శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Feb 16, 2020 , 01:35:48

మాతృభాషకు పట్టాభిషేకం

మాతృభాషకు పట్టాభిషేకం

‘తెలంగాణ’.. ఈపేరులో ఏదో మహత్తు ఉంది. ఇక్కడి మనుషుల్లో మంచితనం ఉంది. కల్మషమెరుగని మనసుంది. ‘ఏరా’ అంటే.. ‘ఏందిరా’ అనే తెగువ ఉంది. అన్యాయాన్ని ఎదురించే తిరుగుబాటుంది. అందుకే మన అవ్వభాషకు ప్రపంచమే ఫిదా అయింది. ఇక్కడి పలుకులు ఎదలోతుల్లోంచి ఎగిసివస్తాయి. నాలుక కొస నుంచి కాకుండా నాభి నుంచి పెకులుతాయి. తెలంగాణ పదాలు, పాటలు ప్రజల అనుభవంలోంచి ఆవిర్భవిస్తాయి. ప్రజల కష్టసుఖాలు,  కన్నీళ్లు, చెమటలోంచి వచ్చిన ఈ పలుకుబళ్లు మట్టి వాసనలతో గుబాళిస్తాయి.  అందుకే మన అమ్మభాషకు ప్రపంచమే పట్టం కట్టింది. పోరాట పటిమను నేర్పిన నేలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మన యాస, భాషలే అచ్చ తెలుగు. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ యాస, భాషల రూపాంతరం.. మన భాషను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఈ వారం ముఖచిత్ర కథనం. 

-డప్పు రవి, సెల్‌: 9951243487

తెలంగాణ ప్రాంతంలో బండ్లకొద్దీ పలుకుబడులు ఉన్నాయి. గంపలకొద్ది సామెతలున్నాయి. ఇక్కడ పొణకల నిండా పొడుపుకథలున్నాయి. పట్టేన్ని పదాలు ఉన్నాయి. ఒల్మెన్ని విభక్తి ప్రత్యయాలున్నాయి. వీటన్నింటినీ తెలుగు రాష్ర్టాల్లోని ఇతర ప్రాంతాల పలుకుబళ్ళతోనూ, సామెతలూ, పొడుపుకథలూ, పదాలూ, ప్రత్యయాలతోనూ పోల్చిచూసినప్పుడు తెలంగాణ పలుకుబడి ప్రత్యేకమైందిగా కనబడుతుంది. ఈ ప్రాంత సామెతలు విశిష్టమైనవి. ఇక్కడి పొడుపుకథల్లో విలక్షత గోచరిస్తుంది. తెలంగాణలో వ్యవహృతం అవుతున్న పదాలూ, విభక్తులూ విభిన్నంగా అగుపిస్తున్నాయి. ఈ ప్రత్యేకతలకు కారణాలు అనేకం. నిజానికి తెలంగాణ ఒక ప్రత్యేక ప్రాంతం. ఇవాళ అది ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ సాహిత్యం ప్రధానంగా దేశి కవితా సంప్రదాయానికి చెందింది. అది శిష్టేతరమైన జానపదుల సారస్వతం, తెలంగాణ పల్లె మమతానురాగాల ముల్లె.. నెనరు గల్ల మాటలకు నెలవు తెలంగాణం. ఆత్మగల్ల పాటలకు కొలువు తెలంగాణం. మన గడ్డమీద మాట్లాడిందే అసలైన భాష అనుకొని సగర్వంగా మాట్లాడాలి. ఏదేమైనా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ భాషనే ఆయువు. తెలంగాణ పాటలన్నీ అవే, తెలంగాణ ఉద్యమకర్త, మన ముఖ్యంత్రి  కే చంద్రశేఖర్‌రావు మాటలన్నీ అచ్చ తెలంగాణమే. అందుకే మనందరి హృదయాలను గెలిచినవి. తెలంగాణమే అసలైన తెలుగు. మన తెలంగాణ భాష వినసొంపుగా ఉంటుంది. నాదమయంగ వినిపిస్తుంది. ఈ భాషలో లయాత్మకత నిండి ఉంటుంది. మన పల్లెల్ల గలగల మాట్లాడే ముచ్చటంతా తెలంగాణ యాసనే. అసలు అచ్చ తెలుగు మనగడ్డ మీదనే మాట్లాడతారు. ‘అదొక యాస..భాస’ అని నాడు వెక్కిరించారు. ఇప్పుడా వెక్కిరింతలు లేకపోయినా.. అసలు సిసలు తెలుగు మన నేలమీదనే మాట్లాడుతున్నారు. ‘మా భాషే గొప్ప.. మీ భాషదేముంది దిబ్బ’ అని లొల్లి పెట్టుకున్నారు కాబట్టే.. రాష్ట్రం రెండు ముక్కలైంది. ఎవరు మాట్లాడేది వారికి భాష అయితే.. పరాయి వారికి యాస. విషాదం ఏంటంటే.. ఎన్నో ఏండ్లనుంచి ఉన్నపదాలు.. పంపన, పోతన, సోమన వాడిన పదాలు కనపడకుండా పోయాయి. వాటి స్థానంలో తెలుగు పేర ఇక్కడ పలుకని పదాలు వచ్చిపడ్డాయి. దీంతో ‘మన సంస్కృతి, భాష, సాహిత్యం దోచుకున్నారు’ అనే చర్చ జరిగింది. ఆంధ్రులు.. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ల యాస, భాషలను మనపై బలవంతంగా రుద్దారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన రాష్ట్రం, మన మీడియా.. మన వ్యావహారికభాష.. మన యాస మనకైంది. ఇప్పుడు ఎవరికివారే వేరుపడ్డాక మనం మన సోయిలకు రావాలే. అప్పుడే తెలుగు అంటే తెలంగాణం అని తెలుస్తుంది. విశ్వవ్యాప్తంగ ఉన్న తెలుగును విస్తృత పరచాలి. అందులో అన్ని ప్రాంతాల ప్రజలు మాట్లాడే మాటలను పొందుపరచాలి. మన స్వరాష్ట్రంలో ఆ ప్రయత్నమే జరుగుతున్నది.

