శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Feb 15, 2020 , 23:29:37

వాస్తు

వాస్తు

ఆలయ గోపురాలు అంత ఎత్తు ఎందుకు కట్టాలి?పి.సత్యవతి, మేడ్చల్‌

ఆలయ గోపురాలు ఆడంబరం కోసం కట్టరు. ఆగమ శాస్ర్తాన్ని అనుసరించి మెట్లు మెట్లుగా కడతారు. దాని నిర్మాణంలో ఒక అద్భుత శాస్త్ర గుణం ఉంటుంది. గోపురాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ప్రాకారానికి ఉండే తూర్పు గోపురం స్వామివారి పాదాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఆ ద్వారం గుండా రావడం అంటే ఆయన పాద స్పర్శ లభించినట్టు. అలాగే అందులోకి వెళ్లాక రెండు వైపుల అరుగులు ఉంటాయి. అక్కడ భక్తులు ఆగి సేద తీరుతారు. అంటే స్వామి పాదాలే భక్తులకు గొప్ప ప్రశాంతతతను ముందుగా ప్రసాదిస్తాయి. ఆ తదుపరి దర్శనం లభిస్తుంది. ఇక ఆలయ గోపురం ఎత్తుకు వెనుక అనేక శాస్త్రీయ అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఆ ఎత్తు గోపురం స్వామివారి దర్శనం పొందని వారికి దర్శనం అందిస్తుంది. దానికి మొక్కినా స్వామిని దర్శించిన ఫలం పొందుతాము.


ఇల్లు మారినంత మాత్రాన మనిషి మారుతాడా? అతని అలవాట్లు మారుతాయా?-వి.సంధ్య, బయ్యారం, ఖమ్మం

మనిషి తప్ప ఈ సృష్టిలో ఎవరూ మారలేరు. మీరు అడవిలోని సింహానికి ఇడ్లీ పెడితే తినదు. పిల్లికి ఎంత పాలుపోసి పెంచినా ఎలుకను వేటాడటం మానదు. మారాలనుకుంటే మనిషి ఒక్కడే మారగలడు. ఆశక్తి, యుక్తి మనిషికి ఉన్న మహా బలం. అదే మనిషి ప్రత్యేకత. ఇల్లు అంటే కేవలం మట్టి, సిమెంటు, ఇటుక అనుకోవద్దు. ప్రాంతం, ప్రభావం, శాస్త్రం నిర్మాణశైలి అన్నీ కలిసి మనిషి మూలాల్లోకి ప్రయాణిస్తాయి. ఒక గొప్పసెలయేరు, జలపాతం పచ్చని మైదానం మనిషిలోని అంతరాత్మను మేల్కొల్పుతాయి. కాబట్టి మార్పు అనివార్యం. అందుకే సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసే వారు గొప్ప వాస్తు ఇండ్లలోకి వెళ్లగానే అరెస్ట్‌ అవుతారు. అందుకే వాళ్లు కొన్ని దిక్కుమాలిన కూలిన ఇండ్లల్లో గుహల్లో ఉంటూ ఉంటారు. మృగాలూ అంతే కదా! చీకటి కావాలి వాటికి.


వాయవ్యం బెడ్‌రూంకు బాల్కనీ ఉండవచ్చా?- డి. అరవింద, ప్రగతినగర్‌, కేపీహెచ్‌బీ

పడక గదులకు ప్రత్యేకంగా బాల్కనీలు పెట్టుకోవడం నేడు చాలా ఆకర్షణీయంగా కనబడుతున్న నిర్మాణ విధానం. కానీ వాటివల్ల వాస్తుపరమైన దోషాలు వస్తున్నాయి. బాల్కనీ ఇంటిలోని సభ్యులు అందరూ వెళ్లడానికి అనుకూలంగా వుండాలి. అప్పుడు తూర్పు, ఉత్తరాలలో మంచి బాల్కనీలు హాలుతో అనుబంధం కలిగి నిర్మించుకోవచ్చు. ప్రత్యేకంగా వాయవ్యం గదికి బాల్కనీ రావాలి అంటే పడమర వైపు మాత్రమే బాల్కనీ బయటకు తీసుకొని కట్టుకోవచ్చు. అయితే ఇంటికి తప్పనిసరిగా తూర్పు బాల్కనీ ఉండాలి. లేదా పడమర గదిని తగ్గించి బాల్కనీ ఇవ్వొచ్చు. ఎట్టి పరిస్థితిలో వాయవ్యం గదికి ఉత్తరంలో బాల్కనీ వుండకూడదు.


మా తమ్ముడు తూర్పు స్థలంలో ఎత్తుగా మూడు మిద్దెలు కట్టాడు. పడమర నా ఇల్లు వుంది. ఒకటే అంతస్థు దోశమా?- చిన్నరాములు, బోరబండ

కాలంలో ఎవరు ఎదుగుతారో ఎవరు ఒదుగుతారో ఎవరం చెప్పలేం. వారివారి గృహాలు, గుణాలు కర్మ ఫలాలు వాటిని నిర్ధారిస్తూ వుంటాయి. అయితే గృహం వుండే పరిసరాలలో అనివార్యంగా మార్పులు వస్తూ వుంటాయి. వాటిని ఎవరూ ఆపలేరు. శాస్త్రంలో అందుకే అనేక సూచనలు వుంటాయి. మనం వుండే ఇంటికి ఎంత దూరంలో ఇతరుల ఇల్లు వుండాలి అని ఇతరులు ఎట్లాగు వారి ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు. కాబట్టి మనమే మన స్థలంలో రేపటి పరిణామాలను ఊహించి గృహం కట్టాలి. ఇంటికి చుట్టూ ఆరు అడుగులను మించి పరిధిని దక్షిణం, పశ్చిమాలలో ఇరవై అడుగులు మించి తూర్పు ఉత్తరాలలో స్థలం వదిలి కట్టి తప్పక ప్రహరీలు నిర్మించినప్పుడు ఎటు వైపు ఎత్తు పెరిగినా మన గృహాన్ని నష్టపరచలేవు. మీరు మీ ఇంటికి ప్రహరీ కట్టండి. మీ తమ్ముని గృహం మిమ్మల్ని ఏమీ చేయదు.


logo