గురువారం 02 ఏప్రిల్ 2020
Sunday - Feb 16, 2020 , 01:02:14

కెమెరా పాఠశాల

కెమెరా పాఠశాల

ఎర్రమంజిల్‌ సమీపం. మోర్‌ సూపర్‌ మార్కెట్‌ వెనకాల. ఓ పాత భవనం. అక్కడ కొందరు కంప్యూటర్ల ముందు పనిచేస్తూ కనిపిస్తారు. దీన్ని ఆ చుట్టు పక్కల వాళ్లు కెమెరా పాఠశాల అంటుంటారు. పాఠశాల అనే బోర్డు ఉండదు. అక్కడ టీచర్లు అస్సలే ఉండరు. చదువు చెప్పనే చెప్పరు. కానీ అంతకుమించి అక్కడ జీవిత పాఠాలు నేర్పుతారు. సమాజంలో ఎలా బతకాలో చెబుతారు. ఆ కెమెరా పాఠశాల కథేంటో తెలుసుకోండి.

సూరజ్‌ది ఆదిలాబాద్‌ జిల్లా మారుమూల గ్రామం. ఇదివరకు ఓ హోటళ్లో పనిచేసేవాడు. నెలంతా పనిచేస్తే మూడు నాలుగు వేలు చేతికొచ్చేవి. అది అతడికి ఎంత మాత్రం నచ్చేది కాదు. కానీ వేరే పని దొరక్క కాలం వెళ్లదీసేవాడు. ఆ సమయంలోనే అతడి ఆసక్తిని గమనించారో వ్యక్తి. అతడి తల్లిదండ్రులతో మాట్లాడి సూరజ్‌ను హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఉచిత వసతి కల్పించి కంప్యూటర్‌ పరిజ్ఞానం నేర్పించారు. కెమెరా వాడకం నేర్పించారు. ఇప్పుడు సూరజ్‌ ఓ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌. పెద్ద ఈవెంట్లలో ఫొటోలు తీస్తున్నాడు. సూరజ్‌లాంటివారెందరో ఇక్కడ శిక్షణ పొందారు. జీవితంలో సెటిలయ్యారు. వారికి శిక్షణ ఇస్తున్న సుభాష్‌రెడ్డిని పలుకరిస్తే మరెన్నో ముచ్చట్లు చెప్పారు.

మహాజన్‌ సుభాష్‌రెడ్డిది ఆదిలాబాద్‌ జిల్లా బెల్లూర్‌. ఓసారి ఊరెళ్లినప్పుడు గ్రామ సరిహద్దుల్లో వన్యప్రాణుల ఫొటోలు తీస్తున్నారు. అటుగా వెళ్తున్న ఓ గిరిజన యువకుడు సుభాష్‌ దగ్గరికి వచ్చి.. ‘ఇదేంటయ్యా’ అనడిగాడు. ‘కెమెరా’ అని సమాధానమిచ్చారు సుభాష్‌.‘భలేగుంది.. దీనికి ఎంతయితదయ్యా, ఇదెట్ల పనిచేస్తది, ఎంత ఖర్చయితది. ఎంత పెద్ద ఫొటోలు ఇండ్లకెళ్లి బయటికొస్తయి’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అతడిలో ఉన్న ఆసక్తిని గమనించి “నీకు ఫొటోలు తీసుడు నేర్పిస్తా. నాతో పట్నం వస్తావా” అని అడిగారు సుభాష్‌. ‘గేదెలు కాసే నేను పట్నం అచ్చుడా? ఏ ఊకోండ్లయ్య పరిష్కాలు!’ అని వెళ్లిపోయిండు. మళ్లీ రెండో రోజు కలిసినప్పుడూ అదే వ్యక్తి కెమెరా గురించిన అనేక ప్రశ్నలు సంధించాడు. అతడి ఆసక్తిని గమనించి సుభాష్‌ సిటీకి తీసుకొచ్చారు. ఆర్నెళ్లు ఉచితంగా ఫొటో, వీడియోగ్రఫీలో శిక్షణ ఇచ్చి ఓ స్టూడియోలో ఉద్యోగంలో పెట్టించారు. ఇలా ఎంతోమంది చిన్నా చితకా పనిచేసేవాళ్లకు, ఖాళీగా ఉంటూ వేటకెళ్లే గిరిజన యువకులకు, అనాథలకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో శిక్షణ ఇచ్చారు. వారి జీవితాల్ని నిలబెట్టారు. 

