శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Feb 15, 2020 , 23:37:56

మహాశివరాత్రి పెద్దజాతర కత్తెరశాల మల్లికార్జునుడు!

మహాశివరాత్రి పెద్దజాతర కత్తెరశాల మల్లికార్జునుడు!

పట్నాలేసి పరమేశుడిని పూజించే వేళ ఒగ్గు పూజారుల ఢమరుక హేళ శివనామాన్ని ఉచ్ఛరించే జనమేళ భక్తజన వందనాలు వేనవేల అజ్ఞాన తిమిరాలు పోగొట్టే నీ లీల బోనపు కుండపై ధగధగలాడే జ్వాల అగస్త్య మహాముని నడయాడిన నేలమల్లన్న కొలువుదీరిన మన కత్తెరశాల..

ఎక్కడుంది?: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలకేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి రైలుమార్గంలో వచ్చేవారు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. బస్సు మార్గంలో వచ్చేవారు సిద్ధిపేట, కరీంనగర్‌, గోదావరిఖని మీదుగా చెన్నూర్‌ చేరుకోవచ్చు. మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు 30 కిలోమీటర్లు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి చెన్నూర్‌కు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. చెన్నూర్‌ నుంచి కత్తెరశాల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాలెన్నో అందుబాటులో ఉంటాయి. శివుడు నిరాకారుడు. లింగాకారుడు. కానీ అక్కడక్కడా విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. అలాంటి అరుదైన చిత్రం తెలంగాణలోని కత్తెరశాలలో చూడవచ్చు. ఇక్కడ మల్లిఖార్జునుడు విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. ప్రతి ఏటా శివరాత్రికి మూడురోజులు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. 

స్థల పురాణం

పూర్వం ఈ ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడింది. పంటలు పండలేదు. పశుపక్ష్యాదులు మృత్యువాత పడ్డాయి. అప్పుడు కత్తెరశాల సమీపంలోని ఓ చెట్టుకింద మల్లన్నను కొలువగా రైతుల ఇండ్లల్లో సిరులు నిండాయని పూర్వీకులు చెబుతుంటారు. ఏ కష్టమొచ్చినా స్వామిని దర్శించుకుంటే సమస్యలన్నీ తొలిగిపోయేవంట! ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు క్రీ.శ 1600 సంవత్సరంలో ఇక్కడ మల్లన్నకు ఆలయాన్ని నిర్మించారు. కత్తెరశాల సమీపంలోని నారాయణపూర్‌ గ్రామ సరిహద్దులో ఉన్న ఉత్తరవాహిని కోటిలింగాల వద్ద అగస్త్య మహాముని స్నానమాచరించి అక్కడి నుంచి సొరంగమార్గం ద్వారా కత్తెరశాల మల్లన్న ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించేవారని స్థల పురాణం. కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 1983లో పునర్నిర్మించారు. దాదాపు 150 ఏండ్ల నుంచి కాటవేన గోపాల్‌ అనే యాదవుడు మల్లన్నకు నిత్యపూజలు చేసేవాడు. ఆయన మరణానంతరం ఆ వంశస్తులే నిత్య పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం కాటవేన ఓదెలు స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నాడు.

ఆరాధ్య దైవం..

కత్తెరశాల గ్రామంలో యాదవులే ఎక్కువ. వీరికి మల్లిఖార్జునుడే ఆరాధ్య దైవం. పాడిపంట చల్లంగ చూడాలని ఏడాదంతా పూజలు చేస్తుంటారు. శివరాత్రి సమయంలో మూడ్రోజులు జాతర జరుగుతుంది. ఒగ్గు పూజారుల ఒగ్గు పఠనాలు, పూజలతో భక్తులు మల్లన్న స్వామికి బోనాలు సమర్పించుకుంటారు. భక్తులు చెన్నూర్‌ పరిసర ప్రాంతాల్లో ఉత్తరవాహినిగా పేరున్న గోదావరిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఆలయం ఎదురుగా ఉండే రావిచెట్టు కింది నాగేంద్రుని విగ్రహానికి పూజలు చేస్తే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఊరంతా పండుగే!

ప్రతి ఏటా శివరాత్రికి మూడు రోజులు జాతర జరుగుతుంది. మొదటిరోజు  పరమాన్నంతో మల్లన్న దేవునికి నైవేద్యం సమర్పించి పట్నాలు వేస్తారు. అనంతరం ఒగ్గు పూజారులతో స్వామివారి చరిత్ర ఆలయ విశిష్ఠతను కథ రూపంలో భక్తులకు వినిపిస్తారు. కొత్త కుండల్లో వండిన నిండు బోనాలతో స్వామికి మొక్కులు చెల్లిస్తారు. ఆలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు. ఆలయ ఆవరణలోనే పట్నాలు వేస్తారు. భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చిరువ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దుకాణాలు ఏర్పాటు చేస్తారు. హోటళ్లు, దుకాణాలు, ఎగ్జిబిషన్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలతో మూడు రోజులు ఊరంతా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అచ్చమైన పల్లెలో అంగరంగ వైభవంగా కత్తెరశాల మల్లన్న జాతర జరుగుతుంది. 

బోనాలు పోసి.. మొక్కులు తీర్చి  

మల్లన్నకు బోనం పోసి.. పట్నాలు వేస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. వివిధ ప్రాంతాల భక్తులు ఎడ్లబండ్ల ద్వారా కుటుంబ సమేతంగా వచ్చి ఆలయ ప్రాంగణంలో శివరాత్రి రోజున బస చేస్తారు. భక్తులు పొద్దంతా ఉపవాసం ఉండి శివనామ స్మరణ లో తరిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

-పడమటింటి రవికుమార్‌ , సెల్‌: 9948393391