మంగళవారం 02 జూన్ 2020
Sunday - Mar 01, 2020 , 13:27:13

కరోనా.. భారత్‌కు ఓ హెచ్చరిక!

కరోనా.. భారత్‌కు ఓ హెచ్చరిక!

ఒక వైరస్‌.. ప్రపంచాన్నే వణికిస్తున్నది. అది సోకితే వచ్చే వ్యాధి ఏంటో? చికిత్స ఏంటో? తెలియక సైంటిస్టులే తలలు పట్టుకుంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో దీనిని సీరియస్‌గా తీసుకొని గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ‘పిశాచంతో పోరాడుతున్నాం’ అని ప్రకటించారు. వ్యాధి సోకినవారు పిట్టల్లా రాలిపోతుంటే ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఆ వైరస్‌ ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా? అవును. అదే కరోనా. మోస్ట్‌ డేంజరస్‌ కోవిడ్‌-19.

వ్యాధి మొదలైనప్పటి నుంచి కేవలం నెల రోజుల కాలంలోనే వేలాది మంది చనిపోవడం చూస్తుంటే.. మునులు, రుషులు చెప్పినట్టుగా కలికాలం ప్రభావమని అనుకోవాల్సి వస్తున్నది. భూమిపై ముసం పుట్టిందా అనే అనుమానమే వస్తున్నది. అసలు కోవిడ్‌ 19 పుట్టుక స్థానమైన చైనాలోని వుహాన్‌ నగరంలో దాదాపు కోటి 10 లక్షల మంది ప్రజలు కేవలం తమ ఇండ్లలోనే బంధీలయ్యారు. 


ఇండియా పరిస్థితేంటి? 

30 దేశాల వరకు కరోనా బారిన పడ్డట్టుగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. చైనాతోపాటు, జపాన్‌, అమెరికా, థాయ్‌లాండ్‌, జపాన్‌, దక్షిణకొరియా, వియత్నాం, సింగపూర్‌, మలేషియా, నేపాల్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, శ్రీలంక, భారత్‌, ఫిలిప్పీన్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. చైనా ప్రభుత్వం కేవలం పది రోజుల్లోనే వేయి పడకల ఆసుపత్రిని నిర్మించి కరోనాతో పోరాటం చేస్తున్నది. ప్రజలు కూడా స్వీయనియంత్రణ పాటిస్తూ ఇంటి నుంచి బయటకు రావడం లేదు. చైనా పద్ధతి బాగుంది. ఇదే పరిస్థితి మరి ఇండియాకు వస్తే? సరే.. కరోనా కాకపోతే ఇంకోటి ఏదైనా మహమ్మారి సోకితే? ఏంటి పరిస్థితి? అంతటి మౌలిక సదుపాయాలు.. మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేంత ప్రణాళికలు.. పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అమలు చేసే యంత్రాంగం.. అన్నింటికీ మించి ఇక్కడి ప్రజలు స్వీయనియంత్రణను పాటిస్తారా? 


హెల్త్‌ ఎమర్జెన్సీ 

కరోనా.. కొత్త పేరు కోవిడ్‌19.. పేరు ఏదైతేనేమి.. ప్రపంచాన్ని మాత్రం ఈ వైరస్‌ గడగడలాడిస్తున్నది. గడిచిన నెల రోజులుగా చైనాతోపాటు దాదాపు 30 దేశాలు ఈ వైరస్‌ బారిన పడగా.. ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా తమ దేశాల్లోకి వైరస్‌ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఈ వైరస్‌ పుట్టిన వుహాన్‌ నగరంతోపాటు చైనా దేశంలోని దాదాపు సగ భూభాగం, హుబెయి ప్రావిన్సులో కర్ఫ్యూలాంటి పరిస్థితి నెలకొంది. 70 కోట్ల మంది తమ ఇండ్లల్లోనే ఉంటూ.. బయటికి రాకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ.. వైరస్‌ను తుద ముట్టించేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తున్నారు. వెన్‌ఝౌ నగరం నుంచి రాకపోకలను నిషేధించారు. ఇప్పటికే సుమారు 2300 మంది ఈ వైరస్‌ బారినపడి మరణించడం ప్రపంచానికి ఉన్న ముప్పును.. ఈ వైరస్‌ తీవ్రతను చెప్పకనే చెబుతున్నది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతి టెడ్రోస్‌ ‘ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ని ప్రకటించాల్సి వచ్చింది. 
చైనా యంత్రాంగం భేష్‌

