గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Mar 15, 2020 , T00:15

వాస్తు

వాస్తు

ముహూర్తానికి ఇంటికి సంబంధం ఏమిటి? ప్రతిరోజూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము కదా! -ఏనుగు రవిశంకర్‌, పటాన్‌చెరువు

మనిషి జీవితం కాలంతోనే ముడిపడి ఉంది. అంతేకాదు పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు సృష్టిలో సర్వం కాలం తయారుచేసిన భౌతిక స్వరూపాలే. అది చిన్న రేణువు కావచ్చు ఒక ప్లానెట్‌ కావచ్చు. వస్తువునకైనా మనిషికైనా కాలమే ప్రమాణం. అప్పుడు పుట్టాడు. మొన్న పోయాడు. ఆయన కాలంలో నిర్మించారు. ఫలానా సంవత్సరం పూర్తి చేశారు. ఈ క్షణమే పగిలింది. ఇప్పుడే దానిని కొని తెస్తున్నారు. ఇలా మీరు దేనినైనా కాలంతోనే ముడి వేయాల్సి వస్తుంది  జీవితంలో సమస్తమంతా... ఈ దృశ్య జగత్తు అంతా కాలం గర్భం నుండి వచ్చిన బిందువులే కదా కాలాన్ని కాదని లేదని ఎలా నిలువగలం, గెలువగలం.

ఆ కోవలో గృహం కాలంతోనే ముడిపడి నిలబడుతుంది. ఇక ముహూర్తం అన్నది సృష్టిలోని ఒక అద్భుత సమయం. ఆ సమయం శోధించి గణించి మనకు సూచించినప్పుడు ఆ కాలంలో నిర్మాణ ముహూర్తం చేయడం అన్నది గొప్ప ఆంతరంగిక శక్తిని అందిస్తుంది. ఒక సెకండులో కాంతి ఒక లక్షా ఎనభైఆరువేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే క్షణ కాలానికి ఎంత కార్యశక్తి ఉన్నట్టు. ఇల్లు పంచభూతాలతో అంటే భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశాల సమ్మిళితంతో నిర్మిస్తాము. అవన్నీ కాలం గుప్పిట్లో ఉన్నవి కాబట్టి కాలం మహాశక్తిమంతమైంది. దాని పరిణామాల ప్రభావాలు ఊహకు అందనివి. స్థలభావం వల్ల ఇక్కడ వివరించలేము కానీ కాలమే అధినేత కాలమే విధాతగా ఈ సకల బ్రహ్మాండాలను గుప్పిట్లో పెట్టుకొని నడుపుతుంది. ఆ కాలంలోని పాజిటివ్‌ క్షణాలు సంవత్సరంలో సుమారు వేయి ముహూర్తాలు తీసి ఆయా కార్యకలాపాలకు నిర్ణయిస్తారు. కాబట్టే అందరూ కాలంలోనే పుట్టినా ఎవరి వైభవం ఎవరి విషాదం వారిదే. వారివారి కర్మ (కార్యాల) ఫలమే. అందుకే గృహానికి ముహూర్తం అత్యంత ప్రధానం కట్టడానికి, చేరడానికికూడా క్షణం ముందు కదిలి పోయాక వెనుక బోగి దాటాక బ్రిడ్జి కూలుతుంది. ఇదంతా కాక తాళాయం అనుకుంటాం మనం కానీ ఆ విశ్వాత్మకు తెలుసు ఎప్పుడు ఏది కదిలిపోవాలో మిగిలిపోవాలో. అందుకే మన పెద్దలు తల్లులు శివుడి ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదురా అంటారు. కాబట్టి మనకోసం మన మంచికోసం చెప్పిన వాటిని పాటించడం అవసరం. ముందు తరాలను పాడుచేయాలనే దృష్టి మన పెద్దలకు ఎప్పుడూ ఉండదు కదా. చెప్పండి.