   

మన యాసలో నిఘంటువులు..

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. తెలంగాణ తెలుగు ఎట్లా ఉండాలనే చర్చ మొదటి నుంచీ జరుగుతున్నదే. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వాటిలో ప్రధానమైనది భాషనే. వివిధ జిల్లాల్లో వివిధ తీర్లలో పలికే పదాలను, పలుకుబడులను, నుడికారాలను అన్నింటినీ ఏకం చేసే పనిలో కొందరు భాషాప్రియులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మన యాస, మన పదాలు.. వాటి అర్థాలతో పదకోశాలు తీసుకొచ్చారు. తాజాగా 400 పేజీల్లో 33వేల పదాలతో తెలుగు యూనివర్సిటీ ‘తెలంగాణ పదకోశం’పేరుతో డిక్షనరీని రూపొందించింది. తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వం, ప్రొఫెసర్‌ రమేశ్‌ భట్టు కోఆర్డినేషన్‌లో 30మంది.. మూడేండ్ల పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, పల్లెల్లో వృద్ధులతో మాట్లాడి అంతరించిపోతున్న వేలాది పదాలను సేకరించారు. ఇందుకు ప్రత్యేకంగా నలిమెల భాస్కర్‌, ఘంటా చక్రపాణి, కట్టా శేఖర్‌రెడ్డి, రాజేశ్వరశర్మతో కమిటీని కూడా వేశారు. మొత్తంగా లక్షా పదివేల పదాల్లోంచి కనుమరుగైన 33వేల పదాలను ఎంపిక చేసి ‘తెలంగాణ పదకోశం’ తీసుకొచ్చారు. వీరి కంటే ముందు తెలంగాణ తెలుగును ఎలా రాయాలో వివరిస్తూ.. మరుగున పడిన మన పదాలను వెలికి తీసే ప్రయత్నం చాలామంది చేశారు. ఈ క్రమంలో తెలంగాణ భాషా పదాలు, మాండలికాలపై, వృత్తి పదకోశాలు, ఇతర పదకోశాలు వెలువరించారు. వారిలో భద్రిరాజు కృష్ణమూర్తి, ప్రొఫెసర్‌ తూమాటి దోణప్ప, బూదరాజు రాధాకృష్ణ, కపిలవాయి లింగమూర్తి, పోరంకి దక్షిణామూర్తి, కాలువ మల్లయ్య, నలిమెల భాస్కర్‌, ముదిగంటి సుజాతారెడ్డి, రవ్వా శ్రీహరి వంటివారు వ్యక్తిగతంగా పలు పదకోశాలు వెలువరించారు. వీరి గ్రంథాల నుంచి కూడా ‘తెలంగాణ పదకోశం’లో కొన్ని పదాలను స్వీకరించారు. మన యాసకు ప్రాణం పోయాలనే సంకల్పంతో తెలంగాణ, ఉస్మానియా, తెలుగు యూనివర్సిటీల్లోని కొందరు పీహెచ్‌డీ విద్యార్థులు ‘తెలంగాణ యాస’లోనే హీహెచ్‌డీలు సమర్పిస్తున్నారు. ఇదొక శుభపరిణామం.


