శనివారం 29 ఫిబ్రవరి 2020
అంతర్జాల సాహిత్యం

అంతర్జాల సాహిత్యం

Feb 09, 2020 , 11:29:18
PRINT
అంతర్జాల సాహిత్యం

తెలుగుసాహిత్యం కొత్తపుంతలు తొక్కుతున్నది.మారుతున్న కాలానికి తోడు సాహిత్యం డిజిటల్‌ రంగులను పులుముకుంటున్నది. మనసులో తోచిన భావాలను ఏ ఫేస్‌బుక్‌లోనో, వాట్సాప్‌లోనో, ట్విట్టర్‌లోనో ఎక్కడో ఓ చోట పోస్ట్‌ చేస్తే చాలు వేలాది లైక్‌లు, వందలాది షేర్లు, పదుల్లో కామెంట్లు పుంఖాను పుంఖాలుగా సెల్‌నిండా చేరిపోతున్నాయి. సోషల్‌ మీడియా ముఖపరిచయంలేనివారిని ముఖపుస్తక కవులను, వయసుతో సంబంధం లేకుండా వాట్సాప్‌ రచయితలను సృష్టిస్తున్నది. అందుకు తగ్గట్లే ఆయా గ్రూపులు, బ్లాగులు, అంతర్జాల పత్రికలు, వెబ్‌ సిరీస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు పుస్తకాలకే పరిమితమైన సాహిత్యం సామాజిక మాధ్యమాల గోడలపై హోర్డింగ్‌లై కొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. అనంతవిశ్వపు అంతరాలను చెరిపేస్తూ ప్రపంచాన్నంతా చుట్టేస్తున్న అంతర్జాల, వాట్సాప్‌ సాహిత్యంపై ఈ వారం కథనం.

ఎందుకు?

ఆధునిక పుంతలు తొక్కుతున్న సాహిత్యంలో అంతర్జాల ప్రవేశం అవసరమా? అంటే ఒక రకంగా అవసరమే అని చెప్పచ్చు. దీనికి అనేక కారణాలున్నాయి. న్యూస్‌ఫ్రింట్‌ ధరలు, ప్రింట్‌ ఖరీదు, ఉద్యోగుల జీతాభత్యాలు ఇలా అనేక కారణాల వల్ల తెలుగులో సాహిత్య పత్రికల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఉన్న ఒకటి రెండు పత్రికలు అందరి, అన్ని రకాల సాహిత్యానికి వేదిక కాలేకపోతున్నవి. మరో వైపు ప్రతి దినపత్రిక వారంలో ఒకరోజు నిర్వహించే సాహిత్యపేజీల్లోనూ, ఆదివారం అనుబంధాల్లో  కేటాయించే ఒకటీ, అరా పేజీల్లో సాహిత్యకారులకు చోటు లభించడంలేదు. దినపత్రిక సాహిత్యపేజీలో రెండుమూడు కవితలకు, ఆదివారం అనుబంధంలో ఒక కథ, ఒకటి రెండు కవితలకు తప్ప పెద్దగా చోటు దక్కడం లేదు. దీనితో అత్యంత వేగంగా, విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన అంతర్జాల (ఇంటర్నెట్‌) పత్రికలు, గ్రూపులు సాహిత్యాభిమానుల అవకాశాలకు వేదికలవుతున్నాయి.

