మంగళవారం 02 జూన్ 2020
Sunday - Mar 15, 2020 , 19:50:23

సన్యాసం!

సన్యాసం!

‘ఆవేశం ఆపుకో. మొదట వైరాగ్యం గురించి సన్యాసి లక్షణాల గురించి తెలుసుకో. సన్యాసం అంటే ప్రాపంచిక విషయాలపట్ల వైముఖ్యం. వైరాగ్యమంటే వ్యామోహాల పట్ల అయిష్టం. మీ తమ్ముడిలో అవేవీలేవు.

గణేష్‌ ఒక ఆఫీసులో పని చేస్తాడు. ఆ రోజు ఎంతో పని ఉంది. ఫైల్స్‌ తిరగేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఉన్నట్లుండి అతని భార్య ఆఫీసులోకి దూసుకొచ్చింది. ఫైళ్ళలో తలదూర్చిన గణేష్‌ తల ఎత్తి ఆశ్చర్యంగా ఆఫీసుకు వచ్చిన భార్యను చూశాడు.

గణేష్‌ భార్యపేరు నిరుపమ. ఆమె గణేష్‌ పక్కనే ఉన్న కుర్చీలాక్కుని కూర్చుంది.  ఆమె ముఖంలో ఒక రకమైన ఉద్వేగం, ఆందోళన దాంతోపాటు ఒకరకమైన ఆనందం కూడా మిళితమై ఉన్నాయి.

గణేష్‌ ఆమెను చూసి ‘ఎందుకలా ఉన్నావు. ఏమిటి పొద్దున్నే ఆఫీసుకు వచ్చావు?’ అని అడిగాడు.

నిరుపమ ‘పొద్దున్నే మా తమ్ముడు ఇంటికి వచ్చాడు. వాడు ఆరునెలల క్రితం తీర్థయాత్రలకని వెళ్ళాడు. గడ్డం కూడా పెంచాడు. వాడు ఒక్కగా నొక్క తమ్ముడు. వాణ్ణి అన్నాళ్ళ తరువాత చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాడిలో సన్యాసి లక్షణాలు కనిపిస్తున్నాయి. వాడి ముఖంలో ఎంతో పవిత్రభావం ఉంది. తీర్థయాత్రల విశేషాలన్నీ వివరించాడు. నాకోసం ప్రసాదాలు, విభూతి కూడా తెచ్చాడు. మీకోసం కూడా తెచ్చానని చెప్పాడు. బావమరిది అంతదూరం నుంచి మీకు తెచ్చానని చెప్పినా బెల్లం కొట్టిన రాయిలా అలా ఊరుకుంటున్నారేమిటి?’ అంది ఆవేశంగా.

గణేష్‌కు ఏం మాట్లాడాలో తోచలేదు. 

నిరుపమ మాట్లాడడం ఆపలేదు. ‘మా తమ్ముడు రుద్రాక్షలహారం కొనాలని సంకల్పించాడు. ఏవో వ్రతాలు, హోమాలు నిర్వహిస్తాడట. మనందరి బాగుకోసం పూజలు చేస్తాడట!’ సంతోషంతో చెప్పింది.

‘అవును నాకు తెలుసు. ఉదయాన్నే నా దగ్గరికి వచ్చాడు’ చెప్పాడు గణేష్‌.

‘చూశారా! బావగారంటే ఎంత గౌరవమో! మొదట మీ దగ్గరికే వచ్చాడు’ అంది.

‘వాడు నా దగ్గరికి వచ్చింది రుద్రాక్ష హారం కొనడానికి, డబ్బులు కావాలని అడగడానికి వచ్చాడు.

‘ఆమాత్రం ఇవ్వలేరా?’

‘ఆ రుద్రాక్షలు బంగారు కమ్మీతో కుట్టాలట.’

‘మా తమ్ముడిలో వైరాగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. సన్యాసాశ్రమం స్వీకరిస్తాడేమో!’

‘నీకు అలా అనిపించిందా?’

‘మీదంతా వెటకారం. మా తమ్ముడి బట్టలు కూడా మాసిపోయాయి. వాడికి పట్టుపంచ కొనివ్వాలి’ అంది.

‘అయితే మీ తమ్ముడిలో వైరాగ్య లక్షణాలు నీకు కనిపించాయన్నమాట’ అన్నాడు గణేష్‌.

‘కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంటే మీకు ఎందుకు సందేహం కలిగింది.’

‘వాడు పట్టుబట్టలకు, రుద్రాక్షహారానికి పెద్ద మొత్తంలో డబ్బు అడిగాడు. అంత డబ్బు నా దగ్గర లేదని పంపేశాను’ అని చెప్పాడు గణేష్‌.

‘మీకు ఒక్కగానొక్క బావమరిది కోరికను తీర్చలేక నిష్ఠూరంగా వాణ్ణి పంపేశారా?’ అంది.

గణేష్‌ ‘ఆవేశం ఆపుకో. మొదట వైరాగ్యం గురించి సన్యాసి లక్షణాల గురించి తెలుసుకో. సన్యాసం అంటే ప్రాపంచిక విషయాలపట్ల వైముఖ్యం. వైరాగ్యమంటే వ్యామోహాల పట్ల అయిష్టం. మీ తమ్ముడిలో అవేవీలేవు. ఖరీదైన బంగారు తీగతో అల్లిన రుద్రాక్షమాలను ఆశించడం కూడా ఆడంబరంలో భాగమే. పట్టు వస్ర్తాలు కోరుకోవడం కూడా పటాటోపంలో భాగమే. దయ, నిర్మలత్వం వదులుకోవడం వైరాగ్య లక్షణం. వీటిలో ఏవైనా మీ తమ్ముడిలో ఉన్నాయేమో చెప్పు’ అన్నాడు.

నిరుపమ భర్త చెప్పే మాటల్లో సత్యం గ్రహించి నిజం తెలుసుకొని మౌనంగా ఉండిపోయింది.

సౌభాగ్య


logo