శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Mar 07, 2020 , 23:42:59

చౌక బేరం

చౌక బేరం

“నువ్వు చేసిన నేరాలకి తగిన ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధమౌ జాన్సన్‌” శామ్‌ చెప్పాడు.“ఏం నేరాలు? నా పేరు జాన్సన్‌ కాదు. మీరేం మాట్లాడుతున్నారు?” కొద్ది క్షణాల తర్వాత జాన్సన్‌ అడిగాడు.“నువ్వెవరో మాకు తెలుసు జాన్సన్‌. ఇంక అది చర్చించడం అనవసరం. నువ్వు బాధ లేకుండా త్వరగా పోతావు” శామ్‌ దయగా చెప్పాడు.

పళ్ళ డాక్టర్‌ శామ్‌ ఇంట్లో కానిస్టేబుల్‌ స్టోక్స్‌, జడ్జ్‌ టర్నర్‌ ఎప్పటిలా ఆ శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతున్నారు. అది నూట ఏభై ఏండ్ల క్రితం కట్టిన ఇల్లు. ఆ గదిలో అప్పటికే మూడోసారి సన్నగా ఏడుపు వినిపించింది. కిటికీ తలుపులు మూసి ఉండి, గాలి లోపలకి రాకపోయినా తెరలు కదిలాయి. ఆ ముగ్గురు ఆటగాళ్ళు ఆ ఏడుపుని పట్టించుకోకుండా ఆడసాగారు. బల్లమీద నాణాలు ఉన్నాయి.

“రెండు ఏసులు” శామ్‌ చెప్పాడు.

“మూడు ఏసులు” టర్నర్‌ నవ్వుతూ చెప్పాడు.

ఆ ఆట ముగిసాక స్టోక్స్‌ మళ్ళీ పేకని కలపసాగాడు. మళ్ళీ ఇంకోసారి ఏడుపు వినిపించింది.

“ఈసారి పది సెంట్లు” శామ్‌ చెప్పాడు.

“పదిహేనైనా ఫర్వాలేదు” టర్నర్‌ చెప్పాడు.

“నా పరిమితి ఐదే” చెప్పి, స్టోక్స్‌ కార్డ్‌లని పంచసాగాడు.

గది తలుపుమీద ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. తర్వాత ఏడుపు పెరిగింది. ఆ పంతొమ్మిదో శతాబ్దపు బల్లమీంచి ఓ ఏష్‌ట్రే నెమ్మదిగా కదిలి కార్పెట్‌మీద పడింది. టర్నర్‌ కొద్దిగా చిరాగ్గా పైకి చూసి చెప్పాడు.

“ఇవాళ మిన్నీ చురుగ్గా ఉన్నట్లుంది డాక్టర్‌?”

“సారీ. సాధారణంగా ఆమె మన చుట్టుపక్కల ఉన్నట్లు తెలీకుండా ఉంటుంది” డాక్టర్‌ శామ్‌ చెప్పాడు.

“చౌకగా వచ్చిందని మీలా నేను దెయ్యాల కొంపని కొని అందులో ఉండలేను” కానిస్టేబుల్‌ స్టోక్స్‌ చెప్పాడు. 

“దానికి అలవాటు పడతాం. అవి మనల్ని భయపెట్టవు. మనమే భయపడతాం. హాని చెయ్యవు. థాంక్స్‌ టు దెయ్యం. లేకపోతే ఇంత మంచి ఇల్లు అంత చౌకగా వచ్చేది కాదు” శామ్‌ చెప్పాడు.

“నిజమే. కాకపోతే రోగులు రావడానికి భయపడతారు కదా?” టర్నర్‌ చెప్పాడు.

“ఈ ఊళ్ళో నేనొక్కడ్నే పళ్ళ డాక్టర్ని. కాబట్టి, వాళ్ళకి మిన్నీ అసాధారణంగా అలవాటైపోయింది. సాధారణంగా మిన్నీ నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ రాత్రి ఎందుకు ఇలా అశాంతిగా ఉందో మరి!”