సోషల్‌ మీడియా వేదికగా

మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక కాలంలో ఇ-బుక్స్‌ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీని ద్వారా మనం అనుకున్న పుస్తకాన్ని చదవవచ్చు. ఇక ఇప్పటితరం మరింత ముందుకెళ్లి ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో గ్రూపులుగా ఏర్పడి సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.తాము ఎంచుకున్న అంశానికి సృజనాత్మకతను జోడించి ఈ మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ తమ రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నారు.ఇక్కడ ఒక విషయం తప్పకుండా చర్చించాలి. ఒకప్పుడు గుర్తింపు పొందిన కవులు రాసే కవితలు, కథలు, పాటలు మాత్రమే పత్రికల్లో కనిపించేవి. అయినా చాలామంది ఔత్సాహికులు తాము రాసుకున్న కవితను ఆయా పత్రికల్లో చూడాలన్న ఆశతో పంపితే అవి ఎప్పుడు ముద్రిస్తారో, అసలు ముద్రిస్తారో లేదో కూడా సమాచారం అనేది లేకుండాపోయేది. అంతేకాదు సాహిత్యంలో రాణించాలంటే తెలుగు పాండిత్యంలో దిట్ట అయి ఉండాలి. ప్రాసలు, అలంకరాలు, గురులఘువులు అన్నీ తెలిసి ఉండడంతో పాటు సాహితీ పద సంపదపై పట్టు కలిగి ఉండాలి.

ఇట్లా అనేకం ఉండేవి.అయినా దాన్ని ఏ పత్రికకో పంపితే ప్రచురణకు నోచుకుంటుందన్న నమ్మకమూ లేదు. అయితే కాలంతో పాటే ‘కలం’ రాతతీరు మారింది. ఇప్పుడు కవితా అంటే కేవలం నాలుగు పాదాలు కలిగి, వ్యాకరణ శుద్ధిగా ఉండాలన్న నియమమేం లేదు. అంతేకాదు అది పద్యకవిత్వమే కానవసరం లేదు. నేడు అంతా వచన కవిత్వానికే పట్టం కడుతున్నారు. వచన కవిత్వరూపం ముందుకొచ్చాక అందులో అనేకానేక ప్రక్రియలు పురుడు పోసుకున్నాయి. మినీ కవితలు, హైకూలు, నానోలు, నానీలు, వ్యంజకాలు, రెక్కలు, ఇంకా అనేకానేక ప్రక్రియలు వచ్చి ఒక చారిత్రక పాత్రను నిర్వర్తించాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో ప్రక్రియ ముందుకు వస్తుంది. ఆ ప్రక్రియే ప్రజలపై బలమైన ముద్రను వేస్తుంది. అందుకే సాహిత్య ప్రక్రియ లెన్నొచ్చినా కవిత్వం నిత్యనూతనమవుతూ వర్ధిల్లుతున్నది. దారి పొడవునా తనదైన పాత్రను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నది.పాదాలు ఎన్నైనా, పదాలు ఎన్నున్నా అది మనసును హత్తుకుంటుందా లేదా? హృదయాన్ని తాకుతుందా లేదా అన్నదే ముఖ్యం. అందుకే వేగంగా చేతి వేళ్లు కదిలించగలిగి తెలుగును టైప్‌ చేయగలమన్న విశ్వాసం ఉన్నవాళ్లంతా ఇప్పుడు సోషల్‌మీడియాలో కవులుగా రాణిస్తున్నారు.నిన్నటిమొన్నటి వరకు పుస్తకాలకే పరిమితమైన గుర్తింపు పొందిన కవులు, రచయితలు కూడా సోషల్‌మీడియా విప్లవం ముందు తలవంచక తప్పలేదు. రాయాలనే ఆసక్తి ఉన్న వారంతా తమకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తద్వారా ఆయా వేదికలపై కొత్త సాహిత్య సాధకులు పుట్టుకొస్తున్నారు. వెబ్‌ పత్రికలు, సోషల్‌ మీడియా అందుకు వేదిక అవుతున్నాయి.

