మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Mar 01, 2020 , T00:02

వాస్తు

వాస్తు

ఇంటికి ఉత్తరంలో పడమర కట్‌చేసి మెట్లు వేయొచ్చా?- పసుమాముల అమర్‌, దుద్దెడ

మెట్లు ఇంటికి బయట వేయాలంటే.. ఇంటి నాలుగు మూలలు సుస్థిరంగా అలాగే ఉంచి వాటిని ఏ మూల కూడా కత్తిరించకుండానే బయటకు వేసుకోవాలి. ఇంటిమూల కట్‌ చేస్తే తప్ప మెట్లు రావు అన్న సంకట పరిస్థితి వచ్చినప్పుడు ఉత్తర వాయవ్యం కట్‌చేసి వేసుకోవచ్చు. అదికూడా ఇంటి ఉత్తర భాగం ముప్పైఆరు ఫీట్లు ఉన్నప్పుడు అందులో మూడో భాగం అంటే పన్నెండు ఫీట్లు వచ్చేలా చూసి అందులో అంత భాగమే ఇంటిని కట్‌చేసి ఉత్తరం అందుకు సమానంగా మెట్లు వేసుకోవచ్చు. చాలామంది అలా ఉత్తర వాయవ్యం కట్‌చేసి మెట్లు వేసుకున్నప్పుడు ఆ భాగంలో ఇంటికి పడమర వాయవ్యంలో ద్వారంపెట్టి వదిలి వేస్తున్నారు. అది సరైన విధానం కాదు. ఆ నిర్మాణానికి ఉత్తరంలో తప్పక బాల్కనీ రావాల్సి ఉంటుంది. అప్పుడే ఇంటికి వాయవ్యం కటింగ్‌తో మెట్లు వచ్చి ఆ నిర్మాణానికి ఉత్తరం, ఉత్తర ఈశాన్య భాగాలు నిలబడి శాస్త్ర సమ్మతం అవుతుంది. ఇందుకు విరుద్ధంగా చేస్తే విరుద్ధ ఫలితాలే పొందుతారు.


మాది తూర్పు, ఉత్తరం రోడ్డు స్థలం. ఏ రోడ్డుకు ప్రధాన ద్వారం పెట్టుకోవాలి. అందులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?-మేడి శాంత, హుస్నాబాద్‌

మీది ఈశాన్య స్థలం. దానితో మీరు ఇల్లు కట్టాలంటే ముందుగా మీ పరిసర ప్రాంతాలను పరిశీలించాలి. ఈశాన్యం భాగం గొప్పదే కావచ్చు. కానీ దానికి వెనుక భాగంలో ఇతర నిర్మాణాలు తప్పక వచ్చి ఉంటేనే అది తన సహజ వైభవాన్ని కనబరుస్తుంది. “సైన్యం లేని రాజుకు ఏ ప్రాధాన్యత, రక్షణ లేనట్టు” తూర్పు ఉత్తరం వీధులున్న స్థలానికి పడమర - దక్షిణం ఇతర నిర్మాణాలు వచ్చి ఉండాలి. అప్పుడే అందులో ఇంటి నిర్మాణానికి పూనుకోవాలి. ఇక తూర్పు రోడ్డు ప్రధానంగా కట్టాలి ఉత్తరం రోడ్డు ప్రధాన ద్వారం పెట్టి కట్టాలా అన్న నియమం దీనికి వర్తించదు. రెండూ ఉత్తమ దిశలే, రెండు వైపులా సింహ ద్వారాలు వచ్చేలా గొప్పగా శాస్ర్తాన్ని స్థిరీకరించి ఇంటిని కట్టాలి. ఈశాన్యం స్థలం అనగానే చంకలు బాదేసుకొని నిర్మాణం చేయడం మంచిదికాదు. దానికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. స్థలం అనుకూలమా అన్నది ప్రధానంగా చూసుకోవాలి.


పూజ గదిలో పూజా సామగ్రికి సెల్ఫ్‌ ఎటు కట్టాలి? అసలు కట్టొచ్చా?-వి.అనంతాచారి, సిరిసిల్ల

పూజగదిని కాస్త విశాలంగా కట్టుకుంటే సెల్ఫ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూజగదికి దానికి సంబంధించిన సామగ్రి అంతా పూజా పీఠం కింద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీ పూజగది స్థలం విశాలంగా ఉంటే పూజగది దక్షిణం గోడకు సెల్ఫ్‌ పెట్టుకోండి. దానికి ద్వారాలు పెట్టుకోండి. ఆ సెల్ఫ్‌ను కేవలం దక్షిణంలో పూజాపీఠాన్ని అంటకుండా కట్టండి. అలాగే పూజగది ద్వారం గదికి మధ్యలో సరిగ్గా సెంటర్‌లో పెట్టి ఉంటే ఆ పడమర ద్వారానికి ఇరువైపులా ద్వారం పోను మిగిలిన గోడకు రెండువైపులా సెల్ఫ్‌లు కట్టుకొని వాటిల్లో పూజా సామగ్రిని ఏర్పాటు చేయవచ్చు. పూజగది తూర్పు ముఖంగా తూర్పు దక్షిణం ద్వారం పెట్టి కట్టినప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పోను, దక్షిణం గోడకు దక్షిణ నైరుతి దిశలో సెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు - ఉత్తరం గోడలు దేవుడు కూర్చునే దిశ ఎప్పుడూ ఖాళీగానే ఉండాలి. 


ఆగ్నేయంలో బయట మెట్లు కడితే లోపల నైరుతి గది ద్వారానికి అవి ఎదురు అవుతాయి కదా. తప్పుకాదా?-మోది అనుపమ, వెంకటాపురం

మీరు చెపుతున్నది బయటి మెట్లు, మీ సందేహం లోపల ఉన్న నైరుతి పడక గది గురించి. ఇది చాలా విడ్డూరమైన సందేహం. ఒక ఇంట్లో లోపలి ఆవరణంలో విభజన దాని వసతి, వాటిలో జరిగే దోషాలు వేరు. ఇంటిబయటి ఆవరణంలో జరిగే దోషాలు వేరు. ఇంటికి తూర్పు ఆగ్నేయంలో వచ్చే మెట్లు ఉత్తరం ముఖంగా ఉంటాయి. అవి దక్షిణం నుంచి నేలమీదకు వాలుగా వచ్చి ఆగిపోతాయి. ఆ స్థానం ఇంటిలోపల ఉన్న ప్రధాన పడక గదికి ఉన్న ఈశాన్య ద్వారానికి ఎదురు అవుతాయి కదా అన్నది మీ అనుమానం. అది ఎంత మాత్రం లెక్కించాల్సిన అవసరం లేదు. ఇంట్లో మెట్లు వచ్చినప్పుడు ఆ గృహంలోని దక్షిణం మెట్లు హాలులోకి చొచ్చుకొని వచ్చి నేరుగా పడకగది ద్వారంలోకి వచ్చిపడుతుంటాయి. ఇది బయట మెట్లు వచ్చినప్పుడు వర్తించదు. అడ్డుగా గోడలు, వాటి గోడలు ఉంటాయి. మీకు అనుమానం అక్కరలేదు. మీ మెట్లు దోషం కాదు. శుభం.


logo