మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Mar 07, 2020 , 23:54:26

ఇటుకబట్టీ కూలీ.. సిమెంట్‌ తయారుచేశాడు!

ఇటుకబట్టీ కూలీ..  సిమెంట్‌ తయారుచేశాడు!

మనిషికి.. తొలినాళ్లలో ఆవాసాలు లేవు కదా? చెట్ల తొర్రలే వాళ్ల నివాసాలుగా ఏర్పరచుకున్నారు. చలికి.. ఎండకు.. వానకు వాటిలోనే తలదాచుకునేవాళ్లు. తర్వాత చెట్ల కొమ్మలతో తడకలు కట్టుకున్నారు. ఆ తర్వాత గుడిసెలు వేసుకున్నారు. రాయికి.. రాయిని పేర్చి ఇండ్లు కట్టుకున్నారు. ఆ తర్వాత.. పక్కా ఇండ్లు.. పూరిండ్లు. ఇప్పుడు? అంతా కాంక్రీట్‌ మయం. సిమెంటు లేనిదే ఒక్క ఇల్లూ ఉండదు. పట్నమే కాదు.. పల్లెలూ కాంక్రీటు జంగిల్స్‌గా మారిపోయాయి. పెద్ద పెద్ద మేడలు.. మిద్దెలు.. ప్రాజెక్టులు.. బ్రిడ్జీలు ఇలా ప్రతీ కట్టడమూ.. ప్రతీ నిర్మాణమూ సిమెంట్‌తో నిర్మించినదే! ఇంత విశిష్ఠత కలిగిన సిమెంట్‌ను ఎప్పుడు? ఎవరు? ఎందుకు కనుకున్నారో కూడా తెలుసుకోవాలి కదా?


దాయి శ్రీశైలం, సెల్‌: 8096677035


థామస్‌ అల్వా ఎడిసన్‌ బల్బ్‌ను ఎందుకు కనుక్కున్నాడో తెలుసుకున్నాం. థేల్స్‌ కరంటును ఎలా ఉత్పత్తి చేశాడో తెలుసుకున్నాం. జార్జ్‌ స్టీఫెన్‌సన్‌ రైలు మార్గాన్ని ఎలా విజయవంతంగా కనిపెట్టాడో తెలుసుకున్నాం. రేయింబవళ్లు ఎలాంటి ప్రయోగాలు చేసి గెలీలియో మార్కోనీ రేడియోను కనిపెట్టాడో తెలుసుకున్నాం. ఎలాంటి నేర్పరితనంతో జాన్‌గుటెన్‌ బర్గ్‌ అచ్చుయంత్రం ఆవిష్కరించాడో తెలుసుకున్నాం. ఇవన్నీ దాదాపు యంత్ర సంబంధమైనవి. ఆవిష్కరణ అంటే కేవలం యంత్రాలు మాత్రమే కాదు. సిమెంటులాంటి ముడిసరుకును కనుక్కోవడం కూడా ఒక గొప్ప ఆవిష్కరణే. కర్రలతో.. రాళ్లతో ఇండ్లు.. కట్టడాలు నిర్మించుకొని జీవిస్తున్న దశలో సిమెంట్‌ అనే ముడి సరుకును తయారుచేసి సంచలనం సృష్టించిన వ్యక్తి జోసెఫ్‌ ఆస్పిడన్‌.


