శనివారం 29 ఫిబ్రవరి 2020
ప్రేమికుల రోజు.. ప్రత్యేక బహుమతి!

ప్రేమికుల రోజు.. ప్రత్యేక బహుమతి!

Feb 09, 2020 , 13:19:46
PRINT
ప్రేమికుల రోజు.. ప్రత్యేక బహుమతి!

పువ్వులు.. చాక్లెట్లు.. గ్రీటింగ్‌ కార్డులు.. ఈ మధ్యకాలంలో మగ్గుల మీద ఫొటోలు.. ప్రేమికుల రోజున ఇచ్చే బహుమతులంటే గుర్తొచ్చేవి ఇవే! కానీ తక్కువ ఖర్చుతో మరిచిపోలేని బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? ఈ సంవత్సరం మీ ప్రియమైన వారి ప్రేమను రెట్టింపు చేయాలనుకుంటే.. వారి ముఖంలో ఆనందం పెరుగాలంటే.. ఈ వాలెంటైన్స్‌ డేను మరింత బాగా చేసుకోవాలంటే.. ఈ ప్రత్యేక బహుమతులను ఇచ్చి చూడండి..

సరికొత్తగా..

మీరు కలుసుకున్న రోజులన్నీ గుర్తున్నాయా? అయితే.. మీ బంధాన్ని మరింత అందంగా చూపించుకోవాలంటే ఆ రోజులన్నింటినీ నోట్‌ చేసుకోండి. అవి మీ రోజులని.. ఆ రోజుకున్న ప్రత్యేకతలు తెలిసే ఒక అందమైన కాగితంపై పరువండి. దీన్ని ప్రత్యేకంగా ఫ్రేమ్‌ కట్టించి మీ ప్రియమైన వారి చేతికి అందించండి. అన్నీ డబ్బులతోనే బహుమతులిస్తే ప్రేమ ఉన్నట్లు కాకుండా.. మీ మధుర క్షణాలను కూడా ఇలా బహుమతిగా మలుచవచ్చు. 

ప్రేమ పదిలంగా.. 

ప్రేమను మనం వ్యక్తపరుచడానికి సవాలక్ష మార్గాలున్నాయి. కానీ ప్రేమికులు ఎక్కువ ఇష్టపడే వాటిలో వారి మధుర జ్ఞాపకాలకు చెందిన ఫొటోలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయట. మీకు నచ్చిన ఫ్రేములను ఎంచుకొని బహుమతి ఇవ్వొచ్చు. గోడకు తగిలించుకునే విధంగా, టేబుల్‌ మీద పెట్టే ఫొటోలు ఇలా బోలెడు ఆప్షన్లులున్నాయి. దిండ్ల మీద కూడా ఫొటోలను వేయించుకొని వాటిని గిఫ్ట్‌లు ఇచ్చుకునే ట్రెండ్‌ కూడా ఈ మధ్య ఎక్కువైంది. ఆ బహుమతి కూడా మంచి ఆప్షన్‌ అని చెప్పొచ్చు. 

ప్రేమ పజిల్‌.. 

కొత్త దశాబ్దం మొదలైంది. ఇప్పుడు కూడా పాత ఆలోచనలతో అవే బహుమతులను ఎందుకు ఇవ్వడం చెప్పండి. అందుకే ప్రేమ పజిల్‌ని మీ వారి ముందు పెట్టండి. మీ బొమ్మలతో పర్సనలైజ్‌ పజిల్స్‌ తయారుచేసే సంస్థలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా ఫ్రేములతో తయారు చేయించుకుంటే మరింత సూపర్‌గా ఉంటుంది.  

మెడలో హారంగా.. 

చిన్న చిన్న గొలుసులు, పట్టీలు  అమ్మాయిలకు బహుమతులుగా ఇవ్వడం మామూలే. అయితే.. వీటికి అదనంగా వారి రాశుల గుర్తులను పెండెంట్లుగా చేర్చి ఇవ్వండి.. 

వారి ఆనందం రెట్టింపు అవ్వడం ఖాయం. కేవలం బంగారు నగలే కాదు.. వన్‌గ్రామ్‌ గోల్డ్‌లో కూడా ఇలాంటి నగలు దొరుకుతున్నాయి. ఇవి కాకుండా హృదయాకార గుర్తులను కూడా పెండెంట్‌లుగా చేర్చి గొలుసులను బహుమతిగా ఇస్తే బాగుంటుంది. 

దాచుకొనేలా.. 

