బుధవారం 03 జూన్ 2020
Sunday - Feb 15, 2020 , 23:54:29

నెట్టిల్లు

నెట్టిల్లు

 లఘుచిత్రాల నిడివి చిన్నదే అయినా వాటి వెనుకాల ఉండే కృషి పెద్దది. ఎంతో మంది ఆసక్తి ఉన్న యువకులు ఈ లఘుచిత్రాల  ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. వీటితో సినిమారంగంలోనూ వారి కలలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారు తీసిన లఘుచిత్రాల్లో కొన్ని సమీక్షలే ఇవి..


మధురమే ఈ క్షణమే..


దర్శకత్వం:  మోహన్‌ ప్రసాద్‌

నటీనటులు :  వరలక్ష్మి,  మోహన్‌ 

అక్షర... పండుగకు వాళ్ల పిన్నీ ఇంటికి వస్తుంది. అక్కడ అద్వైత్‌ పరిచయం అవుతాడు. అక్షరకు అది కొత్త ప్రాంతం కాబట్టి సాధారణంగానే ఆమె అద్వైత్‌కు క్లోజ్‌ అవుతుంది. ఆమెను మొదటిసారి చూడాగానే అద్వైత్‌ ఇష్టపడతాడు. అక్షర పిన్నీ ఇల్లు , అద్వైత్‌ ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. దీంతో వారి పరిచయం మరింత ఎక్కువ అవుతుంది. ఆమెను ఓ రోజు బయటకు తీసుకెళ్తాడు అద్వైత్‌.  తన ప్రేమ సంగతి ఆమెకు చెప్తాడు. ఆమె ఒప్పుకోదు. కానీ ఇష్టపడుతుంది. ఇలా వారం రోజులు గడుస్తాయి. ఆమె తిరిగి వాళ్ల ఊరికి వెళ్లాల్సి వస్తుంది.  తన ప్రేమను అంగీకరిస్తుందేమో అనుకుంటాడు. కానీ ఆమె కుదరదు అని చెప్పి వెళ్లిపోతుంది. రెండు రోజులు గడుస్తాయి. అక్షర అతని కోసం వదలి వెళ్లిన ఒక మెసేజ్‌ ఆధారంగా ఆమె ప్రేమను గుర్తిస్తాడు.  తర్వాత వాళ్లు మళ్లీ కలుస్తారు. ఎలా కలిశారు? ఆ సందేశం ఏంటి? అనేది లఘుచిత్రంలో చూడండి. Total views 64271+ (ఫిబ్రవరి 8 నాటికి) Published on FEB 1, 2020


ఫైవ్‌ స్టార్స్‌

దర్శకత్వం:  సుధీర్‌

నటీనటులు :  తేజ, అక్షిత, శ్లోక

తేజది చిన్న కుటుంబం. ఒక పాప.  కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టడతాడు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తాడు. కానీ అతని కూతురికి ఇష్టమైన భోజనం ఎప్పుడూ ఇవ్వలేకపోతాడు. మరోవైపు కస్టమర్లకు సమయానికి ఫుడ్‌ అందించి మంచి ఫీడ్‌బ్యాక్‌ అందుకుంటాడు. ఓ రోజు డెలివరీ కంపెనీనీ నుంచి ప్రత్యేకమైన ఆఫర్‌ తేజ కోసం ఇస్తారు. రాత్రి పదిలోపు కొన్ని ఫుడ్‌ డెలివరీలు చేస్తే బోనస్‌ వస్తుందని ఆ ఆఫర్‌. పొద్దంతా కష్టపడి ఆ డెలివరీలు చేస్తాడు. కానీ చివరి ఆర్డర్‌ కస్టమర్‌ తప్పిదం వల్ల పూర్తి కాదు. దీంతో తేజ ఆఫర్‌ను మిస్‌ అవుతాడు. కానీ కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ రెస్టారెంట్‌కు తిరిగి ఇవ్వలేడు కాబట్టి దాన్ని తీసుకెళ్లి తన కూతురికి, భార్యకు ఇస్తాడు. ఇప్పటి నుంచో కోరుతున్న ఇష్టమైన భోజనం తేవడంతో ఆ కూతురు సంతోషిస్తుంది. రోజు గడవడం  కోసం అతను ఏదో ఒక పని చేయాలి అలాంటి పరిస్థితులను ఒక ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఎలా ఎదుర్కొంటాడో ఈ లఘుచిత్రం ద్వారా చూపించారు. Total views 6271+ (ఫిబ్రవరి 8 నాటికి) Published on FEB  2020


