మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Feb 16, 2020 , 00:42:46

డెడ్‌ ఆర్‌ ఎలైవ్‌

డెడ్‌ ఆర్‌ ఎలైవ్‌

ఆమె కన్నీళ్ళు విచారంలోంచి కాక రిలీఫ్‌లోంచి వచ్చాయని చాలామంది గుర్తించారు. ఆ శవం అంతిమ సంస్కారానికి ఊరివాళ్ళు ఎవరూ రాలేదు. తాగిన మత్తులో మొదటిబిడ్డని కొట్టి చంపిన వాడు, తాగి భార్యని కొట్టేవాడైన అతని అంత్యక్రియలకి రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. షెరీఫ్‌, లిజా, బాయిడ్‌, గోతిని తవ్వినవాడు మాత్రమే హాజరయ్యారు.

తలుపు చప్పుడు విన్న లిజా తలుపు తెరిచింది. ఎదురుగా షెరీఫ్‌ రాబర్ట్‌.“గుడ్‌ మార్నింగ్‌ లిజా. నీ వయసు అమ్మాయి ఇలా ఊరికి దూరంగా జీవిస్తే ఎలా? మీ అబ్బాయి బాయిడ్‌ స్కూల్‌కి వెళ్ళాల్సిన వయసుకూడా వచ్చింది. నిన్న రాత్రి నువ్వు ఒకరి పుట్టినరోజు ఫంక్షన్‌కి రాకపోతే నీకేమైందో చూడమని ఊరి వాళ్ళు పంపారు” షెరీఫ్‌ రాబర్ట్‌ చెప్పాడు.“నీ అబద్ధాన్ని నమ్మను రాబర్ట్‌. ఓ నేరస్థుల కుటుంబం గురించి ఆదుర్దా పడేవాళ్ళు ఊళ్ళో ఉన్నారంటే నమ్మను” లిజా నవ్వి చెప్పింది.“నువ్వు అవకాశం ఇస్తే ఊరివాళ్ళు నీకు మిత్రులని నువ్వే తెలుసుకుంటావు. నీ భర్త బెన్‌ చట్టం నించి తప్పించుకునేందుకు నువ్వు సహాయం చేసినందుకు ఎవరూ నిన్ను నిందించడం లేదు. ఏ మంచి భార్యయినా చేసే పనే చేసావు. కాని, ఇది ఏడేండ్ల నాటి సంగతి. ఈ ఏడేండ్లు బెన్‌ తనకి తాను విధించుకున్న శిక్షని అనుభవిస్తూనే ఉన్నాడు.”“అతను నేరస్థుడని తెలీక మునుపే నేను అతను పారిపోయేందుకు సహాయం చేసాను. బెన్‌ ఇంకా కొండల్లోనే నివసిస్తున్నాడా?”“అతను ‘జీవించే ఉన్నాడు’ అనడానికి గుర్తులు చాలామందికి కనపడ్డాయి. కానీ, తల దాచుకునేందుకు ఎక్కడా చిన్న కప్పునికూడా నిర్మించుకోకుండా చలి కాలాలు ఎలా చలి బాధనించి తప్పించుకుని జీవిస్తున్నాడో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఏదో ఓ రోజు అతను తప్పక బయటకి వస్తాడు. అతన్ని బతికుండగానో లేదా మరణించాకో పట్టిచ్చిన వారికి ఐదు వేల డాలర్లు ప్రకటించారు” రాబర్ట్‌ చెప్పాడు.“అతను చచ్చినా బావుండేది. అది అందరికీ లాభం. అప్పుడు నాకు, బాయిడ్‌కి ఈ బాధ ఉండేది కాదు. ఎవరికైనా ఐదు వేల డాలర్లు వస్తాయి. అంతేకాక అతని ఇన్సూరెన్స్‌ మొత్తం మాకు వస్తే మా అవసరాలన్నీ తీరుతాయి” లిజా కంఠంలో తొణికిస లాడిన బాధని రాబర్ట్‌ గుర్తించాడు.“నువ్వు ఊళ్ళోకి వచ్చి ఉంటానంటే అద్దె లేకుండా నీకో చిన్న ఇల్లు చూసే పూచీ నాది” వెళ్ళబోయే ముందు అతను చెప్పాడు.“నేను ఎవరి దాతృత్వాన్ని తీసుకోలేనని మీ అందరికీ తెలుసు” లిజా చెప్పి తలుపు మూసింది.గంట తర్వాత బాయిడ్‌ ఏరిన బెర్రీస్‌ బుట్టతో వచ్చాడు.“వీటిని ఎందుకు తెచ్చావు బాయిడ్‌. ఇవి విషంవి. వసంతంలోని మొదటికాపు బెర్రీలని ఎవరూ తినకూడదని తెలీదా? ఇది నీకు రెండేండ్లుగా చెప్తున్నాను” లిజా కొడుకుని కోప్పడింది.“విషంవైతే మరి కుందేళ్ళు వీటిని తిని చావవే?” బాయిడ్‌ అడిగాడు.“పిచ్చివాడా! ప్రకృతి వీటినే కాదు. హాని కలిగించే వేటినీ ఏ మృగం తినకుండా చేస్తుంది” ఆమె నవ్వుతూ చెప్పింది.ఆ రాత్రి మరోసారి లిజా ఇంటి తలుపుని ఎవరో తట్టారు. బాయిడ్‌ వెళ్ళి తలుపు తెరచి అరిచాడు.


