గురువారం 02 ఏప్రిల్ 2020
Sunday - Feb 16, 2020 , 01:24:26

ఫిడెల్‌ క్యాస్ట్రో .. చావుకే చావుదెబ్బ

ఫిడెల్‌ క్యాస్ట్రో .. చావుకే చావుదెబ్బ

ఆయన ఉడుకు రక్తానికి ఉత్తేజం..పెట్టుబడి పడగలపై ఎత్తిన పిడికిలి..సామ్రాజ్యవాద విధానాలపై గర్జించిన స్వరం..అమెరికా హత్యాయత్నాలను తప్పించుకున్న మృత్యుంజయుడు..చావుకే చావు దెబ్బలు కొట్టిన క్యూబా కమ్యూనిస్టు శిఖరం..చివరి రోజుల్లో తీవ్ర అస్వస్థతకు గురైనా సుదీర్ఘ కాలం జీవించిన యోధుడు..90 ఏండ్ల వయసులో తుది శ్వాస విడిచిన క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో చివరి పేజీ..

నవంబర్‌ 25, 2016

యావత్‌ ప్రపంచాన్ని ఓ వార్త కలవరపెట్టింది. ప్రపంచ యోధుడు ఫిడెల్‌ క్యాస్ట్రో మరణించిన వార్త అది. సామాజ్యవాదుల గుండెల్లో నిద్రించిన వీరుడు లేరన్న సంగతి ఎన్నో దేశాలను కలవరపెట్టింది.  అమెరికా సామ్రాజ్యవాదపు కుట్రలను జయించి చావుకే చావు దెబ్బ కొట్టి గెలిచన కమ్యూనిస్టు సమున్నత శిఖరం ఆయన. ప్రపంచంలో చిన్న దేశం నుంచి అత్యంత శక్తిమంతమైన అమెరికాకే చుక్కలు చూపించిన వీరుడాయన...

సామ్రాజ్యవాద విధానాలను విస్తరించుకునేందుకు అమెరికా ప్రయత్నాలు సాగుతున్న రోజులవి. క్యూబా దేశాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ ఆమెరికాకు వరుస హెచ్చరికలు జారీ చేస్తూ పక్కలో బల్లెంలో మారాడు ఫిడెల్‌ క్యాస్ట్రో.  క్యూబా అధ్యక్షునిగా దేశాన్ని ఆమెరికా పంచన చేరనియలేదు. క్యూబాను ఆక్రమించుకొనేందుకు ఆమెరికా తీవ్రంగా విఫలమైంది. ఫిడెల్‌ క్యాస్ట్రోను అడ్డు తొలగించుకుంటే ఆ పని సులభంగా సాధ్యం అవుతుందని భావించింది అమెరికా.చివరికి  క్యాస్ట్రోను చంపాలన్న పథకాలను అమెరికా విస్తృతం చేసింది. దీని కోసం అమెరికా గూఢాచార సంస్థ సీఐఏను రంగంలోకి దించింది.  విషపూరితమైన గుళికలు ఇవ్వడం, ఆయన కాల్చే చుట్టలో బాంబు పెట్టడం, స్క్యూ బా డైవింగ్‌ సూట్‌లో ప్రాణాంతకమైన ఫంగస్‌ను ఉంచడం, విషం కూరిన సిగరెట్లు వంటి ప్రయోగాలతో అంతమొందించేందుకు ప్రయత్నించినా కాస్ట్రో చిక్కలేదు. మాఫియా తరహాలో కాల్చి చంపేందుకు కూడా సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. చివరికి క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లోరెంజ్‌ ద్వారా సైతం ఆయన్ను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ నిత్యం అప్రమత్తంగా ఉండే ఫిడెల్‌ కాస్ట్రో... అమెరికా కుట్రలన్నీ ఛేదించి మృత్యుంజయుడిగా నిలిచారు. ఇట్లా అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ చేసిన ప్రయత్నాలు 636.. అన్నీ విఫలమయ్యాయి. ఫెడెల్‌ క్యాస్ట్రో జయించాడు.రోజులు గడిచే కొద్దీ అమెరికాకు మాత్రం క్యాస్ట్రో లొంగడం లేదు.  క్యూబాపై అమెరికా వాణిజ్యపరమైన ఆంక్షలు విధించింది. క్యూబాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది అమెరికా. ఆ దేశంలో కమ్యూనిస్టు రాజ్యాన్ని కూలదోయడానికి విశ్వప్రయాత్నాలూ చేసింది.  అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా  వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు క్యాస్ట్రో.


1959 జనవరి 8, క్యూబా.. 