ఆలోచన ఎలా వచ్చింది?

సుభాష్‌రెడ్డి ఓ కెమెరామన్‌. 19వ దశకంలోనే కెమెరా పట్టారు. పలు టీవీ చానెళ్లకు పనిచేశారు. విధి నిర్వహణలో భాగంగా 2004లో పెడదోవ పడుతున్న కుర్రాడిని చిత్రీకరించారు. తప్పిపోయి హైదరాబాద్‌ చేరిన ఆ బాలుడిని తల్లి వద్దకు చేర్చడంలో కీలకపాత్రపోషించాడు. అప్పుడు ఆయన చేతిలో ఉన్న కెమెరా ఓ పసివాడి జీవితాన్ని నిలబెట్టింది. ఇలా మరెంతో మందిని నిలబెట్టాలని, తానున్న వృత్తిలోకి మరికొంతమందిని తీసుకురావాలని ప్రయత్నించాడు. స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారీ కొంతమందికి కెమెరాపై, పట్టణ జీవనంపై అవగాహన కల్పిస్తూ ఉండేవారు. ఆసక్తి ఉన్న వారిని పట్నం తీసుకొచ్చి ఉచిత వసతి కల్పించి కెమెరా, వీడియోగ్రఫీలో శిక్షణ ఇచ్చేవారు. తెలిసిన వారి ద్వారా కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగంలో పెట్టించేవారు.శిక్షణ ఇస్తారిలా..

ఎర్రమంజిల్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకొని కెమెరా, ఫొటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నారు. ఫొటో ఎడిటింగ్‌, ఫొటో మేకింగ్‌, వీడియో మేకింగ్‌, వీడియో ఎడిటింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో ఒక్కరూపాయి కూడా తీసుకోరు. ఇన్నాళ్లు కచ్చితంగా పనిచేయాలంటూ అగ్రిమెంట్‌ కూడా ఏం ఉండదు. శిక్షణ పొందేవారు ఉండటానికి మూడు గదుల్ని కేటాయించారు. వారికి ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్న వారికి సుభాష్‌రెడ్డి సొంత ఖర్చుతో డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు వంద మంది యువకులు సుభాష్‌రెడ్డి దగ్గర కెమెరా, వీడియోగ్రఫీలో శిక్షణ పొందారు. వారంతా వివిధ సంస్థల్లో ఉద్యోగాలలో ఉన్నారు. కొందరు సొంతంగా స్టూడియోలు పెట్టుకొని లైఫ్‌లో సెటిలయ్యారు. ఇప్పటివరకు దాదాపు 20 మంది గ్రామీణ యువకులకు కారు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం ఆరుగురికి శిక్షణ ఇప్పిస్తున్నారు. 

శిక్షణ పొందాలనుకుంటే..

ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు సుభాష్‌రెడ్డిని సంప్రదించవచ్చు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీతో పాటు మోటివేషనల్‌ క్లాసెస్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ వంటివి కూడా నేర్పిస్తున్నారు. శిక్షణ పొందాలనుకునే వారు 92480 99111లో సంప్రదించవచ్చు.

చేతనైన సాయం చేస్తున్నా..

2004లో నా వృత్తిద్వారా ఓ తప్పిపోయిన బాలుడ్ని తల్లిదగ్గరికి చేర్చా. ఆ బాలుడు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. నేను చేస్తున్న కార్యక్రమాల్లో నాభార్య పల్లవి సాయం మరువలేనిది. నా దగ్గర శిక్షణ పొందిన వారు ప్రస్తుతం యాభై మంది హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మరికొందరు సొంతగా స్టూడియోలు నడిపిస్తున్నరు. నా దగ్గర శిక్షణ పొందిన వాళ్లు ఎక్కడైనా కలిస్తే ఆప్యాయంగా పలుకరిస్తారు. గురువుగారు అంటూ పిలుస్తుంటే టీచర్‌ కాకపోయినా గర్వంగా అనిపిస్తుంటుంది.

- మహాజన్‌ సుభాష్‌రెడ్డి, హైదరాబాద్‌


-పడమటింటి రవికుమార్‌


logo
>>>>>>