తెలుగు తప్పనిసరి.. 

మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలని ఎన్నో కమిటీలు నిర్ణయించాయి. దీనివల్ల విద్యార్థుల్లో చదువుపై ఏకాగ్రత పెరిగి, విషయాలను, భావనలు అర్థం చేసుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తెలుగు భాషను కాపాడుకునేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. ప్రాథమిక విద్యనుంచి ఇంటర్‌వరకు తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశారు. దీని వల్ల ప్రతి విద్యార్థి తెలుగు కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. దక్షిణభారతంలో భాష కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. నేటికీ మనపై హిందీని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే భాష’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాలతో సహా అంతా తీవ్రంగా వ్యతిరేకించారు. సాహిత్య తెలంగాణ..  

‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి.. నా తెలంగాణ కోటి అందాల జాణ.. నా తెలంగాణ లేమ సౌందర్య సీమ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఒక రణన్నినాద ఉద్యమ గీతాన్ని రగిల్చిన సాహిత్యకారుడు దాశరథి. తన సాహిత్యంతో మూగవోయిన గొంతులలో మంజీర నాదాలు పలికించి, తీగలు తెంపి ఆగ్నిలో దింపిన రతనాల వీణతో అగ్నిధారలు కురిపించిన సాహిత్యయోధుడు దాశరథి. తెలంగాణ ప్రజల్లో ఆలోచనాలోచనలు తెరిపించి, తెలుగు నుడులకు అమృతాభిషేకం జరిపించి, తిమిరంతో సమరం చేసిన అక్షర ధీశాలి, మహాకవి దాశరథి. 1953లో ‘తెలంగాణ రచయితల సంఘాన్ని’ స్థాపించి స్వయంగా నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన సాహితీ వీరుడు. తెలంగాణ పోరాటానికి ఉద్యమ స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ పునర్నిర్మాణ పథంలో దాశరథి సాహిత్యం ఓ కరదీపికగా మారింది. ఆయనతోపాటు పాల్కురికి సోమనాథుడు, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, గూడూరు, సురమౌళీ, సినారె, గడిగె భీమకవి, అంపశయ్య నవీన్‌, తెలగన్న, తేరేశ్‌బాబు, మామిడి హరికృష్ణ వరకూ ఎందరో సాహిత్యకారులు తెలంగాణ యాసలో విశేష రచనలు చేశారు. వారి బాటలో వర్థమాన రచయితలు వేలాదిగా రచనలు చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన శ్రీభాష్యం విజయసారథి సాహిత్యంలో చేసిన కృషికిగాను ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే.. మన మాతృభాష పరిరక్షణకు నడుం కట్టిన సాహితీవేత్తలు వేలల్లో ఉన్నారు. 

 

‘శతక’ తెలంగాణ.. 

