ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Feb 23, 2020 , 01:33:00

మూడో ప్రియుడు

మూడో ప్రియుడు

ఇక నేనామెని కలవకపోవడంతో నన్ను హింసించడానికి నా పక్క అపార్ట్‌మెంట్‌ ఖాళీ అయితే అందులోకి మారింది. ఆ ఇద్దరు బాయ్‌ ఫ్రెండ్స్‌ వచ్చి వెళ్ళడం చూసాను. ఓసారి ఆమెని అపార్ట్‌మెంట్‌ని ఖాళీ చేయమని అడగడానికి వెళ్ళాను. చెయ్యనని చెప్పింది. అప్పటికే ఆమె అపార్ట్‌మెంట్‌ని నేను రహస్యంగా వెదకడంతో ఆమె పాయింట్‌ 22 రివాల్వర్‌ ఎక్కడుందో నాకు తెలుసు. దాంతో ఆమెని కాల్చాను.

రాత్రి రెండైనా కెండ్రిక్ట్‌కి నిద్ర పట్టలేదు. అతని భార్య మాత్రం గాఢనిద్ర పోతున్నది. అతనికి పల్చటి గోడలోంచి పక్క అపార్ట్‌మెంట్‌లోని గొడవ వినిపిస్తున్నది. ఓ మగాడి ఏడుపు వినగానే అతను మంచం దిగాడు. భార్యని నిద్ర లేపి చెప్పాడు.

“పక్కింటామె కష్టంలో ఉన్నట్లుంది. కొద్దిసేపటి క్రితం తుపాకీ పేలుడు లాంటి చప్పుడు వినిపించింది. తర్వాత ఓ మనిషి ఏడుస్తున్నట్లు. నేను వెళ్ళి ఏం జరిగిందో చూసి వస్తాను.”

“అది మీ ఊహేమో? వద్దనడం లేదు కాని వాళ్ళ వ్యక్తిగత విషయంలో దేనికి తలదూర్చడం?” ఎలీన్‌ చెప్పింది.

అతను వెళ్తుంటే చెప్పింది.


“జాగ్రత్త.”

401 అపార్ట్‌మెంట్‌ ముందాగి తలుపుకి చెవిని ఆనించి విన్నాడు. ఏ శబ్దం వినిపించకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. అంత దూరం వచ్చాక ఏ సంగతీ కనుక్కుని వెళ్ళాలని అనిపించడంతో తలుపుమీద తట్టాడు. జవాబు లేదు. అతను తలుపుని నెడితే అది తెరుచుకుంది. లోపల ఓ మగాడు కిటికీ ముందు అటు ఇటు నడుస్తూ కనిపించాడు. అతను షాక్‌లో ఉన్నాడని కెండ్రిక్ట్‌ గుర్తించాడు. 

“మీరు ఎవరు?” అతను తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు.

“కొద్దిసేపటి క్రితం నాకు ఇక్కడనించి ఓ తుపాకీ పేలిన శబ్దం వినిపించింది.”

“ఈ ఇంట్లో తుపాకీ ఏదీ పేలలేదు.”

“దానికి మునుపు ఓ ఆడదాన్ని బతిమాలిన మాటలు కూడా వినిపించాయి” కెండ్రిక్ట్‌ చెప్పాడు.


“నేను ఒంటరిగా ఉన్నాను.”

“ఓ మగాడు ఏడవడం కూడా విన్నాను. ఇక్కడేం జరిగింది?” కెండ్రిక్ట్‌ లోపలకి వచ్చి తలుపు మూసి అడిగాడు.

“మీరు పొరపడ్డారు. లేదా కలగని ఉంటారు.”

“ఆ రెండూ జరగలేదు. మా పడకగది మీ గోడకి అవతలదే. గోడలు సౌండ్‌ప్రూఫ్‌ కాదు.” 

“మీకు ఇక్కడ పనేం లేదు. బయటకి నడవండి” కొద్దిగా పాలిపోయిన మొహంతో చూస్తూ అతను చెప్పాడు.

“ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండే యువతి ఏది? ఆమె పేరు తెలీదు కాని చాలాసార్లు చూసాను.”

“మిస్‌ డి కార్లో. ఆమె ఊళ్ళో లేదు. మేం ఫ్రెండ్స్‌. ఆమె ఈ అపార్ట్‌మెంట్‌ని నేను ఉపయోగించుకోవడానికి ఇస్తుంటుంది. వెళ్ళమని ఇంకోసారి చెప్పను. వెళ్ళండి.”

“సరే. ఏం జరిగిందో పోలీసులే కనుక్కుంటారు” కెండ్రిక్ట్‌ తలుపువైపు నడుస్తూ చెప్పాడు.

