శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Mar 15, 2020 , 19:57:18

ప్రపంచాన్ని కదిలించిన ఆమె మరణం

ప్రపంచాన్ని కదిలించిన  ఆమె మరణం

31 సంవత్సరాలు.. 17 వారాల ప్రెగ్నెన్సీ.. అనుకోని అనారోగ్యం.. గర్భస్రావం.. వాంతులు,  వెన్నునొప్పి.. శ్వాస సమస్య.. గర్భాన్ని తీసేయాలనే అభ్యర్థన.. చట్టాలు అడ్డం.. డాక్టర్ల నిర్లక్ష్యం..  ఆమె దుర్మరణం.. పిండం హృదయస్పందన ఉన్నప్పుడు ఎవరి కోసమూ దాన్ని తొలగించలేమనే చట్టాలున్నాయి.. చివరికి ఆ చట్టమే ఆ తల్లి ప్రాణాలను బలిగొంది.. ప్రపంచాన్ని కదిలించింది. భారత సంతతికి చెందిన సవితా హలప్పనవార్‌ విషాద కథ ఇది. అమ్మతనం మీద హక్కులను జయించేలా చేసిన మరణం ఆమెది..


2012, అక్టోబర్‌ 17గాల్వే యూనివర్సిటీ ఆస్పత్రి, ఐర్లాండ్‌..

ప్రెగ్నెన్సీ విభాగంలో డాక్టర్లున్నారు. అక్కడ ఓ మహిళ నిల్చొని ఉంది. కొద్ది సేపటికే ఆమె డాక్టర్‌ గదిలోకి వెళ్లింది. ఆమె ఏదో మాట్లాడుతున్నది. డాక్టర్‌ సమాధానం ఇస్తున్నారు. ఆమె అభ్యర్థిస్తున్నట్టు కనిపిస్తున్నది. కానీ డాక్టర్లు నిరాకరిస్తున్నారు. డాక్టర్‌కు, ఆమెకు మధ్య ఏదో సంభాషణ?.. ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది.  పేరు సవితా హలప్పనవార్‌. కర్ణాటకకు చెందిన మహిళ. ఐర్లాండ్‌లో డెంటిస్టుగా స్థిరపడ్డారు. 31సంవత్సరాల వయస్సు. 17 వారాల ప్రెగ్నెన్సీ. ఆమె అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లింది.తాను గర్భవతి అనే సంగతి సవితకు ఆగస్టులో తెలిసింది. సాధారణ వైద్య పరీక్షల కోసం అదే నెలలో ఓ డాక్టర్‌ను కలిసింది. 2013 మార్చి 20 డెలివరీ తారీఖు ఖరారైంది.అప్పటికీ ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, ప్రమాద కారకాలు లేవు.  అక్టోబర్‌ 10న మొదటిసారి ప్రెగ్నెన్సీతో వైద్య పరీక్షలకు హాజరైంది. అప్పడు ఆమె గర్భం దాల్చి 15 వారాల 5 రోజులవుతున్నది. ఆమె బిడ్డకు పాలు పట్టించాలని కోరుకుంటున్నట్టు దానికి తగ్గ సలహాలను తీసుకుంది. దాని వివరాలను స్టాఫ్‌తో చర్చించింది. కానీ వెన్నునొప్పికి సంబంధించిన పరీక్ష కోసం ఫిజియోథెరపీ డాక్టర్‌ను కలవాల్సి వచ్చింది. స్కానింగ్‌ టెస్టు జరిగింది. తర్వాత వైద్యపరీక్షలు డిసెంబర్‌ 20న చేయించాలని వైద్యులు చెప్పారు. ఆ తారీఖు నాటికి ఆమె 20 నెలల గర్భంతో ఉంటుంది. 


అక్టోబర్‌ 21, 2012

వైద్య పరీక్షల కోసం ఇచ్చిన తారీఖు కన్నా ముందే సవిత, ఆమె భర్త ప్రవీణ్‌ అక్టోబర్‌ 21న ఆస్పత్రికి వచ్చారు. అదీ ఎలాంటి డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ లేకుండా ప్రెగ్నెన్సీ వార్డులోకి వచ్చారు.  ఉదయం 9.35 గంటలకు ఒకరకమైన వెన్నునొప్పితోనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ వెన్నునొప్పికి చికిత్స ఉంటుందని ఆమె భావించారు. డాక్టర్‌ను కలిసిన తర్వాత ఆమె ఇంటికి బయల్దేరింది. కానీ ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆస్పత్రికి రావాలని ఓ వైద్యుడు తెలిపాడు.  అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. అమెకు ఏదో వెనక్కి దిగుతున్నట్టు అనిపిస్తున్నదనీ, వెనక్కి నెట్టినట్టు అనిపిస్తున్నదని ఏడుస్తూ ఉంది. వార్డులో పని చేస్తున్న ఓ మహిళ  సవిత అవస్థను గమనించింది. సవితకు గర్భస్రావం అవుతుందని గుర్తించింది. వెంటనే డాక్టర్లను పిలిపించి వైద్య పరీక్షలు చేయించింది. అప్పటికే సవిత బాధపడుతున్నది. భరించలేని నొప్పితో ఉంది. ఆమె పరిస్థితిని పూర్తిగా పరీక్షించిన డాక్టర్లు గర్భస్రావం అని నిర్ధారించారు. గర్భం కోల్పోవడం అణివార్యం అనే అభిప్రాయానికి వచ్చారు. తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో వైద్యులకు తోచలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సవితను ఓ గదిలోకి తరలించారు. అదే ఆదివారం రోజు పిండం హృదయ కదలికలపై పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి వాటిని గుర్తించారు. కానీ తర్వాత ఏం చేయాలన్నదే నిర్ణయం తీసుకోవడానికి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. 
అక్టోబర్‌ 22 సోమవారం 