ఆధునిక కాలంలో తెలంగాణలో శతక సాహిత్యం భక్తి, జ్ఞాన, వైరాగ్య, నీతి బోధక మార్గోపదేశంగా వెల్లివిరిసింది. వానమామలై వరదాచార్యులు రాసిన ‘స్తవరాజ పంచశతి’, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యుల ‘అంతర్మథనం’, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు రాసిన ‘శ్రీపాంచాల రాయశతకం’, హరిరాధా కృష్ణమూర్తి ‘శ్రీ శ్రీనివాస శతకం’, డా.సి.వి. జయరాజు ‘చారుచర్య’, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ‘శ్రీ కర్మన్‌ఘాట్‌ ఆంజనేయ స్వామి’, కపిలవాయి లింగమూర్తి ‘ఆర్యా శతకం’ మొదలైనవి తెలంగాణ నుంచి వెలువడిన శతకాలలో కొన్ని. అలాగే డా.ఇందారం కిషన్‌రావు రాసిన ‘శ్రీనివాస శతకం’ శ్రీనివాస ప్రభో అనే మకుటంతో వెలువడింది. ఆచార్య యస్‌.లక్ష్మణమూర్తి ‘గోపికా వల్లభా శతకం’, గాదె వేంకట మధుసూదనరావు ‘మధుశతకం’, డా.తిరునగరి ‘తిరునగరీయం’, వరిగొండ కాంతారావు ‘ఏలికకు ఒక లేఖ’, నల్ల ఉపేందర్‌ ‘తెలంగాణ శతకం’ వంటివి ఈ ప్రాంతం నుంచి వెలువడిన మరికొన్ని శతకాలు. వీరి బాటలో వర్దమాన కవులు తెలంగాణ భాషలో శతకాలు రాస్తున్నారు. వారిలో ఆయాచితం నటేశ్వర శర్మ, క్రాంతికృష్ణ ‘నలవురాణి శతకం’, పద్మా త్రిపురారి ‘చిద్విలాస శతకం’, గౌరీపట్ల ముకుంద శర్మ, గౌరీశంకర్‌, మరుమాముల దత్తాత్రేయశర్మ, గుడిపల్లి వీరారెడ్డి ‘శంభో శతకం’, బీటకూరి శేషుకుమార్‌ ‘ఆధునిక కుమార శతకం’, పిట్ల కావ్య ‘కావ్యమాల శతకం’, గోగులపాటి కృష్ణమోన్‌ ‘నవ్యకృష్ణ శతకం’ వంటివారు ఇంకా ఎంతోమంది వర్దమాన కవులు ప్రజలందరికీ అర్థమయ్యేరీతిలో, మన భాషలో శతకాలు, పాటలు, బాల గేయాలు, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన రచనలు చేస్తున్నారు. శతక రచనల ద్వారా నాటి నుండి నేటి వరకు సరస్వతీ ఉపాసన చేసే కవులు, పండితులు మన దగ్గర ఎందరో ఉన్నారు.


మీడియాలో పెరిగిన ప్రాధాన్యం  

తెలంగాణ ఏర్పాటుతో మీడియాలో ముఖచిత్రమే మారిపోయింది. గతంలో ఏ మీడియాలో చూసినా ఆంధ్రప్రాంత భాషనే ఉండేది. మలిదశ ఉద్యమంలో ‘టీ న్యూస్‌' చానెల్‌ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ యాస ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆ సమయంలో వచ్చిన ‘నమస్తే తెలంగాణ’ పత్రిక మన యాస, భాషలకు జీవం పోసింది. ప్రత్యేకరాష్ఱ్ర సాధనలో భాష ప్రాధాన్యం అధికంగా ఉండడం, పాటలు, సాహిత్యం, రచనలు, మన యాసలోనే సాగడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. స్వరాష్ట్రం సాధించాక.. ప్రధాన పత్రికలు, మీడియా విభాగాలు రెండుగా విడిపోయాయి. తెలంగాణలో అన్ని మీడియా సంస్థలు ఇక్కడి యాస, భాషలకు గౌరవం ఇస్తూ మన భాషకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఫక్తు తెలంగాణ యాసతోనే సినిమాలు, పాటలు అలరిస్తున్నాయి. రేడియో మాధ్యమాలు కూడా తెలంగాణ యాసలోనే ప్రసంగాలు చేస్తున్నాయి. ప్రముఖ టీవీ చానెళ్లు తెలంగాణ యాసలోనే ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందిస్తుండటం మన భాషా ఉద్యమ ఫలితమే. ఇంగ్లిషు భాష నేర్వడం అవసరమూ, విజ్ఞాన సముపార్జన ధ్యేయం కావాలే కానీ మోజు కాకూడదు. ఈ మోజులో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీనిని అందించడం మనందరి కర్తవ్యం. ప్రపంచంలో అన్ని భాషలూ గొప్పవే కానీ అన్నింటికంటే మాతృభాష గొప్పది. దానిని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలి.


