గురువారం 04 జూన్ 2020
Sunday - Mar 01, 2020 , 01:04:16

మహిళా సెక్యూరిటీ గార్డ్‌ కావాలా? వీరిని సంప్రదించండి!

మహిళా  సెక్యూరిటీ గార్డ్‌ కావాలా? వీరిని సంప్రదించండి!

సెక్యూరిటీ గార్డు అనగానే ముందుగా గుర్తొచ్చేది యూనిఫాం, మెడలో విజిల్‌, చేతిలో లాఠీ.. అటూ ఇటూ తిరుగుతూ పరిగాపులు కాస్తుంటాడు. ఈ వృత్తిలో పురుషులు తప్ప మరెవరినీ ఊహించలేం. మహిళలు ఉంటే బాగుంటుంది కదా అనుకుందాం.. వారికే భద్రత లేదు వీరు మరొకరికి రక్షణ కల్పిస్తారా? అని నవ్వుతారు. అవును.. మహిళలు కల్పించే భద్రత మరెవరూ కల్పించలేరంటున్నది బెంగళూరుకు చిందిన శ్రావణి పవార్‌. అంతేకాదు వందలమంది మహిళలను సెక్యూరిటీ గార్డ్‌లుగా తీర్చిదిద్దుతున్నది.. వారిని హైదరాబాద్‌, గోవా, చెన్నై రాష్ర్టాలకు ఉద్యోగానికి పంపుతున్న శ్రావణి పవార్‌ ఇంకేం చేస్తుందో తెలుసుకోండి.

సరస్వతి వనజ

అది 2009 సంవత్సరం. సుజిత(పేరు మార్చాం) భర్త ఉద్యోగం చేస్తేగాని ఇల్లు గడువదు. అలాంటిది ఆయనకు పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. ఆమె చదువుకోలేదు. ఏ పని తెలిసేది కాదు. ఇద్దరు పిల్లలు. వారిని చదివించాలంటే సుజిత ఉద్యోగం చేయాలి. మరో దారిలేదు. అప్పుడే 2010లో లేడీస్‌ హ్యాస్టల్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం కల్పించింది శ్రావణి పవార్‌. ఇది ఆమెకు మంచి ఆదాయం, ఈఎస్‌ఐ, ఇతర ప్రయోజనాలను తెచ్చిపెడుతున్నది. ఇప్పుడు ఈమె ‘సేఫ్‌ హ్యాండ్స్‌ 24*7’ అనే సంస్థలో భాగమైనందుకు గర్వపడుతున్నది. ఇదంతా ఆ సంస్థ ద్వారానే సాధ్యం. సుజిత ఒకతే కాదు భర్త చనిపోయిన వారు, విడాకులు పొందినవారు, ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పింస్తున్నది సేఫ్‌ హ్యాండ్స్‌ సంస్థ.