 వేగవంతమైన స్పందన

ఒకపుడు ఒక విషయం మీద కవి స్పందించాలంటే అది ప్రచురించేలోగా పుణ్యకాలం కాస్తా దాటిపోయేది. కానీ ఆధునిక కాలంలో వచ్చిన సోషల్‌ మీడియా మూలంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అసమానతలు, ఆందోళనలపై క్షణాల్లో స్పందించగలుగుతున్నారు. దానిపై ఓ కవితా, కథ, పాట ఇలా ఏదో ఒకటి రాసి పోస్ట్‌ చేస్తే చాలు ప్రపంచమంతా దాన్ని వీక్షిస్తున్నది. క్షణాల్లో స్పందనలు, లైక్‌లు, ఆగ్రహావేశాలు చోటు చేసుకుంటున్నవి. సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద సామాజిక మాధ్యమాల్లో తాజాగా కవిత్వం వెలువడుతున్నది. ‘సబ్బుబిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితానర్హం అన్నట్లు తమ కవిత, కథకు వస్తువును ఎంపిక చేసుకోవటంలో ఈ తరం కవులు అత్యంత వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రక్రియ సరికొత్త సాహితీ సృష్టికి బీజాలు వేసే అవకాశం ఉన్నప్పటికీనష్టాలు లేకపోలేదు.

దెబ్బతింటున్న ప్రమాణాలు

అంతర్జాలంలో వస్తున్న సాహిత్యం అత్యంత వేగాన్ని ప్రదర్శిస్తున్నది. అయితే ఇది అంత ఉపయుక్తమేం కాదనే చెప్పాలి. ఎందుకంటే తమ తోటివారికంటే ముందుగా స్పందించాలనే తొందరపాటుతో ఉత్సాహం ప్రదర్శించే రాతగాళ్లు తమ రచనా ప్రమాణాలను తామే దెబ్బతీసుకుంటున్నారు. పొంతనలేని అక్షరపదజాలం, డబుల్‌మీనింగ్‌పదాలు, ఇతరుల సాహిత్యాన్ని అవహేళన చేసే రీతిలో రచనలు, అనేక ఏండ్లుగా వస్తున్న సాహిత్య ప్రక్రియను భ్రష్టు పట్టించే విధంగా కొత్త ప్రక్రియల పేరుతో చేసే ప్రయోగాలు సాహితీ ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. సాహిత్యంపట్ల పట్టు లేకపోవడం, పాతతరం రచనలను అధ్యయనం చేయకపోవడం, అర్థంపర్థం లేని పద ప్రయోగాలు చేయడంతో సాహిత్య ప్రమాణాలు దెబ్బతిని నిజమైన సాహిత్యకారుల మనో నిబ్బరాన్ని దెబ్బతీసేదిగా ఉంటున్నది.

పర్యవేక్షణా లోపం

నిజానికి సోషల్‌మీడియాలో భాగమైన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ ఇతర గ్రూపులలో ప్రతిరోజు యథేచ్ఛగా కవితలు పోస్ట్‌ చేస్తున్నారు. వాటిమీద ఎలాంటి అజామాయిషీ లేకపోవడంతో అందులో సాహిత్యం పాలు ఎంత? అసలు అది పోస్ట్‌కు అర్హమైనదా లేదా అనేది ఎవరూ పట్టించుకునే పరిస్థితిలేదు. ఒకప్పుడు పత్రికలకు పంపే కథలు, కవితలను ఆయా పత్రికల్లో పనిచేసే కొంత సాహిత్య అవగాహన ఉన్న సబ్‌ఎడిటర్లు , ఆ పేజీని పర్యవేక్షించే ఇన్‌చార్జ్‌, వీలైతే పత్రిక ఎడిటర్‌ దాన్ని చదివి అవకాశం ఉంటేనే ప్రచురించేవారు. అయితే సోషల్‌మీడియాలో అది లోపించిందనే చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటిగా వెంటవెంటనే పోస్ట్‌ చేస్తుండడంతో ఎవరు దేన్ని పోస్ట్‌ చేశారో తెలియని పరిస్థితి. అదే సమయంలో దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోకుండానే లైక్‌లు కొట్టడం, కామెంట్లు చేయడం వల్ల ఆ ప్రక్రియలో వారు చేసిన, చేస్తున్న లోపాలను ఎత్తిచూపే అవకాశం లేకుండా పోతున్నది. అందుకే ఈ విషయంలో ఆ గ్రూపు అడ్మిన్‌ ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పోస్ట్‌ను పూర్తిగా చదివి అనుమతిస్తే సాహిత్యం నాలుగుకాలాలపాటు బతుకుతుంది. మరోవైపు ఆయా గ్రూపులు ఫలానా ప్రక్రియకోసం ఏర్పాటు చేసామని అడ్మిన్‌ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అనవసర పోస్ట్‌లు, నిందాపూర్వక కామెంట్లు చేసేవారిని ఉపేక్షించకుండా గ్రూపునుండి బయటకు పంపగలిగితే ఆ గ్రూపులో సమగ్రత పెరుగుతుందని గుర్తించాలి.