అది ఇంగ్లండ్‌. లీడ్స్‌ పట్టణంలోని లిన్సెస్‌ స్ట్రీట్‌లో గృహ నిర్మాణ కార్మికుల ఇండ్ల సముదాయం ఉండేది. థామస్‌ ఆస్పిడన్‌ ఇటుకలు తయారీ చేసేవాడు. ఆయన భార్య మేరీ ఆస్పిడన్‌. వీరికి ఆరుగురు సంతానం. వీరిలో రెండోవాడు జోసెఫ్‌ ఆస్పిడన్‌. జోసెఫ్‌ 1778లో పుట్టాడు. పెద్ద కుటుంబం.. పనిచేసేది థామస్‌ ఒక్కడే. రాత్రింబవళ్లు థామస్‌ కష్టపడేవాడు. పిల్లల ఆలనా.. పాలనా మేరీ చూసుకునేది. ఎంతచేసినా తిండికి.. బట్టకే సరిపోయేది. పిల్లలకు జ్వరం వస్తే కూడా వైద్యం చేయించలేని పరిస్థితి వాళ్లది. ఈ పరిస్థితి వల్లే పెద్ద కొడుకు.. మూడో కొడుకు అనారోగ్యంతో చనిపోయారు. ఆ దశలో రెండోవాడైన జోసెఫ్‌ ఇంటికి పెద్దవాడు అయ్యాడు. దీంతో కుటుంబ భారం తండ్రి తర్వాత తనపైనే ఎక్కువగా ఉండేది. అందుకే తను చిన్న వయసులోనే తండ్రి బాటలో నడిచాడు. థామస్‌ ఇటుకల తయారీ పని మాత్రమే కాదు.. ఇండ్లు కట్టేవాడు కూడా. దాంతో జోసెఫ్‌ కూడా ఇంటి నిర్మాణ పనులు నేర్చుకున్నాడు. రోజులో రెండు డ్యూటీలు చేసేవాడు. ఉదయం పూట ఇంటి నిర్మాణ పనులకు వెళ్తే.. సాయంత్రం ఇటుక బట్టీల్లో పనిచేసేవాడు. బంకమట్టితో ఇటుకలు తయారుచేసేవాడు. రాత్రిళ్లు పని అయిపోయాక బట్టీల్లోనే పడుకునేవాడు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బతికాడు జోసెఫ్‌. కానీ.. పరిస్థితులకు ఎప్పుడూ భయపడలేదు. అతడికి తెలిసిందల్లా పని మాత్రమే. వాళ్ల నాన్న ఏది చేస్తే అది చేయడం. 