ఈ ఏడాది థీమ్‌.. 

ప్రతియేటా ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నది యునెస్కో. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో.. స్థానికంగా మాట్లాడే భాషలతోనే చైతన్యం పెరిగి అభివృద్ధి జరుగుతుందని బలంగా విశ్వసిస్తున్నది యునెస్కో. కారణం.. 1956లో జరిగిన ‘బెంగాలీ భాషా ఉద్యమం’లో నలుగురు యువకులు ప్రాణాలు అర్పించారు. ఈక్రమంలో అన్ని ప్రాంతాల్లో భాషలపై ఎంతో కసరత్తు చేసిన యునెస్కో.. స్థానికంగా ఉండేవారికి మాతృభాషే ముఖ్యమని 1999 నవంబర్‌ 17న ఓ నిర్ణయం తీసుకున్నది. అదే.. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21న ‘అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం’ జరుపాలని. అలా 2000వ సంవత్సరం ఫిబ్రవరి 21న తొలిసారిగా ‘అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం’ జరిగింది. అప్పటి నుంచి ప్రతియేటా ఒక్కో థీమ్‌తో ప్రచారం చేస్తున్నది యునెస్కో. ఈ ఏడాది ‘మాతృభాషలు.. అభివృద్ధికి, శాంతి నిర్మాణానికి, సయోధ్యకు సంబంధించినవి’ అనే ఇతివృత్తాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వారి మాతృభాషకు సంబంధించిన వ్యాసాలు, పాటల పోటీలు నిర్వహించాలని యునెస్కో పిలుపునిచ్చింది. తద్వారా భావితరాలకు వారి మాతృభాషను అందించాలనే ప్రయత్నం చేస్తున్నది.భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో..  

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా వర్ధమాన కవులు, రచయితలను ప్రోత్సహించే కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతున్నది. మన యాసలో రాసిన రచనలు, సాహిత్యాన్ని డిజిటలైజ్‌ చేస్తున్నారు. మన సాహిత్యం, కవిత్వం, రచనలు, తెలంగాణ పర్యాటకం, కళలు, రుచులు, తెలంగాణ జీవన విధానం, తెలంగాణ చరిత్ర, పండుగలు, ఆహారపు అలవాట్లు, కొత్తగా వికీపీడీయాలో అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నది. ఇందుకు దాదాపు 200 మంది రచయితలు తమ సహకారం అందిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలంగాణ భాషా, సంస్కృతి, చరిత్ర, విశిష్ఠత తెలిపే ప్రయత్నం రెండేండ్ల నుంచి జరుగుతున్నది. ఇప్పటికే మన భాష, యాసలకు సంబంధించిన ఎన్నో విషయాలు వికీపీడీయాలో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల భాష కొత్తగా పునరుద్ధరించబడుతూ.. బలోపేతమవుతున్నది. గడిచిన నాలుగేండ్లలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 52 పుస్తకాలు ప్రచురించారు. ఇవన్నీ మన సంస్కృతిని పరిశోధించి రాసిన పుస్తకాలు. ఇవేకాకుండా తెలంగాణ పల్లెల్లో.. ప్రజల అనుభవాల నుంచి పుట్టిన వేలాది పాటలను కూడా సేకరించి డిజిటలైజేషన్‌ చేశారు. కొత్తగా ఏర్పడిన ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’ ఆధ్వర్యంలో మరో 1200 పాటలు పుట్టుకొచ్చాయి. వాటిని ‘సంక్షేమ స్వరాలు’ పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు. ఇలాంటి భాషా సంపదను కాపాడుకునే కార్యక్రమాలు చాలా పద్ధతిగా, వేగంగా జరుగుతున్నాయి. మన యాస, భాషలకు సంబంధించిన ఏ సమాచారమైనా ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చింది. మన యాస, భాషల్లో వచ్చే రచనలు, వెలువడే పుస్తకాలు, కథలు, కథనాలు, కథా సంపుటులను ప్రోత్సహిస్తున్నారు. ఇవేకాకుండా అచ్చ తెలంగాణకు ప్రాణం పోసి కనుమరుగైన కళలను బతికించేందుకు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు.