ఎన్నెన్నో గ్రూపులు

సాహిత్యానికి పెరిగిన ఆదరణ లాగే ఇంటర్నెట్‌లో వివిధ పత్రికలు, వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాయి. కథలు, పాటలు, కవితలు, గజల్స్‌, సూక్తులు, నినాదాలు, నీతివ్యాఖ్యలు ఇలా వివిధ ప్రక్రియలకు వేర్వేరుగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపులు,పలు సాహితీ సైట్లు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. చాలా అంతర్జాల పత్రికలు నేడు క్రమం తప్పకుండా సాహిత్య సేవ చేస్తున్నాయి. వాట్సాప్‌ గ్రూపులు కూడా సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నవి. మధురవాణిడాట్‌కం, కహానియా.కాం, ప్రతిలిపి, సుకథ.కాం వంటివి అనేక కథలను ప్రచురిస్తున్నాయి. కవి సంగమం తెలుగు కవిత్వాన్ని అంతర్జాల ప్రపంచంలోకి తీసుకుపోవడంలో ముందుంది. జల్లెడ, కూడలి, మనందరి.కాం, తెలుగు వన్‌.కాం, నమస్తే.ఇన్‌, వాకిలి, సారంగ వంటి చాలా పత్రికలు వెబ్‌లో అందుబాటులో ఉన్నాయి. విహంగ పేరిట మహిళలకు ప్రత్యేకంగా ఒక వారపత్రిక వెబ్‌లో ఉంది. గోతెలుగు అంతర్జాల వార పత్రిక కూడా మంచి రచనలు ప్రచురిస్తున్నది. కౌముదిని పత్రిక సంపాదకులు కిరణ్‌ ప్రభ దానిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. తెలుగుతల్లి కెనడా మాస పత్రిక నిర్వహిస్తున్న లక్ష్మి రాయవరపు సాహిత్య పోటీలు పెట్టి రచయితలను ప్రోత్సహిస్తున్నారు. రచయిత్రి, కవయిత్రి జ్యోతి వలబోజు కూడా మాలిక అంతర్జాల పత్రికను నిర్వహిస్తున్నారు.  కథల ప్రక్రియను మోస్తున్న వాటిలో కహానియాడాట్‌కం, ప్రతిలిపి ముఖ్యమైనవి.

 వీటితో పాటు ఈ మాట, పొద్దు, సుజనరంజని మనతెలుగు వెలుగులు,సహస్రకవులు, మెరుపులు, మేలిమి ముత్యాలు, పోయెట్రీ, సాహితీసోపతి, తెలంగాణ రచయితల సంఘం, ఆయుత కవితా యజ్ఞం, తెలంగాణ రచయితల సంఘం, మెదక్‌ జిల్లా సాహిత్యం, జాతీయ సాహిత్య పరిషత్‌ సిద్దిపేట, అక్షర సేద్యం, కవి గాయకులు, తెలుగు మకరందం, బాల సాహిత్య శిల్పులు, పోతన పద్య పాఠశాల, ప్రయుతా కవితా యజ్ఞం, పద్యాల సవ్వడి,  ఇలా ఎన్నో సంస్థలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ పేజీలను నిర్వహిస్తూ సాహిత్యాన్ని సుపంపన్నం చేస్తున్నాయి.