మా స్థలం నాలుగు మూలలకు నాలుగు రకాల కొలతలు ఉన్నాయి. దేనినిబట్టి ఇల్లు కట్టాలి? -కె. సుందరయ్య, శ్రీరామ్‌సాగర్‌

కొన్న ప్రతి స్థలం నలుచదరంగా బిస్కట్‌ లాగా ఎప్పుడూ ఉండదు. దానిని చక్కగా మలుచుకోవాల్సిందే. స్థలాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలోనే మహిమ అంతా దాగుంది. జాగను దిశానుకూలంగా నిర్ణయించి తీసుకున్నాక దాని కొలతలు చూసుకొని, అందులో దక్షిణం కొలత ప్రధానంగా ఎంచుకోవచ్చు. అంటే ఏ భాగం తక్కువగా ఉందో దానిని ప్రమాణంగా తీసుకోవాలి. ఎక్కువ భాగాలను వదిలివేయాలి. వీధి ఉత్తరం, తూర్పు ఉంటే దిశలల్లో పెరిగిన స్థలాన్ని అలాగే వదిలి ప్రహరీని సెట్‌ చేసుకోవచ్చు. ఇక చిన్న కొలత పడమర, దక్షిణం అయినా దానిని అనుసరించి ఒక చతురస్రాన్ని తీసుకొని దానిలో కాంపౌండు, గృహం ప్లాను చేసుకోవాలి. మిగతా భాగం దిశానుకూలంగా కలుపుకొని ఇల్లు కట్టుకోవాలి.


ఒక ఫ్లోరంతా స్లాబ్‌ వేసుకొని దానిలో ఒక్క గది మాత్రమే కట్టుకోవచ్చా? -జోగుల చైత్ర, ఆలేరు

చాలామంది ఇల్లు కిందకట్టుకొని ముందు ముందు అవసరాల నిమిత్తం ఒకేసారి పైన స్లాబు కూడా అదనంగా వేసుకుంటారు. అది ప్రస్తుతానికి అంతగా అవసరం పడకపోవచ్చు. కానీ దానిని ఖాళీగా వదలడం మంచిదా కాదా అని అనుమానపడుతూ ఉంటారు. ఏదైనా అవసరం మేరకే నిర్మాణం చేయాలి. వాడినా వాడకపోయినా దానిని మెయిన్‌టెన్‌ చేయాలి. ఇంటిని సగంకట్టి ఆపడం చేయవద్దు. అలాగే పైన స్లాబ్‌ వేసుకున్న దానిని పూర్తిగా రేలింగ్‌తో సహా చక్కగా ఫినిష్‌ చేయాలి. స్టీలు బయటకు వదిలి పూర్తి చేయకుండా వదలకూడదు. పగిలిన అద్దంలా ఇంటి స్లాబ్‌ను మిగుల్చుకోవద్దు. మెట్లు రేలింగ్‌ అన్నీ పూర్తిచేసి దానికింద ఒక్కరూము అయినా వేసుకోవచ్చు. వీలునుబట్టి మరికొన్ని రూములు కూడా పెంచుకోవచ్చు. 


పాత ఇల్లు తీయకుండా దానిచుట్టూ పిల్లర్స్‌ వేసి స్లాబ్‌ వేసుకోవచ్చా? - సిరికొండ వెంకటేష్‌, వెలిదండ, జనగాం

వాస్తవానికి పాత ఇల్లును పూర్తిగా తీయటమే శుభకరం. ఎంతగా ప్లాన్‌ చేసినా ఎంత జాగ్రత్త తీసుకున్నా పాత కట్టడం కొత్త కట్టడం కలువలేవు. అలా చేయడం కరక్ట్‌ కాదు. వాటి ఆయుష్షులు పోతాయి. ప్రతి నిర్మాణానికి ఒక ఏజ్‌ ఉంటుంది. మనం ఇంటి గోడలు తప్పించుకోవడం గూర్చి స్లాబును చుట్టూ పిల్లర్స్‌ వేసినంత మాత్రాన పూర్తిగా శాస్త్ర సమ్మతంగా ఇల్లు కుదురదు.  కాస్త కష్టమైనా ఖర్చుఅయినా సమయం తీసుకొని అయినా పాత ఇంటిని తొలగించే కట్టుకోండి. మంచి గృహం పిల్లలకు ఇచ్చిన వాళ్లం అవుతాం. ఇల్లు నిర్మాణం అత్తర బుత్తర, అడ్జెస్టు చేసుకునే విధానం మంచిదికాదు. లేదంటే ఉన్నదానినే సరిచేసుకొని ఉండటం మంచిది. పనికిరాకపోతే మరొక ఇంటికి కిరాయికి వెళ్లి పరిస్థితులు కుదిరాక మంచి ఇల్లు కట్టుకోండి.


logo