బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Mar 01, 2020 , 00:46:55

ఇంద్రుడే చేశాడు

ఇంద్రుడే చేశాడు

ఒక పండితుడికి పెద్ద తోట ఉంది. దాంట్లో రకరకాలైన పళ్ళచెట్లు ఉన్నాయి. పళ్ళను అమ్ముకుంటాడు కానీ ఎప్పుడూ ఒక్క పండు కూడా ఎవరికీ ఇచ్చిన పాపానపోడు. పైగా తన పాండిత్యంతో మంత్రతంత్రాలతో జనాల్ని మభ్యపెట్టి డబ్బు గుంజేవాడు.ఒకరోజు ఒక పేదవాడి ఆవు పండితుడి తోటలోకి జొరబడి కొన్ని మొక్కల్ని తిన్నది. ఆ దృశ్యం చూసిన పండితుడు ఆగ్రహోదగ్రుడై ఆ ఆవును బలమైన కర్రతో విపరీతంగా బాధించాడు. ఆ దెబ్బలకు తాళలేక అది చనిపోయింది. ఆ ఆవు యజమాని ఆ సంగతి తెలుసుకొని నెత్తీ నోరూ బాదుకున్నాడు. ఎందుకంటే అది అతని జీవనాధారం. దాని పాలు అమ్మి జీవించేవాడు. చుట్టు పక్కల జనాలు ఆ పేదవాడి తరఫున పండితుడి ఇంటికి వచ్చి ‘పవిత్రమైన గోవును హింసించడమే కాకుండా దాన్ని చంపావు. ఈ పేదవాడు జీవనాధారం కోల్పోయాడు. అతనికి ఏదో కొంత ధనసాయం చేయి. భారతీయులకు పవిత్రమైన గోవును చంపావు. పాపపరిహారంగా పూజలు నిర్వహించు’ అన్నారు.పండితుడు ‘మీరు చెప్పినట్లు చనిపోయిన ఆవుకు పరిహారం చెల్లించదగిన విషయం కొంత ఆలోచించదగిందే. కానీ పాప పరిహారార్థం పూజా పునస్కారాలు చెయ్యడమన్నది నాకు సంబంధించిన విషయం. అది పక్కన పెట్టండి. దోష నివారణ చర్యలు చెయ్యడం, చెయ్యకపోవడం నేను చూసుకుంటాను’ అన్నాడు.

జనం ‘అయితే ఈ పేదవాడికి ఇంకో ఆవును కొనుక్కోవడానికి సరిపడా డబ్బు ఇవ్వండి’ అన్నారు.

పండితుడు ‘ఆవును ఎవరు చంపారు?’ అన్నాడు.

‘నువ్వు చంపడం అందరూ చూశారు కదా!’ అన్నారు.

‘కాదు, ఆవును ఇంద్రుడు చంపాడు’ అన్నాడు పండితుడు.

‘ఇంద్రుడేమిటి? చంపడమేమిటి?’ అని జనం విస్తుపోయారు.

పండితుడు ‘మనం నిమిత్తమాత్రులం మన కర్మకు ఇంద్రుడే బాధ్యుడు’ అంటూ కొన్ని శ్లోకాలు వినిపించి జరిగినదంతా లేని ఇంద్రుని మీద తోసేశాడు. 

జనం ఏమీ మాట్లాడలేక ఎక్కడవాళ్ళు అక్కడకు వెళ్ళిపోయారు.

మరుసటిరోజు ఒక గంభీరమైన వ్యక్తి పండితుడి తోట దగ్గరకు వెళ్ళి ‘ ఈ తోట ఎంత అందంగా ఉంది రకరకాల ఫలవృక్షాలు ఎవరు నాటారో’ అన్నాడు.

అక్కడు ఉన్న పండితుడు ‘ఈ తోట నాది. ఈ చెట్లన్నీ నేనే నాటాను’ అన్నాడు. ఆ వ్యక్తి దగ్గరేవున్న బావిచూసి ‘ఈ బావి నీళ్ళు పారడానికి చెట్ల దాకా ఎంత చక్కగా కాలువలు తీశారు. ఎవరు ఈ పనిచేశారో?’ అన్నాడు.

పండితుడు ‘నేనే ఈ కాలువలు తవ్వాను’ అన్నాడు గర్వంగా.

‘ఇంత అందమైన పూలపొదలు ఎవరు ఏర్పరిచారో?’

‘నేనే’ అన్నాడు పండితుడు.

‘అయ్యా! చెట్లు నాటింది మీరు, కాలువలు తీసింది మీరు. పూలపొదలు ఏర్పాటు చేసింది మీరు. ఇన్ని మీరు చేసి ఆవును చంపడం మాత్రం నామీద వెయ్యడం ఏమైనా ధర్మంగా ఉందా?’ అన్నాడు.

ఆ వచ్చిన ఇంద్రుడు.

ఇంద్రుని సాక్షాత్కారంగా భయపడిపోయిన పండితుడు ఇంద్రుని పాదాలపై పడి ‘నా తప్పు మన్నించండి’ అని వేడుకున్నాడు.

ఇంద్రుడు ‘మొదట ఆ పేదవాణ్ణి ఆదుకో. అతనికి ఆవును ఖరీదు చేసే డబ్బు ఇవ్వు. ఇటుపై ఇట్లాంటి కుతర్కాలతో జనాల్ని మభ్యపెట్టకు!’ అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు.

పండితుడు పేదవాడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి డబ్బు ఇచ్చి మన్నించండని కోరాడు.

సౌభాగ్య


logo