శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Feb 15, 2020 , 23:54:52

ఓరుగల్లు కోటలో..

ఓరుగల్లు కోటలో..

తెలంగాణ రాష్ట్రంలోని అందమైన పర్యాటక నగరం వరంగల్‌. వరంగల్‌ కోట, వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం వంటి ఎన్నో ప్రదేశాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. వీటిని సందర్శిస్తున్న సమయంలో చరిత్రలోకి తొంగి చూసిన అనుభూతి ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. శీతాకాలంలో ఈ ప్రాంతం పర్యటనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్‌ నుంచి మార్చి మాసాల మధ్య ఇక్కడి ఉష్ణోగ్రత 22 నుంచి 23 డిగ్రీల మధ్య ఉంటుంది. కాబట్టి వరంగల్‌ సందర్శనకు ఇదే సరైన సమయం.

అందమైన సరస్సులు, అద్భుతమైన శిల్పకళతో కూడిన దేవాలయాలతో ప్రాచీన కాలాన్ని గుర్తు చేసే నగరాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్‌ ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి తీరాలి. సరికొత్త ప్రదేశాలను చూడాలని, చరిత్రను తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారికి వరంగల్‌ సరైన గమ్యస్థానం.  

వరంగల్‌ కోట: వరంగల్‌లో లెక్కకు మించిన చారిత్రక ప్రదేశాల్లో వరంగల్‌ కోట ఒకటి. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం ఎన్నో దాడులను ఎదుర్కొని నేటికీ మన కండ్ల ముందు కనిపించడం విశేషం. ఇక్కడి శిథిలాలు, ముఖ్యంగా ఈ ప్రదేశం మధ్య భాగంలో ఉండే నిర్మాణాలు అప్పటి వరంగల్‌ వైభవాన్ని కండ్లకు కడతాయి. ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శిస్తే తప్పకుండా మరోసారి ప్రయాణానికి ప్రణాళిక వేసుకుంటారు.


వెయ్యి స్తంభాల గుడి: వరంగల్‌లో తప్పక చూడాల్సిన ప్రముఖ ప్రదేశాల్లో వెయ్యి స్తంభాల గుడి ఒకటి. హనుమకొండలోని. దీనిని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. మహాశివుణ్ణి ఇక్కడ పూజిస్తారు. అద్భుతంగా మలచిన ఇక్కడి స్తంభాలతో కూడిన నిర్మాణం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు రాతితో మలచిన ఏనుగులు, భారీ నంది శిల్పం పర్యాటకులను అబ్బురపరుస్తాయి.


జైన దేవాలయం: కొలనుపాకలోని జైన దేవాలయం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుంది. ఇక్కడి గోడలపై అందమైన శిల్పాలు, ఎర్రని రాతి నిర్మాణాలు వంటి ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈ ప్రదేశాన్ని పూర్తి స్థాయిలో అన్వేషించాలనుకుంటే సాంప్రదాయ పద్ధతిలో పూజార్హమైన వస్ర్తాలను ధరించి వెళ్లండి.


పాకాల సరస్సు: ఓ ప్రదేశం గురించి మాటల కంటే చిత్రాలు ఎంతో బాగా తెలియజేస్తాయి. అటువంటి అందమైన దృశ్యాలను అందించే ప్రదేశాల్లో పాకాల సరస్సు ఒకటి. వరంగల్‌ నగరం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ సరస్సు ఉంది. పచ్చని ప్రకృతి వాతావరణం మధ్య ఉత్కంఠభరిత దృశ్యాలను ఈ ప్రాంతం ఆవిష్కరిస్తుంది. ప్రతి పర్యాటకుడికీ ఈ ప్రదేశం తప్పక నచ్చుతుంది.

భద్రకాళి ఆలయం: వరంగల్‌ నగరం ఎన్నో పర్యాటక ఆకర్షణలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా పేరొందింది. వాటిలో పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రదేశాల్లో భద్రకాళి ఆలయం ఒకటి. వరంగల్‌, హనుమకొండ మధ్య ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఏటా లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఆలయం మాత్రమే కాదు ఇక్కడికి సమీపంలోని భద్రకాళి సరస్సు, సహజసిద్ధమైన ప్రకృతి ప్రదేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యం: చిన్నపాటి ఉత్సాహభరిత, సాహసభరిత అనుభవాలు లేకుండా హాలిడే గడపడం కాస్త వెలితిగా అనిపిస్తుంది. అయితే వరంగల్‌కు సమీపంలోని ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యం ఆ వెలితిని కూడా దూరం చేస్తుంది. రాష్ట్రంలోని పురాతన అభయారణ్యాల్లో ఇది ఒకటి. ఇక్కడ ఎంతో విలువైన వృక్ష, జంతుజాలాన్ని వీక్షించవచ్చు. కాబట్టి పర్యటనలో ఇది ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది.

 భీమునిపాదం జలపాతాలు: ఉత్కంఠభరితమైన అనుభవాలను అందించే భీమునిపాదం జలపాతాల ప్రస్తావన లేకుండా వరంగల్‌ పర్యాటక ప్రదేశాల జాబితా పూర్తి కాదు. ప్రకృతి అందాలు, ఉత్సాహభరిత వాతావరణం, సూర్యుని కిరణాలు జలపాతాలపై పడి ఆవిష్కృతమయ్యే ఇంద్రధనస్సు సోయగాలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. ఎన్నో మరపురాని గుర్తులను ఇక్కడ ఫొటోల ద్వారా పదిలపరుచుకోవచ్చు. వరంగల్‌ నగరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతాలు ఉంటాయి.

లక్నవరం సరస్సు: వరంగల్‌లో తప్పక చూడాల్సిన మరో మనోహరమైన ప్రదేశం లక్నవరం సరస్సు. ఉత్కంఠభరితమైన వంతెనపై నడుచుకుంటూ వెళ్లడం, అందమైన సూర్యోదయాన్ని వీక్షించడం, సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి సుందర దృశ్యాలను ఆస్వాదించడం ఇక్కడ గొప్ప అనుభవాలను అందిస్తాయి. మీరు ప్రేమించే వ్యక్తులతో ఇక్కడ ఓ అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు.రామప్ప ఆలయం: వరంగల్‌లో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లో రామప్ప లేదా రామలింగేశ్వర ఆలయం ఒకటి. నగరం నుంచి 77 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. క్రీస్తుశకం 1213లోని ఈ ఆలయ నిర్మాణాలు దీని గొప్పదనాన్ని గురించి తెలియజేస్తాయి. ఈ అరుదైన ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు ఒక ప్రత్యేకత అయితే ఆలయం వెలుపల కుడివైపున ఉండే భారీ నందిశిల్పం మరో ప్రధాన ఆకర్షణ.