తెలంగాణ భాషా దినోత్సవం..

మన మాతృభాషకు పట్టం కడుతూ.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఏటా సెప్టెంబరు 9న ‘తెలంగాణ భాషా దినోత్సవం’ నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా భాషా పరిరక్షణ కోసం పాటుపడుతున్న ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నది. 2015లో మొదటిసారిగా రచయిత అమ్మంగి వేణుగోపాల్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. 2016 సంవత్సరానికిగాను ప్రజాకవి గోరటి వెంకన్నకు అందజేశారు. 2017లో సీతారాంను ఎంపిక చేశారు. 2018లో అంపశయ్య నవీన్‌కు.. 2019లో కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డికి కాళోజీ పురస్కారం అందించారు. ఇదేకాకుండా.. దాశరథి జయంతికి కూడా సాహిత్యంలో విశేష సేవలు అందిస్తున్న రచయితలు, కవులను ప్రతియేటా ఘనంగా నగదు ప్రోత్సాహమిచ్చి సత్కరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.


భాషో రక్షతి రక్షితఃభాష మన జీవన విధానం. 

భాషను రక్షిస్తే.. అది మనల్ని, మన జాతిని రక్షిస్తుంది. ‘తెలంగాణ వ్యవహారిక పదకోశం’తో భావితరాలకు మన భాషా సంపదను అందించాం. ప్రజల భాషలో పరిపాలనను, విద్యను, శాస్త్ర సాంకేతిక జ్ఞానాభివృద్ధిని, సమాచార సాధనాలను శక్తివంతం చేసేందుకు పూనుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకూ తెలుగు భాషలో ఫిర్యాదులు స్వీకరించి, తెలుగులోనే సమాధాలు ఇస్తే.. ఇంకా బాగుంటుంది. అలాగే కోర్టులల్లో కూడా వాద, వివాదాలు తెలుగులోనే జరిగి, ఉత్తర, ప్రత్యుత్తరాలు, తీర్పులు కూడా తెలుగులోనే వెలువడితే సామాన్యుడికి భాష చేరువ అవుతుంది. మనమంతా భాషను కాపాడే ప్రయత్నం చేయాలి. తెలుగు భాషా బిడ్డలుగా అది మన బాధ్యత.

- ఎస్వీ సత్యనారాయణ, తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ


తెలుగు విశ్వవ్యాప్తం.. 

తెలంగాణ భాషకు టీవీ చానెళ్లు, పత్రికలు పునర్జీవం పోస్తే.. ప్రభుత్వం మన యాస, భాషలకు పట్టం కట్టింది. ఇప్పుడు మీడియా తెలంగాణ యాసలోనే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. నాడు పెండ్లి చూపులు సినిమా నుంచి మొదలు పెడితే.. ఇటీవల విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' వరకు తెలంగాణ యాసలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందించిన సాంకేతికతతో మేము చేస్తున్న ప్రయత్నాలు ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీనివల్ల తెలుగును విశ్వవ్యాప్తం చేస్తున్నాం. మన భాషతో పాటు ఇతర భాషలు కూడా వర్థిల్లాలి. 

- మామిడి హరికృష్ణ, భాషా, సాంస్కృతికశాఖ సంచాలకులు, తెలంగాణ 


అందుబాటులో మన సాహిత్యం

తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఎందరో వర్థమాన సాహితీ వేత్తలను ప్రోత్సహిస్తున్నాం. ఈ అకాడమీ ద్వారా ఎన్నో అపరూప గ్రంథాలను ప్రచురించాం. ఇటీవలే ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ (tsa.telangana.gov.in) పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. తెలుగు వారికి మన సాహిత్యాన్ని అందుబాటులోనే ఉంచాలనేది మా ప్రధాన ఉద్దేశం. తెలంగాణ కవుల పద్యాలు, కావ్యాలు, నవలలు, జానపదాలు ఈ వెబ్‌సైట్లో ఉన్నాయి. ప్రభుత్వ అడుగుజాడల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు పెద్ద ప్రణాళికతో ఉన్నాం.