కవులసంగమం

కవిసంగమం అనేది ఫేస్‌ బుక్‌ సామాజిక మాధ్యమంలో తెలుగు కవిత్వాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్న సమూహం పేరు. కవిసంగమం 2012లో ఫిబ్రవరి 9నప్రారంభం అయింది. ప్రముఖ కవి యాకూబ్‌ దీనికి నాంది పలికారు. తాము రాసిన కవిత్వాన్ని గ్రూపు వేదికగా మిత్రులతో పంచుకోవడం, సలహాలూ సూచనలూ తీసుకోవడంతో కవిత్వ రచనపై ఇష్టాన్ని పెంచడంతో పాటు మెళకువలు తెలుసుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం దీనిలో ప్రధానంగా జరుగుతుంది. అంతర్జాలంలోనే కాకుండా ప్రత్యక్షంగా కలుసుకుని నెలనెలా కవిత్వ పఠనం చేయడం, ప్రముఖ కవులనూ వారి కవిత్వాన్నీ పరిచయం చేయడం, కవిత్వ సంబంధ కార్యక్రమాలను నిర్వహించడం దీనిలోని ప్రధానాంశాలు.ఇప్పటివరకున్న వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు, 4,300 మందికి పైగా కవితాభిమానులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు. 

కథల కహానియాడాట్‌కం

2016 మేలో నెట్‌కెక్కిన సాహితీ సైట్‌ కహానియా డాట్‌కం. ఈ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం పల్లవ్‌ బజ్జూరి, కార్తీకేయ నందివెలుగు, లక్ష్మీ పెండ్యాలు అడ్మిన్‌లుగా కొనసాగుతున్నారు. ఈ వెబ్‌సైట్‌ సందర్బొచితంగా కథల పోటీలు, నవలల పోటీలు కూడా నిర్వహిస్తున్నది. కేవలం తెలుగు కథలకే కాకుండా ఇంగ్లిష్‌, హిందీ, బెంగాళీ కథలు ఇందులో ప్రధానంగా అఫ్‌లోడ్‌ చేస్తున్నారు.వీటితో పాటు  కన్నడ, మరాఠి, ఉర్ధూ ఇలా మొత్తం 11 భాషల సాహిత్యానికి సపోర్ట్‌ చేసే టెక్నాలజీ ఈ వెబ్‌సైట్‌కు ఉండడం ప్రత్యేకత. ఈ వెబ్‌సైట్‌లో అన్ని భాషలకు సంబంధించి 52 వేలమంది సభ్యులుగా ఉంటే, రెగ్యులర్‌గా తెలుగులో రాసేవారు 300 మంది వరకు కథా రచయితలు సభ్యులుగా ఉన్నారు.

వైవిధ్య కౌముది

కిరణ్‌ ప్రభ (పాతూరి ప్రభాకరరావు), ఆయన భార్య కాంతి ఈ పత్రికకు నిర్వాహకులు. గతంలో సుజనరంజని పత్రికను నిర్వహించిన కిరణ్‌ ప్రభ 2007 జనవరిలో కౌముదిని ప్రారంభించారు. ప్రముఖ ఆర్టిస్టుల చిత్రాలతో, ఫొటోలతో అందమైన ముఖ చిత్రాలను రూపొందించటం ఈ పత్రిక ఆకర్షణల్లో ఒకటి. అచ్చు పత్రికల్లో లాగా వైవిధ్యభరితమైన శీర్షికల్ని ఇందులో పొందుపరిచారు. సమకాలీన సాహిత్యంతో బాటుగా విలువైన పాత కథల్నీ, నవలల్నీ అందించటంతో వివిధ వర్గాల పాఠకులను ’కౌముది’ ఆకట్టుకోగలుగుతున్నది.