శ్రావణి పవార్‌ కర్ణాటకలోని ధార్వాడ్‌ నివాసి. కర్ణాటక విశ్వవిద్యాలయంలో సోషల్‌వర్క్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. తర్వాత గ్రామీణాభివృద్ధి రంగంలో పనిచేస్తున్న ఓ ఎన్జీఓలో ఆరు నెలలు పనిచేసింది. ఆ కాలంలో పెద్దదిక్కులేని కుటుంబాల దుస్థితిని ఆమె గ్రహించింది. మహిళా సాధికారత దిశగా పనిచేయడానికి ఆమెను ప్రేరేపించింది. తర్వాత దేశ్‌పాండే ఫౌండేషన్‌తో కలిసి సామాజిక వ్యవస్థాపక శిక్షణా కార్యక్రమంలో చేరింది. శిక్షణా  క్రమంలో పవార్‌ మరో ఇద్దరితో కలిసి మహిళల కోసం పనిచేయాలని కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు. వారు లింగ అంతరాన్ని పూరించాలనుకున్నారు. ఈ పట్టుదలతోనే మహిళను సెక్యూరిటీ గార్డులుగా నియమించాలనుకున్నారు. ఈ ఉద్యోగానికి మహిళలు ఒప్పుకుంటారా? అని కూడా ఆలోచించారు. దీనిపై మహిళల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి సర్వే నిర్వహించారు. ‘ఆడవాళ్లు చీరకట్టుకొని ఇంటికే పరిమితమయ్యే ఈ కాలంలో ప్యాంటు, చొక్కా వేసుకొని అది కూడా రక్షణ లేని ఉద్యోగంలో చేరాలా? ఆడవాళ్లకు రక్షణ కల్పించండంటూ పోరాటాలు జరుగుతున్న ఈ రోజుల్లో వీరు ఒకరికి రక్షణ కల్పిస్తారా?’ అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. పురుషాధిక్యం అధికంగా ఉన్న ఈ ఉద్యోగంలో మహిళలు తప్పకుండా చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నది పవార్‌. కుటుంబం కోసం ఒంటరిగా పోరాడుతున్న తల్లుల వద్దకు వెళ్లి వారికి ధైర్యాన్నిచ్చింది. ఈ ఉద్యోగంపై అవగాహన కల్పించింది. ఇలా ముగ్గురితో మొదలై పదులు, వందల సంఖ్యకు చేరుకున్నది. వారితోనే సేఫ్‌ హ్యాండ్స్‌ సంస్థ పూనుకున్నది.ఆర్మీ శిక్షణ: సెక్యూరిటీ గార్డు అంటే మామూలు విషయం కాదు. వారు శారీరకంగా ఎంతో దృఢంగా ఉండాలి. ఎదుటివారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉండాలి. ఇది మహిళలకు సాధ్యమేనా? సాధ్యమంటున్నది పవార్‌. ఉద్యోగంలో చేరాలనుకున్న మహిళలందరినీ ఒక చోట చేర్చింది. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీల రెగ్యులేషన్‌ యాక్ట్‌, 2005(సీఎస్‌ఎఆర్‌ఎ) ఉద్యోగంలో చేరిన మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తర్వాత వీరిని చూస్తే సైనికులుగానే కన్పిస్తారు తప్ప గార్డు అని ఎవరూ అనుకోరు. శిక్షణ కూడా పూర్తయింది. ఒక వారికి ఉద్యోగం కల్పించాలి. నగరంలో చాలా హాస్పిటల్స్‌, విద్యాసంస్థలు, లేడీస్‌ హాస్టల్స్‌, కార్యాలయాలు ఉన్నాయి. కానీ వారెవ్వరూ మహిళల్ని సెక్యూరిటీగా నియమించడానికి ధైర్యం చేయడం లేదు. వారిని ఒప్పించడం సవాలుతో కూడుకున్న పని. ఒక ఛాన్స్‌ ఇచ్చి చూడండి. కొన్ని రోజులు వారి పనితనాన్ని గమనించండి. నచ్చకపోతే మీ ఇష్టం అని వేడుకున్నది. ఉద్యోగంలో చేర్చుకున్నారు. పురుషులకంటే వీరే బాధ్యతగా పని చేస్తున్నారని తెలుసుకున్నారు. ఇలా అన్ని ప్రదేశాల్లో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి సంస్థలు. మరికొంతమంది వాణిజ్య సంస్థలకు హౌస్‌కీపింగ్‌ కూడా చేస్తారు. వీరి యోగక్షేమాలు చూసుకుంటారు. సురక్షితమైన ప్రదేశాలలో మాత్రమే మహిళలను గార్డుగా నియమిస్తారు. వీరికి రాత్రి 8 గంటల వరకే పనివేళలు. ఆ తర్వాత వీరి స్థానంలోకి పురుషులు వస్తారు. సంస్థలో చేరిన మహిళలు కర్ణాటక, హైదరాబాద్‌, గోవా, చెన్నై వంటి రాష్ర్టాలలో సేవలందిస్తున్నారు. కంఫర్ట్‌ జోన్‌ను దాటి వెళ్లాలని కోరుకునే ప్రతీ స్త్రీకి ప్రేరణగా వీరు నిలుస్తున్నారు. పురుషాధిపత్య వృత్తిలో తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటున్నది. సంస్థ కృషికి గాను కొన్ని అవార్డులు వరించాయి. మిగిలిన వివరాల కోసం 

https://www.facebook.com/pg/Safe-Hands-24x7-164205180264421/photos/?tab=album&album_id=29913639842151


తల్లిదండ్రులకు తెలియదు

సంస్థలో 800 మంది ఉంటే అందులో 60 శాతం మహిళలే. ఈ సంస్థ గురించి మా తల్లిదండ్రులకు తెలియదు. ఒకరోజు నిజం చెప్పకతప్పలేదు. అందుకు అమ్మానాన్న ఒప్పుకోలేదు. అప్పటికే 100 మంది ఉద్యోగంలో చేరడంతో కుదరదని చెప్పాను. దీంతో 7 నెలలు మా మధ్య మాటల్లేవు. కానీ, తోటి మహిళలకు నేను కల్పిస్తున్న ఉద్యోగాలు, బాధ్యతలే వారిని మార్చేలా చేశాయి. 

- శ్రావణి పవార్‌, వ్యవస్థాపకురాలు


logo