అర్ధరాత్రి దాటిన తర్వాత సవితకు భయంకరమైన వాంతులు ప్రారంభమయ్యాయి. పిండం పొరలు చీలిపోయాయి. ద్రవం బయటకు వచ్చింది.  ఉదయం 8.22 గంటలకు సవిత తీవ్రమైన రక్తస్రావాన్ని ఎదుర్కొన్నది. అదే సమయంలో కొంత నొప్పి కూడా తగ్గింది. అప్పుడే డాక్టర్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదాన్ని చర్చించాడు. పిండం హృదయ స్పందన కోసం నిరంతరం చేయాల్సిన తనిఖీ అవసరాన్ని గురించి తెలిపాడు. గర్భస్రావం తగ్గడానికి తక్షణ మందుల కోసం, మార్గాల కోసం సవిత, ప్రవీణ్‌ డాక్టర్లను కోరారు. మరుసటి రోజు మంగళవారం ఇది జరిగింది. ఈ అభ్యర్థనను విన్న డాక్టర్లు ఐరిష్‌ చట్టం గురించి చెప్పారు.ఐరిష్‌లో అమలవుతున్న అబార్షన్‌ చట్టం ప్రకారం.. ‘తల్లిప్రాణాలకు ప్రమాదం ఉన్నట్టు ఆధారాలు లేకపోయినా, పిండం హృదయ కదలికలు ఉన్నా అబార్షన్‌ చేయడానికి వీలుండదు’ అని డాక్టర్లు చెప్పారు. ‘పరిస్థితుల కోసం ఎదురుచూడడం కోసం మా చేతులు కట్టివేయబడతాయ’ని వైద్యులన్నారు. రోజంతా పరీక్షించేందుకు సవితకు యాంటీబయాటిక్స్‌ ఇచ్చారు. ఈ సమయంలో ఆమె బలహీనత గురించి ఫిర్యాదు చేసింది. అయినా సాధారణ ఆహారం తీసుకుంది. 


అక్టోబర్‌ 24 బుధవారం 

తెల్లవారు జామున 4.15 గంటలకు ఒక నర్సు సవితకు చలి ఉన్నట్టు గుర్తించింది. గదిలోని రేడియేటర్‌ పని చేయడం లేదు. ఆ గదిలో బెడ్‌మీద సవిత, భర్త ప్రవీణ్‌ మాట్లాడుకుంటున్నారు. గది అంతా చల్లగానే ఉన్నా ఆమె శరీర ఉష్ణోగ్రత్త మాత్రం ఎక్కువగానే ఉంది. దాన్ని నియంత్రించడానికి నర్సు ప్యారసిటమల్‌ ఇచ్చింది. ఉదయం 7 గంటలకు సవిత వికారం, వాంతితో బాధపడింది. ఒక గంట తర్వాత వైద్యులు పరీక్షించారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా పిండం పొరల వాపును గుర్తించారు. వారి దృష్టి అంతా ఇన్‌ఫెక్షన్‌కు గల కారణాలను కనుక్కోవడం మీదనే ఉన్నది. పిండం హృదయ స్పందనను ఎప్పటికప్పుడూ కనుక్కొంటున్నారు. గుండె ఉదయం 11.45 గంటల నాటికి నిమిషానికి 148 సార్లు కొట్టుకున్నది. ఇది సాధారణ హృదయ స్పందన. 