కవిమిత్రుల కవిసాయంత్రం

2015లో ముక్కెర సంపత్‌ దీన్ని వాట్సాప్‌ గ్రూపుగా ప్రారంభించారు. 20 మంది సభ్యులతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో  ప్రారంభమైన ఈ గ్రూపు 2017లో ఫేస్‌బుక్‌ గ్రూపును కూడా ప్రారంభించింది. వారంలో నాలుగు శీర్షికల్లో వివిధ ప్రక్రియలను పరిచయం చేస్తున్నదీ గ్రూపు. విభిన్న ప్రక్రియల్లో పాటలు, పద్యాలు రాయించడం, చిత్రకవిత, ఆ పాత మధురాలు , నా చిత్రం నా కవిత్వం  ఇలా పలు కార్యక్రమాలను ఈ గ్రూపు నిర్వహిస్తున్నది. ప్రతి ఆరునెలలకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో సమావేశమై విజేతలకు బహుమతులు అందజేస్తారు. కొత్తగా రాయాలనుకునేవారికి ఇది ఒక ప్లాట్‌ఫాంగా పనిచేస్తున్నది.  ముక్కెర సంపత్‌, డాక్టర్‌ ప్రతికంఠం మాలతిలత, విశ్వైక, కొండూరు కళ్యాణి, వంగగీతారెడ్డి అడ్మిన్‌లుగా ఉన్న కవి సాయంత్రం ప్రస్తుతం 150 మంది వాట్సాప్‌ గ్రూపు సభ్యులు, 1200 మంది ఫేస్‌బుక్‌ సభ్యులతో కొనసాగుతున్నది.

పాఠక దేవుళ్లఉత్తమ పాఠకుల సంఘం (ఉపాసం) 

ఐత శ్రీనివాస్‌ అడ్మిన్‌గా, గుండెబోయిన శ్రీనివాస్‌  మరికొంతమంది కలిసి వాట్సాప్‌ గ్రూపును 2016 మేలో ఏర్పాటు చేశారు.  పాఠకులకు పెద్దపీట వేసి,పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో  ఉపాసం(ఉత్తమ పాఠకుల సంఘం)వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు. రచనలు,రచయితలను అభిమానించే సంస్కృతి గల చదువరులతో ఏర్పాటు చేసిన గ్రూపు 256/256 సభ్యులతో విజయవంతంగా కొనసాగుతోంది. పాఠకుల పక్షాన,పాఠకుల కోణంలో ‘పాఠకులే దేవుళ్ళు‘అనే సిద్ధాంతానికి ఉపాసం కట్టుబడి ఉంది.ఈ నాలుగేళ్లలో ఉగాది,దీపావళి మొ. పండుగలకు కవితల పోటీలు, సంక్రాంతికి కథల పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించింది. ఉపాసం తొలి ఏడాది ‘తల్లివేరు‘ పేరుతో అరవై రెండు కవితల సంకలనం ముద్రించింది. సభ్యులు తమ రచనలు పోస్టు చేస్తూ గ్రూపును సుసంపన్నం చేస్తున్నారు.  

సాహిత్య తెలుగు పూలతోట

తెలుగు పూలతోట(సాహిత్య వేదిక) ఫేస్బుక్‌ గ్రూప్‌గా 2017 మే నెల 18 వ తేదీ స్థాపించారు. ఇందులో సభ్యుల సంఖ్య 5200 పై చిలుకు. ఈ గ్రూపు ఇప్పటివరకు 30 కవితల పోటీలను నిర్వహించింది. విజేతలకు కవిత్వ పుస్తకాలు, నగదు బహుమతులను అందజేశారు. రెండుసార్లు జాతీయ స్థాయి లో కవితల పోటీలు నిర్వహించారు. ఒకటి 2019 సంక్రాంతి సందర్భంగా ’రెడ్నం సత్యవతమ్మ స్మారక’ కవితల పోటీ, రెండవది 2019 ఉగాది సందర్భంగా  లక్ష్మీ నారాయణ జైనీ స్మారక ’ కవితల పోటీలను నిర్వహించారు. ప్రతి రోజూ కనీసం 200 నుండి 300 వరకు కవితలు, పద్యాలు, వ్యాసాలు  పోస్ట్‌ చేస్తుంటారు.  ఈ గ్రూప్‌ ముఖ్య ఉద్దేశ్యం తెలుగు భాషను సాహిత్యాన్ని కాపాడుకోవడం. కొత్తగా రాస్తున్న వారిని పోత్సహించడం మున్ముందు అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించనున్నామని  గ్రూప్‌ అడ్మిన్స్‌ శాంతికృష్ణ, వెన్నెల సత్యం తెలిపారు.