పువ్వుల గుత్తి ఇస్తే నాలుగు రోజులకే వాడిపోతుంది. మేలుజాతి పువ్వులైతే మరో రెండు రోజుల కాలమే. అలా కాకుండా కలకాలం వాటిని చూసి మురిసిపోయే ఆప్షన్‌ దొరికితే బాగుంటుందనిపిస్తుంది కదా! హృదయాకారం డబ్బాలో పువ్వులు వసివాడకుండా ఉండేలా తయారు చేయించండి. దాన్ని బహుమతిగా ఇస్తే సరిపోతుంది. అమెజాన్‌లాంటి వెబ్‌సైట్లలో ఈ పువ్వులు దొరుకుతున్నాయి. ఆర్డర్‌ చేసిన వారం రోజులకు ఇవి వస్తాయి. 

పచ్చగా పదికాలాలు.. 

మీ ప్రేమ పచ్చగా ఉండాలంటే వెదురు చెట్లు బహుమతులుగా ఇవ్వొచ్చు. ఇవి ఎక్కువ కాలం ఉంటాయి. పైగా ఈ చెట్ల అదృష్టంగా భావిస్తారు. కాబట్టి మీ బంధానికి ఆ అదృష్టం కలిసి రావాలంటే కూడా ఈ బహుమతిని ఇచ్చి, పుచ్చుకోవచ్చు. పైగా వీటిని హృదయాకారంలో చేసి మరీ ఇప్పుడు షాపుల్లో అమ్ముతున్నాడు. మూడు సైజుల్లో ఈ చెట్లు లభ్యమవుతున్నాయి. మీరు దానికి కేటాయించాలనుకున్న స్థలాన్ని బట్టి మీ బహుమతిని ఎంచుకోవచ్చు. 

అందమైన బ్రాస్‌లెట్‌గా.. 

ప్రేమిస్తున్నానని ఎన్నోసార్లు చెప్పుండొచ్చు. మెసేజ్‌ రూపంలో పంపించొచ్చు. లేకపోతే హోమ్‌వర్క్‌లా ఒక పేజీ మీద రాసి ఇచ్చి ఉండొచ్చు. కానీ మీ చేతి రాతే అందమైన బ్రాస్‌లెట్‌గా మారితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలా మీ చేతి రాతతో బ్రాస్‌లెట్‌ చేసే కంపెనీలు ఉన్నాయి. అలా మీకు నచ్చిన పదాల అల్లికతో మీ ప్రియమైన వారికి బ్రాస్‌లెట్‌ని బహుమతిగా ఇవ్వొచ్చు. దీంట్లో కూడా 18కే గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌, సిల్వర్‌ ఇలా ఆప్షన్స్‌ కూడా ఉంటాయండోయ్‌! 

వారికోసం ప్రత్యేకంగా.. 

ఈ విషయం తెలుసో లేదో మీకు..

ప్రతీ నెలకు ఒక చెట్టు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే మీ ప్రియమైన వారి పుట్టిన రోజు ఏ నెలో మీకు తెలిసే ఉంటుంది. 

ఆ నెలకి సంబంధించిన ఫ్లవర్‌వాజ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆ నెలలో ఆ చెట్టు విరబూస్తుంది. అంటే.. వారిలా ఆ చెట్టు కూడా కళకళలాడుతుందనే ఇండికేషన్‌ వెళుతుందన్నమాట. 

సంవత్సరం మొత్తం మీ ప్రేమ గుబాళింపు పంచడానికి ఆ బహుమతి మరింత వన్నె తెస్తుంది. 

ప్రేమ గుబాళింపు.. 

యూనిక్‌గా మీరిచ్చే బహుమతి ఉండాలనుకుంటే వీటిని ఎంచుకోండి. మీరు మాట్లాడాలనుకున్న మాటలను సబ్బులుగా పేర్చొచ్చు. ఆశ్చరంగా ఉందా? కస్టమైజ్‌ చేసిన సబ్బులు ఇలా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. రంగు రంగుల క్యాండీల్లాగే ఈ సబ్బులు ఉంటాయి. పైన ‘మిస్‌ యూ.., లవ్‌ యూ..’ ఇలా పదాలు ఉన్న సబ్బులు మీ మనసులోని మాటలను వ్యక్తపరిచేలా.. సువాసనలు వెదజల్లేలా ఉంటాయి. పైగా వీటి ఖర్చు కూడా తక్కువ ఉండటం ఇక్కడ వీటిని ఎంచుకొనే వారు ఎక్కువైపోతున్నారని ఒక సర్వేలో తేలింది.

సౌమ్య నాగపురి


logo