జోసెఫ్‌ ఆలోచనలో పడ్డాడు. పని ఎవరైనా చేస్తారు. దాంట్లో గొప్పదనం ఏముంది? చేసే పనికి సృజనాత్మకత జోడించడమే కదా? మనం చేయాల్సింది అనుకున్నాడు. అప్పుడు తనకుతానే కొన్ని ప్రశ్నలు వేసుకున్నాడు. ఇటుకలు తయారుచేయడం కోసం బంకమట్టి వాడుతున్నాం కదా? ఆ బంకమట్టితో అంతకంటే దృఢమైంది ఏం తయారుచేయొచ్చు అనుకున్నాడు. తర్వాత ఇటుకలు.. రాళ్లు ఒకదానికొకటి అంటిపెట్టుకోవాలంటే సున్నం వాడుతాం కదా? దానికి ప్రత్యామ్నాయ సరుకేదైనా తయారుచేయొచ్చా? అని కూడా ఆలోచించాడు. రోజూ అందరికంటే ఓ గంట ముందే పనికి వెళ్లేవాడు. సున్నం.. మట్టిని పరిశీలించేవాడు. రెండింటినీ మిశ్రమంగా చేస్తూ రకరకాల వస్తువులు తయారుచేశాడు. అవన్నీ దృఢంగా ఉండేవి. రాత్రిపూట ఇటుకబట్టీల్లో పనిచేసేటప్పుడు కూడా వాటిని ఎంతసేపు కాలుస్తున్నాం? తడి ఎంతసేపు ఉంటుంది? ఆరబెట్టాక వాటిలో ఉన్న దృఢత్వం ఏంటి? అని ప్రతిరోజూ అధ్యయనం చేస్తుండేవాడు. కానీ అక్కడ అసౌకర్యంగా అనిపించేది. ‘ఏంరా బాబూ.. ఎప్పుడూ ఏదో చేస్తుంటావ్‌?’ అని తోటివాళ్లు అంటుండేవాళ్లు. ‘నాన్నా ఇలా ఎంతకాలం పనిచేస్తారు? మనమే సొంతంగా ఇటుకల వ్యాపారం చేసుకోవచ్చు కదా?’ అని తండ్రికి సలహా ఇవ్వడంతో అప్పటికే ఇటుకల వ్యాపారంలో మంచి అనుభవం ఉన్న థామస్‌ వ్యాపారం మొదలుపెట్టాడు. థామస్‌ ఒళ్లొంచి పనిచేసే కార్మికుడే కాదు. మంచి నైపుణ్యం ఉన్న పనిమంతుడు కూడా. ఇటుకలు.. ఒకదానికొకటి అతుక్కోవడానికి దృఢమైన ముడిసరుకు తయారుచేయాలని అనుకున్నాడు. కంకర.. రాళ్లతో ఏవేవో ప్రయోగాలు చేస్తుండేవాడు. వీటన్నింటినీ జోసెఫ్‌ నిశితంగా గమనిస్తుండేవాడు. తండ్రికి తెలియకుండానే ఒక మిశ్రమం తయారుచేశాడు. జోసెఫ్‌కు పెద్ద సమస్య వచ్చింది. వాళ్ల నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. అప్పుడు జోసెఫ్‌ వయసు 33 సంవత్సరాలు. ఇక చెల్లెలు.. ముగ్గురు తమ్ముళ్ల బాధ్యత తనపైనే పడింది. ఇటుకల వ్యాపార బాధ్యతలు చేపట్టాడు. వ్యాపారం బాగా నడవసాగింది. తన తండ్రి అర్ధాంతరంగా వదిలేసిన ముడిసరుకు ప్రయోగాన్ని జోసెఫ్‌ కొనసాగించాడు. తల్లికి చేతకావడం లేదు. జోసెఫ్‌కు పెండ్లి చేసుకోవాలనే ఒత్తిళ్లు వచ్చాయి. 1811వ సంవత్సరం. లీడ్స్‌లోని పారిష్‌ చర్చి వెలుగు జిలుగులతో ముస్తాబైంది. అది జోసెఫ్‌ పెండ్లి వేడుక. వధువు మేరీ ఫోథర్‌బీ. జోసెఫ్‌ను అన్ని రకాలుగా అర్థం చేసుకున్న యువతి. ఆవిష్కరణల పట్ల అతడు సాగిస్తున్న ప్రయత్నాలు కూడా ఆమెకు తెలుసు. పెద్దల సమక్షంలో పెండ్లి జరిగింది. అందరూ సంతోషించారు. కానీ.. ప్రయోగాలు ముందుకు సాగడం లేదు. బాధ్యతలు మరింత పెరిగాయి. తాను సెటిల్‌ అవ్వడమే కాదు.. తమ్ముళ్లను.. చెల్లెల్ని సెట్‌ చేయాల్సిన బాధ్యత కూడా తనదే. వారికి పెండ్లిళ్లు కూడా చేయాలి. జోసెఫ్‌పై ఒత్తిడి పెరిగింది. సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నట్లుగా భావించాడు. కుటుంబానికి దూరంగా పారిపోవాలనే ప్రయత్నాలూ చేశాడు. కానీ వాళ్ల నాన్న తమకోసం పడిన కష్టం గుర్తొచ్చి ఆగిపోయాడు. ఆయన ఆశయం కోసం పనిచేయాలని అనుకున్నాడు. అమ్మ కోరిక మేరకు తమ్ముళ్లు.. చెల్లెలికి పెండ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. సంసార సాగరంలో ఇరుక్కుంటే తన లక్ష్యం సాధించలేననీ అనుకున్నాడు. ఇంటినుంచి వేరుపడి మకాం స్లిప్‌ ఇన్‌ యార్డ్‌కు మార్చాడు. వ్యాపారం కూడా అక్కడే ఏర్పరుచుకున్నాడు. దాంట్లోనే ఇటుకలు తయారుచేయడం.. నివాసం రెండూ కావటంతో ఇల్లు అంత సౌకర్యవంతంగా అనిపించలేదు. అది కూడా పాత ఇల్లు. వంటగదినే ప్రయోగశాలగా మార్చుకున్నాడు. రాత్రింబవళ్లు పనిచేస్తూ ఉండేవాడు. 

లక్ష్యం దగ్గర్లోనే ఉంది. అది జోసెఫ్‌కు కూడా తెలుసు. కానీ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఏకకాలంలో రెండింటి మీద దృష్టి సారించడం వల్ల ఇటు ఇటుకల వ్యాపారమూ సరిగ్గా నడవకపోయేది. అటు ప్రయోగాలూ విజయవంతం కాకపోయేవి. ఈ ప్రభావం జీవితంపై పడింది. అస్తవ్యస్థమైన జీవనశైలితో ఇటు తాను.. అటు కుటుంబ సభ్యులూ ఇబ్బంది పడేవారు. తన ప్రతిభ మీద జోసెఫ్‌కు నమ్మకం ఉంది. సాధిస్తా అనే ఆత్మవిశ్వాసం ఉంది. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల వల్ల తన ఆశయం కలగానే మిగిలిపోతుందేమో అనే జంకు ఏదో ఒక మూలన ఉండేది. ఆ భయాన్ని పారదోలేందుకే తిండి.. తిప్పలు మానేసి పనిచేసేవాడు. ఆత్మ విశ్వాసమే విజయుడిని చేసింది. 