“కూర్చోండి. దాని గురించి మాట్లాడుదాం. ఆ తర్వాత కావాలంటే పోలీసులకి ఫోన్‌ చేయండి. నన్ను నమ్మండి. నేనామెని చంపలేదు. కొద్ది నిమిషాల క్రితం నేను ఇక్కడికి వచ్చేసరికే ఆమె చచ్చిపోయి ఉంది. కొన్ని కారణాల వల్ల నేను ఇందులో ఇన్‌వాల్వ్‌ కాకూడదు” అతను నిస్సహాయంగా చూస్తూ చెప్పాడు.


“ఆమె ఎక్కడుంది?”

“పడక గదిలో.”

అక్కడికి వెళ్తే ఆమె బెడ్‌మీద ఓ నైట్‌గౌన్‌లో ఉంది. ఓ చెయ్యి ఛాతీమీద ఉంది. మరొకటి గుప్పిటిలా ఉంది.

“మీ పేరు?” కెండ్రిక్ట్‌ అతన్ని అడిగాడు.

“విలియం. నేనో రియాల్టీ కంపెనీ ప్రెసిడెంట్‌ని. ఈమె మా కంపెనీలో సెక్రటరీ. నేను ఆమెతో ప్రేమలో పడ్డాను. కాని నాకు భార్య, పిల్లలు ఉన్నారు. పైగా కోట్ల వ్యాపారం ఉంది. అందువల్ల ఇది బయటకి వస్తే నేను చాలా చిక్కుల్లో పడతాను. ఆర్థికంగా నేను ఆమెకి చాలా సహాయం చేసాను. ఆమె ఇంకా, ఇంకా డబ్బు కావాలని సతాయించ సాగింది. నేను పదకొండుకి ఫోన్‌ చేసి వస్తున్నానని చెప్తే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఆమె దగ్గర మరో మగాడున్నాడని ఆమె కంగారునిబట్టి అనిపించి వచ్చాను. నేను వచ్చాక చూస్తే ఇప్పుడు మీరు చూసినట్లుగా ఉంది.”


“మీరు చెప్పేది నిజమని ఏమిటి నమ్మకం?”

“నేనే హంతకుడ్ని ఐతే ఇప్పుడు మీరు బతికుండేవారు కాదు. నా భద్రత కోసం ఇంకొకర్ని చంపడం నాకు లెక్కలోది కాదు. మీ పేరేమిటి?”

“కెండ్రిక్ట్‌.”

అతను జేబులోంచి ఓ రివాల్వర్‌ తీసి చూపించి చెప్పాడు.

“ఇది. 38 కేలిబర్‌. నాదే. రాత్రిళ్ళు భద్రత కోసం దగ్గర ఉంచుకుంటాను. నేను ఆమెని చంపి ఉంటే, మీరు ఒక్కరే కాబట్టి దీంతో మళ్ళీ మిమ్మల్ని కాల్చేవాడిని. దీన్ని నేను కాల్చి ఆమెని చంపి ఉంటే తుపాకీ మందు వాసన వస్తుంది. చూడండి.”


కెండ్రిక్ట్‌ దాన్ని వాసన చూసి ఔనన్నట్లుగా తల ఊపాడు.

“ఆమెని కాల్చింది ఈ రివాల్వర్‌ కాదు. ఆమెకి ఓ ఆటోమేటిక్‌ రివాల్వర్‌ ఉంది. అది బల్ల సొరుగులో ఉంటుంది. కాని ఇప్పుడు అది అక్కడ లేదు. చంపిన వాళ్ళకి అది అక్కడ ఉంటుందని తెలుసన్నమాట.”

“నా భార్య నా కోసం ఎదురు చూస్తూంటుంది. నేను ఆలస్యం చేస్తే ఆమె పోలీసులకి ఫోన్‌ చేయవచ్చు.”

“మీరు ఆమెకి ఫోన్‌ చేసి ఆలస్యం అవుతుందని చెప్పండి. ఏం జరుగుతోందని అడిగితే పది నిమిషాల్లో వచ్చాక చెప్తానని చెప్పండి” అతను అర్థించాడు.

కెండ్రిక్ట్‌ ఫోన్‌ దగ్గరకి వెళ్తే అతను హెచ్చరించాడు.


“కర్ఛీఫ్‌తో. మీ వేలిముద్రలు పోలీసులకి దొరక్కూడదు.”

కెండిక్ట్‌ తన భార్యకి చెప్పాక విలియం చెప్పాడు.