మళ్ళీ డోర్‌ బెల్‌ మోగింది. 

“ఈ రాత్రికి ఒక్కటే అపాయింట్‌మెంట్‌. మీ ఇద్దరూ ఆడుతూండండి. ఎక్కువ టైం తీసుకోను. సాయంత్రం ఆరు దాటాక నేను రోగులని చూడనని చెప్తే, పంటినొప్పి బాధ చాలా ఎక్కువగా ఉందని అతను ఫోన్‌ చేసాడు. రమ్మన్నాను” డాక్టర్‌ శామ్‌ చెప్పాడు.

“అతను నాకు తెలుసు. అతని పేరు జాన్సన్‌. మందుల దుకాణం అతను మీ దగ్గరకి వెళ్ళమని సూచిస్తుంటే విన్నాను. కొన్ని రోజుల క్రితం ఈ ఊరికి వచ్చినప్పటి నుంచీ అతన్ని పోలీసులు రహస్యంగా వెంబడిస్తున్నారు” కానిస్టేబుల్‌ స్టోక్స్‌ చెప్పాడు.

“మూడు ఏసులు” టర్నర్‌ చెప్పాడు.

ఆ ఆటలో కూడా టర్నరే గెలిచాడు.

“ఎందుకు వెంబడిస్తున్నారు?” శామ్‌ కుర్చీలోంచి లేస్తు అడిగాడు.

“వాంటెడ్‌ నోటీస్‌లోని ఓ ఫొటోలోని మొహానికి అతని మొహం దగ్గరగా ఉంది. ఫొటోలోని వ్యక్తికి సైడ్‌ బర్న్‌ ్స, మీసం, కళ్ళజోడు లేవు. ఇతనికి ఉన్నాయి. బహుశా అవి తీస్తే ఇతనే అని మా అనుమానం. బరువు, ఎత్తు, జుట్టు, కళ్ళ రంగు మొదలైన మిగిలినవన్నీ సరిపోయేవే. అతని పేరు జాన్సన్‌. కానీ, తన పేరుని టోనీగా చెప్పుకుంటున్నాడు.”

శామ్‌ తలుపు తెరవడానికి ముందు గదిలోకి వెళ్ళాడు.

“జాన్సన్‌ ఈ ఊరు ఎందుకు వచ్చాడు?” టర్నర్‌ అడిగాడు.

“అది నాకు తెలీదు. జాన్సన్‌కి అనుమానం రాకుండా ఉండాలని ఇంతకాలం వేలిముద్రలు తీసుకోలేదు.”

“అతను చేసిన నేరం?”

“హత్య”

“హత్యే?”

“అవును. జైలునించి పారిపోయాడు. ఇల్లినాయ్‌లో ఇద్దరు అతనికి లిఫ్ట్‌ ఇస్తే వాళ్ళని చంపి దోచుకున్నాడు.”


డాక్టర్‌ శామ్‌ కుర్చీ పైనించి వేలాడే దీపాన్ని వెలిగించాడు. దాని ముందున్న శక్తివంతమైన లెన్స్‌ని టోనీ నోట్లోకి పోనిచ్చి చూసాడు.

“నోరు ఇంకాస్త తెరవండి. ఎక్కడ నొప్పిగా ఉంది?” అడిగాడు.

టోనీ పైభాగంలోని ఓ దంతాన్ని వేలితో చూపించాడు.

డెంటల్‌ మిర్రర్‌ని టోనీ నోట్లో ఉంచి, దాన్ని పరిశీలించి ఇంకో పరికరంతో దానిమీద చిన్నగా తట్టి అడిగాడు.

“నొప్పిగా ఉందా?”

టోనీ శరీరం వణికింది. పెద్దగా అరిచాడు.

“సరే. ఈ పన్ను బాగా పుచ్చి నరం కనిపిస్తున్నది.”

“దాన్ని తీసేయాలా?”

