శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Feb 16, 2020 , 00:53:36

తాజ్‌ మహోత్సవం 2020

తాజ్‌ మహోత్సవం 2020

తాజ్‌మహల్‌.. ప్రేమకు చిహ్నం.. ఈ మాట ఎవరిని అడిగినా చెబుతారు.. అందుకే దాన్ని సందర్శించడానికి..ప్రతీ సంవత్సరం..  దేశ, విదేశాల నుంచి లక్షల మంది తరలివస్తుంటారు.. అయితే ఇక్కడ ప్రతీ ఫిబ్రవరిలో ఒక ఉత్సవం జరుగుతుంది.. అదే తాజ్‌ మహోత్సవం.. 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఉత్సవం.. ఇప్పుడు మరింత కొత్తగా మన ముందుకు రావడానికి సిద్ధమైంది.. ఆ విశేషాలేంటో ఈ జంట కమ్మలో చదువండి..  

ఫిబ్రవరి 18-27వరకు ఏ పనులు ఉన్న ఆ రోజులను బ్లాక్‌ చేసుకోండి. అందమైన తాజ్‌ అందాలతో పాటు.. అక్కడ జరిగే మహోత్సవానికి మీరు సైతం అతిథులు అవ్వండి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్‌తో ముందుకు వస్తుంటుంది. ఈ సంవత్సరం... ‘సంస్కృతీ కే రంగ్‌.. తాజ్‌ కే సంఘ్‌' పేరిట నిర్వహించబోతున్నారు. అంటే.. ఆ ప్రేమ చిహ్నం దగ్గర అనేక సంస్కృతుల కలయికతో ఈ ఉత్సవం నిర్వహించబోతున్నట్లు తాజ్‌ మహోత్సవ్‌ కమిటీ ప్రకటించింది.  

ఉత్సవం.. మహోత్సవం.. 

దీనిని ఒక కల్చరల్‌ బొనాంజాగా చెప్పవచ్చు. 1992లో ఈ ఉత్సవం జరపడం ప్రారంభించారు. అప్పటి నుంచి నెమ్మదిగా ఇది కొత్త రూపు సంతరించుకుంటూనే వస్తున్నది. ఈ సంవత్సరం మనం 29వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. భారతదేశ పర్యాటక శాఖ ఈ ఉత్సవాన్ని ప్రతీ యేడు అంగరంగ వైభవంగా జరుపుతున్నది. కేవలం అక్కడి ప్రాంతాల వారే కాదు.. దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా ఈ మహోత్సవాన్ని చూడడానికి పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఇక్కడ ప్రధానంగా ఆకర్షించేది తాజ్‌మహల్‌ ఒక్కటే కాదు.. ఇక్కడికి విచ్చేసే ఆర్ట్‌, క్రాఫ్ట్‌ మేళా కూడా ఆకట్టుకుంటుంది. 

కళలకు ప్రత్యేకం..

తాజ్‌మహల్‌ అంటేనే ప్రత్యేకం. దాన్ని చూడడానికే రెండు కళ్లూ చాలవు. ఇక ఆ తాజ్‌మహల్‌ అందంతో పాటు అక్కడకు వచ్చే వివిధ కళారూపాలు కూడా ఆకట్టుకుంటాయి. ప్రతీ యేడు సుమారు 400 కళలు అక్కడ ప్రదర్శించబడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కర్రతో చేసిన బొమ్మలు, ఇతర వస్తువులు, రాళ్లతో చెక్కిన శిల్పాలు కట్టిపడేస్తాయి. ఎక్కువగా తమిళనాడు నుంచి కర్ర, రాతికి సంబంధించిన కళారూపాలు వస్తుంటాయి. బ్రాస్‌తో చేసిన వస్తువులు మోరదాబాద్‌, మార్బుల్‌తో చేసినవయితే ఆగ్రా నుంచే వస్తాయి. కుండలు కుర్జా, చికెన్‌ వర్క్‌ చేసిన బట్టలు లక్నో నుంచి వస్తాయి. సిల్క్‌, జరీకి చెందినవి బెనారస్‌ నుంచి ఇక్కడకు చేరుతాయి. కశ్మీరీ శాలువాలు ఇలా బోలెడు వస్తువులను, కళారూపాలను ఇక్కడ చూడొచ్చు. సంస్కృతి.. సంప్రదాయలకు నెలవు.. 