1824వ సంవత్సరం. జోసెఫ్‌ ఆస్పిడన్‌ కల నిజమైన వేళ. ఎన్నో ఆటంకాలను దాటుకొని చేసిన ప్రయోగం ఫలించిన సందర్భం. సున్నం.. బంకమట్టి.. కంకర పౌడర్‌తో మిశ్రమం చేశాడు. దానిని ఆరబెట్టి యంత్రాల ద్వారా మెత్తగా చేసేవాడు. నీటిని కలిపితే అది గట్టిగా కావడం.. రెండు ఇటుకల మధ్య దానిని పెడితే గంట లోపే గట్టి పడటం జరిగేది. ఆ ముడిసరుకే సిమెంట్‌. ఇప్పుడు మనం ఇండ్లు.. ఇతర కట్టడాలకు ఉపయోగించే సిమెంటే. 1824లోనే సిమెంట్‌పై పేటెంట్‌ కూడా పొందాడు. దానిని పోర్ట్‌లాండ్‌ సిమెంట్‌ అనేవారు. సిమెంట్‌ తయారీతో సంచలనం సృష్టించిన జోసెఫ్‌ ప్రతిభను చూసి అందరూ మెచ్చుకున్నారు. తర్వాత పోర్ట్‌లాండ్‌ సిమెంట్‌ అనే కంపెనీ ప్రారంభించాడు. తన కొడుకును కూడా అదే రంగంలోకి దింపాడు. ఇద్దరూ కలిసి సిమెంట్‌ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించారు. తర్వాత దానిని తన కొడుకుకు అప్పగించి ఇంకో సిమెంట్‌ కంపెనీ మొదలుపెట్టాడు జోసెఫ్‌. అది కూడా విజయవంతంగా నడిచింది. 

1855లో జోసెఫ్‌ ఆస్పిడన్‌ మరణించాడు. ఇప్పుడు జోసెఫ్‌ లేడు. కానీ ఆయన తయారుచేసిన సిమెంట్‌ మనతోనే ఉన్నది. ఇటుకకు.. ఇటుకకూ మధ్య బంధాన్ని బలపరచడమే కాదు.. మనిషి జీవితంతో కూడా సిమెంట్‌ మంచి బంధాన్నే ఏర్పరచుకుంది. ఇప్పుడు సిమెంట్‌ లేకుండా ఏ నిర్మాణమూ జరగదు. ఆఖరికి మనిషి చనిపోయి సమాధిని పూడ్చాలన్నా అదే సిమెంట్‌ అవసరమవుతున్నది. 

చివరగా.. జీవన ప్రయాణంలో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటి తాకిడికి తల్లడిల్లిపోవడం కాకుండా రాటుదేలిపోవాలి. దెబ్బ మొదటిసారి తగిలితే నొప్పి చాలా పెడుతుంది. అదే దెబ్బ మరోసారి తగిలితే అంత నొప్పి అనిపించదు. జోసెఫ్‌ ఆస్పిడన్‌కు మొదట్నుంచీ ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. బాధ్యతలు మీద పడ్డాయి. అదే సమయంలో ఏదైనా సాధించాలని కలగన్నాడు. బాధ్యతల బంధీల్లో ఇరుక్కొని తన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా తాను మారాడు. కాలానికి అనుగుణంగా తన జీవితాన్ని మల్చుకున్నాడు. అందుకే ఆలస్యం అయినా.. ఆటంకాలు ఎదురైనా కష్టపడి సిమెంట్‌ను కనిపెట్టాడు. చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడు. 

సిమెంట్‌ తయారీతో సంచలనం సృష్టించిన జోసెఫ్‌ ప్రతిభను చూసి అందరూ మెచ్చుకున్నారు. తర్వాత పోర్ట్‌లాండ్‌ సిమెంట్‌ అనే కంపెనీ ప్రారంభించాడు. తన కొడుకును కూడా అదే రంగంలోకి దింపాడు. ఇద్దరూ కలిసి సిమెంట్‌ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించారు. తర్వాత దానిని తన కొడుకుకు అప్పగించి ఇంకో సిమెంట్‌ కంపెనీ మొదలుపెట్టాడు జోసెఫ్‌. అది కూడా విజయవంతంగా నడిచింది. 


logo