శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Mar 14, 2020 , 23:29:30

అంతా రెడీమేడ్‌!

అంతా రెడీమేడ్‌!

ఆరుగజాల చీరను.. అందంగా కట్టడమంటే పెద్ద ప్రహసనమే.. కానీ దాన్ని కూడా ఒక డ్రెస్‌లా వేసేస్తే.. అబ్బా.. ఎంత శ్రమ, సమయం ఆదా అయిందనుకుంటున్నారు కదా! చక్కనమ్మా.. ఏది కట్టినా అందమే అన్నట్లు.. రెడీ టు వేర్‌ చీరలు ఇప్పుడు ఎక్కువయ్యాయి.. సెలెబ్రిటీలు మొదలు పెట్టిన ఈ ట్రెండ్‌ని.. ఇప్పుడు కాలేజ్‌ అమ్మాయిల నుంచి మురిసిపోయే ముదితల వరకూ.. ఫాలో.. ఫాలోయూ.. అంటూ పాడేస్తున్నారు.. దీంతోపాటు.. రెడీమేడ్‌ బ్లౌజ్‌ల హవా కూడా అంతాఇంతా లేదు.. 

‘జతకలిసే.. జతకలిసే..’ అంటూ చీర, జాకెట్టు పల్లవి పాడుతూ.. అమ్మాయిల మనసులను కొల్లగొడుతున్నాయి.. ఆ ట్రెండ్‌  గురించే ఈ జంటకమ్మ..  

-సౌమ్య నాగపురి


‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. కానీ ఈతరం అమ్మాయిలు ‘చీర కట్టి చూడు.. డిజైనర్‌ బ్లౌజ్‌ కుట్టించి చూడు’ అంటున్నారు. ఎందుకంటే చీర ఎంచుకోవడం, దానికి తగిన డిజైనర్‌ బ్లౌజ్‌ని వేల రూపాయలు పోసి కుట్టించడం ఇప్పుడు నడుస్తున్న, అమ్మాయిలు నడిపిస్తున్న ట్రెండ్‌. అందుకే వీధికొక బొటిక్‌ నిర్విరామంగా నడుస్తున్నది. ఈ విషయం పక్కన పెడితే.. కాలేజ్‌ అమ్మాయిలు అయినా, ఆఫీసుకు వెళ్లే పడుచులైనా.. ఏదో అకేషన్‌ వస్తే తప్ప చీర చుట్టడం లేదు. పండుగకో.. పబ్బానికో అమ్మాయిలను చీరలో చూడాలని కోరుకునే వాళ్లకు కొన్నిసార్లు ఆశాభంగమే కలుగుతుంది. 


సొగసరి కుచ్చిళ్లు.. 

ప్రణవి ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లాలి. సాయంత్రం వరకు ఉండాలి. కాబట్టి జీన్స్‌, టాప్‌ లేదా చుడీదార్‌కి ఓటేస్తుంది. దీనికి కారణం ఏంటంటే చీర కట్టుకోవాలంటే పట్టే సమయం కేటాయించలేకపోవడం ఒక కారణం అనొచ్చు. అంతకుమించి ఆ చీరను కదలకుండా ఎక్కడిక్కడికి పిన్స్‌ పెట్టినా.. చీర ఎక్కడ జరిపోతుందోనన్న భయం మరో వైపు వెంటాడుతుంది. అందుకే చీర అనే ఒక వస్ర్తాన్ని కేవలం పండుగలకే పరిమితం చేసింది. ప్రణవిలాంటి అమ్మాయి కథ వింటుంటే అది అచ్చు మీ కథలాగే అనిపిస్తున్నది కదా! ఇలాంటి వ్యయప్రయాసలను ఎదుర్కొనే ప్రతీ అమ్మాయి కథే అనొచ్చు. మనసులో చీర కట్టాలని ఉన్నా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న అందరి వ్యథ కూడా. ఈ బాధను తీర్చేందుకు వచ్చిందే రెడీ టు వేర్‌ చీర. కుచ్చిళ్లు అందంగా పిన్‌ పెట్టి ఉంటాయి. వాటిని దోపితే చాలు. బ్లౌజ్‌కి పల్లూ పిన్‌ పెట్టేసుకుంటే చీరను కట్టుకున్నట్టేనన్నమాట. 


అక్కడి నుంచే.. 

చీరంటే ఒకేలా కట్టేయడమేనా? అని అనుకున్నారేమో.. రకరకల పద్ధతులు వచ్చాయి. చీరకట్టు పలురకాలు అయిపోయింది. అందుకే కుచ్చిళ్లు లేకుండా కడితే అది చీరకట్టు కదా? ఈ అనుమానం మీకు వచ్చింది కదా! ఫ్యాషనిస్టులు దీనికొక ఉపాయాన్ని ఆలోచించారు. ఈ రెడీ టు చీర కట్టుకు మూలం ఎక్కడి నుంచో తెలుసా? శాస్త్రీయ నృత్యానికి వేసే చీరకట్టును ఆ తర్వాత డ్రెస్‌లా కుట్టి వేసుకోవడం ప్రారంభించారు. ఆ పద్ధతిని మామూలు చీరకట్టుకు అన్వయిస్తే పోతుందని అనిపించిందో డిజైనర్‌కి. అలా ఈ రెడీ టు వేర్‌ చీర పుట్టకొచ్చిందట. అయితే మనవాళ్లు అక్కడితో ఆగిపోలేదు. దీనికి మరిన్ని మెరుగులద్దాలనుకున్నారు. షిఫాన్‌ చీరలయితే పొందికగా ఉంటాయని ఎక్కువగా ఆ చీరలను ఎంచుకొని ఈ రెడీ టు వేర్‌ చీరలకు శ్రీకారం చుట్టారు. 


