శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Mar 07, 2020 , 23:24:32

అరుదైన ఆలయం దేవునిగుట్ట

అరుదైన ఆలయం దేవునిగుట్ట

దేవునిగుట్టపై ఉన్న రాతిని తొలిచి చిన్నచిన్న ఇటుకలుగా తయారుచేశారు. ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం చెక్కి వాటిని ఆరు అడుగుల ఎత్తులో పేర్చారు. రాచకొలువులో లలితాసనంలో బోధిసత్వుడు కూర్చున్న దృశ్యరూపం ఇచ్చారు. మధ్యలో ఖాళీ ఉండి రెండు పొరలతో నిర్మితమైన గోడకు రెండువైపులా ఉన్న రాళ్లపై బుద్ధుడి జీవిత చరిత్ర ఉంది.

అంగ్‌కోర్‌వాట్‌ అనగానే మనకు గుర్తుకు వచ్చేది అక్కడి అద్భుత శిల్పసంపదతో నిర్మితమైన దేవాలయం. కంబోడియా దేశంలోని అంగ్‌కోర్‌ వాట్‌, ఇండోనేషియా సెంట్రల్‌ జావాలోని బోరోబుదుర్‌ దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఒకే శిల్పాన్ని చిన్నచిన్న రాళ్లతో భాగాలుగా చెక్కి ఇటుకల మాదిరిగా పేర్చి పూర్తి రూపం ఇవ్వడం ఈ నిర్మాణం ప్రత్యేకత. అలాంటి తరహా కట్టడమే మన తెలంగాణలోని జయశంకర్‌ జిల్లాలో వెలుగుచూసింది. అంతర్జాతీయ పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ దేవాలయాన్ని స్థానికులు దేవునిగుట్ట దేవాలయంగా పిలుస్తున్నారు. 

ఎక్కడ ఉంది? : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ములుగు మండలం, కొత్తూరు సమీపంలో ఉందీ దేవునిగుట్ట. ఈ గుట్టపై క్రీ.శ. 6 (లేదా 7)వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉంది.  

నిర్మాణశైలి : తెలంగాణలో కాకతీయ పాలకుల నిర్మాణశైలిలోనే ఎక్కువగా దేవాలయాలు కనిపిస్తాయి. కానీ, ఈ ఆలయం వీటికి భిన్నంగా ఉండి అడుగు నుంచి నాలుగడుగుల వరకు ఇసుకరాతి ఇటుకలను పేర్చి నిర్మితమవడం విశేషం. దీనికి రాళ్లు, డంగుసున్నం మిశ్రమాన్ని జోడించారు. ఈ మందిరం ఎత్తు 24 అడుగులు ఉంది. ఇసుక రాళ్లను అతికించడానికి డంగు సున్నం వాడారు. దేవునిగుట్టపై ఉన్న రాతిని తొలిచి చిన్నచిన్న ఇటుకలుగా తయారుచేశారు. ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం చెక్కి వాటిని ఆరు అడుగుల ఎత్తులో పేర్చారు. రాచకొలువులో లలితాసనంలో బోధిసత్వుడు కూర్చున్న దృశ్యరూపం ఇచ్చారు. మధ్యలో ఖాళీ ఉండి రెండు పొరలతో నిర్మితమైన గోడకు రెండువైపులా ఉన్న రాళ్లపై బుద్ధుడి జీవిత చరిత్రను ప్రతిబింబించే చిత్రాలెన్నో చెక్కి ఉన్నాయి. అంతేకాకుండా దీని నిర్మాణానికి వాడిన చాలా తేలికైన లేత ఎరుపురంగు ఇసుక రాతి ఇటుకలు గట్టుమీద పునాది లేకుండా 9 అడుగుల మందంతో రెండు పొరలుగా గోడలను నిర్మించిన తీరు అపూర్వం. ఆలయం నలువైపులా రాతిగుండ్లతో పేర్చిన గోడ, ఉత్తరం వైపు సహజసిద్ధంగా ఏర్పడిన చెరువు, మరోవైపు పాలరాతి స్తంభం, బౌద్ధ స్తూపాల వద్ద నిలిపి ఉంచే ఆయకస్తంభం, దానికి నలువైపుల అర్ధపద్మాలు, చెక్కిన సింహాల శిల్పాలు, అబ్బురపరిచే ఆకృతి తూర్పు ముఖంగా ఉండే చిన్న గ్రామం. దానికి ఇరువైపుల ద్వార పాలకుల్లా ఉండే వజ్రయాన బౌద్ధ మూర్తులు.. వారిలో ఒకరు హరివాహన లోకేశ్వరుడు, లోపల గోడల మీద బౌద్ధజాతక కథలతో చిత్ర దృశ్యాలు. రెండుమూడు చోట్ల బుద్ధుడు శిష్యులకు బోధిస్తున్న దృశ్యాలు. మరోచోట యుద్ధ సన్నివేశం ఆసక్తి కలిగిస్తాయి. పడమటి వైపుగోడపై అర్ధనారీశ్వరుడి శిల్పం దానిపై వరుసలో బుద్ధుడి బోధనలు వింటున్న రాజు, రాణి, పరివారం, మిథునాలు. ఉత్తరం వైపు గోడమీద పెద్ద తలకాయతో భయంకర ఆకారంలో బోధిసత్వుడు. ఎన్నో విశేషాలతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఆలయం దేశంలో మరెక్కడా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రత్యేకత : 2018లో వెలుగులోకి వచ్చిన ఈ దేవునిగుట్టకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమేకాకుండా, కంబోడియాలోని ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంటే ముందే తెలంగాణలో కూడా అటువంటి నిర్మాణాలు జరిగాయనడానికి ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తున్నది.   

అంతర్జాతీయ పరిశోధన : దేవునిగుట్ట పురాతన కట్టడాలపై అంతర్జాతీయ పరిశోధనల పరంపర మొదలైంది. ఈ కట్టడాన్ని ప్రపంచ శిల్ప చరిత్రలోనే విశిష్ఠమైన నిర్మాణంగా, శిల్పకళా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని జర్మనీకి చెందిన ప్రఖ్యాత పురావస్తు పరిశోధకురాలు, చరిత్రకారిణి కొరీనా వెసల్స్‌, ఇంగ్లండ్‌ దేశానికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ప్రొఫెసర్‌ ఆడమ్‌ హార్డీ అభివర్ణించారు. గుట్టపై గల పురాతన ఆలయ కట్టడాలను ఆమెతోపాటు మరికొందరు పురావస్తు పరిశోధకులు సందర్శించారు.  దక్షిణాసియా ప్రాచీన చిత్ర, శిల్పరీతులపై పరిశోధన చేసిన ఆమె తెలంగాణలో తాజాగా వెలుగులోకి వచ్చిన దేవునిగుట్ట ప్రాచీన ఆలయం గురించి తెలుసుకుని ఇక్కడకొచ్చారు. దేవునిగుట్టలోని శిల్పాలు, శైలిని పరిశీలించిన అనంతరం అది క్రీ.శ. 6, 7 శతాబ్దాలకు చెందిన కట్టడంగా ఆమె నిర్ధారించారు. ఇలాంటి ఆలయాన్ని తాను ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. 


logo