బుధవారం 03 జూన్ 2020
Sunday - Mar 08, 2020 , 00:47:58

షీరోస్‌

షీరోస్‌

రాసినట్టి తలరాతో.. చేసినట్టి కట్టుబాటో...పుట్టడమే ఒక నేరం పుట్టినంక బతుకు నరకం పెరగడమే తారతమ్యం పెరిగినంక వరకట్నం అసలు ఆడజన్మే ఒకశాపం...అంటూ ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే శోకాలు పెట్టుకు ఏడ్చేవారు. ఆడపిల్లంటే అబల, కోమలి, సుకుమారి అంటూ తక్కువ చేసేవారు. కట్టుబాటు గేట్లు పెట్టి కథలల్లి కీర్తించేవారు. వంట ఇంటిపాలు చేసి స్త్రీని బంధిచేసేవారు. కానీ కాలం మారింది. మారుతున్న కాలానికి తోడు సమాజమూ మారింది. ఆధునిక సమాజంలో ఆడమగ అని తేడా లేకుండా ఆడవారు మగవారికి ఏమాత్రం తీసిపోక అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. విద్య, వైద్యం, సినిమా, క్రీడలు ఇలా ఒక్కటని కాదు ఏ రంగంలో చూసినా సగటు మహిళ తన సత్తా చాటుతున్నది. గడచిన ఏడాది కాలంలో మహిళాలోకం సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. చెప్తే వారి ఓర్పంతా....రాస్తే వారి సహనమంతా...ఇంకా చెప్పాలంటే వారి తెగువంతా...అంతర్జ్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కాలంలో వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనపరిచిన మహిళామణుల పరిచయమే ఈ వారం కవర్‌స్టోరీ.

సమానత్వం అనేది అన్ని రంగాల్లోనూ ప్రస్ఫుటించాలి. అప్పుడే ఆడ,మగ సమానమనే సమాజం ఆవిష్కృతమవుతుంది. నేడు ఏ రంగాన్ని తీసుకున్నా పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా మహిళాశక్తి ఎదిగింది. గతంలో పరదా చాటున  సిగ్గుతో తల వంచుకుని సమాధానం చెప్పే స్ధాయి నుంచి నేడు గడపదాటి ఉద్యోగం చేసే స్థాయికి మహిళలు చేరుకున్నారు. వరకట్నం, గృహహింసలతో పురుషాధిక్య సమాజంలో ఎన్నో మానసిక, శారీరక చిత్రహింసలకు గురైన అబల నేడు సివంగిలా బరిదూకి నిలబడుతున్నది. వంట ఇంటికే పరిమితమై గొడ్డు చాకిరీ చేసిన చేతులే నేడు కంప్యూటర్‌ కీబోర్డును టపటపలాడిస్తున్నాయి. అనేక ఏండ్లుగా ద్వితీయశ్రేణి పౌరురాలిగా నిలిచిపోయిన మహిళలు నేడు ఆ అసమానతలను సమూలంగా చెరిపేసి తమను తాము ఆవిష్కరించుకునే  ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో కొంతమంది పరిచయమిది.   


మిలిటరీ దౌత్యవేత్త అంజలీ సింగ్‌ 

 విదేశాల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి మహిళా మిలిటరీ దౌత్యవేత్తగా, వింగ్‌ కమాండర్‌గా అంజలీ సింగ్‌  గుర్తింపు పొందారు. రష్యాలోని భారత దౌత్య కార్యాలయంలో వాయుదళ ఉప సహాయాధికారిగా 2019 సెప్టెంబర్‌లో పదవి చేపట్టి ఈ ఘనతను సాధించారు. బిహార్‌కు చెందిన అంజలి మిగ్‌-29 విమానం పైలట్‌గా శిక్షణ తీసుకున్నారు.17ఏళ్ల పాటు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో విధులు నిర్వర్తించారు.  తొలి లీడ్‌ కమాండర్‌ భావన కస్తూరి

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో144 మంది ఇండియన్‌ ఆర్మీ పురుషుల దళాన్ని లీడ్‌ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు హైదరాబాద్‌ కు చెందిన భావన కస్తూరి.  71 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో పురుషుల సైనిక దళానికి మహిళ నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి. 26 ఏండ్ల భావన.. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. క్లాసికల్‌ డ్యాన్స్‌లో డిప్లొమా చేశారు. భారత సైన్యంలో సర్వీస్‌ క్రాప్స్‌లో లెఫ్టినెంట్‌ ర్యాంకులో ఉన్న భావన.. తనకు ఈ అవకాశం దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.   
అంధ మహిళా ఐఏఎస్‌

దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా ప్రాంజల్‌ పాటిల్‌ చరిత్ర సృష్టించారు. కేరళలోని తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్రలోని ఉల్హాసనగర్‌కు చెందిన ప్రాంజల్‌ ఆరేళ్ల వయసులోనే చూపును కోల్పోయారు. 2016లో భారత రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఏఎస్‌)లో ఉద్యోగం వచ్చినా అంధురాలని తిరస్కరించారు. పట్టు వదలని ప్రాంజల్‌ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌గా ఎంపికై , ఎర్నాకులం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సబ్‌ కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయురాలు ఆశారాణి

హైదరాబాద్‌ శివారు జీడిమెట్ల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూలుకు చెందిన  ఇంగ్లీష్‌ టీచర్‌ ఆశారాణి 2019 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయస్థాయి అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా  అందుకొన్నారు.ఆశారాణికి ఉపాధ్యాయినిగా ఇరవై ఐదేండ్ల అనుభవం ఉంది. పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా పదిహేడేళ్లు టీచర్లకు ట్రైనింగ్‌ఇచ్చారామె. 1997లో ఢిల్లీలోని సీసీఆర్టీలో తోలు బొమ్మలతో పాఠాలు చెప్పడంలో శిక్షణ పొందిన ఆశారాణి ప్రైమరీ స్కూలు పిల్లలకు  ఆకట్టుకునే విధంగా పాఠాలు చెప్పడంలో దిట్ట .  


క్రికెట్‌లో అరుంధతి రెడ్డి

హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతిరెడ్డి క్రికెట్‌లో అద్భుతమైన ఘనత సాధించింది. విమెన్‌ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికై శెభాష్‌ అన్పించుకుందినేరేడ్‌మెట్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన అరుంధతీరెడ్డి. గత  నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన విమెన్స్‌ మెగా ఈవెంట్‌ టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించింది.  పదేండ్ల వయసులోనే సోదరుడు రోహిత్‌రెడ్డితో కలిసి గల్లీలో క్రికెట్‌ ఆడిన ఆమె ఆట తీరు క్రీడాభిమానుల చేత ఔరా అనిపించింది. తొలుత ఆర్మీలో చేరాలనుకున్న అరుంధతి క్రికెట్‌లో అంచలంచెలుగాఎదిగింది. చిన్నవయస్సులోనే భారత జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది. 20-20 లో ఫాస్ట్‌ బౌలర్‌గా, ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నది.  
మింటీ అగర్వాల్‌

పాకిస్థాన్‌ వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానం భారత భూభాగంలోకి వచ్చిన సమయంలోదాన్ని తరుముతూ వెళ్లిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ పాకిస్థాన్‌కు చిక్కిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌ విమానాలు భారత భూభాగంలోకి వచ్చాయన్న విషయాన్ని పైలట్లకు తెలియజేయడంలో మింటీ అగర్వాల్‌ నేతృత్వంలోని ‘సిగ్నల్‌ యూనిట్‌' జట్టు కీలకపాత్ర పోషించింది. ఇందుకుగాను మింటీ అగర్వాల్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ‘యుధ్‌ సేవా మెడల్‌' అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళగా మింటీ చరిత్ర సృష్టించారు. 
సంచలనం మన నిఖత్‌ జరీన్‌

నిజామాబాద్‌కు చెందిన నిఖత్‌ తన పంచ్‌ పవర్‌తో పతకాలు సాధించింది. గత ఏడాది బేలెగ్రేడ్‌ లో నిర్వహించిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో జరీన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.  అంతకుముందు ఒలంపిక్స్‌ లో 48 కేజీల విభాగంలో మేరీకోమ్‌ ప్రాతినిథ్యం వహించేది. నిఖత్‌ జరీన్‌ 51కిలోల కేటగిరీలో ఆడేది. అయితే.. టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగం ఎత్తివేయడంతో.. మేరీకోమ్‌ 51 కేజీల కేటగిరీకి మారింది. ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ కోసం నిఖత్‌ జరీన్‌, మేరీ కోమ్‌ తో ట్రయల్స్‌ నిర్వహించారు.  అయితే  మేరీకోమ్‌ చేతిలో  ఓడినా ఎనిమిదిసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీకోమ్‌ను సవాల్‌ చేసి నిఖత్‌ జరీన్‌ సంచలనం సృష్టించింది.
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