“అమ్మా! ఎవరో వచ్చారు చూడు.”వెంటనే ఆమె కిరసనాయిలు లాంతరు వత్తిని పెంచింది. అతన్ని చూడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. కుర్చీని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని అడిగింది.“బెన్‌! నువ్వేనా?”“కాదు. మీరు నన్ను చూసి ఇంకెవరో అనుకుంటున్నారు మేడం” అతను చెప్పాడు.“ఓ! ఇందాకే నేను బెన్‌ గురించి ఎవరితోనో మాట్లాడబట్టి మీరు బెన్‌ అనుకున్నాను.”లిజా గుండె సాధారణ స్థాయికి వచ్చింది.“మీరు సరిగ్గా ఆయన లానే ఉన్నారు. నా భర్త బెన్‌లా!”“నేను మీ వారు బెన్‌ కాదు. ఏదైనా పని దొరుకుతుందా అని అడగడానికి వచ్చాను” అతను నెమ్మదిగా చెప్పాడు.అతని వంక తేరిపార చూసి ఆమె మళ్ళీ చెప్పింది.“లేదు. మీరు అతను కాదు. మీరు సిటీకి చెందిన వారని మీ బట్టల్నిబట్టి తెలుస్తున్నది. ఆయనకి ఇలాంటి బట్టలు ఉండవు. మీరు బెన్‌ ఐతే కాల్చి చంపేదాన్ని. సారీ! పనిచ్చేంత డబ్బు నా దగ్గర లేదు. మీకు ఆకలిగా ఉంటే తినడానికి ఏదైనా పెడతాను. తర్వాత మీరు వెళ్ళవచ్చు.”అతను కడుపు నిండా భోజనం చేసాడు.“ఇంత ఒంటరిగా ఉండటం బాధగా లేదా?” అతను అడిగాడు.

“లేదు. ఏదో ఓ రోజు మా వారు మరణించాక నేను, మా అబ్బాయి ధనవంతులం అవుతాము. ఇన్సూరెన్స్‌ డబ్బు వస్తుంది” చెప్పింది.అతని వంక ఏదో వెదుకుతున్నట్లుగా కొద్దిసేపు చూసి అడిగింది.“మీరు సిటీకి చెందినవారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు?” ప్రశ్నించింది.అతను వెంటనే జవాబు కోసం తడుముకుంటుంటే అడిగింది.“మీరు చట్టం నించి పారిపోతున్నారా?”అతను మౌనంగా ఉండిపోయాడు.“తాగి తన భార్యని కొట్టి చంపిన వ్యక్తి గురించి నేను చదివాను. అతను మీరేనా?”“అవును. కాదు” నవ్వి చెప్పాడు.అతను బల్లమీది బుట్టలోని చెర్రీలని చూసి అందుకుంటూ చెప్పాడు.“చాలా తాజాగా ఉన్నాయి. ఇంతటి తాజావి సిటీలో దొరకవు.”ఆమె వారించలేదు. అతను ఒకదాని తర్వాత మరోటి తినడాన్ని నిశ్శబ్దంగా గమనించింది. అతను వెళ్ళేప్పుడు బుట్టలో మిగిలినవి తీసుకెళ్ళమని కోరింది. అతను వెళ్ళాక దాదాపు ఏడేండ్ల తర్వాత ఆమె ఓ పాటని కూనిరాగం తీయసాగింది.


