మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Mar 14, 2020 , 23:28:07

మత సామరస్యానికి ప్రతీక బిజిగిరి షరీఫ్‌ దర్గా

మత సామరస్యానికి ప్రతీక  బిజిగిరి షరీఫ్‌ దర్గా

మత సామరస్యానికి ప్రతీక అక్కడి దర్గా. కుల, మత, తారతమ్యాలు లేకుండా...అన్నీ వర్గాల ప్రజలు దర్గాను దర్శించడం దాని ప్రత్యేకత. మానవత్వమే మతమనీ...దేవుడి దృష్టిలో అంతా సమానులేనని చాటుతూ..ప్రత్యే విశిష్టతకు నిలయంగా నిలుస్తున్నది బిజిగిరి షరీఫ్‌లోని హాజరత్‌ సయ్యద్‌ ఇంకుషావళీ రహ్మతుల్లాహ అలై దర్గా. శతబ్దాల క్రితం నిర్మించిన ఈ దర్గాలో భక్తులు తమ మొక్కల కోసం తెలంగాణ రాష్ట్రం నుండే కాక మహరాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రల నుండి సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో ఈ దర్గా మతసామరస్యంతో వెల్లివిరుస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పవిత్రమైన, ప్రముఖమైన ఈ దర్గా కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోబిజిగిరి షరీఫ్‌ గ్రామంలో ఉంది. కరీంనగర్‌కు తూర్పున 62 కిలోమీటర్ల దూరంలో, హుజురాబాద్‌ నుండి 22 కిలోమిటర్లు ఉంటుంది.11 వ శతాబ్దంలో నిర్మితమైన ఈ దర్గా పరిసరాల్లో అత్యధికంగా కొండలు ఉన్నాయి. దర్గాకు నాలుగు వైపుల నాలుగు అందమైన ద్వారాలున్నాయి. ఇస్లాంతో పాటు అల్లాహ్‌ సందేశాన్ని, దివ్య ఖురాన్‌లోని సూక్తులను ప్రజలకు తెలియజేస్తూ ..మధ్యయుగ కాలంలో అరబ్‌ దేశం నుండి వలస వచ్చిన ముస్లీం సోదరులు ఇంకుషావళి, అజ్మత్‌షావళి ఇక్కడ స్ధిరపడ్డారు. వారు తమ జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు, బాధితుల పట్ల చూపిన కరుణ..దయ..ఎందరో ప్రజల జీవితాల్లో సుఖ, సంతోషాలను నింపాయి. ఆ ఇద్దరి మరణానంతరం వారి సమాధులు ఇక్కడే నిర్మించారు. ఇంకుషావళి వర్ధంతిని పురస్కరించుకోని ప్రతి ఏడాది జిల్‌హజ్‌ మాసంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. దీంతో ఈ ప్రాంతానికి బిజిగిరిషరీఫ్‌ అనే పేరు వచ్చింది. ఈ దర్గాను దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం ఏర్పడింది. ముస్లింల పవిత్ర పర్వదినం అయిన బక్రీద్‌ పండగ సందర్భంగా ఇక్కడ సందల్‌ (గంధలేపనం)ను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం భక్తితో ‘కందూర్‌' చేస్తారు. ఈ దర్గాకు ఎనిమిది శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు చెబుతారు.


ఉర్సు ఉత్సవాలు...

ముస్లింల పవిత్ర పర్వదినమైన బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈ దర్గాలో వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. దర్గాలో తమ ప్రార్థనలు అర్పించడానికి దూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఈ దర్గాను దర్శించే వారిలో ముస్లింలతో పాటు హిందువులు సైతం అధికంగా ఉండడంతో ఈ దర్గా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది. భక్తులు తమ కోరికలు తీరడానికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి  మొక్కులు తీర్చుకుంటారు. ఉర్సువేడుకల్లో వివిధ రాష్ర్టాలు, సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారికోసం అవసరమైన నిత్యావసరాల కోసం వివిధ దుకాణాల సమూదాయాలు వెలుస్తాయి. ఉర్సు సందర్భంగా దర్గాకు ఇరువైపుల ఏర్పాటు చేసే కొవ్వొత్తులు, విద్యుత్తు లైట్ల వెలుతుర్లలో పరిసరాలు ప్రకాశిస్తాయి. ఉర్సులో భాగంగా నిర్వహించే గంధం, ఖవ్వాలీ లాంటి కార్యక్రమాలు భక్తులను అలరిస్తాయి. దర్గా పైన పెద్ద గోపురం అద్భుత ఆకర్షణగా నిలుస్తున్నది.వివిధ రకాల రుగ్మతలతో బాధపడే వారిని, ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్బిణీలను  ఇక్కడికి తీసుకువచ్చి తాయత్తులు కట్టిస్తుంటారు.    

ఇలా చేరుకోవచ్చు

దర్గాను చేరుకోవడానికి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. సికింద్రాబాద్‌ నుంచి జమ్మికుంట దాటిన తర్వాత బిజిగిరి షరీఫ్‌ గ్రామం వస్తుంది.అక్కడి రైల్వే స్టేషన్‌లో దిగి దర్గాను చేరుకోవచ్చు. బస్సులో వచ్చేవారు కరీంనగర్‌ నుండి హుజురాబాద్‌ మీదుగా జమ్మికుంట చేరుకుని అక్కడి నుండి బస్సులు, ఆటోల ద్వారా బిజిగిరి చేరుకోవచ్చు.


 సమాధుల వివరాలు..

దర్గాలో ఇంకుషావళితో పాటు ఆయన సోదరుడు అజ్మత్‌షావళి సమాధి, ఆయన కుమారులు ముర్తాజాషావళి, అక్బర్‌షావళిల సమాధులు ఉన్నాయి. పవిత్ర సాధువైన ఇంకుషావళి భార్య హజ్రత్‌ సయ్యద్‌ అఫ్జల్‌ బి సమాధి ప్రధాన దర్గాకు చాలా దగ్గరలో ఉంది. ఈ ప్రదేశం ప్రశాంతమైన వాతావరణం, అందమైన ప్రకృతి చెంతన ఉండడం వల్ల ఆధ్యాత్మిక, స్వచ్ఛమైన ఆలోచనల పెరుగుదలకు దోహదపడుతుందని భక్తుల నమ్మకం. చుట్టూ కొండలతో నాలుగు వైపుల నాలుగు ప్రధాన ద్వారాలతో ఉన్న ఈ దర్గాలో వేలాది భక్తులు విడిది చేసి ఉంటాయి.


-మహ్మద్‌ మన్నాన్‌ కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌


logo