“ఆ సిగరెట్‌ లైటర్ని చూసారా? అది నాది కాదు. దానిమీద ఎల్‌.జి అనే మోనోగ్రాం కూడా ఉంది. అది హంతకుడిదై ఉండచ్చు.”

కెండ్రిక్ట్‌ దాని వంక చూసాడు. అది రూబీ పొదిగిన బంగారు సిగరెట్‌ లైటర్‌.

“నాకూ ఇలాంటిది ఒకటి ఉంది. ఆమె దాన్ని నాకు బహుమతిగా ఇచ్చింది. ఒకే రకంవి రెండు కొని రెండోది అతనికి ఇచ్చినట్లుంది. ఆమె నన్ను మోసం చేసింది” అలాంటి ఓ లైటర్ని చూపించి విలియం చెప్పాడు.


“ఈ ఎల్‌.జి. ఎవరో తెలుసా?” కెండ్రిక్ట్‌ అడిగాడు.

“తెలీదు. పూర్తిగా రహస్యంగా ఉంచింది. నేను నన్ను, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి. మా మధ్య సంబంధం పూర్తిగా రహస్యంగా సాగింది.”

“అంటే, మిమ్మల్ని ఇక్కడ ఇప్పుడు నేను చూసిన సంగతి మర్చిపోవాలని చెప్తున్నారా?” కెండ్రిక్ట్‌ అడిగాడు.

“అవును. ఆమెని చంపిన వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు. ఈ అపార్ట్‌మెంట్‌లో నన్ను సూచించేవి ఏమీ లేవు. నేను వేలిముద్రలన్నీ తుడిచేసాను. అదో తెలివైన ఆలోచన.”

“మీరు హంతకుడు కాదని నేను నమ్మినా తర్వాత ఇదంతా పోలీసులకి తెలిస్తే సాక్షిగా నేను దీన్ని దాచి పెట్టినందుకు హత్యలో భాగం పంచుకున్న వాడిని అవుతాను. మా ఆవిడకి నేను ఇక్కడ ఉన్నానని తెలుసు. హత్య సంగతి బయట పడగానే ఆమె పోలీసులకి తప్పక నేను ఇక్కడికి వచ్చానని చెప్తుంది” కెండ్రిక్ట్‌ చెప్పాడు.

“మీరేం చేస్త్తుంటారు?” విలియం అడిగాడు.


“ఓ మందుల షాపులో సేల్స్‌మన్‌ని.”

“రేపు మధ్యాహ్నం మీరు మా ఆఫీస్‌కి వస్తే నేను మీకు కొంత మొత్తం ఇస్తాను. డబ్బు లేని వారికి దాని అవసరం సదా ఉంటుంది. అది లంచం కాదు. నాకు సహాయం చేసినందుకు ఇచ్చే బహుమతి. పదివేల డాలర్లు.”

కెండ్రిక్ట్‌కి అప్పుడు బ్యాంక్‌ అకౌంట్లో ఉన్నది కేవలం మూడు వందల డాలర్లు. అతనికి పదివేల పైనే అప్పులు ఉన్నాయి.

“అలాగే. కాని.. మీరే హంతకుడని నాకు తెలిసిన మరుక్షణం...”

“సరే. సరే. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి” చెప్పి విలియం తన విజిటింగ్‌ కార్డ్‌ని ఇచ్చాడు.

ఇంటికి తిరిగి వచ్చాక తన భార్య ఎలీన్‌కి జరిగింది వివరించాడు.

“రివాల్వర్‌ చూపించగానే నన్ను చంపబోతున్నాడని భయపడ్డాను తెలుసా?”

“పదివేల డాలర్లు! మనం వందేళ్ళు జీవించి ప్రతీ పెన్నీని ఆదా చేసినా అంత సొమ్ము రాదు. అతనా హత్య చేసాడంటారా?”

“ఎవరికి తెలుసు? అది మనకి అనవసరం” కెండ్రిక్ట్‌ చెప్పాడు.


మర్నాడు కెండ్రిక్ట్‌ చెప్పిన సమయానికి లిఫ్ట్‌లో ముప్పయి ఒకటో అంతస్థులోని విలియం ఆఫీస్‌కి చేరుకున్నాడు. విలియం ఆఫీస్‌ గది కెండ్రిక్ట్‌ ఇంటికన్నా పెద్దగా ఉంది. బూడిదరంగు సూట్లోని అతను హంతకుడిలా కనిపించలేదు. గత రాత్రి తను చూసిన ఆందోళన కూడా అతనిలో లేదు.

విలియం అతన్ని చూసి నవ్వలేదు. గ్రీట్‌కూడా చేయలేదు. నిశ్శబ్దంగా డ్రాయర్‌ తెరచి ఓ చిన్న కవర్‌ తీసిచ్చాడు. తెరచి చూస్తే వంద డాలర్ల నోట్లు కనిపించాయి.