చారిత్రక ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఎట్టకేలకు పార్లమెంటు 2019 జూలైలో ఆమోదించింది.  దేశంలోని ముస్లిం మహిళలకు సంబంధించి ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు గురించి పార్లమెంటులో అనేక చర్చలు  జరిగాయి. ట్రిపుల్‌ తలాక్‌ని అడ్డం పెట్టుకుని ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇచ్చి అనేక పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ విషయాన్ని సభ్యసమాజంతోపాటు కోర్టులు కూడా తప్పు పట్టాయి. అదే క్రమంలో 2017లో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ట్రిపుల్‌ తలాక్‌ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన తీర్పును కూడా ఇచ్చింది. అయితే తీర్పు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలులోకి రాలేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది..అదేవిధంగా రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం ఇప్పుడు సంచలనమైంది. దేశంలో ఉన్న ముస్లిం మహిళలకు దేశ చరిత్రలోనే గొప్ప విజయమని ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు నుద్దేశించి అభివర్ణిస్తున్నారు.
శబరిమల ప్రవేశం

 కేరళలో శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు ప్రవేశించడం ద్వారా వారు చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు తొలిసారిగా శబరిమలను సందర్శించారు. అంతకు ముందు నెలలో వీరిద్దరూ శబరిమల సందర్శించడానికి రాగా, నిరసనలు వెలువెత్తడంతో వెనుదిరిగారు. ఆ తర్వాత అర్ధరాత్రి నుండి మహిళలిద్దరూ ఆలయ ప్రవేశానికి సమాయత్తమయ్యారు. తెల్లవారు జామున అయ్యప్ప గర్భగుడిలోకి చేరి పూజలు చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. 
వికసించిన పద్మాలు 


తెలుగు ఆణిముత్యం

భారత బాడ్మింటన్‌ క్రీడారంగంలో అద్భుత ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన తెలుగుతేజం మహిళా బాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధుకు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్‌ అవార్డు దక్కింది. దేశంలో అత్యున్నత స్థాయి 3వ పురస్కారం పద్మభూషణ్‌ను ఆమె తన 24వ ఏటనే  అందుకోవడం విశేషం.  భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్‌ స్ఫూర్తితో పి.వి. సింధు ఈ క్రీడారంగంలోకి ప్రవేశించారు. పుల్లెల గోపిచంద్‌ సారధ్యంలో ఏర్పాటుచేసిన బాడ్మింటన్‌ అకాడమీలో ఈమె శిక్షణ తీసుకున్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడారంగంలో పలు విజయాలను సొంత చేసుకున్న సింధు, తన చిన్ననాట ఎనిమిదేళ్ల వయసు నుంచే బాడ్మింటన్‌ ఆడటం ప్రారంభించారు. ఆమె ఎంతో ప్రతిభాపాటవాలు చూపేవారికి ఇచ్చే గొప్ప పురస్కారాన్ని పద్మభూషణ్‌ అందుకుంది.
 పద్మ శ్రీ కంగనా రనౌత్‌

కంగనారనౌత్‌ ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో ఒదిగిపోతుంది. అంతేకాదు. ఆ పాత్రకు సంబంధించిన యాసలో డైలాగులు చెబుతూ ఆ పాత్రకు పరిపుష్ఠి తీసుకువస్తుంది. ఒప్పుకున్న పాత్ర కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. ముఖ్యంగా ఉమెన్‌ ఓరియంటెడ్‌ పాత్రలో ఆమె ఒదిగే తీరు విమర్శకులు సైతం ప్రశంసిస్తారు. సమకాలీన స్త్రీ సమస్యలు ఎదురైనప్పుడు ఆమె స్పందించే తీరును విభిన్నంగా ఉంటుంది. ముక్కుసూటిగా, తాను చెప్పదలచుకున్నది చెబుతుంది. ఆమెలో సేవా దృక్పథం కూడా మెండు. ఇటీవలనే 40 లక్షల రూపాయల విరాళాన్ని కావేరి నదీ జలాల పరిరక్షణకు ఇవ్వటం విశేషం. ఆమె సేవకు దక్కిన బహుమానమే పద్మశ్రీ. ఆమెకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద. అందుకే ఆయన స్థాపించిన రామకృష్ణ మిషన్‌తో కలిసి సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.