సైలెన్స్‌ ఆఫ్‌ లవ్‌

దర్శకత్వం: ఈశ్వర్‌

నటీనటులు :  ధన్‌రాజ్‌, అనుపమ

ప్రేమకు భాషతో సంబంధం ఉంటుందా? ప్రేమ పుట్టాలంటే మాటలు అవసరమా? అవసరం లేదు అని చెప్తుంది ఈ లఘు చిత్రం. ఇద్దరు మూగవ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమ ఎలా ఉంటుందో ఈ లఘు చిత్రం ద్వారా చూడవచ్చు. కథ విషయానికి వస్తే ఓ అమ్మాయి, అబ్బాయి ఒకచోట కలుస్తారు. కొంతసేపటి తర్వాత వాళ్లు ఫోన్‌ నంబర్లు మార్చుకుంటారు.  వాళ్లకు మాటలు రావు కాబట్టి ఫోన్‌లో మెసేజులు చేసుకుంటారు. ఇలా ఒకరికొకరు అర్థం అవుతారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకుంటారు. అమ్మాయి పుట్టిన రోజు సందర్భంగా తన ప్రేమను అబ్బాయికి తెలియజేస్తుంది. అబ్బాయి ఆశ్చర్యపోతాడు. తనను మొదటిసారి ఎక్కడ చూశాడో అక్కడికి వచ్చి కలుస్తాడు. తన ప్రేమను అదే చోట వ్యక్తపరుస్తాడు. వారి వైకల్యాన్ని పక్కన పెట్టి వాళ్లు ఒక్కటవుతారు. మాటలు ఏమీ ఉండవు.  కాన్సెప్ట్‌ బాగుంది. మంచి ప్రయత్నం చేశారు. చూడొచ్చు. Total views 41867+ (ఫిబ్రవరి 8 నాటికి) Published on FEB  2020


వక్ర

దర్శకత్వం: సత్యరాజ్‌

నటీనటులు : నిఖిత, షౌకత్‌

కార్తీక్‌, స్వాతి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆమె కార్తీక్‌కు మామ కూతురే. కానీ అతను వీళ్ల ప్రేమను ఒప్పుకోడు. మరోవైపు స్వాతికి వేరే వాళ్లతో పెండ్లికి సిద్ధం చేస్తాడు ఆమె తండ్రి. దీంతో కార్తీక్‌ చచిపోవాలని అనుకుంటాడు. కానీ ఫ్రెండ్స్‌ సహాయంతో స్వాతిని ఎక్కడికైనా తీసుకెళ్లాలనే నిర్ణయించుకుంటాడు. రాత్రి పూట ఇంటికి వెళ్లి స్వాతిని తీసుకొని వచ్చి, పెండ్లి చేసి బెంగళూర్‌ పంపాలన్నది ప్లాన్‌. అనుక్నుట్టుగానే ఆమెను తీసుకొచ్చి ఫ్రెండ్‌ ఇంట్లో ఉంచుతారు. కానీ ఉదయం అయ్యేసరికి ఆమె ఓ ఉత్తరం రాసి వెళ్లిపోతుంది. వేరే అబ్బాయిని ప్రేమించానని కార్తీక్‌కు గుడ్‌ బై చెప్తున్నట్టు ఉన్న ఉత్తరం అది. దీంతో అతను తీవ్ర ఆవేదనకు గురవుతాడు. దాని నుంచి బయటకు రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో ఓ రోజు స్వాతిని చూస్తాడు. ఆమె ఎవరితో ఉంటుంది? ఎవరిని ప్రేమించిందో తెలిసి ఆశ్చర్యపోతాడు. నమ్మిన ఫ్రెండ్స్‌ అందరూ మోసం చేసినట్టు తెలుసుకుంటాడు? ఇంతకీ ఏం జరిగి ఉంటుంది పూర్తిగా తెలియాలంటూ యూట్యూబ్‌కు వెళ్లండి.Total views 62+(ఫిబ్రవరి 8 నాటికి) Published on FEB  2020


వినోద్‌ మామిడాల,  సెల్‌: 7660066469


logo