“నేను ముందు చెప్పినట్లుగా నాకు డబ్బు ముట్టినా మీరే ఆ పని చేసారని నాకు తెలిస్తే.. అదీ మన మధ్య ఒప్పందం.” కెండ్రిక్ట్‌ చెప్పాడు.

“అవును. అది నాకు గుర్తుంది. ఇక మీదట మీరు నన్ను కలవాల్సిన అవసరం లేదు. అర్థమైందా?”

“ఐంది” చెప్పి కెండ్రిక్ట్‌ బయటకి నడిచాడు.


డి కార్లో శవాన్ని ఆ మధ్యాహ్నమే గుర్తించారు. మర్నాడు ఉదయం దినపత్రికలో ఆ వార్త వచ్చింది. పోలీసులకి ఓ ముఖ్యమైన ఆధారం దొరికిందని, ఇరవై నాలుగు గంటల్లో నిందితుడ్ని అరెస్ట్‌ చేయవచ్చని భావిస్తున్నారని కెండ్రిక్ట్‌ చదివాడు. లైల్‌ గేడిస్‌ అనే అతన్ని అరెస్ట్‌ చేసారని, అతని ఇనీషియల్స్‌గల సిగరెట్‌ లైటర్‌ శవం ఉన్న అపార్ట్‌మెంట్లో దొరికిందని కెండ్రిక్ట్‌ ఆ మర్నాటి దినపత్రికలో చదివాడు. అతను డి కార్లోకి కొత్త కారు అమ్మిన ఆటో సేల్స్‌మన్‌. ఆమె బల్ల సొరుగులో అతని విజిటింగ్‌ కార్డ్‌ పోలీసులకి దొరికింది. ఆ లైటర్‌ ఆమె తనకి బహుమతిగా ఇచ్చిందని ఒప్పుకున్నాడు. తనని పెళ్ళి చేసుకోడానికి నిరాకరించడంతో దాన్ని వారం క్రితం తిరిగి ఇచ్చేసానని, మళ్ళీ ఆమెని చూడలేదని అతను చెప్పాడు. ఆమెని చంపిన పాయింట్‌ 22అతని పేరుమీద రిజిస్టర్‌ అవడంతో అతనిమీద కేసుని బనాయించారు.

కోర్ట్‌లో అతను డి కార్లో తనని ఎవరో కొత్త వ్యక్తి అనుసరిస్తున్నాడని చెప్తే, తనే తన రివాల్వర్‌ని భద్రత కోసం ఆమెకి ఇచ్చానని చెప్పాడు. ఐతే, ఆ రివాల్వర్‌ పోలీసులకి దొరకలేదు. తనని పెళ్ళి చేసుకోడానికి డి కార్లో నిరాకరించడానికి కారణం ఆమెకో బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని, అతను ఆమెకి ఆ కారు కొనివ్వడమేకాక చాలా డబ్బు ఇస్తున్నాడని చెప్పిందని కూడా చెప్పాడు. అతనికి యావజ్జీవ కారాగారశిక్ష పడింది.ఆ డబ్బుతో కెండ్రిక్ట్‌ దంపతులు ఓ కొత్త పెద్ద ఇంటిని అద్దెకి తీసుకుని అందులోకి మారారు. కొత్త కారు కొన్నారు. పాతమిత్రులని వదిలి డబ్బున్న కొత్త మిత్రులని సంపాదించారు. త్వరలోనే వారి పదివేల డాలర్లు ఖర్చయిపోయాయి.


“ఇప్పుడేం చేద్దాం?” ఎలీన్‌ అడిగింది.

కొత్త నీలం రంగు సూట్లో తన గదిలోకి వచ్చిన కెండ్రిక్ట్‌ని చూసి విలియం చెప్పాడు.

“మళ్ళీ నువ్వు వస్తావని నాకు తెలుసు.”

అతనిలో కోపం కాని, ఆందోళన కాని లేవు.

“నాకు ఇంకో పదివేల డాలర్లు కావాలి” కెండ్రిక్ట్‌ కోరాడు.

“నీ సమస్య గురించి ముందే పరిష్కారాన్ని ఆలోచించి పెట్టుకున్నాను. బ్లాక్‌ మెయిలర్‌ను సదా తృప్తి పరుస్తుండాలి. లేదా నాశనం చేయాలి. నిన్ను తృప్తి పరిచే ప్రయత్నం చేసాను. అది సమస్యకి పరిష్కారం కానప్పుడు నాకు ఇక మిగిలింది రెండో పరిష్కారమే” ఓ కవర్‌ తీసి కెండ్రిక్ట్‌కి ఇచ్చి చెప్పాడు.

