శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Mar 01, 2020 , 00:51:15

గుట్ట మీద దేవుడు

గుట్ట మీద దేవుడు

అప్పటివరకు నోటమాట రాక నిలబడి పోయిన రాంరెడ్డి కాళ్లకింద భూమి కదిలినట్లనిపించింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుట్టను కరిగించి రాళ్లుగా మార్చి కోట్లు సంపాదించుకోవాలనుకుని ఇటీవల క్వారీ పెట్టడానికి ప్రభుత్వ అనుమతి తెచ్చుకున్నాడు రాంరెడ్డి. దానికోసం లక్షలు ఖర్చుపెట్టాడు. కానీ ఇప్పుడు.. ఇలా.. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నడుస్తూ ఇంటిదారి పట్టాడు.ఇదంతా గమనిస్తున్న సమ్మయ్య ఆనందంతో నవ్వుకున్నాడు.

తూర్పున ఆకాశం పూర్తిగా తెలవారనేలేదు. ఊరి ఆడవాళ్లు ఒక్కరొక్కరిగా లేచి వాకిలి ఊడ్చి కళ్లాపి చల్లుతున్నారు. ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నా.. ఆరుబయటి గాలికి అలవాటు పడ్డ కొన్ని జీవితాలు చేతిలో చెంబుతో చెట్ల చాటుకు వెళుతున్నాయి. కూ.. కూ.. కిచ.. కిచ.. కావ్‌ కావ్‌... చెట్ల కొమ్మల్లో పక్షుల కిలకిల రావాలు. వాటి అరుపులు విని కుక్కలు భౌ.. భౌమని అరుస్తున్నాయి.‘ఒరేయ్‌.. రామన్న.. లింగయ్య.. రాజీగా ఉన్నారారా..’ సమ్మయ్య అరుస్తూ పరుగెత్తు కొస్తున్నాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. సమ్మయ్య అరుపులకు ఊరు ఊరంతా మేల్కొంది. అందరి ఇండ్లముందు బల్బులు వెలిగాయి. పడుకున్న వారు, అప్పుడే మెలకువ వచ్చిన వారంతా బయటకు పరుగెత్తుకు వచ్చి ఊరి మోతుబరి రాంరెడ్డి ఇంటి ముందు చేరారు.పరుగెత్తుకుంటూ వచ్చిన సమ్మయ్య ఆ గుంపునకు ఎదురుగా చేరాడు.‘ఏంట్రా సమ్మయ్య.. ఏమయింది? ఎలుగుగొడ్లు ఏమన్న తరిమినయా? దొంగలు ఎవరన్న ఎంట వడ్డరా?’ లుంగీ, బనీను మీదున్న రాంరెడ్డి ప్రశ్నించాడు. ‘అదేం లేదయ్య. గా పెద్దగుట్ట మీద..’ ఆయాసపడుతూ అగిపోయాడు. అందరి ముఖాలు విచ్చుకున్నాయి. ‘పెద్దగుట్ట మీదా ఏమయ్యింది?’ అందరి ఆలోచన అదే!‘ఆఁ.. పెద్దగుట్ట మీదా ఏం జరిగిందిరా?’ రాంరెడ్డి నోట అనుమానం నిండిన ప్రశ్న ధ్వనించింది? 

అందరూ ఆయననే చూస్తున్నరు.

‘గుట్టమీదా దేవుడు ఎలిసిండు’ అసలు విషయం చెప్పేశాడు.

‘దేవుడా’ ఆశ్చర్యంగా అడిగాడు రాంరెడ్డి.

‘దేవుడు ఎలిసిండా?’ అందరూ ఒకరిముఖాలు ఒకరు చూసుకుంటూ గుసగుసలాడుతున్నరు.

‘అవును పటేలా. దేవుడే.. పెద్దపెద్ద కళ్లు, పెద్ద బొట్టు, పేద్ద.. నాలుక అచ్చం మన ఊరి పోచవ్వ తల్లి లెక్కనే ఉన్నది’

రాంరెడ్డికి ఏం అనాలో అర్ధం కాలేదు. గుసగుసలు ఎక్కువయ్యాయి.

తూర్పు దిక్కున సూర్యుడు వెలుగులు చిమ్ముతూ తెరలుతెరలుగా బయటకు వస్తున్నాడు.

‘ఒరేయ్‌ సమ్మా.. పదరా చూద్దాం.. గుట్టలేందీ? దేవుడు ఎలుసుడేందిరా? అరేయ్‌ అందరూ రండి’ రాంరెడ్డి అందరినీ పురామాయించాడు.

అక్కడ నిలబడి ఉన్నవాళ్లంతా ఎవరి ఇండ్లకు వాళ్లు తాళాలు వేసి ఉన్న పళంగా గుట్టకు బయలుదేరారు. కొంతమంది ఇంట్లో ఉన్న కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు కూడా తీసుకొని మరీ బయలుదేరారు.పదినిమిషాల్లో ఊరుఊరంతా గుట్టమీదుంది. సమ్మయ్య చెప్పిన దగ్గర రాయితో చెక్కిన అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది. అది ఎన్నో ఏళ్ల కాలంనాటి దానిలా పాతబడి ఉంది.విగ్రహాన్ని చూడగానే ఊరివాళ్లంతా చెంపలేసుకుంటూ కళ్లు మూసుకొని ఎవరికి తోచినట్లు వారు దండం పెట్టుకుంటున్నారు. కొంతమంది తమవెంట తెచ్చిన పసుపు, కుంకుమ చల్లి కొబ్బరి కాయలు కొడుతున్నారు.తెనుగోల్ల లచ్చిమికి పూనకం వచ్చింది. ‘అరేయ్‌ మీ పాపాలు పండినయి. నన్ను నా గుట్ట మీద నుంచి పంపేయ్యాలని చూస్తార్రా’ అంటూ పూనుతుంది. ఆమెను మరో ఇద్దరూ పట్టుకున్నారు.