మధ్యాహ్నానికి ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గురించి వైద్యులకు చెప్పింది. సవిత ఆరోగ్యం ఆకస్మాత్తుగా క్షీణించడాన్ని నర్సులు గుర్తించారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ఆమె తీవ్రమైన అనారోగ్యంతో ఉంది. వైద్యుల బృందం చేసిన పరీక్షల తర్వాత సవితకు సెప్టిక్‌ షాక్‌ ఉందని నిర్ధారణ అయింది. గర్భస్రావం గురించి తీవ్ర కలత చెందిన ప్రవీణ్‌.. సవితను రెండు గంటలకు  ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అక్టోబర్‌ 25 వరకూ ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. ఆమెకు ఆక్సీజన్‌ అందిస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటలకు ఐసీయూకు తరలించారు. తెల్లవారేసరికి ఆమె గుండె పనితీరు తగ్గింది. శనివారం రోజు కూడా ఐసీయూలో ఆమెకు వైద్యపరీక్షలు కొనసాగాయి. అయినా పరిస్థితి విషమంగానే ఉంది. అక్టోబర్‌ 28 రాత్రి 12.45కు సవితకు గుండెపోటు వచ్చింది. 1.09 గంటలకు ఆమె పూర్తిగా ఆరోగ్యం క్షీణించింది. గుండె స్పందన ఆగిపోయింది. ఆమె మరణించింది. తీవ్రమైన గర్భస్రావం ఉండడం వల్ల అబార్షన్‌ చేయాలన్న సవిత అభ్యర్థనకు ఐర్లాండ్‌ చట్టాలు అడ్డం వచ్చాయి. అబార్షన్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో భారత సంతతి యువతి సవిత హలప్పనవర్‌ ప్రాణాలు కోల్పోయింది. 31 సంవత్సరాల సవిత దుర్మరణ వార్త బయటకు తెలిసింది. ఐర్లాండ్‌లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ‘స్త్రీలకు అబార్షన్‌ నిరాకరించే చట్టాన్ని రద్దు చేయాల’ని కోరుతూ నిరసనలు తెలిపారు. ఆ తర్వాతి రోజుల్లో ఐర్లాండ్‌  తీరిగ్గా విచారణకు ఆదేశించింది. ‘4 నెలల పిండాన్ని కాపాడటానికి 30 ఏండ్ల నా కూతురిని చంపేశారు. ఇదేమి న్యాయం, చెప్పండి’ అంటూ సవిత భర్త ప్రవీణ్‌ ఆవేదన చెందాడు. వైద్య నిర్లక్ష్యం, ఐరిష్‌ అబార్షన్‌ చట్టాలు  ఈ రెండింటివల్ల తన కూతురు చనిపోయిందని సవిత తండ్రి ఆక్రోశం వ్యక్తం చేశాడు.  అబార్షన్‌ కోరుకునే ఐర్లాండ్‌ స్త్రీలు పక్క దేశాలకు వెళ్లిపోతారు. ఐరిష్‌ మహిళలు దాదాపు 4,000 మంది వరకూ అబార్షన్‌ కోసం పక్కనే ఉన్న ఇంగ్లండ్‌ వెళ్తారని  పత్రికలు తెలిపాయి. అత్యవసర పరిస్ధితులు ఏర్పడినప్పుడు ఇలా పక్క దేశం వెళ్ళే సమయం ఉండదు. తల్లి ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నపుడు అబార్షన్‌ చేసుకునేందుకు ఆమెకు గల హక్కును కాపాడటంలో ఐర్లాండ్‌ చట్టాలు విఫలం అవుతున్నాయని యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు గతంలో విమర్శించింది. తల్లి ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరిస్థితుల్లో అబార్షన్‌కు అనుమతించేలా చట్టాన్ని ప్రతిపాదిస్తు వామపక్షాల సభ్యులు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు చట్టంగా మారకుండా పార్లమెంటు అడ్డుకుంది. గాల్వే యూనివర్సిటీ ఆస్పత్రి వారు తీవ్రమైన ప్రమాదాన్ని నివారించడానికి కూడా అబార్షన్‌ చేయడానికి నిరాకరించడంతో ఒక మహిళ చనిపోయింది. ఇలాంటి పరిస్ధితి అసలెప్పుడూ తలెత్తదని (పార్లమెంటులో) వాదించారు. ఆమె ఆకస్మిక అబార్షన్‌కి గురయింది. ఒక మహిళ ప్రాణం కంటే నిలబడలేని పిండానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దానితో దురదృష్టవశాత్తూ, ఊహించగలిగినట్లుగానే సెప్టికేమియాతో ఆమె చనిపోయింది అని బిల్లుని ప్రతిపాదించిన పార్లమెంటు సభ్యులు తెలిపారు. సవిత మరణ వార్త ప్రపంచమంతా వ్యాపించింది. వివిధ దేశాల నుండి ఖండన ప్రకటనలు వెలువడ్డాయి. రెండు వేల మందికి పైగా ప్రజలు పార్లమెంటు ముందు ప్రదర్శన నిర్వహించారు. దానితో ఐర్లాండ్‌ పభుత్వం విచారణకు ఆదేశించింది. రెండు బృందాలతో దర్యాప్తు ప్రకటించింది.అబార్షన్లను నిషేధించాలా, అనుమతించాలా అనే అంశంపై దేశవ్యాప్తంగా రెఫరెండం నిర్వహించారు.  ఈ రెఫరెండంలో ఎక్కువ మంది అబార్షన్లను అనుమతించాలి, అమ్మతనంపై హక్కు ఆమెకే ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 66.4 శాతం మంది ప్రజలకు అబార్షన్‌ చట్టాన్ని సవరించాలని ఓటేశారు. దీంతో ఐర్లాండ్‌ ప్రభుత్వం  అబార్షన్‌ చట్టాన్ని సవరించింది. తల్లి ప్రమాదంలో ఉన్నప్పుడు అబార్షన్‌ చేయడానికి అనుమతినిచ్చింది. 

వినోద్‌ మామిడాల,  సెల్‌: 7660066469


logo