గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Feb 16, 2020 , 00:19:19

రౌడీబేబి కృతిక!

రౌడీబేబి కృతిక!

ముద్దమందారం లాంటి ముఖం. ముద్దు ముద్దు మాటలు తనని ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించేంత ధైర్యం.. అంతలోనే అమాయకత్వంతో బోలెడన్ని కబుర్లు చెబుతుంది. ఇన్ని లక్షణాలు కలగలిసిన ఆణిముత్యమే కార్తీకదీపం ఫేమ్‌ క్రితిక. అలియాస్‌ శౌర్య. చిన్న వయసులోనే సీరియళ్లు, సినిమాలలో రాణిస్తున్న ఈ చిన్నారి మనసు కూడా పెద్దదే.. 


మాటీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం చాలా ఫేమస్‌. అందులో బాలనటి శౌర్య ముద్దుముద్దు మాటలు వినేందుకే చాలామంది చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇది మొదటి సీరియల్‌ కాదు. ఇంతకు ముందు చాలా సీరియల్స్‌ చేసింది. గీతాంజలి సీరియల్‌తో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బుల్లితెరకు పరిచయం అయింది. తర్వాత అష్టాచెమ్మా, కాంచనమాల, గోపికమ్మ, వదినమ్మ, దేవయాని, అత్తారింటికి దారేది లాంటి సీరియల్స్‌లో చేస్తున్నది. వెండితెరవైపూ ఓ కన్నేసింది. ఇటీవల విడుదల అయిన రాగల 24 గంటల్లో, సరిలేరు నీకెవ్వరూ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. దీనికిముందే బాలకృష్ణ ‘సింహా’ చిత్రంలో బాలనటిగా మెప్పించింది. సినిమా డైరెక్టర్లూ కృతికను ప్రోత్సహిస్తూ ఉంటారు. బోయపాటి శీను అంటే చాలా ఇష్టమట. 


కృతిక బంధువు ధన్వి చైల్డ్‌ ఆర్టిస్ట్‌. తను టీవీలో కనిపించగానే కృతిక ఎగిరి గంతేస్తుంది. నేను కూడా యాక్ట్‌ చేస్తానంటూ మారం చేసేది. మొగలిరేకులు ఫేమ్‌ విజయ్‌ ద్వారా తండ్రి కృష్ణవంశి, తల్లి స్వప్నారెడ్డి ప్రోత్సాహంతో ఆడిషన్స్‌కు వెళ్లింది. సెలెక్ట్‌ అయింది. ఆరునెలల తర్వాత కాల్‌ వచ్చింది. అప్పుడే తిరుపతిలో వెంట్రుకలు తీయించారు. జుట్టు ఉండే పాప కావాలనే సరికి తిరిగి వచ్చేశారు. రెండేండ్ల తర్వాత మళ్లీ ప్రయత్నించింది. గీతాంజలి డైరెక్టర్‌ విజయ్‌కృష్ణ పాపని సెలెక్ట్‌ చేశాడు. యాక్టింగ్‌లో మెళకువలు నేర్పించారు. అలా కృతిక ప్రయాణం మొదలైంది. యాక్టింగ్‌లో ముందుండే శౌర్య చదువులోనూ ముందుంటుంది. షూటింగ్‌లో కాస్త విరామం దొరికినా చదువుకు కేటాయిస్తుంది. ఉదయం పరీక్షలు రాసి సాయంత్రం షూటింగ్‌లో పాల్గొంటుంది. అన్ని చానళ్లలో కృతికను చూడొచ్చు. అలాగే రియాలిటీ షోలలో కూడా చురుగ్గా పాల్గొంటుంది. స్కూల్‌లో తనని సాధారణ అమ్మాయిలానే ట్రీట్‌ చేస్తారు. తనకి అలా ఉండడమే ఇష్టమంటున్నది. చిన్నతనంలోనే ఇన్ని పనులు సవ్యంగా చేసుకుంటున్న కృతికను చూస్తే గర్వంగా ఉందంటున్నాడు ఆమె తండ్రి.


అనాథ పిల్లలతో కలిసి..

తొమ్మిందేడ్ల కృతిక పుట్టినరోజును గ్రాండ్‌గా ఫంక్షన్‌హాలో జరుపుకోకుండా ఆనాథ శరణాలయంలో తోటి పిల్లలతో కలిసి చేసుకున్నది. ఆరోజు వందలాది పిల్లల ఆకలి తీరుస్తున్నది. అలాగే చిల్డ్రన్స్‌డే సందర్భంగా ఓల్డేజ్‌ హోంకి వెళ్లి పెద్దవాళ్లకు స్వయంగా భోజనం వడ్డించి పెద్దమనసు చాటుకుంటూ అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నది. వీరి కుటుంబం నెల్లూరు జిల్లాలోని తురిమెర్ల గ్రామానికి చెందింది. తండ్రి ఉద్యోగపరంగా, పిల్లల చదువు, షూటింగ్‌లో పాల్గోనేందుకు అనుకూలంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కృతికకు ఇప్పటికే బుల్లితెర పెద్ద పండుగగా నిర్వహించే పద్మమోహన అవార్డ్స్‌లో బెస్ట్‌ ఫీమేల్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అవార్డు అందుకున్నది. మనసు మమత సీరియల్‌కి బెస్ట్‌ ఫీమేల్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుంది.


logo