“ఉంచేందుకే ప్రయత్నిస్తాను. మీకు మత్తుమందివ్వాలి.”

“మీరేమైనా చేయండి. నొప్పి మాత్రం తగ్గించండి. భరించలేక పోతున్నాను. అది నన్ను చంపేస్తున్నది” టోనీ చెప్పాడు.

శామ్‌ ఓ అల్మారా దగ్గరికి వెళ్ళి, అందులోని ఇంజెక్షన్‌ సిరంజ్‌ని, రంగు లేని ద్రవపదార్థం గల సీసాని బయటకి తీసి, దాన్ని సిరంజ్‌లోకి ఎక్కిస్తూ చెప్పాడు.

“మీ కేసులో లోకల్‌ ఎనస్తీషియా బాధని తెలీకుండా ఉంచదు. జనరల్‌ ఎనస్తీషియా ఇవ్వాలి.” 

అకస్మాత్తుగా పెద్ద ఏడుపు వినపడి ఆగిపోయింది. అదీ వారిద్దరి మధ్యనించి వినపడటంతో టోనీ అదిరిపడ్డాడు.

“ఎవరిదా ఏడుపు?” భయంగా చుట్టూ చూస్తూ అడిగాడు.

“దెయ్యం. దెయ్యం మాత్రమే. మీ చొక్కా చేతిని పైకి మడవండి” శామ్‌ కోరాడు.

“దెయ్యమంటారేమిటి? దెయ్యాలు లేవు.”

“సారీ! ఈ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని మీకు తెలీదనుకుంటా. ఈ ఊళ్ళోని అందరికీ తెలుసు. మీరు చొక్కా చేతిని పైకి మడిస్తే..”

“అబద్ధాలాడకండి డాక్టర్‌. నాకు అది ఇష్టముండదు. మళ్ళీ అడుగుతున్నాను. ఎవరిదా ఏడుపా?”

“నేను అబద్ధం ఆడటం లేదు. ఈ ఇంట్లో దెయ్యం ఉందని నమ్మకంగా చెప్తున్నాను.”

“చూడండి డాక్టర్‌. మీరు ప్రొఫెషనల్‌. చదువుకున్న వారు, తెలివైన వారు. ఇలాంటి చెత్తని ఎలా ఒప్పుకుంటున్నారు? ఆ ఏడుపు ఎవరిదో తెలీదు కాని అది దెయ్యంది మాత్రం కాదు” అతను సందిగ్ధంగా చూస్తూ అడిగాడు.

“ఈ రోజుల్లో దెయ్యాలని నమ్మనివారు మేధావి వర్గానికి చెందిన వారని నమ్ముతున్నారు. కానీ, నిజాలు నిజాలే. శాస్త్రజ్ఞులు సైకిక్‌ విషయాల్లో పరిశోధనలు ఎందుకు చేస్తున్నారు? అందులో నిజం ఉందని నమ్మే. ఈ ఊళ్ళోని అందరికీ ఇది అనుభవమే. బావిని తవ్వే ముందు నీరు ఎక్కడుందో చెప్పే మంత్రగాళ్లున్నారు.” 

“అంటే, ఈ ఇంట్లో దెయ్యం ఉందంటారా?” టోనీ ఆశ్చర్యంగా అడిగాడు.

“అది ఇప్పటికే చెప్పాను. ఆమె గురించి మా అందరికీ తెలుసు. ఆమె పేరు మిన్నీ. 1830లో కట్టిన ఈ ఇల్లు ప్రిన్నెల్‌ది. మిన్నీ ఈ ఇంట్లో పనిమనిషి. 1933లో మిన్నీ ఆత్మహత్య చేసుకుంది. ఆమె దెయ్యమై తిరుగుతుండటంతో ఈ ఇల్లు కొంత కాలం ఖాళీగా ఉంది. ఎవరూ కొనడానికి కాని, ఉండటానికి కాని రాలేదు. 1945లో దీన్ని అతిచౌకగా నేను కొన్నాను. మిన్నీ నన్ను భయపెట్టలేక పోయింది.”

