ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Mar 15, 2020 , T01:05

ఊరికి పొయ్యొచ్చిన అమ్మ

ఊరికి పొయ్యొచ్చిన అమ్మ

“వారం రోజులు డేగాట ఆడినవు. ఇయ్యాల్నన్న పొద్దుగాల రావొచ్చుగా?” అన్నది అమ్మ తలుపు తీసుకుంటనే. సప్పుడు జెయ్యకుంట బెడ్రూంలకి పొయ్యి, బ్యాగు గూట్ల పెట్టి, సెల్‌ఫోన్ల టైమ్‌ జూశిన. పన్నెండైంది. ఈ టైముల మాటలు మాటలతోటి ఆగవు. 

డిస్కషన్లు గావొచ్చు. గట్టిగ అర్సుడు దాక పోవొచ్చు. ఎందుకొచ్చిందిలే అని బట్టలు మార్చుకొని, ఫ్రెష్షయ్యి టీవీ ఎదురుంగ కూసున్న. 

అప్పటికే ముంగల స్టూల్‌ మీద అన్నం పెట్టి ఉంది. న్యూస్‌ చానల్‌ పెడ్తె అర్ధరాత్రి వార్తలు నడుస్తున్నయి. తినుకుంట వాట్సాపుల ఫ్రెండ్‌ మెసేజికి రిైప్లె ఇస్తున్న. 

“ఈ టైముల ఫోను అవసరమా? రోజురోజుకి అజయ్‌గాని లెక్క తయారైతున్నవు?”

అజయ్‌ మా చెల్లె కొడుకు. డిగ్రీ ఫస్టియర్‌ సదువుతుండు.  నాకు నేనే “కంట్రోల్‌ ” అని చెప్పుకున్న. 

“మెడకానించి తల్కాయ దాంక నరాలు ఒకటే గుంజుడు..” చెయ్యి మెడ మీద పెట్టి చూపిచ్చుకుంట అన్నది. 

అమ్మ కూసున్న మంచం మీద మెత్త పక్కన పెయిన్‌ బామ్‌ కనపడ్డది. అప్పటికే ఒక గోళి గూడ ఏస్కొని ఉంటదని అర్థమైంది.

“సాయంత్రం తమ్ముడొచ్చినప్పుడు చెప్పకపోయినవు? ” పెరుగు కలుపుకుంట అన్న. 

“అప్పుడు లేకుండె. ఆడు పొయినకానించే తీపు తీస్తుంది” 

“ఇప్పుడేం జెయ్యలేము... పొద్దున జూద్దాం...” అనుకుంట ప్లేట్‌ తీస్కపోయి సింక్‌ల పెట్టి, చెయ్యి కడుక్కొని వొచ్చి, బెడ్రూంల దూరిన. ఎప్పటి లెక్కనే పొర్లంగ పొర్లంగ నిద్రబట్టింది. 


అమ్మమ్మ తద్దినానికి పొయ్యి వారం రోజులు మిర్యాలగూడల ఉండొచ్చింది అమ్మ. చాన రోజుల తర్వాత ఊరికి పోబట్టి, ఎప్పటికంటె నాల్గు రోజులు ఎక్కువ ఉన్నది. ఆ ముచ్చట్లు నేను పొద్దుగాల వచ్చుంటె రాత్రే చెప్పేది. కుద్రలేదు. నేను లేచేసరికే మొకం కడుక్కొని బాత్రూంలకెల్లి బైటికొస్తుంది. తేటగనే ఉంది మొకం. 

నొప్పెట్లుందని నేను అడ్గలేదు. ఉంటే ఎైట్లెనా ఆమే చెప్తది. చెప్పకపోతె లేనట్టు. కొంచెం కుంటుకుంట కిచెన్లకి పోయి స్టవ్‌ తూడ్సుడు మొదలుపెట్టింది. మోకాల్ల నొప్పులు బై డిఫాల్ట్‌ ఉండే రోజులు కదా. బ్రష్‌ చేసుకుంటుంటె అమ్మ గొంతు వినబడ్డది. 

“గా ఫిల్టర్ల నీళ్లు చిన్న బిందెల పట్టరాదు?... పుణ్యమే గాని పాపం తగ్లదు” 

నీళ్లు పట్టుకుంట అన్న, “చెప్తె పట్టనన్ననా?” 

“చిన్నపిల్లగానివి. అన్నీ జెప్పాలె...” అన్నది. 


‘మర్సిపోయిన. అన్సూయ నువు రాసిన పుస్తకం యాజ్జేసిందిరా.. బిడ్డ వొచ్చినప్పుడల్ల సదివిచ్చుకుంటదంట’
‘పర్వలేదు’ అనుకుంట గేటు కాడికి నడ్సిన.. ఎన్కంగ అమ్మ గేటు దాక వొచ్చింది. పట్నంల ఎప్పుడూ ఒక్కతి నాల్గు గోడల మజ్జెన టీవీ జూస్కుంట వుండేది. ఏం ముచ్చట వుంటది? చేతనైతె కూసొనుడు, లేకుంటే మంచం మీద ఒరుగుడు. వూరికి పోయి వొస్తస్త, వూరు మొసుకొచ్చినట్టుంది. 


స్నానం చేసొచ్చేసరికే ఆనియన్‌ పకోడీ చేసి పెట్టింది. టీవీ ఎదురుంగ కుర్చీల కూసొని తినుడు మొదలు పెట్టిన. 

“నర్సిమ్మ బిడ్డ పెండ్లి కుదిరిందంట. పిలగానోల్లు గూడ మనకు తెల్సినోల్లే. కలమ్మ చెల్లెలి కొడుకు...” 

“ ఏం జేస్తడు?” 

“సాప్టేరే అంట. ముప్పై అయిదేండ్లంట పిలగానికి” 

“ఐతె పిల్లకి ముప్పై ఉంటాయా?” 

“ఏ... ఇర్వై ఏడో ఇర్వై ఎనిమిదో ఉండొచ్చు”...

“పిల్లేమన్న జేస్తదా? ” 

“ప్రైవేట్ల జేస్తందంట. ఊళ్లనే. ఐదు తులాల బంగారం బెట్టి, పెండ్లి జేసిస్త అన్నడంట” 

‘కట్నమేం లేదా?’

‘ఇంకేం కట్నం?’.. ఇయ్యాల్రేపు అందరు అట్లనే జేస్తుర్రు. బంగారం మాత్రం తక్కువుందా?.. తులం నలభైవేలు.. అంటె ఎంతయితయి?”

‘అదేలే.. రెండు లక్షలు..’

‘ఆ.. మరే.. కానీ బోజనంల కూర పెట్టనన్నడంట.. కూరగాయలే పెడ్తనన్నడంట’

‘అదేంది?.. మహా అంటె ఇంకో యాభైవేలు ఎక్వయితై.. అంతేగా?’

‘ఏమో ఏందో వాళ్లింట్ల సిస్టం పెట్టుకుర్రంట.. వాళ్లు గూడ తినేది లేదంట...’

‘ఏమోలే.. వాళ్లిష్టం..’ అనుకుంట కుర్చీలకెళ్లి లేశిన.

నా ఎనకనే నడ్సుకుంట కిచెన్లకి వొచ్చింది. వాటర్‌ తాగి బెడ్రూంలకి వస్తుంటె నా ఎన్కనే బెడ్రూంలకి గూడ వొచ్చింది.

‘మనింటికాడ మూలమడ్త మీద డబ్బకొట్టు గొల్లాయిన ఉండెగా. సచ్చిపోయిండంట. కొడ్కుకి విడాకులైనంక మల్ల పెండ్లి జేశిర్రంట. అది గూడ కాటికూటిదే వొచ్చిందంట. రోజు పంచాతీలంట. ఏమైందో ఏమో గొల్లాయిన పెండ్లం గూడ సచ్చిపోయిందంట. మనింటి ఎదురుంగ రాణి వుండేదిగా.. నేను వొచ్చిన్నని తెల్సి మామయ్యింటికి వొచ్చింది. ఈ ముచ్చటంత జెప్పింది.” 

‘వాళ్ల ముచ్చట జెప్పలే?’

