బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Mar 01, 2020 , 01:14:37

మన ప్రాంత జీవవైవిధ్యం ప్రపంచానికి పరిచయం!

మన ప్రాంత జీవవైవిధ్యం ప్రపంచానికి పరిచయం!

దట్టమైన అడవులు. ఆకట్టుకునే ప్రకృతి సోయగాలు. హాయిగొలిపే పక్షుల కిలకిలారావాలు. మెలికలు తిరుగుతూ పారే నదీనదాలు. గ్రామాల చుట్టూ ప్రహరీ మాదిరిగా ఎత్తైన కొండలు. వీటన్నింటి నడుమ విహంగాల విహారాలు. వీటిని ‘క్లిక్‌మని’ ఫొటోలో బంధించే పక్షి ప్రేమికులు. ఇలాంటి ఎన్నో అద్భుత ఘడియలు. బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ తియ్యని జ్ఞాపకాలు.మట్టి నేల కాంక్రీటవుతున్నది. పంటపొలాలు లే-అవుట్లుగా మారుతున్నాయి. టెక్నాలజీ కొత్త వస్తువులకు ప్రాణం పోస్తున్నది. కొత్త ఆవిష్కరణలన్నీ మానవాళికి అనుకూలమే. కానీ.. వీటి పర్యావసనంతో కొన్ని చిన్న జీవులు చిదిమివేయబడుతున్నాయి. చాలా పక్షిజాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. బతికి ఉన్న కొన్ని పక్షులు జనావాసాలకు దూరంగా వెళ్లిపోయాయి. ‘తెలంగాణలో ఈ పక్షి జాతులు కూడా ఉండేవి’ అని భవిష్యత్‌ తరాలు పాఠ్యాంశాల్లో చదువుకునే దుర్గతి రాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌' పేరుతో పక్షుల గుర్తింపు కార్యక్రమం చేపట్టింది. 


వినూత్న కార్యక్రమం

డిసెంబర్‌ 14, 15 తేదీల్లో ‘బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌' కార్యక్రమం జరిగింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండల పరిధిలోని కోసిని, మాలిని హిల్స్‌, నందిగామ కొండలు, పాలరపు కొండలు, బెజ్జూర్‌, పెంచికల్‌పేట ప్రాణహిత నదీ తీరం వెంట, తిర్యాణి మండలంలోని గుండాల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కనుమరుగవుతున్న పక్షిజాతులను కాపాడుకునేందుకు, జిల్లాలోని వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు, ఈ ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం ఉపయోగపడుతుంది. తెలంగాణలో జరిగిన మొదటి బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ ఇది. 


ఎవరెవరు పాల్గొన్నారంటే..

బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అటవీశాఖ మూడు నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేసకున్న వారిలో  150 మందిని ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల పక్షి ప్రేమికులున్నారు. వీరిలో వివిధ రంగాలకు చెందిన వారున్నారు. ఫొటోగ్రఫీ విద్యనభ్యసిస్తున్నవారు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, సినీ రచయితలు, కవులు, కళాకారులు ఇలా విభిన్న రంగాల్లో ఉన్నవారికి ‘బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌'లో పాల్గొనేందుకు అవకాశమిచ్చింది. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన పక్షి ప్రేమికులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. స్థానిక అటవీ అధికారులు వీరిని లోహ, బెజ్జూర్‌, పెంచికల్‌పేట అడవుల్లో తిప్పుతూ పక్షుల్ని చూపించారు.. ముఖ్యంగా బెజ్జూర్‌ సమీపంలోని పాలరాపు గుట్ట రాబందులకు ఆవాసం. ఇక్కడి రాబందులు సైతం పక్షి ప్రేమికుల్ని ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోనే అతి శీతల గ్రామంగా పేరొందింది లోవ గ్రామం. ఈ గ్రామం చుట్టూ దట్టమైన అడవి ఉంది. చల్లని ప్రదేశం, నీటి వనరులు, సేంద్రియ పంటలు ఎక్కువగా పండిస్తుండడంతో ఈ ప్రాంతంలో అనేక రకాల పక్షులు సేదతీరుతాయి. ఇవన్నీ పక్షి ప్రేమికుల్ని ఆకట్టుకున్నాయి. అటవీ పరిసర ప్రాంతాల్లోని గ్రామీణులను సైతం  ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. ‘ఎలాంటి పక్షులు తిరుగుతుంటాయి? ఏ ఏరియాలో ఏ పక్షులు తిరుగుతాయి, ఏ సమయానికి ఏ జాతి పక్షులు బయటికొస్తాయి’ వంటి అంశాలన్నీ స్థానికులకు ఎక్కువ తెలిసి ఉంటుంది. అందుకనే వారిని భాగస్వామ్యం చేశారు. వారికి పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించారు. 
ఏమేం పక్షులు? తర్వాతేంటి?

రెండ్రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 270 పక్షిజాతుల్ని గుర్తించారు. వీటిలో రాబందులు, అయోరా, ఇండియన్‌ ప్యారడైజ్‌డ్‌ ఫ్లై క్యాచర్‌ బర్డ్స్‌, లిటిట్‌ ఫ్లై క్యాచర్‌ బర్డ్స్‌, రింగ్‌ రోజ్డ్‌ ప్యారా కిడ్‌, చాంగ్‌బుక్‌ హక్‌, కింగ్‌ఫిషర్‌, గిజిగాడు, తోకపిట్టలు వంటివి 270 జాతులు ఉన్నాయి. హిమాలయ ప్రాంతాలు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, వివిధ దేశాల నుంచి తరలి వస్తున్న పక్షి జాతుల్ని ఈ బర్డ్‌ వాక్‌లో అధ్యయనం చేశారు. పక్షి ప్రేమికులు పక్షుల వీడియోలు, ఫొటోలను కెమెరాల్లో చిత్రీకరించుకున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో పక్షులతో కూడిన ఫొటోల ఆల్బమ్‌, డాక్యుమెంటరీని తీసుకురానున్నారు. ఇలా మన దగ్గరున్న పక్షి సంపదను ప్రపంచానికి తెలిసేలా చేయడమే ముఖ్య ఉద్దేశంగా బర్డ్‌వాక్‌ కార్యక్రమం జరిగింది. అటవీశాఖ అధికారులు దగ్గరుండి పక్షి ప్రేమికులకు పక్షుల్ని పరిచయం చేశారు. అడవుల్లో, వాగుల వెంట, జలాశయాల వెంట పక్షుల జాడను చూపించారు. 

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వలసజాతుల వన్యప్రాణుల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘కాప్‌' (కాన్షరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌) 13 వ సదస్సు జరుగుతున్నది. ఈసందర్భంగా ఇటీవల ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ - 2020’ నివేదికను వెల్లడించింది. ఈ సర్వేలో చాలా పక్షి జాతులు ప్రమాదానికి చేరువలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో జరిగిన ‘పక్షి జాతుల అధ్యయనం’పై కథనం.


అక్కల చంద్రమౌళి, 91775 41446


logo