బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Feb 23, 2020 , 02:04:11

అమరధామంలా శోభిల్లే ప్రకృతి అందాలు

అమరధామంలా శోభిల్లే ప్రకృతి అందాలు

ఎప్పుడు రొటీన్‌ జీవితం. పుస్తకం.... చాక్‌ ఫిస్‌..... బ్లాక్‌ బోర్డు..... డస్టర్‌ పట్టి పాఠాలు చెప్పే పంతుళ్లకు కొత్త ఆలోచనలు వచ్చాయి. ప్రకృతి అందాలు వీక్షించాలని టీచర్ల మనసు ఉవ్విళ్లూరింది. అవి శీతాకాలపు సెలవులు గత ఏడాది డిసెంబర్‌లో రాత్రి హెచ్‌.పి. యస్‌. ఆర్‌. స్కూల్‌ నుండి తెలంగాణా టూరిజం బస్సులో జయ జయ ధ్వనులు చేస్తూ జై తెలంగాణ..... జై కేసీఆర్‌.... అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ వింటినారి నుండి సంధించి విడిచిన బాణంలా రహదారి వెంట బస్సు వేగంగా దూసుకుపోతున్నది. ఎవరికివారు ముచ్చట్లలో మునిగి ఉన్నారు. కిలకిల నవ్వులతో,సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చలి దుప్పట్లు వెచ్చగా కప్పుకొని కొంతమంది కునుకుతీస్తున్నారు.

తెల్లవారింది. పచ్చని పంట పొలాలు. పక్కనే నీటి కాలువలు, పనులకు వెళుతున్నవాళ్ళు,పంట పొలాల్లో పని చేసే రైతులు, అక్కడక్కడ పశువులు, ఆకాశంలో పక్షులు వరసలుగా కదిలి వెళుతుంటే చూసిన ప్రతి కంటికి ఎంతో ఆనందం. ప్రకృతి ఒడిలోకి వెళ్తుంటే చెప్పలేని ఆనందం. మబ్బు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు దాగుడుమూతలు ఆడినట్లుగా వస్తూ పోతున్నాడు.ఒక దగ్గర ప్రయాణం నిలిపి ముఖం కడుక్కొని కొద్దిగంత టిఫిన్‌ తిని వేడి వేడి చాయ్‌, కాఫీలు తాగి మళ్ళీ ప్రయాణం. సన్నని ఇరుకు రోడ్డు, ఒక పక్క నీటి కాలువలు, మరో పక్క పంటపొలాలు, ఎటు చూసినా కొబ్బరి చెట్లు. ఆ చెట్ల మధ్యలో ఉండి మిణుగురుపురుగు కాంతిలాగా మెరుస్తున్న దిండి సరోవర్‌ విడిది చేసే చోటుకు చేరుకున్నాం. 


ఆ పక్కనే చల్లని తల్లి తెల్లనైన తెలివాహ (గోదావరి) నది. ఎంత బాగుందో గోదారమ్మ తల్లి.  ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రయాణించి అలసిపోయి సేదతీర్చుకుంటున్నట్లుగా మెల్లగా కదిలిపోతున్నది. అమరధామంలా శోబిల్లే ప్రకృతి అందాలను చూస్త్తుంటే  టైమే తెలియట్లేదు. గబగబా ఎవరి గదుల్లోకి వారు, మరో గంటలో భోజనశాలకు చేరుకొని రుచికరమైన భోజనం చేసి మళ్ళీ బస్సుఎక్కి కూర్చున్నాం. దిండి నుండి 24 కి.మీ. ప్రయాణం. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. సాయంకాలం అవుతున్నది. తొందర తొందరగా సముద్రుడి దగ్గరికి వెళ్లి అతని వెంట 3 కి.మీ. పాదయాత్ర చేసి సాగరసంగమం దగ్గరికి చేరుకున్నాం. అక్కడ ఓ అద్భుత శిల్పసౌందర్యముంది. సముద్రుడి వెంట నడుస్తూ ఎదురుగా చూసేసరికి నందీశ్వరుడిలా, గోదారమ్మ వచ్చి కలిసే చోటు నుండి చూస్తే శివలింగంలా కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని కన్నులతో చూసి ఆనందం పొందాలే గాని చెప్పడానికి మాటలురావు.  