చైనాలో మొదలైన ఈ ప్రాణాంతక వైరస్‌ను మొదట్లో మిగతా వ్యాధుల్లాగే పరిగణించారు. అయితే దీని ప్రభావం తీవ్రం కావడంతో చైనా వెంటనే మేల్కొంది. విస్తృతమైన చర్యలను తీసుకుంది. తమ దేశంలోని వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బందిని, వైద్యులను అప్రమత్తం చేసి కరోనా అనుమాతులందరినీ పరీక్షించింది. పైగా వ్యాధిగ్రస్థులను ఎక్కడికక్కడ ఏర్పాటుచేసిన ఆసుపత్రుల్లో క్వారంటైన్‌ చేసి చికిత్సలు అందిస్తున్నారు. దీనికోసం అక్కడి వైద్య సిబ్బంది అహర్నిశలు, రాత్రి అనక.. పగలు అనక కష్టపడుతున్నారు. కనీసం టాయిలెట్లకుకూడా వెళ్ళేందుకు సమయం లేకపోవడంతో.. డైపర్లు వేసుకొని పనిచేస్తున్నారంటే వారి కమిట్‌మెంట్‌ను అర్థం చేసుకోవచ్చు. వేలాది మంది కరోనా బారిన పడి వస్తున్న బాధితులకు చికిత్స అందించేందుకు ఇండోర్‌ స్టేడియాలను, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను కూడా ఆసుపత్రులుగా మార్చివేసి చైనా యంత్రాంగం మొక్కవోని దీక్షతో కష్టపడుతున్నది.


స్వీయ నియంత్రణ

ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల నుంచి సహాయ సహకారాలు లేకుండా ఏ పని అయినా.. కార్యక్రమమైనా.. ముఖ్యంగా ఇలాంటి మహమ్మారి లాంటి వ్యాధులు ప్రబలుతున్న సమయంలో విజయవంతం కావు. చైనాలో బయలుదేరిన కోవిడ్‌19కు అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రభుత్వం ఎంతటి కట్టుదిట్టుమైన, వేగంగా చర్యలు తీసుకుందో.. అక్కడి ప్రజలు కూడా స్వీయ నియంత్రణతో సహాయ సహకారాలు అందిస్తుండడం అబ్బుర పరుస్తుంది. ఎంతలా అంటే.. సుమారు 70 కోట్ల మంది స్వీయనియంత్రణను పాటిస్తూ.. తమ ఇండ్లకే పరిమితమయ్యారు. బహిరంగ ప్రదేశాలకు, విహారయాత్రలకు, శుభకార్యాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, షాపింగ్‌కు, మాల్స్‌కు, వ్యాపారాలను మానుకొని.. వైరస్‌ను తగ్గించేందుకు ఇతోధికంగా సహాయ పడుతున్నారు. అలాగే ఏమాత్రం అనుమానం ఉన్నా.. కనీసం 14 రోజులపాటు ఇతరులను కలుసుకోకుండా ఐసోలేషన్‌ రూములకే పరిమితమవుతున్నారు. 


