గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Mar 07, 2020 , 22:59:48

సహజంగా.. రంగులమయం!

సహజంగా.. రంగులమయం!

రింగు రింగు బిళ్ల.. రూపాయి దండ అంటూ.. హోలీకి పాడే పాటలు వినపడడం లేదు.. పైగా ఈ రంగుల పండుగను మరింత చెడగొట్టేందుకు.. కెమికల్స్‌తో నిండిపోయిన రంగులు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.. అసలు హోలీ అంటేనే రంగుల పండుగ.. ఆ సందర్భంలో ఆ రంగులతో హోలీ అడితే ఇంకేమైనా ఉందా?అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో రంగులు చేయండి.. ఈ హోలీని మరింత రంగులమయం చేసేందుకు..సహజసిద్ధంగా రంగులు ఇంట్లోనే తయారుచేసుకోండి..  

హోలీ అంటేనే ఎక్కడలేని సంబురం వచ్చేస్తుంది అందరికీ. కుల, మత భేదం లేకుండా అందరూ రంగులతో ఈ పండుగను జరుపుకోవడం మనదేశంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి. మరీ ఈ పండుగను కలుషితం చేయడానికే అన్నట్లు కొన్ని కెమికల్స్‌ కలిసిన రంగులు మన మార్కెట్‌ని శాసిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చాలామందిలో ఈ రంగుల పట్ల అవగాహన కలుగుతున్నది. అందుకే కొందరు నేచురల్‌ కలర్స్‌ని తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. అలా కూడా మీకు నమ్మకం లేకపోతే మీ ఇంట్లోనే.. మీకు దొరికే వస్తువులను ఉపయోగించి ఎన్నో రంగులను సృష్టించవచ్చనే విషయం తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఈ రంగుల లోకాన్ని మరింత రంగులమయం చేయడానికి సహజరంగులను ఉపయోగించండి. ఆ రంగులను ఎలా చేయాలో ఇది పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. 


ఆకుపచ్చ

ప్రకృతి రంగు ఆకుపచ్చ. ఈ రంగు పులుముకున్న అన్ని రకాల ఆకులను ఈ రంగుగా వాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా మైదాకులను ఎండబెట్టి పొడి చేయొచ్చు. దీంతో బియ్యంపిండి కాస్త కలిపితే లేలేత ఆకుపచ్చ వర్ణం వస్తుంది. మామూలుగా మైదాకులను రుబ్బితే రంగు మారుతుంది.. కానీ పొడితో మనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇందులో నీళ్లు కలువనంత వరకు వేరే రంగు రాదు. ఒకవేళ నీళ్లతో కూడా ఆడతామనుకుంటే.. ఉసిరికాయ పొడితో కూడా ఈ ఆకుపచ్చ రంగును పొందవచ్చు. పొడి కాకుండా కాస్త నీళ్లలో కలిపేలా రంగులు కావాలంటే ఏం చేయాలనే కదా మీ సందేహం. అదే మైదాకు పొడిని లీటరు నీటిలో ఒక టీస్పూన్‌ వేసి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పాలకూర, కొత్తిమీర, పుదీనా, టమాటా ఆకులను నూరి ఇలా నీళ్లలో కలిపి కూడా ఎంచక్కా ఈ హోలీని ఎంజాయ్‌ చేయొచ్చు. 


పసుపు 

ఇంట్లో వాడే పసుపు ఎలాగూ పచ్చగనే ఉంటుంది. కాకపోతే ఈ రంగు అంటుకుంటే కాస్త వదలడం కష్టం. కాబట్టి ఈ రంగులో కాస్త శనగపిండి కలిపితే సరైన పచ్చని రంగు ప్రత్యక్షమవుతుంది. ఈ రంగు వల్ల ముఖకాంతి మరింత మెరుగుపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిరభ్యంతరంగా ఈ రంగును వాడొచ్చు. ఒక శనగపిండినే కాదు.. మైదా, బియ్యంపిండి, గోధుమపిండి, ముల్తానీ మట్టిలను కలిపి ఈ పసుపు పొడిని సృష్టించొచ్చు. రెండు లీటర్ల నీటిలో చెంచాడు పసుపును వేసి కలుపొచ్చు. కావాలనుకుంటే ఈ నీటిని వేడి చేస్తే చిక్కని పసుపు రంగు వస్తుంది. ఆ వేడి నీటిని చల్లార్చి హోలీ ఆడుకోవచ్చు. బంతిపూల రెక్కలను నూరి కూడా నీటిలో కలుపొచ్చు. లేదా వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం ఉడికించి చల్లార్చి ఈ నీటిని హోలీ రంగుల నీళ్లుగా వాడుకోవచ్చు.
బ్రౌన్‌ అండ్‌ బ్లాక్‌ 

ఈ రంగులకు ఎక్కువ వస్తువులు లేవు. దాల్చినచెక్క పొడిని కూడా ఈ రంగును వాడవచ్చు. అయితే మంట పుడుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించకపోవడమే సబబు. ఈ రంగులను పొడి రూపంలో కంటే.. తడి రూపంలో పొందడం సులువు. టీ, కాఫీ ఆకులను నీటిలో నానేసినప్పుడు ఈ రంగు వస్తుంది. చల్లబర్చి ఈ నీళ్లను ఉపయోగించవచ్చు. ఉసిరికాయలను ఐరన్‌ గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. దీంట్లో కాయలను తీసేసి కాస్త నీళ్లు కలిపితే ఇవి నల్ల రంగులో మెరుస్తుంటాయి. నల్ల ద్రాక్షలను కూడా ఎక్కువ నీళ్లను కలిపి మిక్స్‌ చేస్తే కూడా నలుపు రంగును పొందవచ్చు. 


ఎరుపు 

ఎర్రచందనం మంచి ఎరుపు రంగు వస్తుంది. ఇది కాస్త కాస్లీ అనుకుంటే కనుక వేరేలా కూడా ఈ ఎరుపు రంగును సృష్టించుకోవచ్చు. కాకపోతే దీన్ని ఫేస్‌ప్యాక్‌లా వేసుకుంటే మరింత ముఖవర్ఛస్సు పెరుగుతుందనుకోండి. దీనికి బదులు ఎర్రమందారాలను ఎండబెట్టుకోండి. రాత్రి పొడి చేసుకోండి. మరీ బరుసుగా కాకుండా మెత్తగా నూరితే ఏ ఇబ్బంది ఉండదు. సింధురియా అనే చెట్టుకు విరగబూసే పూలు కూడా ఎర్రగా ఉంటాయి. వీటివల్ల కూడా చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంట్లో ఉండే గింజలు కూడా నానబెట్టి ఆ నీళ్లను చల్లుకోవచ్చు. దానిమ్మ గింజలను కూడా నానబెట్టి ఈ రంగు తీసుకురావచ్చు. ఇంకా ఎర్రని పూలను వేటినైనా తీసుకొని వాటిని పేస్ట్‌ చేసి నీళ్లలో కలిపి ఈ రంగును తీసుకోవచ్చు. టమాటా, క్యారెట్‌లను కలిపి కూడా మిక్సీ పడితే ఈ ఎర్రని రంగును పొందవచ్చు. దీంట్లో నీళ్లు కలిపితే ఈ రంగు చిక్కగా కాకుండా పలుచగా ఉంటుంది. ఈ రంగు కూడా చర్మానికి ఎంతో మేలు చేసేదే కాబట్టి మరింత ఎంజాయ్‌ చేస్తూ ఈ పండుగను జరుపుకోవచ్చు. 


నీలం

జాక్రండా అనే పువ్వులు కుప్పలుగా పెరుగుతుంటాయి. వీటిని ఎండబెట్టి ఈ రంగును పొందవచ్చు. ఈ పువ్వులు ప్రత్యేకంగా ఎండాకాలంలో పూయడం కూడా  ఒక ప్లస్‌ మనకు. నీలం రంగులో ఇప్పుడు ఇతర రకాల పూలు కూడా మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు.. మందార, గులాబీ ఇలా అన్ని కూడా నీలం రంగులో మెరుస్తున్నాయి. వాటిని ఎండబెడితే పొడి రంగు, నీళ్లలో నానబెడితే తడి రంగు వస్తుంది. బ్లూ బెర్రీలను కూడా మిక్సీ పట్టి .. దాంట్లో నీళ్లు పోసి కూడా ఈ రంగును పొందవచ్చు. కాకపోతే ఈ రంగు కాస్త ఒంటికి అతుక్కుపోయినట్టుగా ఉంటుంది.. చిరాకు అనిపిస్తే ఈ రంగు జోలికి వెళ్లకపోవడం మంచిది. 


గులాలు

తెలంగాణలో ఎలాంటి సంబురం అయినా బుక్కగులాలు చల్లుకోవడం ఆనాదిగా ఆనవాయితీగా వస్తున్నదే. అయితే.. కెమికల్‌ కలిసిన రంగు కంటే ప్రకృతి ఒడిలో దొరికే వాటితో ఈ రంగును తయారుచేసుకోవచ్చని ఆలోచించండి. కాకపోతే దీన్ని పొడి రంగు రూపంలో పొందడం కొంచెం కష్టమే. కేవలం నీళ్లలో కలిసి వచ్చే రంగును మాత్రమే పొందవచ్చు. బీట్‌రూట్‌ని నీళ్లల్లో నానబెట్టి ఉదయం బాగా మరిగించి ఆ నీటిని చల్లారిస్తే మనం కోరిన రంగు వస్తుంది. పింక్‌ కలర్‌లో ఉండే ఉల్లిగడ్డల పై పొట్టును నీళ్లల్లో నానబెట్టి వాటిని కూడా కాస్త వేడి చేస్తే మంచి గులాబీ రంగు వస్తుంది. గన్నేరు పూలను కూడా రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం వేడి చేసి వడకట్టాలి. ఈ నీటిని చల్లార్చి కూడా ఈ రంగుగా వాడుకోవచ్చు. 


నారింజ రంగు

ఈ రంగును పొడి రూపంలో పొందలేం. కాబట్టి వీటిని నీళ్లలో కలిపి ఎలా పొందవచ్చో తెలుసుకోండి. మోదుగ పూలతో ఆ దేవదేవుడైన శివుడిని పూజిస్తే కోరిన వరాలిస్తాడంటారు. ఆ పువ్వులను కూడా ఈ హోలీ రంగుల్లోకి చేర్చవచ్చు. రాత్రంతా ఈ పూలను నీళ్లల్లో నానేయాలి. ఉదయం ఆ నీళ్ల రంగును చూడండి. నారింజ పండ్ల తొక్కలను కూడా ఎండబెట్టి  ఈ పని చేయొచ్చు. లేదా ఆ పండ్ల తొక్కలను నీటిలో నానబెట్టి ఉడికిస్తే ఈ రంగును పొందవచ్చు. కొన్ని రకాల గంధాలు కూడా ఈ రంగులోనే దొరుకుతాయి. నేచురల్‌గా ఉండే గంధంతో కూడా ఈ రంగు లభిస్తుంది. కుంకుమపువ్వును కొన్ని గంటలపాటు నానపెట్టి పేస్ట్‌ చేసి ఎక్కువ నీళ్లతో కలిపితే కూడా ఈ రంగు వస్తుంది. 


-సౌమ్య నాగపురి


logo