 అంతర్వేదిని వర్ణిoచాలంటే హృదయాoతరాలల్లోకి వెళ్తేగాని వర్ణిoచలేం. ఆ నీళ్ళు ఉషోదయపుకాంతుల్లో మధురంగా, సాయంసంధ్య లో ఉప్పుగా ఉండటం సృష్టి రహస్యం ఎవరికెరుకా! ఒకే భూమిలో ఒక చెట్టు పండు తీపిగా, మరొక్క చెట్టు పండు చేదుగా ఉండటం ఎంత నిజ మో..ఇది అంతే! అంతర్వేది లక్ష్మీనరసింహుడిని దర్శించుకొని అక్కడే హోటల్లో వేడివేడి చాయ్‌ తాగి బసకు ప్రయాణం అయినాం. చేప ల చెరువులు, వరుసగా తాటివృక్షాలు,కొబ్బరిచెట్లు, పచ్చని పంట పొలాలు. అక్కడి ప్రకృతిని చూస్తుంటే తెలంగాణ ఉద్యమం ఎందు కు జరిగిందో అర్థమైంది. ఇంత అభివృద్ది వీరికి ఉండి స్వచ్చమైన నీటితో ఏడాదికి మూడు పంటలు పండిస్తూ హాయిగా ఉన్నారు.  


ఎవరో జంతికలు తెచ్చి చేయి సాపేసరికి నవ్వుతూ తీసుకొని తింటుండగా రాత్రి 9 :00 గం.లకు బసచేరుకున్నా ము. రాత్రి క్యాంపు ఫైర్‌ వెలిగించారు. పాటలతో, డ్యాన్స్‌లతో, కేరింతలుకొడుతూ పరవశించిపోయి అంద రూ స్టెప్పులు వేశారు.  మరునాడు  ఉదయం బస్సులో పాలకొల్లు బయలుదేరి క్షీరారామలింగేశ్వరుడిని దర్శించుకొని పూతరేకులు,కాకినాడకాజాలనూ రుచిచూస్తూ బస్సులో యానం మీదుగా కాకినాడకు చేరుకున్నాం. కోరింగ వైల్డ్‌లైఫ్‌ సంరక్షణ కేంద్రానికి సాయంత్రం 4:00 గం.లకు చేరుకున్నాం. అందులో కలియతిరుగుతూ ఒక్కొక్కచెట్టును పలకరించుకుంటూ తిరిగి బస్సుదగ్గరికి చేరుకున్నాం.


అటునుండి చాళుక్యులు, చోళులు నిర్మించిన అద్భుతమైన 500 సం.రాల చరిత్ర కలిగి దక్షణకాశిగా పేరుపొందిన ద్రాక్షారామంలో అడుగుపెట్టాం.  పురాతనమైన ఆలయంలో వ్యాసుడు,అగస్త్యుడు తపస్సు చేసిన నేల అది. అమ్మవారి శరీరం 18 భాగాలుగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖడించాడు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైన దక్షవాటికలో మాణిక్యాలదేవిగా వెలిసింది. ఇక్కడ క్షేత్రపాలకుడు వేంకటసత్యనారాయణస్వామి సత్యదేవుడు ఉన్నాడు. గుడి అంతరాలయంలో 15 అడుగుల స్ఫటికలింగం ఉంది. క్రింది భాగం నలుపు, పైభాగం తెలుపుగా ఉంటుంది. ఎదురుగా నంది ఆయన పుష్టభాగం దిక్కు పెద్ద వటవృక్షం. దానికింద శివలింగం పైన విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఆ గుడి బయట కోనేరు అదే ( సప్తగోదావరి) నదీమతల్లిని తలపై చల్లుకొని మరొక్క మారు నమస్కరించి తిరుగు ప్రయాణం మొదలై తెల్లవారేసరికి భాగ్యనగరం(హైదరాబాద్‌) చేరుకున్నాం.      


అంతర్వేది సమీపంలో  సాగరసంగమం  

ఓ అద్భుత సౌందర్యం. సముద్రుడి వెంట నడుస్తూ ఎదురుగా చూసే సరికి నందీశ్వరుడిలా, గోదారమ్మ వచ్చి కలిసే చోటు నుండి చూస్తే శివలింగంలా కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని కన్నులతో చూసి ఆనందం పొందాలే గాని చెప్పడానికి మాటలురావు.  

డా దొంతులపల్లి కృష్ణారెడ్డి  

సెల్‌: 99490 43853


logo