సోమవారం 26 అక్టోబర్ 2020
Sunday - Mar 07, 2020 , 23:29:57

పాలమూరు పదనిసలు

పాలమూరు పదనిసలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాకృతిక సౌందర్యానుభూతులతో పాటుగా ఆధ్యాత్మిక ఆహ్లాదాన్నిచ్చే ప్రముఖ పుణ్య క్షేత్రాలు, ఆధునిక సమాజంలో సమయం లేని నవీనయుగ కుటుంబసభ్యులకు సేద తీర్చుకునేందుకు పట్టణాల్లోనూ సుందరీకణ హరిత వనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఒకప్పుడు కరువు నేలగా, బీడుపడ్డ భూములతో, ముంబై బస్సెక్కే కూలీలతో, మెతుకు కోసం బతుకు పోరాటం చేస్తూ ఆకలితో బతుకు భారమైన జీవితాలతో దర్శనమిచ్చే పాలమూరు జిల్లా నేడు పచ్చగా మారింది.కరువు ప్రాంతంగా, కార్మికుల జిల్లాగా, వలసలు పోయే జనంతో కనిపించే మహబూబ్‌నగర్‌ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మెరుగైన నీటివనరులు, ప్రాజెక్టులతో కళకళలాడుతూ అద్భుత శోభతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది. ఎన్నెన్నో దేవాలయాలు, నదీతీర ప్రాంతాలు, కొత్త పర్యాటక విడుదులతో పాలమూరు జిల్లా పర్యాటక శోభను సంతరించుకున్నది.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దట్టమైన నల్లమల అరణ్యంతో పాటుగా కృష్ణ, తుంగభద్ర నదీతీర ప్రాంతంలో వెలసిన స్వయంభు క్షేత్రాలయం ఆలంపూర్‌ జోగులాంబ, మణ్యంకొండ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి. కరువు జిల్లా కరువు తీరాలని నాడు నిర్మించిన ఇందిరా ప్రియదర్శిని, జూరాల ప్రాజెక్టుతో పాటుగా కోయిల్‌సాగర్‌, సరళాసాగర్‌లు రైతన్నలకు వ్యవసాయం చేసుకోవడానికి సాగునీరు అందిస్తూ పరీవాహకంలోని  పరిసరాలను పచ్చగా మారుస్తున్నాయి.


తెలంగాణ ఏర్పడిన తరువాత...

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత పాలమూరు పట్టణంలో ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన మయూరి వనం సందర్శకులను ప్రాకృతిక సౌందర్యంతో మంత్రముగ్దుల్ని చేస్తున్నది. దీంతోపాటుగా మినీ ట్యాంక్‌బండ్‌, హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తరహాలో పట్టణవాసులకు సేదతీరే అడ్డాలుగా మారాయి. నల్లమల అభయారణ్యంలో అరుదైన పులుల నిలయంగా అమ్రాబాద్‌ టైగర్‌ జోన్‌తోపాటుగా ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన పక్షిజాతులకు కేంద్ర బిందువుగా ఉమ్మడి జిల్లా ప్రసిద్ధిగాంచింది. ఆధ్యాత్మిక కేంద్రాలైన ఆలంపూర్‌ జోగులాంబ ప్రముఖ శక్తిపీఠ ఆలయంగా, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు తుంగభద్ర, కృష్ణా నదీ సంగమంలో వెలిశాయి. పాలమూరు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ వైష్ణవ క్షేత్రం స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా, పేదల తిరుపతిగా కొలిచిన వారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. గడీలు, బుర్జులకు కూడా పాలమూరు ఉమ్మడి జిల్లా చారిత్రక నేపథ్యంలో గద్వాల, వనపర్తి కోటలు నేటి తరానికి సాక్షీ భూతాలుగా నిలుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాకృతిక సౌందర్యానుభూతులతో పాటుగా ఆధ్యాత్మిక ఆహ్లాదాన్నిచ్చే ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధునిక సమాజంలో సమయం లేని నవీనయుగ కుటుంబసభ్యులకు సేద తీర్చుకునేందుకు పట్టణాల్లోనూ సుందరీకరణ హరిత వనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మన పిల్లలమర్రి..

పాలమూరు పట్టణ పరిసరాల్లో వందల ఏళ్ల నాటి అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకున్న పిల్లలమర్రి ఉమ్మడి పాలమూరు జిల్లా చిహ్నంగా మారింది. పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ తరహాలో రాత్రి సమయంలో పట్టణ ప్రజల్ని తన వైపు తిప్పుకుంటుంది. అప్పన్నపల్లి రిజర్వు ఫారెస్టులో సహజసిద్దమైన మయూరి పార్కుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. సోమశిల

సోమశిల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ॥ 20.86 కోట్లు ఖర్చు చేసింది. 10 కాటేజీలను నదీ తీరంలో నిర్మించింది. పాశ్చాత్య దేశాలలో కనిపించే కాటేజీలు ఇప్పుడు సోమశిలలో మనకు దర్శనమిస్తాయి. కాటేజీలలో బస చేసిన వారికి కృష్ణమ్మ ఒడిలో బసచేసిన దివ్యానుభూతి కలుగుతుంది. కాటేజీలతోపాటు రెస్టారెంట్లు, వ్యూపాయింట్‌, పార్కింగ్‌ సౌకర్యం అన్నీ ఇక్కడున్నాయి. దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ‘లాంచీ’ తయారు చేయించారు. 125 మంది వరకు దీనిలో ప్రయాణించవచ్చు.  సోమశిల నుండి శ్రీశైలం లాంచీ ప్రయాణం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. సోమశిల నుండి బయలుదేరిన లాంచీ చీమల తిప్ప, అంకాళమ్మకోట, చుక్కలకొండ, కదళీవనం, అక్కమహాదేవి గుహల మీదుగా శ్రీశైలానికి చేరుకుంటుంది.logo