అధిక జనాభా దేశాలకు సవాలే

జనాభా విషయంలో చైనా తర్వాత మనది రెండో స్థానం. అధిక జనాభా గల దేశాల్లో వైరస్‌ వంటివి వ్యాప్తి చెందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, వైరస్‌ సోకిన వారిని గుర్తించడం, వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడం వంటివి సవాల్‌గా నిలుస్తాయి. అయితే చైనా ఈ విషయంలో మెచ్చుకోదగ్గ స్థాయిలోనే ఉంది. వైరస్‌ ప్రమాదాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం సాధ్యమైనన్ని చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగానే కేవలం పది రోజుల్లో వెయ్యి పడకల హాస్పిటల్‌ నిర్మించి అందరిని విస్మయపరిచింది. దీంతో పాటు పెద్ద మొత్తంలో మాస్కులను ప్రజలకు అందజేసింది. ప్రయాణాలను నిలిపివేసింది. పూర్తి అవగాహన కల్పించడంలో, వైరస్‌ వ్యాప్తి జరుగకుండా అరికట్టడంలో తీవ్ర ప్రయత్నమే చేస్తుందని చెప్పవచ్చు. అయితే పక్కనే ఉన్న భారత్‌ ఈ విషయంలో ఇంకా నిద్రలేవలేదనే చెప్పాలి. బయో ఆసియాలో శాస్త్రవేత్తలు చెప్పినట్లు ఇది ప్రపంచ సమస్య. కాని భారత్‌ ఇంకా సరైన చర్యలు తీసుకోవడం విఫలమవుతూనే ఉంది. 
మౌలిక వసతులు ఉన్నాయా? 

ఇక వైద్య సేవల విషయానికి వచ్చేసరికి.. మన దేశం చాలా వెనుబడిందనే చెప్పవచ్చు. చిన్న ఇంటిని నిర్మించాలంటేనే నెలలు, సంవత్సరాల సమయం తీసుకునే నిర్మాణ రంగం మన సొంతం. ఇక చైనాలో 10 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రి లాంటి నిర్మాణం చేయాలంటే చేతులెత్తేయక తప్పదు. అలాగనీ.. మనతో ఆ పని సాధ్యం కాదనేది కాదు.. అలాంటి ప్రణాళిక, ఇంజినీరింగు, ఆధునిక యంత్రాలు, మన వద్ద లేకపోవడం.. ఉన్నవాటిని వినియోగించలేకపోవడం మనలను వేధిస్తున్న అసలైన జబ్బు. గతంలో భారీ నిర్మాణాలైన.. సాగునీటి ప్రాజెక్టులను తీసుకుంటే.. 10 నుంచి 30 సంవత్సరాల వరకు నిర్మించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నర సంవత్సరాల్లోనే పూర్తిచేయడం వెనుక పకడ్బందీ ప్రణాళికలు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, ఆధునిక యంత్రాల ఉపయోగం, భారీ సంఖ్యలో కార్మికులను వినియోగించడం, ముడిపదార్థాలను వేగంగా సమీకరించడం లాంటివి కనపడుతాయి. కరోనాలాంటి వైరస్‌ ప్రవేశిస్తే.. చేపట్టాల్సిన చర్యలను వేగంగా పూర్తిచేసేందుకు ఇలాంటి ఇంజినీరింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


తీసుకున్న చర్యలు

ప్రస్తుతం కరోనా బారిన పడిన దేశాల్లో మనం కూడా ఉన్నాం. కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నా.. ఈ సంసిద్ధత సరిపోదనే హెచ్చరికలు వైద్య నిపుణుల నుంచి వినపడుతున్నాయి. బయోఏషియాలో యూకేలోని గ్లోబల్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీటర్‌ పియట్‌ చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ముందస్తు సంసిద్ధతతోనే ఇలాంటి వ్యాధులను అడ్డుకోవచ్చని, చైనా, జపాన్‌లు మాత్రమే ఆ ఏర్పాట్లలో ఉన్నాయని.. భారీ జనాభాతో ఉండే భారత్‌ లాంటివి సిద్ధంగా లేవనే విధంగా సంకేతాలు పంపించడం మనం ఏం చేయాలో చెబుతున్నది.


10 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రి..

ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌, టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో చైనాదే పైచేయి. కోవిడ్‌19ని ఎదుర్కోవడానికి వుహాన్‌ నగరంలో అప్పటి కప్పడు 10 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రిని నిర్మించడం చైనీయుల ఇంజినీరింగు, నిర్మాణ ప్రతిభకు తార్కాణం. కేవలం పది రోజుల్లోనే ఆసుపత్రి భవన నిర్మాణంతోపాటు.. అసుపత్రిలో ఉండాల్సిన అన్ని రకాల వసతులు, ఎమర్జెన్సీ పరికరాలు, అత్యాధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ నుంచి మొదలుకొని టాయిలెట్ల వరకు పూర్తిచేయడం కేవలం చైనా యంత్రాంగానికే చెల్లు. 6.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ వేయి పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు సుమారు 7 వేల మంది కార్మికులు, ఇంజినీర్లు, సిబ్బంది, నిపుణులు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు 24 గంటలపాటు ఇందులో పాల్గొన్నారు. వాయి వేగంతో వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌న ఎదుర్కొనేందుకు చైనా యంత్రాంగం అంతే వేగంతో చర్యలు తీసుకుంటున్నది. ఏకంగా సైన్యాన్నికూడా రంగంలోకి దింపింది.
సన్నద్ధతతో ఉన్నాం: 