‘అయ్యో తల్లి ఇది నీ గుట్ట నిన్నెవరు పంపుతారు తల్లి, శాంతించు తల్లి శాంతించు’ ఎవరో వేడుకుంటున్నారు.‘నేను శాంతించాలంటే ఈ గుట్ట మీద నా గుడి కట్టాలే. ప్రతీ సంవత్సరం పెద్ద ఎత్తున జాతర చేయాలే. నా గుట్ట మీద చిన్నరాయి కూడా కదల్చకూడదు’ పూనకం వచ్చిన లచ్చిమి చెబుతున్నది.‘అట్లనే తల్లి అట్లనే నీవన్నట్లే చేస్తం. గుడి కడుతం తల్లి. తప్పకుండా కడుతాం’ గ్రామస్తులు చెబుతున్నారు.అప్పటివరకు నోటమాట రాక నిలబడి పోయిన రాంరెడ్డి కాళ్లకింద భూమి కదిలినట్లనిపించింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుట్టను కరిగించి రాళ్లుగా మార్చి కోట్లు సంపాదించుకోవాలనుకుని ఇటీవల క్వారీ పెట్టడానికి ప్రభుత్వ అనుమతి తెచ్చుకున్నాడు రాంరెడ్డి. దానికోసం లక్షలు ఖర్చుపెట్టాడు. కానీ ఇప్పుడు.. ఇలా.. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నడుస్తూ ఇంటిదారి పట్టాడు.

ఇదంతా గమనిస్తున్న సమ్మయ్య ఆనందంతో నవ్వుకున్నాడు.ఊరికి పడమరన పెట్టని గోడగా ఉండి.. చెట్లు, చేమలతో పాటు వర్షకాలంలో గుట్టమీద పడే వర్షపునీరు కిందికి చేరి గుట్టకింద భూములకు నీరందించి పంటలు పండడానికి కారణమవుతుంది. పశువులకు పశుగ్రాసం, పక్షులకు ఆవాసం, ఊరివాళ్లకు సీతాఫలాలు అందిస్తున్న గుట్టను కరిగిద్దామనుకున్నాడు రాంరెడ్డి. ఊరి జనం ఎంత చెప్పిన వినకుండా అధికారులకు లంచాలిచ్చి మరీ పర్మిషన్‌ తెచ్చుకున్నడు. అందుకే సమ్మయ్య పట్నం వెళ్లి అమ్మోరు విగ్రహాన్ని కొనుక్కొచ్చి గుట్టమీద పెట్టాడు. ఈ విషయం తెనుగు లచ్చిమికి మాత్రమే చెప్పి పూనకం వచ్చినట్లు నటించమన్నాడు. ఊరందరికోసం చేసే పని కనుక ఆమె కూడా ఒప్పుకొన్నది.అదేం తెలియని ఊరి జనం దేవుడు వెలిశాడని గుడి కట్టడానికి సిద్ధమయ్యారు. ప్రజలందరికీ ఉపయోగపడే గుట్టను కాపాడుకోవాలనే తలంపుతో తలపెట్టిన తమ పథకం పారినందుకు సమ్మయ్య, లచ్చిమి ఆనందంతో ఇంటిదారి పట్టారు.


రచయిత పరిచయం

మధుకర్‌ వైద్యుల చిన్నతనం నుంచే రచనారంగం మీద ఆసక్తి ఏర్పరుచుకున్నారు. పాఠశాల నుంచే కవిగా, రచయితగా ఉన్నారు. 1995లో జర్నలిస్టుగా వృత్తి ప్రారంభించారు. మరోవైపు సాహిత్య, సామాజిక సేవా రంగంలో సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆయన చదువుకున్న స్కూల్‌ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తీసిన ‘శాంతికిరణం’ అనే పాఠశాల మ్యాగజైన్‌కు ‘జ్ఞాపిక’ అనే కవిత తొలిసారి రాశారు. 2014లో ‘స్వతంత్ర సుమాలు’ కవితా సంపుటి తెచ్చారు. ‘అమ్మకావాలి’, ‘బతుకు చిత్రం’, ‘ఒక అమ్ము... ఒక అభి’, ‘ప్రేమిస్తే’, ‘కడప టూ హైదరాబాద్‌ వయా అనంతపూర్‌' తదితర కథలు ప్రజాశక్తి, సూర్య దినపత్రికల్లో అచ్చయ్యాయి. ‘మా ఊరి జాడేది’, ప్రాయశ్చిత్తం’ కథలు నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో, ‘అందమైన విధ్వంసం’ కథ నవతెలంగాణ ‘సోపతి’లో ప్రచురితమయ్యాయి. ‘పోరుబాట’ అనే సీరియల్‌ నవల సూర్య దినపత్రికలో ప్రచురితమైంది. ఇప్పటి వరకూ 20 కథలు, మూడు వందల కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వాటికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందాయి. 1996 నుంచి కోల్‌వాయిస్‌, చర్చ, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో పాత్రికేయునిగా సేవలందించారు. సూర్య దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరి ఆదివారం అనుబంధం ఇన్‌చార్జ్‌గా, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో సీనియర్‌ జర్నలిస్ట్‌గా ఉన్నారు. 


మధుకర్‌ వైద్యుల, సెల్‌: 8096677409


logo