“ఎందుకని?”

“స్పందన. నా నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే ఏ దెయ్యం ఏమీ చేయలేదు. ఆమె ఫొటో చూపిస్తాను.”

డ్రాయర్‌ తెరచి డాక్టర్‌ శామ్‌, మిన్నీ ఫొటోని టోనీకి చూపించాడు.

“అబ్బా! ఎంత రోత మొహం? ఆమెకి పెళ్లయి ఉండదు” టోనీ చెప్పాడు.

“అవును. అందుకే ఆత్మహత్య చేసుకుంది.”

అకస్మాత్తుగా డాక్టర్‌ పరికరాల ట్రే రోగి ముందు గుండ్రంగా తిరగడం టోనీ చూశాడు. అతని కుర్చీచుట్టూ అదృశ్య అడుగుల శబ్దం వినిపించింది.

“ఆమె మన మాటలు వింటున్నదా?” టోనీ ప్రశ్నించాడు.

“వినలేదని అనుకుంటాను. దెయ్యాలతో మాట్లాడటం చాలా కష్టం. నేనీ ఇంట్లో ఉన్న మూడేండ్లల్లో రెండుసార్లే ఆమెతో మాట్లాడాను. ఆమె ఏం కోరిందంటే...”

“మీరు నిజంగా ఆమెతో మాట్లాడారా?”

“అవును. రెండుసార్లే ఐనా మిన్నీ గురించి చాలా తెలుసుకున్నాను.”

“నాకు ఇక్కడ నచ్చలేదు. నేను వెళ్తాను. అసలీ ఊళ్ళోంచే వెళ్తాను. ఈ ఊళ్ళోని వారంతా నాకు వింతగా కనిపిస్తున్నారు” టోనీ చెప్పాడు.

“మీ ఇష్టం.”

“కానీ, పంటి నొప్పి... ఇది భరించలేక పోతున్నాను. త్వరగా ముగించండి.”

శామ్‌ అతనికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి


కానిస్టేబుల్‌ స్టోక్స్‌ మత్తులో ఉన్న టోనీ మొహాన్ని పరిశీలనగా చూస్తూ తన చేతిలోని ఫొటోతో పోల్చి చూసాక చెప్పాడు.

“ప్రతీ పోలికా అతనే ఇతనని చెప్తున్నది. నేను వేలిముద్రలు తీసుకోగానే అది తెలిసిపోతుంది.”

పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి ఫొటోతోపాటు తెచ్చిన ఫింగర్‌ప్రింట్‌ కిట్‌ని తెరచి, టోనీ వేలిముద్రలు తీసుకుంటూంటే శామ్‌, టర్నర్‌ ఆసక్తిగా చూసారు. రోలర్ని నల్ల ఇంకులో తిప్పి, దాన్ని రెండు చేతి వేళ్ళమీదా రుద్ది, ఓ కాగితం మీద ఆ ముద్రలని తీసుకున్నాడు. తర్వాత తనతో తెచ్చిన మరో జత వేలిముద్రలని, వాటిని భూతద్దంలో దాదాపు పది నిమిషాల సేపు జాగ్రత్తగా పరిశీలించాడు. తర్వాత తృప్తి పడి చెప్పాడు.

“వీటిని ఇలా పోల్చి చూసి తెలుసుకోవడానికి ఆరు వారాల శిక్షణ తీసుకున్నాను. ఇతను జాన్సనే. టోనీ, జాన్సన్‌ల వేలిముద్రలు ఒకటే.”

“ఐతే శామ్‌. మీ ఇంట్లో ప్రస్తుతం ఓ హంతకుడు ఉన్నాడు” టర్నర్‌ చెప్పాడు.

“ఇప్పుడు అతనికి ఏమవుతుంది?” శామ్‌ ప్రశ్నించాడు.