అన్ని టీచింగ్‌ ఆసుపత్రుల్లో ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. కరోనా లాంటి వ్యాధులను తగ్గించేందుకు ఐసోలేషన్‌ వార్డులే కీలకం. సామాన్య జనంతో కలవకుండా.. ప్రత్యేకంగా ఉంచి వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం, రాష్ట్రం కూడా తగిన చర్యలు తీసుకుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైనా, చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చే ప్రతీ ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరీక్షించి, వ్యాధి ఉన్నా.. లేకున్నా కచ్చితంగా 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌ పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. పరిస్థితులను వైద్య, ఆరోగ్య శాఖ నిరంతరం పరిశీలిస్తున్నది.

డాక్టర్‌ రమేష్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌


అవగాహనఎంత?

 వైరస్‌ గురించి అవగాహన లేకపోవడం, ప్రభుత్వం సైతం కల్పించకపోవటం పెద్ద సవాలుగా మారింది. చైనాలో దీనివల్లనే ప్రాణనష్టం ఎక్కువగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేశారు. సాధారణ ఫ్లూ లక్షణాలే కరోనాకు సోకిన వారికి ఉంటుంది. దీన్ని గుర్తించడం కొంత క్లిష్టమైన పనే. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలి. ఈ దిశగా ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. కాని మన దేశంలో అలాంటి చర్యలేమి కనిపించడం లేదు. మన ప్రజల్లో స్వతహాగా ఉన్న విచ్చలవిడి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ కొంత అవరోధంగా కనపడుతున్నాయి. చైనాలో చూస్తే.. ఏకీకృత కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండటంతో.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మరుక్షనం క్షేత్రస్థాయిలో అందరూ పాటిస్తున్నారు. కానీ మన దేశంలో ఎంతమేర పాటిస్తారనేది కొంత అనుమానాస్పదమే. ఎవరికి వారు ముందుకు వచ్చి.. ఇలాంటి మహమ్మారిని అడ్డుకునేందుకు స్వీయ నియంత్రణ పాటిస్తూ.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా సహాయం అందిస్తేగానీ ఇలాంటి మహమ్మారి వ్యాధులను అడ్డుకోలేము. ఇలాంటి వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎంతో ఉంది. వైరస్‌ వ్యాప్తి చెందక ముందే అడ్డుకోవడం కొంత సులువు. కాని ఒక్కసారి వ్యాప్తి చెందడం చేయి దాటిందంటే దాన్ని అడ్డుకోవడం ప్రపంచ దేశాల వల్ల కాని పరిస్థితి. ఈ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
గాంధీలో ప్రత్యేక కేంద్రం: 

చైనా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని ట్రాకింగ్‌ విధానంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చినవారితోపాటు వారి కుటుంబ సభ్యులను కూడా 14 రోజుల పాటు ఫోనులో పర్యవేక్షిస్తున్నాం. జలుబు, దగ్గు లాంటి వ్యాధి లక్షణాలుంటే.. వారిని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యాధి లక్షణాలను నిర్ధారించుకోవడానికి పుణేకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా మన గాంధీ దవాఖానలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. ఇందుకు అవసరమైన  కిట్లను కేంద్ర ఆరోగ్య విభాగం అందిస్తున్నది. అన్ని విభాగాలు ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉన్నాయి.

-డాక్టర్‌ శంకర్‌, డైరెక్టర్‌, ఐపీఎం


భారత్‌ సంసిద్ధత ఎంత? 

ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి? ముందస్తు చర్యలేంటి? వ్యాప్తి జరుగకుండా ఎలా అడ్డుకోవాలి? పరిశోధనలు ఎలా ఉండాలి? అనే అంశాలపై భారత్‌కు ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేదని స్పష్టమవుతున్నది. పక్కనే ఉన్న చైనా కరోనా వైరస్‌ వ్యాపించి వేల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతుంటే.. భారత్‌ మాత్రం ఇంకా పోరాటానికి సిద్ధమవడం లేదు. ఇలాంటి వైరస్‌ వ్యాపించినపుడు ఎదుర్కొనేందుకుగాను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కూడా లేని పరిస్థితి మన దేశంలో నెలకొంది. 


మన సంసిద్ధత ఏది?

ఊహించని విధంగా విజృంభిస్తున్న కరోనా (కొవిడ్‌-19)పై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని పలు దేశాల ప్రముఖ శాస్త్రవేత్తలు ఇటీవల జరిగిన బయో ఏషియా సదస్సులో అభిప్రాయపడ్డారు. వైరస్‌ వ్యాప్తి గురించి సరైన అవగాహన కల్పించడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అడ్డుకోవచ్చని సూచించారు. యూకేలోని గ్లోబల్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీటర్‌ పియట్‌ మాట్లాడుతూ.. ముందస్తు సంసిద్ధత అనేది మాత్రమే వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుందన్నారు. వైరస్‌ పై అవగాహన లేకపోవటం వల్ల వ్యాప్తి పెరిగి, మరణాలు పెరిగినట్లు తెలిపారు. వైరస్‌ సోకిన వారిని ఐసోలేటెడ్‌గా ఉంచి చికిత్స అందించడం అత్యంత ఉత్తమమైన చికిత్స విధానం అని చెప్పారు. చైనా, జపాన్‌లు మాత్రమే చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. 
బయోసేఫ్టీ ల్యాబులేవీ?

వైరస్‌లు విజృంభించడం ఇదేమీ కొత్తకాదు.. ప్రపంచాన్ని వణికించిన అనేక వైరస్‌ల ప్రభావం మన దేశంపైకూడా పడింది. నిఫా, ఎబోలా, జికాలతోపాటు స్వైన్‌ఫ్లూ, సార్స్‌ లాంటివి ప్రపంచంలోని ఏదో ఒక మూలన తలెత్తడం మొదలెడితే.. మన దేశానికి వాటి ప్రమాదం లేదని మాత్రమే అనుకోవడానికి వీలులేదు. అలాంటి తీవ్రమైన వ్యాధులు వచ్చాయా.. వాటి ప్రభావం ఏమిటి.. విదేశాల నుంచి వచ్చే వారిని పరీక్షించాలంటే కూడా మన దేశంలో సరైన బయో సేఫ్టీ ల్యాబులు అందుబాటులో లేవు. ఇప్పటికికూడా ఎలాంటి వైరస్‌ వ్యాధికి సంబంధించిన పరీక్ష అయినా.. పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించాల్సి వస్తున్నది. దీనివల్ల పరీక్ష ఫలితాలు ఆలస్యంగా రావడంతోపాటు డబ్బు ఖర్చు కూడా ఎక్కువ తడిసి మోపెడవుతున్నది. దీనికన్నా ప్రమాదం ఏమిటంటే.. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే కరోనా లాంటి వ్యాధుల విషయంలో ఒక్క రోజు ఆలస్యమైనా దాని ప్రభావం మనం ఊహించనంతటి స్థాయిలో ఉండే ప్రమాదం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రాణాంతక వైరస్‌లను నిర్ధారించి సరైన సమయంలో చికిత్స అందించాలంటే.. బయోసేఫ్టీ ల్యాబ్‌లు (బయో సేఫ్టీ లెవల్‌-3) అవసరం. అలాంటివి కనీసం రాష్ర్టానికి ఒకటైనా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. విపత్తు వచ్చినపుడు ఎదుర్కోవడం కంటే ముందు నుంచే సంసిద్ధంగా ఉండడం భారత్‌లాంటి అధిక జనాభా గల దేశాలకు ఎంతో ముఖ్యం. 
ఎక్కల్‌దేవి శ్రీనివాస్‌, సెల్‌: 8096660568logo