గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Feb 23, 2020 , 01:57:25

మూడు లింగాల త్రిలింగేశ్వరాలయం

మూడు లింగాల త్రిలింగేశ్వరాలయం

రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర అనే మూడు లింగాల కలయికతో ఒకే చోట లింగాకృతిలో ఉన్న మందిరం త్రిలింగేశ్వరాలయం. మూడు లింగాలు ఒకే ఆలయంలో ప్రతిష్ఠితమై ఉండడమే ఇక్కడి ప్రత్యేకత. ఈ సనాతన త్రిలింగేశ్వరాలయాన్ని క్రీ.శ 12వ శతాబ్దంలో నిర్మించారని పెద్దలు చెబుతున్నారు. ఈ ఆలయ ముఖద్వారం, ప్రధాన ద్వారం, స్వాగత తోరణాలు అన్నీ ఒకే రాతితో నిర్మించారు. ఇది ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రతి ముఖద్వారానికి ఒకే రాతితో నిర్మించిన శిల్పకళ ఉంటుంది. ఈ ఆలయాన్ని ఏవైపు నుంచి చూసినా లింగాకృతిలో కనిపిస్తుంది. విశిష్ఠ మైన చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఎక్కడ ఉంది? కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌లో ఉంది.  

లేపాక్షిని పోలిన నంది

ఈ ఆలయంలో నెలకొల్పిన నంది విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుంది. దీనిని లేపాక్షి నంది విగ్రహంతో పోల్చుతారు. ఈ ఆలయాన్ని ఒకే కాలు, ఒకే చేయి ఉన్న శిల్పాచార్యుడు రూపకల్ప న చేశాడని పెద్దలు చెపుతున్నారు. ఆయన ఈ ఆలయాన్ని నిర్మించి ఇదే ఆలయంలో సజీవ సమాధి అయ్యా రని అంటారు. ఈ ఆలయానికి నాలుగు ముఖద్వారాలున్నాయి. ఈ ద్వారాలకు ఇరువైపులా నాట్యం చేస్తున్న బొమ్మలు ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. స్వాగతం పలుకుతున్నట్టు ఆ శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ ద్వారాలపై పలు చిత్రాలను కర్రతో చెక్కినవాటికంటే మిన్నగా ఉండడం విశేషం. ప్రతి రాతి స్తంభానికి నాగుపాము బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఈ రాతిబొమ్మల్లో కొన్ని భాగాలను, నంది విగ్రహంలోని కొంత భాగాలను రజాకార్లు ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే తర్వాత వాటిని పునరుద్ధరించారు.


ఆలయ చరిత్ర

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి, లక్ష్మణ సమేతంగా వనవాసం చేసిన సమయంలో ఈ ప్రాంతా నికి వచ్చినట్లు ప్రతీతి. ఇక్కడి నేల స్వభావం (తమోగుణం) కారణంగా ఒకరి అభిప్రాయాలు మరొకరు అంగీకరించకుండా ఉంటారని పెద్దలు చెప్పారు. ఈ కారణంగా సీతారామ లక్ష్మణులు ప్రస్తుతం మంజీర నది ఉన్న ప్రాంతానికి చేరుకొని స్నానాలు ఆచరించారు. అక్కడే నది ఒడ్డున పూజలు నిర్వహించాల్సి ఉంది. కానీ తమోగుణం ప్రభావం మూలంగా ముగ్గురి మనసులో ఏదో తెలియని వెలితి ఏర్పడింది. దీంతో వారు తమకు నచ్చిన విధంగా ముగ్గురు వేర్వేరుగా కూర్చొని స్వతహాగా లింగాలను తయారు చేసుకొని పూజలు చేశారని ప్రతీతి. ఆ ముగ్గురు మూడు లింగాలను తయారు చేసుకొని పూజలు ముగించడంతోనే ఈ ప్రాంతంలో మూడు లింగాల ఆలయాన్ని నిర్మించారని పెద్దలు చెబుతారు. అప్పట్లో రాముడు స్నానమాడిన ప్రాంతాన్ని రామపాదాలు అని పిలిచేవారు. అవి నేడు కాలగర్భంలో కలిసిపోయాయి. రాముడు తీర్థం సేవించిన ప్రాంతాన్ని రామతీర్థంగా పిలుస్తున్నారు. ఈ పేరు మీదనే ఊరు వెలిసింది. అది నేడు నదికి ఆవలి వైపు ఉండడంతో మెదక్‌ జిల్లాలోకి వెళ్లింది.  


మహాశివరాత్రి ఉత్సవాలు

మహాశివరాత్రికి ఇక్కడ ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజు ఉపవాస దీక్షలు, రెండో రోజు ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన, మూడో రోజు పద్మవ్యూహం, భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, నాలుగోరోజు రథోత్సవం, ఐదోరోజు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లావాసులే కాక మెదక్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. శ్రావణ మాసంలో ప్రతిరోజూ అభిషేకాలు నిర్వహిస్తారు. చాలామంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ అర్చనలు చేస్తారు. గ్రామం నుంచి కిలోమీటరు దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అక్కడి వరకు రోడ్డు సౌకర్యం ఉంది. వాహనాల్లో హాయిగా వెళ్లవచ్చు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట నుంచి ఆటోలు, బస్సు సౌకర్యాలుంటాయి.


logo