బహుభాషల ప్రతిలిపి

కథల పోటీలకు పెద్దపీట వేయడంతో పాటు 12 భారతీయ భాషల రచయితలు, పాఠకులతో కూడిన భారతదేశపు అత్యంత పెద్ద డిజిటల్‌ ప్లాట్‌ఫాంగా దీన్ని నిర్వాహకులు పేర్కొన్నారు. సుమారు 72లక్షల మంది రీడర్స్‌, 8 లక్షల కథలు, 1లక్ష మంది రచయితలు, 12 భాషల్లో సేవలందిస్తున్నట్లు ఈ ప్రతిలిపి బృందం పేర్కొంది. వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు ఔత్సాహికులు అడ్మిన్‌లుగా ఉన్నారు. సందర్బోచితంగా పలు కథలు, కవితలు వంటి పోటీలు కూడా నిర్వహిస్తున్న ప్రముఖ వెబ్‌సైట్‌లలో ‘ప్రతిలిపి’ ఒకటి. దీనిలో తమ రచనలను తామే స్వీయ ప్రచురణ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌కి మొబైల్‌ యాప్‌ కూడా ఉంది.  

తొలి తెలుగు ఈ మాట

వేలూరివెంకటేశ్వరరావు,నారాయణస్వామి, కె.వి.ఎన్‌.రామారావు, సురేశ్‌ కొలి చాల, శంఖవరం పాణిని, పద్మ ఇంద్రగంటి సంపాదకులుగా వస్తున్న అంతర్జాల పత్రిక ఈమాట ద్వైమాసిక సాహితీ పత్రిక. ఎప్పుడో యూనికోడ్‌ ప్రాచుర్యంలోకి రాకముందే ఈ పత్రికగా ప్రారంభమైంది, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి తోడ్పడిన ఈ పత్రికగా ఈ మాటకు పేరుంది. ఇందులో కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో నివసించే తెలుగు వారందరి రచనలు మనకు కనిపిస్తాయి.   

సాహితీనావ అక్షరాల తోవ 

తేనేలూరే తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తూ, సాహితీ సేద్యం గావిస్తూ.. వర్ధమాన, ఔత్సాహిక రచయితలకు, కవులకు ప్రోత్సాహం అందిస్తూ అక్షరాలతోవ  ముందుకు సాగుతున్నది. 2017 అక్టోబర్‌ 19న దీన్ని సీనియర్‌జర్నలిస్ట్‌ నామా పురుషోత్తం, కథా రచయిత రాచమళ్ల ఉపేందర్‌, కవి, లఘు చిత్రాల దర్శకులు దాసరోజు శ్రీనివాస్‌లు ప్రారంభించారు. వాట్సాప్‌. ఫేస్‌బుక్‌ గ్రూపుగా ఈ సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.కవితల పోటీలతో అడ్మిన్స్‌ సాహితీ సేవ చేస్తున్నారు.