“ఇతన్ని అరెస్ట్‌ చేసి ఇల్లినోయ్‌కి తీసుకెళ్తాం. కోర్ట్‌లో విచారణ జరుగుతుంది. ఫస్ట్‌ డిగ్రీ హత్యానేరానికి మరణశిక్ష పడవచ్చు” స్టోక్స్‌ చెప్పాడు.

“ఇతనికి తప్పనిసరిగా మరణశిక్ష పడుతుందా?” శామ్‌ అడిగాడు.

“ఎంతమాత్రం అనుమానం లేదు.”

“అతను అందుకు నిజంగా అర్హుడా?”

“ఎనభై రెండు డాలర్ల కోసం ఇద్దర్ని చంపాడు. మీరే నిర్ణయించండి” కాన్‌స్టేబుల్‌ స్టోక్స్‌ అడిగాడు.

“అవును” డాక్టర్‌ శామ్‌ ఆలోచనగా చెప్పాడు. కొద్దిసేపాగి అడిగాడు.

“ఇతన్ని నువ్వు నాకు అప్పగించవచ్చు కదా?”

“ఏమిటి?” 

“ఇతన్ని నేను ఉపయోగించుకుంటాను. నాకు కావాల్సింది ఇలాంటివాడే. మీరేమంటారు మిస్టర్‌ టర్నర్‌?”

జడ్జ్‌ టర్నర్‌ అంగీకారంగా, నెమ్మదిగా తలూపి చెప్పాడు.

“మీరేం చెప్తున్నారో అర్థమైంది. నేను అందుకు ఒప్పుకుంటున్నాను. ఏం స్టోక్స్‌?”

“నాకు తెలీదు” స్టోక్స్‌ తల గోక్కుంటూ చెప్పాడు.

“చివరికి వచ్చే ఫలితంలో తేడా ఏముంటుంది? ఎటూ మరణమేగా?”

“పెద్దగా లేదు. సరే శామ్‌. ఇతన్ని నువ్వు తీసుకో” స్టోక్స్‌ చెప్పాడు. “మంచిది. మొదట అతని చేతులు కట్టేద్దాం. ఇతనికి త్వరలో స్పృహ వస్తుంది. ముందుగా అతనికి విషయం చెప్పడం న్యాయం” డాక్టర్‌ శామ్‌ చెప్పాడు.

శామ్‌ అల్మైరా దగ్గరికి వెళ్ళి సిరంజిని ఇందాకటి మందుతో నింపాడు. ఐదారు నిమిషాల్లో జాన్సన్‌కి నెమ్మదిగా స్పృహ వచ్చింది. తన చేతులు కట్టి ఉండటం చూసి అతను ఆశ్చర్యంగా అడిగాడు.

“ఏయ్‌? ఏమిటిది?”

“నువ్వు చేసిన నేరాలకి తగిన ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధమౌ జాన్సన్‌” శామ్‌ చెప్పాడు.

“ఏం నేరాలు? నా పేరు జాన్సన్‌ కాదు. మీరేం మాట్లాడుతున్నారు?” కొద్ది క్షణాల తర్వాత జాన్సన్‌ అడిగాడు.

“నువ్వెవరో మాకు తెలుసు జాన్సన్‌. ఇంక అది చర్చించడం అనవసరం. నువ్వు బాధ లేకుండా త్వరగా పోతావు” శామ్‌ దయగా చెప్పాడు.

వెంటనే జాన్సన్‌ మొహంలో భయం అలుముకుంది. చేతుల్ని విడిపించుకునే ప్రయత్నం చేశాడు. కాని అది నిరుపయోగమైంది.

“తేలిగ్గా తీసుకో జాన్సన్‌. నిమిషంలో పనైపోతుంది. నీకు బాధ కలగదు.”

“మీరీ పని చేయకూడదు. ఇది ఎలాంటి చోటు? ఇక్కడికి పోలీసులు రావాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను” జాన్సన్‌ పెద్దగా అరిచాడు.