- నందిని సిధారెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్‌, తెలంగాణ


మన తెలుగు వర్థిల్లుతున్నది.. 

ప్రస్తుత కాలంలో తెలుగు భాష కాలగర్భంలో కలిసిపోతున్నదని ఎంతోమంది బాధపడుతున్నారు. అది ముమ్మాటికీ తప్పు. ప్రస్తుత యువతరం అందివచ్చిన టెక్నాలజీతో తెలుగు భాషను కాపాడుతున్నారని భాషాభిమానులు అభినందిస్తున్నారు. ఇంటర్‌నెట్‌, సామాజిక మాధ్యమాల్లో మన యాసలు, భాషలు, ఆచారాలు, వ్యవహారాలు, పండుగలు, కవిత్వం, పద్యాలు, సాహిత్యం కోసం ప్రత్యేకంగా గ్రూపులుగా ఏర్పడ్డారు. తెలుగు భాషకు సంబంధించి ఒక్క ఫేస్‌బుక్‌లోనే దాదాపు 2వేల గ్రూపులు ఉన్నాయి. ఇక వాట్సాప్‌లో లక్షలాది గ్రూపులున్నాయి. వీటిల్లోని సభ్యులంతా తెలుగులోనే రాస్తున్నారు. అంతరించిపోతున్న మన పదాలను వారి పెద్దల ద్వారా తెలుసుకొని సోషల్‌ మీడియా వేదికగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా 16కోట్ల మంది తెలుగుమాట్లాడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వాయిస్‌, అనువాద సాప్ట్‌వేర్లు భాషాభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. కొన్ని ప్రత్యేక యాప్‌ల వల్ల ఎవరి మాతృభాషలో వారు మొబైల్‌లో టైపింగ్‌ చేసుకుంటున్నారు. మరికొన్ని యాప్‌లలో వాయిస్‌ ఇస్తే.. అది అక్షర రూపం దాల్చుతున్నది. తెలుగు భాషలో కూడా ఇలాంటి ఎన్నో యాప్‌లు అందుబాటులోకి  రావడంతో మాతృభాషాభివృద్ధికి సాంకేతికత బాగా ఉపయోగపడుతున్నది.


చిన్న భాషలు ఎదిగినందువల్ల పెద్ద భాషలకు ప్రమాదం ముంచుకొస్తుందన్న వాదం తప్పు. అది ఎదగడం వల్ల ఆ భాషీయులు మాత్రమే కాక దాని చుట్టూతా ఉన్న పెద్ద భాషా వారు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు. ఆ రెండు భాషల మధ్య పరస్పరం భాషపరంగా, సంస్కృతిపరంగా ఇచ్చిపుచ్చుకోవడం సహజంగా జరిగిపోతుంది. ఈ క్రమంలో ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న గోండుల కంటే పొరుగురాష్ర్టాల్లో ఉన్న గోండుల సంఖ్య, ప్రదేశం ఎంతో ఎక్కువగా ఉంది. తమ భాషకు లిపి ఉందని ఇంతకాలం తెలియనిస్థితిలో ఉన్న గోండులు తమ పూర్వులు వాడిన లిపిని కనుగొని ఇటీవల తమ భాషాభివృద్ధికి కృషి చేయడం మన రాష్ట్రంలోనే ప్రారంభమైంది. మాతృభాషను కోల్పోతే వారసత్వంగా సాధించుకున్నదంతా కోల్పోయి, ఆ జాతి పూర్తిగా పరాయీకరణ పొంది గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా పెద్ద భాషలతోపాటు చిన్న, అతి చిన్న భాషలను కూడా కాపాడవలసి ఉంది. ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నది. గోండులు, చెంచులు, కోయల భాషలకు లిపిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి. 


logo