శనివారం 29 ఫిబ్రవరి 2020
ట్రాలీ కావాలా?

ట్రాలీ కావాలా?

Feb 09, 2020 , 02:33:00
PRINT
ట్రాలీ కావాలా?

కూకట్‌పల్లిలోని కిరణ్‌ ఓ రోజు కోఠీకి వెళ్లాడు. అక్కడో ఫర్నీచర్‌ షాపు అతడి దృష్టిని ఆకర్షించింది. చూసొద్దాంలే అనుకొని లోపలికెళ్లాడు. బాగా నచ్చి పెద్ద సోఫాసెట్‌ కొన్నాకే బయటికొచ్చాడు. దాన్ని తరలించేందుకు ట్రాలీ మాట్లాడాలనుకున్నాడు. కానీ అక్కడున్న డ్రైవర్లంతా కుమ్మక్కై ఎక్కువ ధర చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు అడిగినంత కిరాయి ఇచ్చేసి ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. 


అది టోలీచౌక్‌లోని ఆటో ట్రాలీ అడ్డా. ట్రాలీలు బారులు తీరాయి. గంటకో రెండు గంటలకో కిరాయి దొరుకుతుంది. అలా గంటకు ఒకట్రెండు వాహనాలు కదులుతున్నాయి. సాయంత్రమైంది. పది పదిహేను వాహనాలకు తప్ప మిగతా వాటికి కిరాయి దొరకలేదు. రోజూలాగే చాలామంది డ్రైవర్లు నిరుత్సాహంగా ఇంటిబాట పట్టారు. 

నియోగదారులు, డ్రైవర్లు తరచూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనే హైదరాబాద్‌లో డెలివరీ సేవల్ని ప్రారంభించింది లాలామూవ్‌ సంస్థ. లాలామూవ్‌ అనేది ఓ యాప్‌. దీన్ని ఉపయోగించి ఎక్కడి నుంచైనా ట్రాలీని బుక్‌ చేసుకోవచ్చు. ఒక్క క్లిక్‌చేస్తే చాలు గూడ్స్‌ ట్రాలీ మన ముందుకు వస్తుంది. డ్రైవర్లు సైతం అడ్డాపై వేచి చూడాల్సిన పనిలేదు. మొబైల్‌లో ఆర్డర్స్‌ను యాక్సెప్ట్‌ చేసి బండిని తోలవచ్చు.


సరుకు రవాణాకు ప్రత్యేకం

ప్రస్తుతం కార్గో సేవలకూ అనేక యాప్స్‌ ఉన్నాయి. కానీ వాటన్నింటిలో లాలామూవ్‌ ప్రత్యేకం. ఎందుకంటే డ్రైవర్‌ ఏ యాప్‌ వాడినా ప్రతీ రైడ్‌కు 15 లేదా 20 శాతం కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ యాప్‌ మాత్రం డ్రైవర్‌ నుంచి కమీషన్‌ తీసుకోవట్లేదు. వినియోగదారుడు చెల్లించే ప్రతీ రూపాయి డ్రైవర్‌కే వెళ్లిపోతుంది. పండుగలు, ప్రత్యేక రోజుల్లో సంస్థ డ్రైవర్లకు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నది. 


లాలామూవ్‌ అంటే?

లాలా అంటే చైనీయుల భాషలో తరలించడం. 2013లో హాంకాంగ్‌లో ‘లాలామూవ్‌' సంస్థను ప్రారంభించారు. వస్తువుల్ని రవాణా చేసే ఉద్దేశ్యంతో ఇది ప్రారంభమైంది. పదిట్రక్కులతో ప్రారంభమైన ఈ సేవలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డ్రైవర్లకు ఉపాధినిస్తున్నాయి. ఢిల్లీ, ముంబాయి, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ సంస్థ సేవలందిస్తున్నది. హైదరాబాద్‌లో మూడు నెలల క్రితం ఈ సంస్థ సేవల్ని ప్రారంభించింది. 


సేవలు ఇలా..