“నేను ఇక్కడే ఉన్నాను. పోలీస్‌ కాన్‌స్టేబుల్ని” స్టోక్స్‌ తన ఐ.డి కార్డ్‌ని చూపించి చెప్పాడు.

“మీ ముగ్గురూ తప్పించుకోలేరు. ఇది చట్టవిరుద్ధం. హత్యానేరానికి మీ అందరికీ శిక్ష పడుతుంది” టోనీ ఆక్రోశంగా అరిచాడు.

“నేనలా అనుకోను. ఈ కుర్చీలో నీకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. సహజ మరణం... చాలా సందర్భాల్లో డెంటల్‌ ఛెయిర్లో ఇలా జరగడం మామూలే. నీ పేరు స్పెల్లింగ్‌ చెప్పు జాన్సన్‌” జడ్జ్‌ టర్నర్‌ అడిగాడు.

“జె.వో... కాదు. టి.వో... ఎందుకు?”

“డెత్‌ సర్టిఫికేట్‌లో పేరు రాయడానికి. టోనీ పేరు రాయడం మంచిది. తక్కువ ఇబ్బంది” టర్నర్‌ చెప్పాడు.

మూడుసార్లు చిన్నగా నవ్వు వినిపించింది.

“మీలో ఎవరు నవ్వారు?” జాన్సన్‌ అడిగాడు.

“అది మిన్నీ నవ్వు. నువ్వు మిన్నీతో సఖ్యతగా ఉంటావని ఆశిస్తాను” శామ్‌ చెప్పాడు.

“ఏమిటి మీ ఉద్దేశం?”

“బాధనేది ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు అనుభవపూర్వకంగా తెలిసిందిగా? జీవించి ఉన్నప్పుడు, మరణించాక కూడా మిన్నీ ఓ మగాడికోసం బాధ పడుతున్నది. మగాడు దొరక్కే ఆత్మహత్య చేసుకుంది.”

“దానికీ, నాకు ఏమిటి సంబంధం?” జాన్సన్‌ అడిగాడు.

“మిన్నీ నాతో మాట్లాడినప్పుడు ఆ బాధని వివరించింది. ఈ ఇంటినే అంటిపెట్టుకుని ఉండటానికి కారణం ఏ మగాడైనా తనలా అసహజ మరణం పొందుతాడనే ఆశతోనే. అలా జరిగితే వారిద్దరూ శాశ్వతంగా కలిసే ఉంటారు. నేను ఆమెకో మగాడ్ని పంపాక అతనితో ఇల్లు వదలి వెళ్ళిపోతానంది” డాక్టర్‌ శామ్‌ నెమ్మదిగా చెప్పాడు.

“ఒద్దు” జాన్సన్‌ అరిచాడు. శామ్‌ అతని జబ్బలోకి సిరంజిని గుచ్చి మందు ఎక్కించాడు. వెంటనే ఆనందకరమైన చిన్న నవ్వు వినిపించింది. తర్వాత నిశ్శబ్దం. పూర్తి నిశ్శబ్దం.

* * *

“శామ్‌! మీ ఇంట్లో ఇప్పుడు దెయ్యం లేదు. అది నాకు స్పష్టంగా తెలుస్తున్నది” కొన్ని రోజుల తర్వాత స్టోక్స్‌ చెప్పాడు.

“అవును. చివరికి ఆమెకి విశ్రాంతి లభించింది” టర్నర్‌ చెప్పాడు.

“ఓ విధంగా నేను మిన్నీని మిస్సవుతున్నాను” శామ్‌ చెప్పాడు.

“ఇప్పుడు ఎవరు ముక్క వెయ్యాలి?” స్టోక్స్‌ అడిగాడు.

“నేను. ఈ ఆటలో కూడా నేనే గెలిచేట్లున్నాను” జడ్జ్‌ టర్నర్‌ చెప్పాడు.

(మైఖేల్‌ జురాయ్‌ కథకి స్వేచ్ఛానువాదం)