గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Mar 15, 2020 , T00:35

ఆమె ఇల్లే ఓ బేకరీ

ఆమె ఇల్లే ఓ బేకరీ

బర్త్‌ డే, మ్యారేజ్‌ డే, వాలెంటైన్స్‌ డే, కొత్త సంవత్సరం.. ఇలా సందర్భమేదైనా కేకులు కోస్తాం. పండుగ చేస్తాం. మరి ఆ కేకులు మనమే తయారు చేసుకుంటే? డబ్బు, సమయం ఆదా అవుతుంది. మనసుకు నప్పేలా కేకులు తయారు చేసి విక్రయిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన జయభార్గవి. అంతేకాదు ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తా అని కూడా చెబుతున్నారు. కారు, బస్సు, సైకిల్‌, ఇలా ఏ ఆకృతిలో కావాలంటే ఆ ఆకృతిలో.. కాన్సెప్ట్‌ చెప్తే చాలు కేకు తయారు చేసి ఇస్తున్నారు.

జయభార్గవి గృహిణి. ఆమె భర్త చైతన్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రతి ఏడాది ఇంట్లో పుట్టినరోజులు, పెండ్లి రోజులు ఇలా నాలుగైదు అకేషన్లు వస్తుండేవి. ప్రతి అకేషన్‌కు బేకరీకి వెళ్లి కేకు ఆర్డర్‌ ఇచ్చేవారు. డబ్బులు పోయినప్పటికీ నాణ్యమైన కేకు మాత్రం దొరక్కపోయేది. తెచ్చిన కేకు కనీసం ఒక్కరోజు కూడా నిల్వ ఉండకపోయేది. పైగా బయటి కేకులు తింటే జలుబు, జ్వరం వచ్చేవి. ఈ విషయమై జయభార్గవి ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఇంట్లో కేక్‌ను వాడొద్దని నిర్ణయించుకున్నారు. కానీ కేక్‌ వాడకుండా ఉండలేకపోయారు. ప్రత్యామ్నాయంగా తామే కేక్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. చైతన్య పూణేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో జయభార్గవి ఇంటివద్దే ఖాళీగా ఉండేవారు. వీరుండే వీధిలో కొందరు మహిళలు కేకులు తయారు చేస్తుండేవారు. వారితో జయభార్గవి పరిచయం పెంచుకున్నారు. కొద్ది రోజులు కేకుల తయారీని దగ్గర్నుంచి పరిశీలించారామె. రోజూ ఇంట్లో సాధన చేసేవారు. అలా ఏడాదిపాటు జయభార్గవి ఇంటి దగ్గరే కేకుల తయారీపై సాధన చేశారు. 

నేర్చుకున్న పనితోనే ఉపాధి

చైతన్యకు హైదరాబాద్‌ బదిలీ అయ్యింది. నిజాంపేటలో నివాసం. అప్పటికే కేకుల తయారీలో ప్రావీణ్యం సాధించిన జయభార్గవి మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తాను పూణేలో ఎదుర్కొన్న సమస్య హైదరాబాద్‌లో ఎంతోమంది గృహిణులు ఎదుర్కోవడం ఆమె గమనించారు. స్థానికంగా ఉండే 10 మంది మహిళలకు కేకుల తయారీలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మౌత్‌ పబ్లిసిటీ ద్వారా కేకుల తయారీలో శిక్షణ కావాలని జయభార్గవిని చాలామంది సంప్రదించారు. తనకున్న కళతో ఉపాధి పొందాలని ఆమె నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ కేకుల తయారీలో శిక్షణ ఇచ్చేవారు. అపార్టుమెంట్లు, మహిళా సమాఖ్యలు, మహిళా సంఘాల్లో కేకుల తయారీపై జయభార్గవి శిక్షణ ఇచ్చారు. అలా 2017 మే నుంచి ఇప్పటి వరకుదాదాపు 600 మంది మహిళలకు కేకుల తయారీలో శిక్షణ ఇచ్చారు. ఆమె దగ్గర కేకులు తయారు చేయడం నేర్చుకున్న ఎంతోమంది మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. శిక్షణ గురించి సోషల్‌ మీడియా  ద్వారా తెలుసుకొని ఉపాధి పొందాలని హైదరాబాద్‌కు వచ్చింది ఓ దివ్యాంగురాలు. ఆమె పేరే వాణి. ఆమెది యానాం. జయభార్గవి ఇంట్లోనే ఉంటూ వారం రోజుల్లో కేకుల తయారీపై పూర్తి శిక్షణ పొందింది. ప్రస్తుతం యానాంలో కూర్చున్నదగ్గరే కేకులు తయారు చేస్తూ విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నది.


