నీ ప్రాణాలు తీస్తా?’ అని బెదిరిస్తారు. ఆ మాట వినగానే చెమటలు పడతాయి. మాట తడబడుతుంది. వణుకు మొదలవుతుంది.అప్పుడు నీ నోట్లోంచి వచ్చే మూడు ముక్కలే నీ ‘ఇకిగయ్‌'. నువ్వు బతకడానికి ఏదో ఓ బలమైన కారణం ఉంటుంది. నువ్వు రేపటి కోసం ఎదురు చూడటం వెనుక ప్రగాఢమైన ఆకాంక్ష  ఏదో ఉంటుంది. అదే... నీ ఇకిగయ్‌.  ఇది జపనీస్‌ మాట. జపనీయుల జీవనవిధానమంతా ఇకిగయ్‌ చుట్టే తిరుగుతుంది. ప్రతి మనిషికి ఓ ఇకిగయ్‌ ఉంటుంది. అదేమిటో తెలుసుకున్నప్పుడే... జీవితం పరిపూర్ణం అవుతుంది. మన జీవితాన్ని ఇకిగయ్‌ ఆధారంగా నిర్మించుకోవాలని చెబుతుంది...  హెక్టర్‌ గార్సియా తాజా  రచన... ‘ఇకిగయ్‌.. జపనీస్‌ సీక్రెట్‌ టు  ఎ లాంగ్‌  అండ్‌ హ్యాపీ లైఫ్‌'. ఇది ఇంటర్నేషనల్‌ బెస్ట్‌ సెల్లర్‌.

రిటైర్మెంటు వద్దు

ఇష్టమైన పనిని చేస్తున్నంత కాలం ముసలితనం నీ దరిదాపుల్లోకి కూడా రాదు. బలవంతంగా నెత్తినేసుకునే బాధ్యత మాత్రం విషపు గుళిక లాంటిది. నీ మనశ్శాంతిని మింగేస్తుంది. అంతిమంగా నిన్నూ మింగేస్తుంది. 

పొట్టనింపుకోవద్దు. కడుపునిండిపోతే... శరీరం చురుకుదనాన్ని కోల్పోతుంది. దాంతోపాటే మెదడూ మొద్దుబారు తుంది. మన్ను తిన్న పాములా తయారైపోతావు. ఎంత అద్భుతమైన విందు అయినా సరే... మూడింట ఒకటో వంతు పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోండి. 

ఆత్మీయుల మధ్యే...

స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం, కుటుంబంతో సినిమాకో షికారుకో వెళ్లడం. జీవితాన్ని ఆనందంగా మలుచుకునే మార్గాలు. ఓ గంటసేపు స్నేహితుల మధ్య గడిపితే... ఆ గంట వృథా అయినట్టు కానే కాదు. ఆ మేరకు అరవై నిమిషాలు మీ ఆయుర్దాయం పెరిగినట్టే. 

నడవండి...నడవండి...

న్యూస్‌పేపర్‌ తెచ్చుకోవాలి, కూరగాయలు కొనుక్కోవాలి, సెలూన్‌కు వెళ్లాలి, పక్కగల్లీలోని ఫ్రెండ్‌ను కలవాలి. ఇలా ఏ చిన్నపనికైనా బండి బయటికి తీసే అలవాటును మానుకోమంటుంది ఇకిగయ్‌. పారే ఏరే పరిశుభ్రంగా ఉంటుంది. నడిచే మనిషే నిక్షేపంగా ఉంటాడు. నడకలో ఆనంద హార్మోన్లు కూడా విడుదల అవుతాయి.

ప్రకృతిలోకి వెళ్లండి

పచ్చదనాన్ని ప్రేమించండి. పచ్చని ప్రకృతి మధ్య కాలం గడపండి. నగర జీవితంలో అది సాధ్యం కాకపోవచ్చు. ఏ వారాంతంలోనో, మాసాంతంలోనో... ఓసారి శివార్ల బాట పట్టండి. ఏ చెట్టు నీడనో కూర్చుని హాయిగా కాలక్షేపం చేయండి. 

ఇకిగయ్‌ తెలుసుకో...

ఇదంతా జరగాలంటే, ముందు నీ ఇకిగయ్‌ ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. అందుకు ఒకటే మార్గం. ఏ పని చేస్తున్నప్పుడు నీకు... అది అసలు పనిలానే అనిపించదో, ఏ పని చేస్తున్నప్పుడు నీకు అదే ప్రపంచమని అనిపిస్తుందో... అదే నీ ఇకిగయ్‌.

వర్తమానమే నిజం

గతం రాదు. రేపటి రూపును ఊహించలేం. వర్తమానమే నిజం. ఈ క్షణమే నీది. ఈ నిమిషంలో జీవించండి. ప్రకృతి పట్ల, తోటి మనుషుల పట్ల కృతజ్ఞతతో వ్యవహరించండి. ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలనుకోవడం దురాశే. పసిబిడ్డ అసంపూర్ణంగా పలికే మాటలూ వినసొంపుగానే ఉంటాయి కదా!

చివరిగా ఒక్క మాట... మీరు కోరుకున్న దార్లోనే వెళ్లండి. గమ్యాన్ని మార్చుకోవద్దు.