లాలామూవ్‌ ద్వారా కేవలం ట్రక్‌లే కాదు. టూవీలర్‌నూ బుక్‌ చేసుకోవచ్చు. ఉబర్‌, ఓలా వంటి యాప్స్‌లో బుక్‌ చేసుకున్నట్లే లాలామూవ్‌ యాప్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. మీ సరుకుల్ని తరలించడానికి టూవీలర్‌, ఆటో ట్రాలీ, మినీ డీసీఎం, లారీ వంటివి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ యాప్‌ ద్వారా కావాల్సిన వాహనాన్ని ఎంచుకోవాలి. ఆ వెంటనే బుక్‌ యువర్‌ ఆర్డర్‌పై క్లిక్‌ చేస్తే వెంటనే డ్రైవర్‌కు, సంస్థకు మెసేజ్‌ వెళ్లిపోతుంది. సమీపంలోని యాప్‌ వాడే డ్రైవర్లందరికీ మెసేజ్‌ వెళ్లిపోతుంది. డ్రైవర్‌ రైడ్‌ను ఆక్సెప్ట్‌ చేసి నిమిషాల వ్యవధిలోనే రైడ్‌ బుక్‌ చేసిన స్థలానికి చేరుకుంటాడు. సరుకును నిర్ణీత ప్రదేశానికి తీసుకెళ్తాడు. అయితే డ్రైవర్‌ రైడ్‌ను ఆక్సెప్ట్‌ చేసినప్పటి నుంచి లాలామూవ్‌ టీం పర్యవేక్షిస్తుంటుంది. సమయానికి చేరుకోకపోయినా, వాహనానికి ఏదైనా సమస్య ఎదురైనా, సరుకు రవాణా విషయంలో వినియోగదారులకు ఏమైనా ఇబ్బందులు కలిగినా లాలామూవ్‌ టీం చర్యలు తీసుకొంటుంది. సరుకును చేర్చిన తర్వాత వినియోగదారులకు ఫోన్‌ చేసి రివ్యూ కూడా అడుగుతారు. లాలామూవ్‌ ద్వారా కేవలం ట్రక్‌ సేవలు మాత్రమే కాదు. ఇంటి వద్ద ఏదైనా వస్తువు మరిచిపోతే ఈ యాప్‌ ద్వారా టూవీలర్‌(డిస్క్రిప్షన్‌లో తీసుకురావాల్సిన వస్తువును రాయాలి) బుక్‌ చేస్తే రైడర్‌ మీ ఇంటికెళ్లి వస్తువులను తీసుకొస్తాడు.


యువకులకు ఉపాధి

అనేకమంది యువకులు లాలామూవ్‌ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 3వేలకు పైగా యువకులు లాలామూవ్‌ ద్వారా ఉపాధి పొందుతున్నట్లు అంచనా. వీరిలో కాలేజీకి వెళ్తూ.. ఖాళీ సమయాల్లో ట్రక్కులు, టూవీలర్‌లు నడిపేవారు ఎక్కువ.  పార్ట్‌టైం డ్యూటీ కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఎక్కువమంది ఈయాప్‌ను ఉపయోగించుకొని ఉపాధిని పొందుతున్నారు. వాహనం లాలామోవ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు, ఇతర వివరాలకు 63664 34149లో సంప్రదించవచ్చు.


బృందం పని చేస్తుందిలా..

జూబ్లీ చెక్‌పోస్ట్‌ సమీపంలో కార్యాలయం ఉంది. ఇందులో రెండు బృందాలుంటాయి. వీరిలో కొంతమంది మార్కెట్‌కు వెళ్లి డ్రైవర్లకు యాప్‌పై అవగాహన కల్పిస్తుంటారు. (యాప్‌, రోడ్డు భద్రతా చర్యల గురించి) మరోబృందం వినియోగదారులు యాప్‌లో రైడ్‌ బుక్‌ చేసినప్పటి నుంచి సరుకు డెలివరీ అయ్యేవరకు పర్యవేక్షిస్తుంటారు. డ్రైవర్లకు, వినియోగదారులకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. 


ఇద్దరికీ మేలు చేయాలనే.. 

డ్రైవర్లు, వినియోగదారులకు లాభం చేకూర్చాలనే లాలామూవ్‌ సేవల్ని హైదరాబాద్‌లో ప్రారంభించాం. అన్ని యాప్‌లతో పోలిస్తే సరుకుల రవాణాకు అతి తక్కువ మొత్తం చార్జి చేస్తున్నాం. అది కూడా నేరుగా డ్రైవర్లకే వెళ్లిపోతుంది. తెలంగాణలో మరిన్ని నగరాల్లో మా సేవల్ని విస్తరించనున్నాం. ప్రస్తుతం రోజుకు 300 నుంచి 400 రైడ్స్‌ వస్తున్నాయి. చాలామంది యువతకు ఉపాధి లభిస్తున్నది.

-కొంగర విజయ రాఘవ స్వరూప్‌,  సిటీ మేనేజర్‌, లాలామూవ్‌

పడమటింటి రవికుమార్‌logo