అలాగే ఎందుకని..

చీర కట్టడం ఒక కళ. దాన్ని ఇప్పటి తరం ఓర్పుగా నేర్చుకొనేంత సమయం ఉండడం లేదు. ఆ కళను ముందుకు తీసుకెళ్లాలని ఉన్నా బిజీ లైఫ్‌ అందుకు సహకరించడం లేదు. అందుకే దాన్ని కూడా రెడీ టు కుక్‌ మాదిరి.. రెడీ టు వేర్‌ చేశారు ఫ్యాషనిస్టులు. పెద్ద పెద్ద పేరున్న చీరల కంపెనీలు సైతం ఇలాంటి చీరలను ఎక్కువగా తయారు చేయడానికి మొగ్గుచూపుతున్నాయంటే వీటి డిమాం డ్‌ చెప్పకనే చెప్చొచ్చు. అయితే ఒకే రకంగా ఈ చీర వేసుకునేలా ఎందుకు ఉండాలనుకున్నారేమో.. దీంట్లో కూడా వివిధ ప్యాటర్న్‌లను తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా లంగా-ఓణీ, ధోతీ మాదిరి కట్టుతో ఉన్న చీరలకు డిమాండ్‌ ఉంది. ఇవికాకుండా ఈ మధ్య రఫెల్‌ చీరలకు కూడా డిమాండ్‌ పెరిగిందండోయ్‌! సెలెబ్రిటీలు సైతం ఈ చీరలకు దాసోహం అంటున్నారు. 


జత కలిసే.. 

సింపుల్‌గా ఉండాలంటే సిల్క్‌ చీరలు కట్టలేం. కానీ వాటికి కూడా ఇమిటేషన్‌ వచ్చాయి. ఆ మెటీరియల్స్‌ ఇప్పుడు మార్కెట్‌ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. పార్టీవేర్‌లకు ఈ చీరలు మరింత సూపర్‌గా ఉంటున్నాయి. పైగా మధ్యతరగతి మహిళలకు ధరలు కూడా అందుబాటులో ఉండటం ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే.. ఈ చీరలు కట్టుకోవాలంటే శారీ పెట్టీకోట్‌ వేసుకోవాలి. ఈ సమయం కూడా ఎందుకనుకున్నారో ఏమో.. పెన్సిల్‌ కట్‌ వచ్చిన ప్యాంట్‌లతో చీరలను జతచేశారు. లెహంగాలకు చీరను మ్యాచ్‌ చేశారు. ఇలా చీర కట్టును పూర్తిగా మార్చేయడంతో అందరికీ సులువుగా చీర కట్టుకోవాలనిపించేలా మారింది. ఎక్కువ డిజైన్లు ఉన్న చీరల కంటే.. ప్లెయిన్‌ చీరలనే ఈ రెడీ టు వేర్‌ చీరలుగా ఎంచుకోవడం, వాటినే డిజైనర్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. కాకపోతే వీటికి బ్లౌజ్‌లను మాత్రం కాస్త గ్రాండ్‌ ైస్టెల్‌లో కుట్టించేస్తే సరిపోతుందంటున్నారు ఫ్యాషన్‌ పండితులు. 


మ్యాచింగ్‌గా ఉండేలా.. 

ఒకప్పుడు చీరకు తగ్గట్లు బ్లౌజ్‌ కుట్టించాలనేవాళ్లు. ఆ తర్వాత మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ అన్నారు. ఇప్పుడు కాంట్రాస్ట్‌ బ్లౌజ్‌ల హవా నడుస్తున్నది. వీటిని కూడా హెవీగా వర్క్‌ చేయించాలని ఊవిళ్లూరుతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కాకపోతే దీనికి పట్టే సమయం ఎక్కువగా ఉంటుంది. అలాకాకుండా ఇప్పుడు రెడీమేడ్‌ బ్లౌజ్‌లు కూడా వచ్చేశాయి. మామూలు బ్లౌజ్‌ నుంచి హెవీ వర్క్‌ వచ్చిన డిజైన్ల వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ చీరను తీసుకెళ్లి.. మీరు మ్యాచింగ్‌ అనుకుంటారో లేక కాంట్రాస్ట్‌ అనేది మీరు ఎంచుకోవడంలోనే ఉంటుంది. ధరలు కూడా మామూలు స్థాయి నుంచి లక్షల్లో సైతం ఉండటం ఇక్కడ కొసమెరుపు. 


logo