‘వాల్ల ఇల్లు గూడ అంత ఆగమాగమైందంట.. అమ్మనాన సచ్చిపొయ్యిండ్రంట. తమ్ముడు గూడ సచ్చిపొయ్యింర్రంట. ఆటో నడిపేటోడు. వూల్ల నేను ఏడ రోడ్డు మీద ఔపడ్డా.. ‘రా అత్తమ్మా’ ఇంటికాడ దించుత..’ అని ఎక్కిచ్చుకునేటోడు’

‘ఏమైందంట?’

‘కిడ్నీలు కరాబైనయంట’..

బ్యాగులో  పుస్తకాలు సర్దుకుంట ఉన్న నేను. నిలబడుడు కష్టమైనట్టు మంచం మీద కూసుంది. 

‘నేను  వూల్లెకొచ్చిన్నని ఎంతమంది వచ్చిర్రు. వాడకట్టుల వున్నొల్లంత వొచ్చిర్రు.’

‘ఇంకేంది... నీకు పండగే..’

‘ఏం పండ్గ నా మొకం! అందరు ఏదో ఒకటి జెప్పి ఏడ్సుడే. మనకు పాలు పోసే ముత్సాసామె వొచ్చొంది. ఒక కొడుకు ఏదో దేశంల వుండంట... ఇంకోడు హైద్రబాద్ల వుండంట. ఒకలితోటి మాటలే లేవంట.. కట్టె లెక్క ఉన్నది..’

‘లోకమంత అట్లనే ఉన్నది’

‘బిచ్చమయ్య, బిచ్చమయ్య పెండ్లం ఇద్దరు సచ్చిపొయ్యిర్రట..’

‘ఆరెంపీ చేసోటోడు?’

‘ఔను... ఒక్క మార్కండేయ వాళ్లు జర మంచిగున్నరంట. కొడుక్కి ఒక కొడ్కు, ఒక బిడ్డ. ఇంటి పట్టున్నే వుంటడంట. ఎల్‌ఐసీ చేస్తడంట” మన పక్కింటి అన్సూయ వొచ్చి నన్ను పట్టుకొని ఒక్కటే ఏడ్సుడు..’

‘ఏందంట?’ బ్యాగ్‌ బుజం మీద ఏస్కుంట అన్న.

‘ఏం బాగలేదక్కా.. మీరు పోయిన కానించి. పోయినోల్లు వూరిడ్సిపొయ్యిర్రు. పోనోల్లు ఒక్కొక్కలు పానాలు ఇడుస్తుర్రు అనుకుంట బాధ పడ్డది’

‘సరే.. నేనొస్త.. నాకు లేటైతది’

‘నా ఎన్కనే డోర్‌ దాక వొచ్చింది.

‘మర్సిపోయిన. అన్సూయ నువు రాసిన పుస్తకం యాజ్జేసిందిరా.. బిడ్డ వొచ్చినప్పుడల్ల సదివిచ్చుకుంటదంట’

‘పర్వలేదు’ అనుకుంట గేటు కాడికి నడ్సిన.. ఎన్కంగ అమ్మ గేటు దాక వొచ్చింది. పట్నంల ఎప్పుడూ ఒక్కతి నాల్గు గోడల మజ్జెన టీవీ జూస్కుంట వుండేది. ఏం ముచ్చట వుంటది? చేతనైతె కూసొనుడు, లేకుంటే మంచం మీద ఒరుగుడు. వూరికి పోయి వొస్తస్త, వూరు మొసుకొచ్చినట్టుంది. ముచ్చట వొడుస్తలేదు.

‘వొస్త’ అన్న నేను గేటు బేడం పెట్టుకుంట.

గేటు అవతలికెల్లే నన్ను చూసుకుంట అన్నది ‘గడ్డం చేపిచ్చుకోక పోయినవు?.. తెల్ల ఎంటికలొచ్చినంక ఇకారంగుంటది.. మీ నాయిన రోజు చేసుకునేటోడుగా..!’

చాన రోజుల తర్వాత అమ్మ మాటలకి పెద్ముల మీద నవ్వొచ్చింది.

మోహన్‌ రుషి, సెల్‌ : 96768 93149


logo