స్త్రీవాద భూమిక 

భూమిక స్త్రీవాద పత్రిక. అచ్చు పత్రికగా మొదలై, 2006 నవంబరులో అంతర్జాల పత్రికగా రూపాంతరం చెందింది. తెలుగులోనే కాక యావత్‌ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా భూమిక గురించిన పేజీలో రాసారు. కొండవీటి సత్యవతి ఈ పత్రిక సంపాదకురాలు. భూమికలో పనిచేసే వారంతా స్త్రీలే! ప్రసిద్ధులైన స్త్రీలు భూమికలో ముఖ్య భూమికలు నిర్వహిస్తున్నారు.

తొలి మహిళ విహంగ

విహంగ తొలి తెలుగు మహిళా వెబ్‌ పత్రిక. ఇది మహిళా పత్రిక. అంతర్జాలంలోమహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ పత్రికను‘మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ’ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు మహిళల భావోద్వేగాలకు వేదిక గా ‘విహంగ’ని తొలి తెలుగు వెబ్‌ పత్రికగా జనవరి1, 2011 ఆరంభించారు. పుట్ల హేమలత ఎడిటర్‌గా ప్రారంభమైన ఈ గ్రూపులో కాత్యాయనీ విద్మహే,కుప్పిలి పద్మ, మెర్సీ మార్గరెట్‌, చల్లపల్లి స్వరూప రాణి, జాజుల గౌరిలు సంపాదక వర్గంగా ఉన్నారు.

చక్కని  సాహిత్యం వస్తున్నది

అంతర్జాలంలో ఇవ్వాళ్ల సాహిత్యానికి సంబంధించిన చర్చలు, గ్రూపులు రోజూ చూస్తున్నాం. చాలా సందర్భాల్లో అంతర్జాల సాహిత్యంలో చక్కని చర్చలు జరుగుతున్నాయి. అందులోనూ నవతరం కవులూ, రచయితలు, అంతర్జాలం, వాట్సాప్‌ మాధ్యమంగా విస్తృతమైన సృజన చేస్తున్నారు. పుస్తకాన్ని ముట్టుకుని ఆస్వాదిస్తూ చదివిన వాళ్లకు కొంత కొరుకుడు పడక పోవచ్చుగాని, అందులోనూ చక్కని సాహిత్యం వస్తున్నది. సృజనకు వేదికైంది.

-పత్తిపాక మోహన్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌


ఈజీగా చదువుకోవచ్చు

సోషల్‌ మీడియాలో సాహిత్య పరంగా జరుగుతున్న ప్రయత్నాలు మంచివే కావచ్చు. కానీ దానికంటే రూమర్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక సాహిత్యానికి వస్తే పోస్ట్‌ చేసిన దానిమీద నియంత్రణ లేకపోవడం మూలంగా వారేం రాస్తే అదే సాహిత్యం అనే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు బుక్స్‌ కొనుక్కుని కుదిరినపుడు చదివేవారం. అయితే అంతర్జాలం, వాట్సాప్‌ గ్రూపుల వల్ల ఈజీగా ఎక్కడైనా చదువుకునే అవకాశం మాత్రం లభించింది.

                   -ఏనుగు నరసింహారెడ్డి, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ.


బాగా రాసేవాళ్లు ఉన్నారు

పత్రికలు, ప్రచురణకు  సంబంధించిన వేదికలు తక్కువగా ఉండడం, ఇంటర్నెట్‌ సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడం దాన్ని ఒక వేదికగా తయా రు చేస్తే ఎట్ల ఉంటది అనే ఆలోచనే కవిసంగమానికి ఊపిరిపోసింది.సాహిత్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడితే తప్పకుండా అదో వేదిక అవుతుందన్న నమ్మకం విజయవంతమైంది. దానికి తగినట్లే స్పందన వచ్చింది. ఎక్కడో మారుమూలన ఉన్న వారు రాయగలిగేవారిని సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం చేశాము. అంతర్జాల వేదికగా మంచి సాహిత్యం రావలసి ఉంది.                           

-యాకుబ్‌, కవి


మధుకర్‌ వైద్యుల, సెల్‌: 9182777409 

logo