‘ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించే కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది’ఫెడెల్‌ క్యాస్ట్రో  ప్రధానిగా ఇచ్చిన తొలి ఉపన్యాసం. అప్పటికీ ఆయన వయస్సు 34 సంవత్సరాలే..  క్యూబా, బొలివియాలో విప్లవ ఉద్యమాలకు, గెరిల్లా యుద్ధ తంత్రాలకు బాటలు వేసిన ఫిడెల్‌ క్యాస్ట్రో, చే గువేరా విప్లవవీరులుగా నిలిచారు.  హవానాయూనివర్సిటీ లాస్కూల్‌లో న్యాయశాస్త్రం అభ్యసిస్తూ విప్లవ రాజకీయాల్లో చేరారు. క్యూబాలో అధికారంలోని నియంతృత్వ బటిస్టా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 1953లో జైలు పాలయ్యారు. 1955లో విడుదలైనా, గెరిల్లా యుద్ధతంత్రంతో బటిస్టా సర్కార్‌ ను ముప్పుతిప్పలు పెడుతూ చేగువేరాతో కలిసి  క్యూబాలో విప్లవాన్ని తెచ్చారు.  కాస్ట్రో ఆధ్వర్యంలో విప్లవసేనలు నియంత బటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసి, క్యూబా ప్రధానిగా ఆయన  బాధ్యతలు చేపట్టారు. హవానాలో విజయోత్సవ సభలో కాస్ట్రో ప్రసంగించారు. తమ మహాసామ్రాజ్యం పక్కనే ఎర్రజెండా రెపరెపలను అమెరికా సహించలేక పోయింది. అప్పుడే క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.   క్యూబాను శత్రుదేశంగా భావిస్తూ తుడిచి పెట్టాలని చూసింది. 

1960 ప్రాంతంలోనే సీఐఏ ఆధ్వర్యంలో దురాక్రమణ సాగింది. క్యాస్ట్రో ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టారు. జాన్‌ ఎఫ్‌ కెనడీ హయాంలో క్యూబాను సంక్షోభంలో నెట్టే ప్రయత్నం చేసింది. క్యూబాకు యూఎస్‌ఎస్‌ఆర్‌ అండగా నిలవడంతో అమెరికా ఆటలు సాగలేదు. కెనడీ హత్యానంతరం జాన్సన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి నుంచి క్యాస్ట్రోను మట్టుపెట్టేందుకు పలుయత్నాలు జరిగాయి. రోనాల్డ్‌ రీగన్‌ హయాంలో ఈ ప్రయత్నాలు పెచ్చుపెరిగాయి. దీంతో 1976లో క్యూబా నేషనల్‌ అసెంబ్లీ ఫిడేల్‌ కాస్ట్రోను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. అప్పటి నుంచి 32 ఏండ్లపాటు క్యూబా ప్రెసిడెంట్‌గా క్యాస్ట్రో కొనసాగారు.మరోవైపు భారతదేశానికి అత్యంత సన్నిహిత మిత్రుడు క్యాస్ట్రో.  భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ హయాం నుంచి ఏర్పడి సన్నిహిత మైత్రీ బంధం దశాబ్దాలుగా కొనసాగింది. ఇందిరా గాంధీ హయాంలో ఈ మైత్రి మరింత బలపడింది. 1991లో సోవియెట్‌ యూనియన్‌ రద్దయి, వేర్వేరు దేశాలుగా విడిపోవడం క్యాస్ట్రోకు పెను సవాల్‌గా నిలిచింది. అయినా కోటీ పది లక్షల జనాభా గల దేశం క్యూబా కమ్యూనిస్ట్‌ పంథాలోనే సాగాలని ఫిడెల్‌ కాస్ట్రో కాంక్షించారు. అప్పట్లో క్యూబా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. బ్రిటీష్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ 2  తర్వాత ప్రపంచంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న రికార్డు క్యాస్ట్రోదే. 


2006, జూలై, క్యూబా,  క్యాస్ట్రోకు 85 ఏండ్లు..

పెరిగిన వయసు కారణంగా క్యాస్ట్రో ఆరోగ్య పరిస్థితులూ మారాయి. 2006 జూలైలో క్యాస్ట్రో పేగులకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. అప్పుడే తన సోదరుడు రావుర్‌ క్యాస్ట్రోకు తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. ఆరోగ్యం సహకరించని కారణంగా తాను అధ్యక్ష బాధ్యతలు చూడలేనని స్పష్టం చేశారు క్యాస్ట్రో. దీంతో 2008లో రావుర్‌ క్యాస్ట్రో పూర్తిస్థాయి అధ్యక్షుడయ్యారు. అనంతరం ప్రజాజీవితానికి ఆయన పూర్తి దూరంగా ఉన్నారు.  రోజులు గడిచాయి. రోజులు నెలలు అయ్యాయి. అవి సంవత్సరాలుగా మారాయి. అనారోగ్యం పాలైన క్యాస్ట్రో నాలుగేండ్ల తర్వాత తొలిసారి సాధారణ ప్రజానీకానికి కనిపించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. జాతీయ అసెంబ్లీలోనూ మాట్లాడారు. స్లైన్‌ను ధరించే ఆయన సమావేశాలకు హాజరయ్యారు.  తర్వాత అప్పుడప్పుడు మీడియాకు ఆయన వీడియోలు, ఫొటోలను క్యూబా ప్రభుత్వం విడుదల చేసింది. క్యాస్ట్రో పరిస్థితి విషమంగా ఉందని పలుమార్లు వదంతులు వ్యాపించాయి. 

 

ఆగస్టు 15, 2013

’ఇన్నాళ్ళు నేను జీవిస్తానని అనుకోలేదు’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుమారు ఏడు సంవత్సరాల నుంచి ఆయన అస్వస్థతకు గురవుతూ వచ్చారు. అయినా ఇన్నాళ్లు బతకడం పట్ల ఆయనే ఆశ్యర్య పోయారు. 87వ పుట్టిన రోజు సందర్భంగా క్యూబా పత్రికలో రాసిన ఓ వ్యాసంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.  పొట్టలో సమస్యతో బాధపడుతున్న తాను 87వ పుట్టినరోజును చూస్తానని ఊహించ లేదు అని చెప్పారు. మూడు పేజీల పెద్ద   వ్యాసాన్ని కమ్యూనిస్టు పార్టీ పత్రిక ‘గ్రాన్మా’ ప్రచురించింది.  2006, జులై 26వ తేదీన ప్రాణాంతకమైన జబ్బుతో తాను బాధపడుతున్నట్లు కనుగొన్న తర్వాతే తాను అధికారం నుండి వైదొలగినట్టు ఈ వ్యాసంలో స్పష్టం చేశారు. ‘ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్న నేను అధ్యక్షుడిగా అధికారాలను వదిలి పెట్టేందుకు వెనకాడలేదు. బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రతిపాదన చేశాను’ అని రావుర్‌ క్యాస్ట్రోని ప్రస్తావిస్తూ క్యాస్ట్రో పేర్కొన్నారు.  ఇలా ఏడేండ్ల కాలం జీవిస్తానని అస్సలు ఊహించలేదు అని వ్యాసంలో స్పష్టం చేశారు.  


నవంబర్‌ 25, 2016, క్యూబా.

ప్రభుత్వ న్యూస్‌ చానెల్‌నుంచి వార్త వెలువడింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫైడెల్‌ క్యాస్ట్రో క్యూబా మాజీ అధ్యక్షుడు కన్నుమూశారు. ‘వివా లా రివల్యూషన్‌' అనే విప్లవ నినాదంతో ఆ ప్రకటన ముగిసింది.  ఆ దేశ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.29 గంటలకి చనిపోయినట్లు ఆయన సోదరుడు క్యూబా దేశాధ్యక్షుడు రావుర్‌ క్యాస్ట్రో ఆ దేశ ప్రభుత్వ న్యూస్‌ చానల్‌ ద్వారా ప్రజలకి తెలియపరిచారు.   తొమ్మిదిరోజుల పాటు ఆయనకె గౌరవసూచకంగా ప్రజా సంతాప దినాలను ప్రభుత్వం ప్రకటించింది.  క్యాస్ట్రో అంత్యకియలు డిసెంబర్‌ నాలుగున ఆయప విప్లవాల పుట్టిల్లు సాంటి యాగోలో జరిగాయి.    పోరుబాటకు సంకేతంగా సాంటియాగో నుంచి హవానా వరకూ దేశవ్యాప్తంగా  ప్రజా యాత్రను నిర్వహించారు.  డిసెంబర్‌ నాలుగవ తేదీన సాంటియాగోలో  ఖననం చేశారు. సామ్రాజ్యవాద పడగలపై గర్జించిన క్యూబా కమ్యూనిస్టు కొదమ సింహానికి ప్రపంచం విప్లవ వందనాలు సమర్పించింది. అనేకసార్లు  మృత్యుంజయుడిగా నిలిచిన క్యాస్ట్రో  అమెరికా ప్రెసిడెంట్లు  ఎక్కించుకున్న సామాజ్యవాదపు వారసత్వ అహంకారాన్ని ఎదిరించి నిలిచారు.  ఏ  సిద్ధాంతం అయినా అణగారిన వర్గాల స్పందనకు అనుగుణంగా మెరుగులు దిద్దుకున్నప్పుడే అది నిజమైన  సిద్ధాంతం అవుతుందని అంటారాయన. ‘పోరు క్షణాలలో విప్లవమనేది పూలపాన్పు కాదు. గతం నుంచి భవిష్యత్తు వరకూ నిరంతరం సాగే పోరాటం’అని చెప్తారాయన...


-వినోద్‌ మామిడాల, సెల్‌: 7660066469


logo
>>>>>>