భారతదేశం అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. అలాంటిది అన్ని కళారూపాలు అక్కడికి చేరినప్పుడు ఇంక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఇక్కడ కేవలం కళారూపాలే కాదు.. ఎంతో ఆహ్లాదకరమైన సంగీత, సాహిత్యాలను కూడా ఎంజాయ్‌ చేయొచ్చు. జానపద, శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన ప్రోగ్రాములు ఇక్కడ జరుగుతాయి. వీటితో పాటు జానపద, శాస్త్రీయ నృత్యాలు కూడా కనువిందు చేస్తాయి. శతాబ్దాల క్రితం కనుమరుగైన వాయిద్యాలను కూడా ఈ మహోత్సవంలో చూడవచ్చునట. ఇలా.. అన్నీ ఒక్కచోట చేరి ఉత్సవం.. మరింత ఉత్సాహంగా మారిపోతుంది.

రుచుల కొలువు.. 

చుట్టూ ఎన్ని ఉన్నా.. కడుపు కాలుతున్నప్పుడు రుచికరమైన ఆహారం గురించే వెతుకుతాం. ఇంత మహోత్సవంలో దానికి కూడా లోటు ఉండదు. ఆర్ట్‌, క్రాఫ్ట్‌.. వీటితో పాటు మంచి ఆహారాన్ని కూడా లాగించేయొచ్చు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారు. వెజ్‌, నాన్‌వెజ్‌ రకాలు.. ఇలా బోలెడు వెరైటీలు కచ్చితంగా నోరూరిస్తాయి. కేవలం ప్రధాన వంటకాలే కాకుండా.. ఆయా ప్రాంత ప్రత్యేక వంటకాలు కూడా ఇక్కడ రుచి చూడొచ్చు. ఒకవేళ ఇక్కడ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలనుకుంటే మాత్రం అక్కడి వారికి ఎంతోకొంత చెల్లించాల్సి ఉంటుంది. కళాకృతులకు ఒక రేటు, ఆహారానికి సెపరేటు ఉంటాయి. ఫన్‌ ఫెయిర్‌.. 

ఈ మహోత్సవమంతా పెద్దలకు మాత్రమే అనుకుంటే పొరపాటే! పిల్లల కోసం ప్రత్యేక ఆకర్షణలు కూడా ఈ మహోత్సవంలో చూడొచ్చు. చిన్న ఎగ్జిబిషన్‌లాంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. జాయింట్‌వీల్‌, ఇతర ఆటలు కూడా ఈ మహోత్సవంలో చోటు దక్కించుకోనున్నాయి. కాబట్టి కుటుంబం మొత్తం ఆహ్లాదంగా, ఆనందంగా గడిపేలా ఈ మహోత్సవం ఉంటుం ది. ఇక్కడ భద్రతకి కూడా చాలా ఏర్పాటు చేస్తారు. చాలా చోట్ల సీసీటీవీ, కెమెరాలు ఏర్పాటు చేస్తారు. మెటల్‌ డిటెక్టర్‌ ఫ్రేమ్స్‌, పోలీస్‌ అసిస్టెంట్‌ బూత్‌ ఇలా అన్ని ఏర్పాట్లతో ఈ సంవత్సరం కూడా సిద్ధమైపోతున్నది ఈ మహోత్సవం. ఆగ్రా ఆహ్లాదంగా.. 

ఈ మహోత్సవం పేరు మీద మీరు ఢిల్లీ టూర్‌ కూడా ప్లాన్‌ చేసుకోవచ్చు. తాజ్‌మహల్‌, రెడ్‌ ఫోర్ట్‌, తాజ్‌ నేచర్‌ వాక్‌, రామ్‌బాగ్‌, జమా మజీద్‌, మెహతాబ్‌ బాగ్‌.. ఇలా కొన్ని ప్రదేశాలను చుట్టి రావొచ్చు. అయితే తాజ్‌మహల్‌ శుక్రవారం చూడడానికి అనుమతి లేదు. పైగా భారతీయులకు, ఫారినర్‌లకు ఇక్కడ ఎంట్రీ రేట్స్‌ వేరువేరుగా ఉంటాయి. అలాగే పౌర్ణమి రోజు తాజ్‌మహల్‌ చూడడానికి ప్రత్యేక ధరలు ఉన్నాయి. ఒకవేళ పౌర్ణమి శుక్రవారం వస్తే కనుక ఆ రోజు సెలవు కాబట్టి ఆరోజు అనుమతించరు. తాజ్‌మహల్‌ చూడడానికి 15 సంవత్సరాల పిల్లలకు ఉచిత ఎంట్రీనే ఉంటుంది. ఈ మహోత్సవానికి మాత్రం మూడు సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత ఎంట్రీ ఇచ్చారు. ఒకవేళ స్కూల్‌ తరపున వస్తే ప్రత్యేక రాయితీ ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాన్ని మరింత బాగా జరిపించడానికి ఈ సంవత్సరం కూడా సర్వం సిద్ధమైంది. 

-సౌమ్య నాగపురి