చేతనైన సేవ..

జయభార్గవి తనకు తోచినంతలో సేవ కూడా చేస్తున్నది. అనాథాశ్రమాల్లోని పిల్లలు బర్త్‌ డేలు జరుపుకుంటే వారికి ఉచితంగా కేకులు అందిస్తున్నది. 2017 నుంచి నగరంలోని 60 అనాథాశ్రమాల పిల్లలకు దాదాపు 1500 మందికి ఉచితంగా కేకులను తయారు చేసి ఇచ్చింది.

ఎన్నో రకాలు

చిరుధాన్యాలు, గోధుమపిండి, అరటిపండు, రాగి, ఆల్మండ్‌ ఫ్లోర్‌ కూల్‌, ఎగ్‌లెస్‌, బెల్లం, షుగర్‌ ఫ్రీ, డెయిరీ ఫ్రీ, గులాబ్‌జామూన్‌ కేక్‌, రసమలై కేక్‌, ఇలా వందరకాల కేకులు తయారు చేస్తున్నారు జయభార్గవి. చాక్లెట్స్‌, హోమ్‌ మేడ్‌, కప్‌ కేకులు, కుక్కీస్‌ వంటి రకాల్ని కూడా ఆర్డర్‌ మేరకు తయారు చేసి ఇస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ‘జయాస్‌ యమ్మీ కేక్స్‌' పేరుమీద ప్రచారం చేస్తున్నారు. ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ తీసుకుంటున్నారు. డోర్‌ డెలివరీ కూడా చేస్తున్నారు.

గృహిణులకు నేర్పించాలనే..

మధ్యతరగతి మహిళలకు శిక్షణ ఇవ్వడమే నా లక్ష్యం. మార్కెట్లో దొరికే కేకులు చాలా వరకు నాణ్యంగా ఉండవు. కానీ మేం నాణ్యమైనవి మాత్రమే తయారు చేస్తాం. ఎలా కావాలంటే అలా తయారు చేసిస్తాం. రూ. 250 నుంచి మా వద్ద కేకులు అందుబాటులో ఉన్నాయి. డోర్‌ డెలివరీ సౌకర్యం కూడా ఉన్నది. ఒక్క ఫోన్‌ చేస్తే చాలు ఇంటివద్దకే కేక్స్‌ తీసుకొచ్చి ఇస్తాం.

- జయభార్గవి, నిజాంపేట


మీరూ ఆర్డర్‌ చేయండి.. 

జయభార్గవి ఆర్టిస్ట్‌. ఏది చూసినా, ఏది చెప్పినా ఆ రూపాన్ని మదిలో పదిలపర్చుకొని బొమ్మ వేస్తారు. బొమ్మ వేయడమే కాదు. అదే మాదిరిగా కేక్‌ కూడా తయారు చేస్తారు. కారు, సైకిల్‌, దేశాల చిత్రపటాలు, టెడ్డీబేర్‌, సీతాకోక చిలుక, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, కప్‌ కేక్స్‌, సామాజింకాశాలు ప్రతిబింబించేలా కేకుల్ని తయారుచేస్తున్నారు. విభిన్న ఆకృతుల్లో కేకును తయారు చేయడం ఆమె ప్రత్యేకత. కేకులు కావాలన్నా.. కేక్‌ తయారీ నేర్చుకోవాలన్నా 91001 64818  నంబర్‌లో సంప్రదించవచ్చు.

పడమటింటి రవికుమార్‌


logo