“ఆ కవర్లోని ఐదు వేల డాలర్‌ చెక్‌ని నువ్వు వెళ్ళిన మర్నాడే రాసాను. నీ నిశ్శబ్దానికి నేను నీకు ఎంత ఇవ్వగలనో అంతకి ఈ చెక్‌ రాసాను. ఇంకోసారి వస్తే నీకే ప్రమాదం.

“అది బెదిరింపా?”

“పూర్తిగా. బెదిరింపు కాదు. పూర్తి నిజం. అందుకు అన్ని ఏర్పాట్లు చేసాను. ఓ ఫోన్‌ కాల్‌తో మరో పదివేలకి వృత్తిరీత్యా రెండు హత్యలని చేసేవాళ్ళని మాట్లాడి ఉంచాను. అది నువ్వు నమ్ముతావా?” విలియం నవ్వుతూ అడిగాడు.

“నమ్ముతాను” కెండ్రిక్ట్‌ బలహీనంగా చెప్పాడు.

“నీకు, నీ భార్యకి సరిగ్గా మూడు రోజుల సమయం ఇస్తున్నాను. ఈ లోగా అన్నీ సర్దుకుని ఆ తర్వాత ఈ ఊరు వదిలి వెళ్ళండి. కనీసం వెయ్యి మైళ్ళ దూరంలోని ఊరుకి. మళ్ళీ తిరిగి రాకూడదు. అర్థమైందా?”

కెండ్రిక్ట్‌ తలూపి కవర్‌ను జేబులో ఉంచుకుని బయటకి నడిచాడు.

“అది ఉత్త బెదిరింపా? లేక నిజంగా మనల్ని చంపుతాడంటావా?” ఎలీన్‌ ఆలోచనగా అడిగింది.

“బెదిరింపు కాదు. ఆఖరిసారి అతనితో ఫోన్‌లో మాట్లాడుతాను” కెండ్రిక్ట్‌ చెప్పాడు.


కెండ్రిక్ట్‌ విమానాశ్రయం నించి విలియంకి ఫోన్‌ చేసాడు.

“సేన్‌ డియాగోకి వెళ్తున్నాం. నువ్వు కోరినట్లే వెయ్యి మైళ్ళ దూరం దాటి. వెళ్ళే లోగా నీకోటి చెప్పాలని అనుకున్నాను.”

“ఏమిటది?”

“నాకో గర్ల్‌ ఫ్రెండ్‌ ఉండేది. ఆమెకి మరో ఇద్దరు బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండటంతో ఆమెకి గుడ్‌ బై చెప్పేసాను. కానీ, ఇక నేనామెని కలవకపోవడంతో నన్ను హింసించడానికి నా పక్క అపార్ట్‌మెంట్‌ ఖాళీ అయితే అందులోకి మారింది. ఆ ఇద్దరు బాయ్‌ ఫ్రెండ్స్‌ వచ్చి వెళ్ళడం చూసాను. ఓసారి ఆమెని అపార్ట్‌మెంట్‌ని ఖాళీ చేయమని అడగడానికి వెళ్ళాను. చెయ్యనని చెప్పింది. అప్పటికే ఆమె అపార్ట్‌మెంట్‌ని నేను రహస్యంగా వెదకడంతో ఆమె పాయింట్‌ 22 రివాల్వర్‌ ఎక్కడుందో నాకు తెలుసు. దాంతో ఆమెని కాల్చాను.”

“.....”


“అర్థమైందా?”

“ఎందుకీ అబద్ధం చెప్తున్నావు?” విలియం అడిగాడు.

“నాకు ఉచితంగా పదిహేను వేల డాలర్లు ఇచ్చినందుకు థాంక్స్‌ చెప్పడానికి. ఇది కట్టుకథ కాదు అని ఋజువు చేయడానికి నా ఇనీషియల్స్‌తో డి కార్లో నాక్కూడా బహుకరించిన బంగారు సిగరెట్‌ లైటర్‌ని నీకు ఎయిర్‌ పోర్ట్‌నుంచి పోస్ట్‌లో పంపుతున్నాను. దాన్ని సావనీర్‌గా దాచుకో” చెప్పి కెండ్రిక్ట్‌ రిసీవర్‌ పెట్టేసి, లైన్‌లో వేచి ఉన్న ఎలీన్‌ దగ్గరకి నడిచాడు.(రాబర్ట్‌ కోల్బీ కథకి స్వేచ్ఛానువాదం) మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo