బుధవారం 03 జూన్ 2020
Sunday - Feb 23, 2020 , 00:29:48

పిల్లలనోట భాగవత పద్యాలు!

పిల్లలనోట భాగవత పద్యాలు!

‘ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి జూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే!’పెద్దలకు ఈ పద్యం వినగానే.. స్తంభాన్ని చీల్చుకొని వచ్చిన నరసింహస్వామి హిరణ్య కశిపుడ్ని సంహరించే ఘట్టం గుర్తుకు వస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లతో సహవాసం చేసే ఈ పిల్లలకు ఆ పద్యం గురించి తెలుసా? అంటే.. ఆ పద్యమే కాదు భాగవతములోని ఏ పద్యమైనా దాని అర్థం, పరమార్థం చెబుతున్నారు. అందుకు కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈయనే.

‘నాన్నా..భీష్ముడు ఎవరు? ఇచ్చిన మాట కోసం బలి చక్రవర్తి ఏం చేశారు?’ అని నాటి భాగవత గాథలను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేటి చిన్నారులు. అంతేకాదు ఎంతో లయబద్ధంగా భాగవత పద్యాలను కూడా పాడుతున్నారు. ఖాళీసమయం ఎప్పుడు దొరికినా.. మన పోతన రాసిన పద్యాలను ఔపోసన పడుతున్నారు. అందుకు కారణం.. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు నేమాని పార్థసారధి (పార్థు). పిల్లల్లో చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావనను పెంపొందించడం కోసం భక్తిటీవీ చానెల్‌లో ‘పలికెద భాగవతము’ కార్యక్రమాన్ని అన్నీ తానై నడిపిస్తున్నారు.


రమణాచారి సంకల్పం

శ్రుతిలయ ఫౌండేషన్‌ ద్వారా తూము నర్సింహదాసు కీర్తలను 72కు పైగా కంపోజ్‌ చేసి, పిల్లలతో పాడించారు పార్థు. దానిపేరు ‘నాద నీవేదన’. ఆ కీర్తనలకు ఎస్పీ బాలు వ్యాఖ్యానం చెప్పారు. అంతకుముందు భాగవతంలోని అన్ని స్కందాల్లోంచి 324 పద్యాలను ‘హ్యుస్టన్‌లోని భాగవతం ఆణిముత్యాల ట్రస్ట్‌' సహకారంతో శలాక రఘునాథశర్మ సారథ్యంలో పద్యాలను స్వరపరచి, అందంగా పాడారు పార్థు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి.. పార్థు సారథ్యంలో భాగవత పద్యాలను నేటి తరానికి అందించాలని ఆలోచన చేశారు. రమణాచారి సంకల్పంతో ‘పలికెద భాగవతము’ అనే రియాల్టీ షో పురుడుపోసుకున్నది. ఈ కార్యక్రమం కత్తిమీద సాములాంటిది. 


ఎందుకంటే పాటలు, డ్యాన్స్‌లు వంటి రియాల్టీ షోలు ఉన్నాయి కానీ.. పద్యాలతో చేసే మొదటి కార్యక్రమం ఇదే. ఎలాంటి దిశ, నిర్దేశం లేని కార్యక్రమానికి అన్నీ తానై, చక్కటి రూపమిచ్చారు పార్థు. మొదటి ఆడిషన్‌లోనే 98 మంది చిన్నారులను ఎంపిక చేశారు. వారికి వారానికి మూడు వర్క్‌షాపులు నిర్వహించి, పద్యాలు పాడేందుకు చక్కని వేదికను కల్పించారు. న్యాయ నిర్ణేతలుగా గరికపాటి నర్సింహారావు, జొన్నవిత్తుల, ఎస్పీబాలు వంటి ప్రముఖులను పిలిపించి.. కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహిస్తున్నారు పార్థు. ఈ కార్యక్రమానికి లైట్‌ బాయ్‌ దగ్గర్నుంచి.. ప్రొడక్షన్‌ పనుల వరకూ అన్ని బాధ్యతలు భుజానవేసుకొని, సెట్‌లో వ్యాఖ్యాతగా ఉంటూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలా ఈ కార్యక్రమం 25 వారాలుగా భక్తిటీవీలో ప్రసారం అవుతూనే ఉంది.

 

కొత్తగా టీనేజర్లతో..

చిన్నపిల్లలతో మొదలు పెట్టిన ‘పలికెద భాగవతము’ విజయవంతం అవడంతో.. అదే స్ఫూర్తితో టీనేజర్స్‌తో పద్యాలు పాడించడం మొదలుపెట్టారు పార్థు. దీని ఆడిషన్స్‌కు 120 మంది వచ్చారు. వారందరికీ తన కీర్తన స్టూడియోలోనే వర్క్‌షాపులు నిర్వహించి రెండో ఎడిషన్‌కు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల పిల్లలు ఇంట్లో, కారులో, స్కూల్‌లో, ఖాళీ సమయాల్లోనూ పద్యాలే పాడుతున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి తన భార్య, ఒలేటి శ్రీనివాస్‌ భాను, భరత్‌, ఓ స్టూడెంట్‌ సహకారం మర్చిపోలేనిదని అంటున్నారు పార్థు. ఈ నలుగురూ కలిసి.. 40 మంది చేయాల్సిన పనిని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్పీ రేటింగ్స్‌తో సంబంధం లేకుండా దేశ విదేశాల నుంచి అభినందనలు వస్తున్నాయి.


సింగర్‌ నుంచి సంగీత దర్శకుడిగా..

పార్థసారథి పుట్టి పెరిగింది కాకినాడ. వీరిది సంగీత కుటుంబం. హైదరాబాద్‌లో దాదాపు 30 యేండ్ల నుంచి ఉంటున్నారు. సంగీతం మీద ప్రేమతో, ఎస్పీ బాలును చూడ్డానికి హైదరాబాద్‌కు వచ్చి మొదటి ‘పాడుతా తీయగా’ కార్యక్రమం విజేతగా నిలిచారు. ఆ తర్వాత చెన్నై వెళ్లి మణిశర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో 150కిపైగా సినిమాలకు పాడారు. 4వేలకు పైగా ప్రైవేట్‌ సాంగ్స్‌ పాడారు. దాదాపు 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 12 యేండ్లుగా ‘కీర్తనా అకాడెమీ’ పేరుతో పిల్లలకు పాడడంలో శిక్షణ ఇస్తున్నారు. సంగీత దర్శకుడిగా 70కి పైగా ఆల్బమ్స్‌ చేశారు. విశ్వనాథ్‌ ‘స్వరాభిషేకం’ సినిమాలో రెండు పాటలు పార్థు నేమాని కంపోజ్‌ చేశారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది.


మొదటి రెమ్యునరేషన్‌ రూ.200

సినిమా పాటలు పాడకముందు పెండ్లిలో పాటలు పాడేవారు పార్థసారధి. ఆయన మొదటి రెమ్యునరేషన్‌ రూ.200. విశ్వనాథ్‌తో చేసిన ‘విశ్వనాథామృతం’ కార్యక్రమం బాగా పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు పాడుతా తీయగా, జీ సరిగమ, ఐడియా సూపర్‌ సింగర్‌ కార్యక్రమాలకు సెలక్షన్‌ ప్యానెల్‌లో ఉన్నారు పార్థు. ఈయనలో ప్రతిభను గుర్తించింది తండ్రి రామం. కాకినాడలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌. ‘ఏడాదికి పదివేలమంది ఇంజినీర్లు వస్తారు. కానీ సింగర్లు ఎక్కుమంది రారు. నీకేం కావాలో ఆలోచించుకో’ అంటూ ప్రోత్సహించారు రామం.


ప్రతియేట 18 మందికి సాయం

పేద విద్యార్థులకు సాయం చేయాలని ‘లోటస్‌ ఫౌండేషన్‌'ను స్థాపించా. దీని ద్వారా స్నేహితుల సహాయంతో ప్రతియేటా 18 మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నా. మా నుంచి సాయం పొందినవారు కష్టపడి చదివి, ఉన్నత ఉద్యోగాలు సంపాదించారు. కొందరు విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. పిల్లలను మంచి సంగీతంలో, సాహిత్యంలో పెరిగేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు అన్నింటికంటే పెద్ద ఆస్తి స్నేహితులే. నా ఈ స్థాయికి కారణం నా స్నేహితులే. 

నేమాని పార్థసారధి, సంగీత దర్శకుడు, గాయకుడు



logo