మర్నాడు ఉదయం ఆ కొత్త వ్యక్తి శవాన్ని ఓ రైతు కనుగొన్నాడు.“అతను బెన్‌ అని చాలామంది అంటున్నారు. నువ్వు వచ్చి శవాన్ని చూసి అవునో, కాదో చెప్పాలి” షెరీఫ్‌ లిజా ఇంటికి వచ్చి కోరాడు.ఆ శవాన్ని కనుగొన్న రైతు ఇంకా డాక్టర్‌ దగ్గరే ఉన్నాడు. షెరీఫ్‌ వెంట వచ్చిన లిజాని ఆ ఊరివాళ్ళు, శవపరీక్ష చేసిన డాక్టర్‌ ఆసక్తిగా చూసారు. ఆమె శవాన్ని చూసి చెప్పింది. “బెన్నే! సందేహం లేదు. మా వారే.”ఆమె కన్నీళ్ళు విచారంలోంచి కాక రిలీఫ్‌లోంచి వచ్చాయని చాలామంది గుర్తించారు.ఆ శవం అంతిమ సంస్కారానికి ఊరివాళ్ళు ఎవరూ రాలేదు. తాగిన మత్తులో మొదటిబిడ్డని కొట్టి చంపిన వాడు, తాగి భార్యని కొట్టేవాడైన అతని అంత్యక్రియలకి రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. షెరీఫ్‌, లిజా, బాయిడ్‌, గోతిని తవ్వినవాడు మాత్రమే హాజరయ్యారు. ప్రీస్ట్‌ మంత్రాలు చదువుతుంటే అంతా నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆ పని పూర్తయ్యాక లిజా మొదటగా మాట్లాడింది.“ఇన్సూరెన్స్‌ కంపెనీ నించి నాకు ఎప్పుడు డబ్బొస్తుంది?”“నీకు డబ్బు ఎంత అవసరమో అందరికీ తెలుసు. త్వరగా వచ్చేలా చూస్తాను” షెరీఫ్‌ రాబర్ట్‌ హామీ ఇచ్చాడు.“పోయింది నాన్న కాదు. నాన్నయితే నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? ఏ తండ్రయినా కొడుకుని చూడకుండా వెళ్తాడా?” ఎనిమిదేళ్ళ బాయిడ్‌ బాధగా చెప్పాడు.షెరీఫ్‌ వాడి భుజం చుట్టూ చేతిని వేసి చెప్పాడు.“ఆ ప్రశ్నకి జవాబు ఎవరికీ తెలీదు. అతను నిజంగా మీ నాన్నేనా అన్నది మాకు ఎవరికీ నూటికి నూరు పాళ్ళూ తెలీదు”లిజా మౌనంగా ఉండిపోయింది. గోతిని తవ్వినవాడు చెప్పాడు.“మా అందరికీ అతను బెన్‌ అవునో, కాదో స్పష్టంగా తెలీదు. అతను సిటీవాడు కాబట్టే బెర్రీలని తిన్నాడు. ఇక్కడ పెరిగిన వాడైతే వసంతంలోని మొదటికాపు బెర్రీలని తింటాడా? అవి విషపూరితమని అందరికీ తెలుసు.”“మా వారు మా కోసం ఈ త్యాగం చేసి ఉంటాడు” లిజా నెమ్మదిగా చెప్పింది.


ఇన్సూరెన్స్‌ కంపెనీనించి త్వరలోనే లిజాకి పదివేల డాలర్లకి చెక్‌ వచ్చింది. తర్వాత ఆమె ఆ పొలాన్ని, ఇంటిని అమ్మేసి కొడుకుతో శాన్‌ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోయింది. ఆమెకి వీడ్కోలు పలుకడానికి ఊరివాళ్ళు ఎవరూ స్టేషన్‌కి వెళ్ళలేదు. కారణం లిజా డబ్బుకోసం అబద్ధం ఆడిందని. ఏడేండ్లు కొండల్లో జీవించిన వ్యక్తి గడ్డం పెరిగి, చిరిగిన దుస్తులతో బలహీనంగా ఉంటాడు తప్ప సిటీవారి దుస్తుల్లో ఆరోగ్యంగా నవనవలాడుతూ ఉండడు. లిజా డబ్బుకోసం ఎవరి శవాన్నో తన భర్త శవంగా అబద్ధపు సాక్ష్యం చెప్పిందని వారంతా భావించారు. సిటీవాడే ఆ బెర్రీలని తింటాడు.షెరీఫ్‌, ‘లిజా భర్తకి కవల సోదరుడు ఉన్నాడా?’ అని అతను పుట్టిన గ్రామానికి వెళ్ళి విచారించాడు. కజిన్స్‌ కూడా లేరని తెలిసింది. లిజా వెళ్ళాక శాన్‌ఫ్రాన్సిస్కోలో తన భార్యని హత్యచేసి పారిపోయిన వ్యక్తి ఫొటో ఒకటి షెరీఫ్‌కి అందింది. అతని వర్ణన కూడా పాతి పెట్టిన శవానికి సరిపోయింది. బెన్‌ ఎప్పటికైనా తిరిగి వస్తే తప్ప పోలీసులు వెదికే ఆ ఇద్దరు నేరస్థులు ఒకరా, వేరా అని తెలీదు అనుకున్నాడు. 

ఐతే, వారిమధ్యగల పెద్ద తేడా లిజాకి తెలీదు.శాన్‌ఫ్రాన్సిస్కో నేరస్థుడు, బెన్‌ అని చెప్పడం వల్ల లిజా పదివేల డాలర్లు సంపాదించింది. అదే ఆమె అతన్ని బెన్‌ అనుకుని చంపానని చెప్తే, అతన్ని గుర్తించిన లిజాకి ఏభై వేల డాలర్ల బహుమతి లభించేది.

(ఈవ్‌లిన్‌ పెయిజ్‌ కథకి స్వేచ్ఛానువాదం) 


-మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo