గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Mar 01, 2020 , 00:18:55

ఆధ్యాత్మిక పర్యాటకం చిత్రకూటం

ఆధ్యాత్మిక పర్యాటకం చిత్రకూటం

పచ్చటి కొండలు, ఆ కొండల మీద ఏపుగా పెరిగిన చెట్లు, వాటి మధ్య కంటికి కనిపించడకుండా చెవులకు మాత్రమే వినిపించే గుప్త గోదావరి, కొండల నడుమ సప్త స్వరాలతో కచేరి చేస్తున్నట్లు పారే మందానికి నది ఇలా ప్రకృతి సౌదర్యం చిత్రకూటం సొంతం. అదేవిధంగా తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఆ పరమపావనుడైన శ్రీరామ చంద్రుడు, తన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం సమయంలో మొదట ఇక్కడే కొంతకాలం ఉన్నాడు. దీంతో ఆ పరమ పావనుడైన శ్రీరామచంద్రుడి పాదధూళిని తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ చిత్రకూటం మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతున్నది. ఇక్కడ చూడదగిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కొన్ని ప్రాంతాల గురించి మీకోసం.

‘చిత్రకూటం’ పేరు వినగానే ఆ ప్రదేశంలో జరిగిన రామాయణ సన్నివేశాలు కళ్ళ ముందర కదలాడతాయి. ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులకు దగ్గరగా మధ్యప్రదేశ్‌ అడవులలో ఈ ప్రాంతం కనిపిస్తుంది. పచ్చని కొండలు... వేగంగా ప్రవహించే వాగులు... జలపాతాలు... అందంగా ఆహ్లాదకరంగా సాగిపోయే మందాకినీ నది యాత్రికుల హృదయాలను కొల్లగొడతాయి.

సతీ అనసూయ తపోభూమిగా చెప్పబడుతున్న ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మనసు మనలో ఉండదు. ఎందుకంటే సీతారాములు అరణ్యవాసం సమయంలో ఇక్కడే తిరుగాడినట్టు చెబుతారు. అందువలన వాళ్లు విశ్రాంతి తీసుకున్న ప్రదేశాలు ... స్నానమాచరించిన ప్రదేశాలు ... తపమాచరించిన ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటాయి.ఈ ప్రదేశంలోనే అమ్మవారి వక్ష స్థలాన్ని కాకాసురుడు పొడవగా, ఆ కాకి పైకి శ్రీ రాముడు దర్భను ప్రయోగించాడు. ఫలితంగా ఆ కాకి కన్ను పోయింది ... అందుకే నేటికీ కాకులు ఒక కన్నుతో ఏటవాలుగా చూస్తూ ఉంటాయని అంటారు. 

రామ్‌ఘాట్‌: మందాకినీ నది ఒడ్డున ఉన్న ఘాట్‌ ఒడ్డునే శ్రీరాముడు ప్రతి రోజూ స్నానం చేసేవాడని చెబుతారు. రామలక్ష్మణులు స్నానం చేసే సన్నివేశాలను తులసీదాస్‌ తన మనోనేత్రాలతో దర్శించాడని చెబుతారు. ఈ వివరాలన్నింటినీ తులసీదాస్‌ తన రామచరిత మానస్‌లో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. దీనికి కొద్ది దూరంలోనే సీతాదేవి స్నానం చేసే జానకి కుండ్‌ను కూడా దర్శించుకోవచ్చు.
భరత్‌ మిలాప్‌

తన అన్నగారు చిత్రకూట్‌లో ఉన్నారని తెలుసుకొన్న భరతుడు వేలాది మంది సైనికులను, పరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చి ఇదే ప్రదేశంలో రాముడిని కలిశాడు. రాముడు తన వనవాస దీక్షను వదలనని చెప్పడంతో ఆయన పాదుకలను తీసుకొని రాజ్యానికి తిరిగి వెళ్లి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి రాజ్యపాలన గావిస్తాడు. అందుకు గుర్తుగా భరతుడికి చిన్న గుడిని కూడా ఇక్కడ మనం చూడవచ్చు.


గుప్త గోదావరి: కంటికి కనిపించడకుండా చెవులకు మాత్రమే వినిపించే శబ్దంతో ఇక్కడ గోదావరి అంతర్గతంగా ప్రవహిస్తుంటుంది. గుప్త గోదావరి ప్రవహిస్తున్న ఈ ప్రదేశానికి కొంత దూరంలో యమునా నది ప్రవహిస్తూ వుంటుంది. శ్రీ రాముడు ఎక్కువ కాలం కొలువుదీరిన ప్రదేశమంటూ ‘కామత్‌ గిరి’ అనే కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. రామాయణంలో విన్న ప్రదేశాలు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ అనుభూతిని ఆసాంతం ఆస్వాదించవచ్చు. 

రామశయ్య: సీతారాములు శయనించడానికి వీలుగా ఒక పెద్ద చెట్టునీడన గల రాతి ప్రదేశాన్ని ఒక మంచంలా వాడుకొన్నారు. దీనినే రామశయ్య అని అంటారు. ఇక సీతారాములు కుర్చొన్న శిలపై ఇప్పటికీ వారి పాదముద్రలు మెరుస్తూ కనిపిస్తాయి. ఆ మెరుపునకు కారణం తెలియడం లేదు.

ఉత్సవాలు : చిత్రకూటంలో ప్రతీ అమావాస్యకూ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ముఖ్యంగా దీపావళి రోజున జరిగే దీపోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ మంత్రిత్వ శాఖలు విడివిడిగా అందుబాటు ధరలో భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇవి కాక ప్రైవేటు బడ్జెట్‌ హోటళ్లు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నుంచి ఇక్కడకు 500 కిలోమీటర్లు.


హనుమాన్‌ ధార్‌

చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల మీటర్ల ఎత్తులో హనుమాన్‌ ధార ఉంటుంది. దాదాపు రెండువేల మెట్లను ఎక్కితే ఇక్కడ మనకు ఒక పెద్ద హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని నిత్యం ఒక నీటి ధార అభిషేకిస్తూ ఉంటుంది. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం ఇప్పటికీ నిఘూడ రహస్యం. ఆ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు.logo