మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Mar 07, 2020 , 22:42:56

వాస్తు

వాస్తు

లే-అవుట్‌ చేయాలంటే ముందు ఏం చేయాలి? రోడ్లు ఎలా వేయాలి?- ఎన్‌.కరుణాకర్‌, పెద్దపల్లి

ఇండ్ల లే అవుట్‌ చేయడానికి ముందు స్థలాన్ని నిర్ధారించాలి, అది నివాస యోగ్యమైందా.. కాదా అని. అందరూ గొప్ప మనసు కలవారు కానట్టు అన్ని జాగలు గొప్పవిగా ఉండవు. ఇంటి స్థలం ఎంపికలోనే ఇంటి వైభవం నెలకొని ఉంటుంది. స్థలం కుదిరాక దాని హద్దులను సరిచేయాలి. అంటే ఇండ్ల నిర్మాణం చేసే ప్రదేశాన్ని తొంబై డిగ్రీలకు సరిచేయాలి. మిగిలిన ఆ వక్ర స్థలాన్ని వేరే అవసరాలకు నీళ్ల ట్యాంకుల కొరకు, కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ (సబ్‌స్టేషన్‌) కొరకు, కారు పార్కింగ్‌ కొరకు, పిల్లల ఆటస్థలం లేదా గ్రీనరీగా వాడుకోవచ్చు. అది కూడా బయటి నుండి బయటనే వాడాలి. లే అవుట్‌లో ముందు స్థల శుద్ధి చేశాక అంటే రాళ్లు ముండ్ల చెట్లు, చీదు తొలగించి తూర్పు, పడమర లేదా ఉత్తరం దక్షిణం రోడ్లు దిశలకు పూర్తి అనుకూలంగా వేసుకోవాలి.  తప్పక మంచి పార్క్‌ - స్థలాన్ని సెంటర్‌ లేదా ఈశాన్యంలో ఏర్పాటు చేయాలి. అది మంచి గృహ సముదాయం అవుతుంది.


మెట్ల దగ్గర భూమిలోపల బీములు బయటకు పెంచుకోవచ్చా?-ముత్తం ఆనంద, కోశిగి

ఇల్లు కట్టేటప్పుడు బీములు ప్రధాన పాత్ర వహిస్తాయని అందరికీ తెలుసు. అయితే అవి ఎటు పడితే అటు పెంచవద్దు. ఇంటిని అంటుకొని బీములు ఆగ్నేయం పెరిగినా నైరుతి పెరిగినా ఇబ్బంది కలిగిస్తాయి. చాలా నిర్మాణాలల్లో మెట్లు పశ్చిమ నైరుతిలో వేసినప్పుడు, తూర్పు ఆగ్నేయంలో వేసినప్పుడు కింది భాగంలో మెట్లు ప్రారంభం అయ్యే చోట బీము ఆరుఫీట్లు లేదా ఏడు ఫీట్లు పెంచుతారు. అది భూమిలోకి మునిగిపోతుంది. కానీ అది దోషమే అవుతుంది. నిజానికి మెట్లు మొదలు చేసేచోట ఇంటి బేస్‌మెంట్‌ను తగలకుండా కాంక్రీటు బలంగా పోసి దాని నుండి మెట్లు ప్రారంభించాలి. ఇంజినీర్లు అవన్నీ పట్టించుకోకుండా ప్లింత్‌ బీము ముందుకు పెంచుతారు. అలాచేసినప్పుడు దానికి ఎదురు దిశ ఈశాన్యంలో అంతే పొడవు బీము భూమిలో ఇవాల్సి ఉంటుంది.


సెల్లారులోకి ఎటువైపు వెళ్లాలి? ఇన్‌ అవుట్‌ ఎట్లా పెట్టాలి. షాపులు కడుతున్నాము.-బిట్ల మారుతి, వరంగల్‌

మీరు ఎటురోడ్డు ఉన్న స్థలంలో కమర్షియల్‌ బిల్డింగ్‌ కడుతున్నారో చెప్పలేదు. తూర్పు, ఉత్తరం వీధి కలిగిన స్థలాలకు సెల్లారులు ఇవ్వడం మంచిది కాదు. దక్షిణం, పడమర రోడ్లు ఉన్న స్థలాలలో చేసే నిర్మాణాలకు చక్కగా ఎన్ని సెల్లారులు అయినా వెళ్లవచ్చు. దోషం ఉండదు. సెల్లారులోకి వెళ్లాలి అంటే దక్షిణం వైపు ఆగ్నేయ భాగం నుండి లోపలికి ర్యాంపు తీసుకొని దానిని ఇన్‌ గేట్లుగా వాడవచ్చు. అలాగే పశ్చిమ వాయవ్యంలో ర్యాంపు తీసుకొని దానిలో నుండి బయటకు అవుట్‌ గేటు ఏర్పాటు చేసుకోవచ్చు. కమర్షియల్‌ బ్లాకులు తూర్పు దిశ రోడ్డులో కట్టినప్పుడు తూర్పు - ఉత్తరం వైపు స్థలం వదిలి ఆ ప్రదేశంలో పార్కింగ్‌ ఏర్పాటు చేయడం మంచిది. అటువైపు కాంపౌండు వాల్స్‌ ఎట్లాగు రావు కాబట్టి మరింత స్థలం వదిలికడితే బాగుంటుంది. లేదా లిఫ్ట్‌తో మొత్తం టెర్రస్‌పైన పార్కింగ్‌ పెట్టొచ్చు.


మాకు ఎల్లమ్మ తల్లి ఉంది. దానిని నైరుతిలో (పైభాగం) పెట్టొచ్చా? మా పాత ఇంట్లో అట్లానే ఉంది.-సుంకు ధనమ్మ, ఆత్మకూర్‌

మన తెలంగాణ పల్లెటూర్లలో ఇప్పటికీ కొందరు వారివారి కులదేవతలను ఇంటి పైభాగం అని నైరుతి దిశలో ఒక అర్ర ఏర్పాటు చేసి దానిని పూర్తిగా అమ్మవారికే కేటాయిస్తారు. పూజల సమయంలో దానిని గొప్పగా అలంకరించి పూజిస్తుంటారు. నిజానికి అది పాత సాంప్రదాయమే కానీ అది శాస్త్ర నియమం కాదు. వాస్తవానికి అమ్మవారి గది అయినా స్వామి గది అయినా ఇంటికి ఉచ్ఛభాగం తూర్పు లేదా ఉత్తరమే అవుతుంది. ఆ దిశలలోనే తూర్పు సెంటర్‌లో లేదా ఉత్తరం సెంటర్‌లో ఒక గదిని మీ ఎల్లమ్మ తల్లికి కేటాయించండి. దానికి చక్కగా రెండు ద్వారాలు నిర్మించి దానిలో మీ పూజా కార్యక్రమాలు చేయండి. గృహంలో నైరుతి భాగం పూజకు ఉత్తరం వైపు మార్చడం దోషం కాదు. అది అమ్మ ఇష్టపడే స్థలమే. పైగా మీకు శుభం కలుగుతుంది.


logo